
జమ్మూ: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి ఉన్న గ్రామాల్లో పాక్ సైన్యం భారీగా కాల్పులకు తెగబడింది. దీంతో పూంచ్ జిల్లా పరిధిలోకి వచ్చే దాదాపు అరడజను ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులను నిలిపివేయాల్సిందిగా ఆదేశించినట్లు శనివారం అధికారులు వెల్లడించారు. పూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్నీ సెక్టార్లను లక్ష్యంగా చేసుకుని పాక్ తీవ్ర కాల్పులకు పాల్పడిందని రక్షణ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ ఘటనలో 16 జంతువులు మృతిచెందినట్లు పూంచ్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాహుల్ యాదవ్ తెలిపారు.