జవాను వరుణ్ కట్టల్
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)వెంట పాక్ స్నైపర్ (దొంగచాటు) జరిపిన కాల్పుల్లో ఒక జవాను నేలకొరగగా పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారు. సుందర్‌బనీ సెక్టార్‌లో శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో పాక్ స్నైపర్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాను ఆస్పత్రిలో చనిపోయాడు. మృతుడిని సాంబా జిల్లా మావా–రాజ్‌పురా ప్రాంతానికి చెందిన వరుణ్ కట్టల్(21)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా పాక్ బలగాలు పాల్పడిన ఈ చర్యకు భారత బలగాలు దీటుగా బదులిచ్చాయన్నారు. కాగా, ఎల్‌వోసీ వెంట పాక్ ఈనెల 9వ తేదీన జరిపిన స్నైపర్ కాల్పుల్లో ఆర్మీ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో ఘటనలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు పుల్వామా జిల్లా టిక్కెన్ ప్రాంతాన్ని శనివారం ఉదయం దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పుల్వామా జిల్లాకు చెందిన, హిజ్బుల్ ముజాహిదీన్ తరఫున పనిచేస్తున్న లియాఖత్ మునీర్ వనీ, వాజిద్ ఉల్ ఇస్లాం చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment