కాల్పులపై పిటిషన్ | tamil labour fires on pitision | Sakshi
Sakshi News home page

కాల్పులపై పిటిషన్

Published Sat, Apr 18 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

tamil labour fires on pitision

చెన్నై, సాక్షి ప్రతినిధి: చిత్తూరు శేషాచల అడవుల్లో జరిగిన కాల్పుల్లో 20 మంది తమిళ కూలీల దుర్మరణంపై సీబీఐచే విచారణ జరిపించాలని విడుదలై చిరుతైగళ్ కట్చి అధ్యక్షులు తిరుమాళవన్ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాల్పుల ఘటనపై తమిళనాడు ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయని, విచారణ పేరుతో పిలుచుకుపోయి హత్యచేసినట్లు తాము భావిస్తున్నామని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేగాక ఎంతోమంది ఆచూకీలేదని తెలిపారు.

కనిపించనివారి ఆచూకీ, అసలు స్మగ్లర్ల పేర్లను బైటపెట్టాలని, కాల్పుల ఘటనపై సీబీఐ విచారణ కు ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రాజకీయనేతల హస్తాన్ని వెలుగులోకి తేవాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం మొత్తాన్ని పెంచేలా ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఈనెల 20వ తేదీన విచారణ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
 
జలియన్‌వాలాబాగ్ కంటే ఘోరం: శరత్‌కుమార్
స్వాతంత్య్ర పోరాట సమయంలో జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన కాల్పుల కంటే ఘోరంగా తమిళ కూలీలను హతమార్చారని అఖిలభారత సమత్తువ మక్కల్ కట్చి (ఏఐవీసీకే) అధ్యక్షులు, ఎమ్మెల్యే శరత్‌కుమార్ వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనపై శుక్రవారం వీసీకే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిపింది. చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన శరత్‌కుమార్ మాట్లాడుతూ అమాయక కూలీలపై కాల్పుల ఘటన తమిళనాడు ప్రజల గుండెను పిండేసిందని అన్నారు.

కూలీలు చెట్లు నరుకుతుండగా కాల్పు లు జరగలేదు, చేతులు, కాళ్లు కట్టివేసి చిత్రవధకు గురిచేసి పథకం ప్రకారం హతమార్చారని ఆయన ఆరోపించారు. కూలీల మరణం పట్ల విచారం వ్యక్తం చేయకపోగా నిందలు వేయడం సరికాదని ఏపీ అటవీశాఖా మంత్రి బొజ్జలకు హితవు పలికారు. తమిళ ప్రజలకు పొరుగు రాష్ట్రాల్లో రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటనతో తమిళనాడు యావత్తు తల్లడిల్లుతుంటే ప్రధాని నరేంద్రమోదీ ఏమీ పట్టనట్లుగా విదేశాలు తిరుగుతున్నారని విమర్శించారు. కాల్పులపై సీబీఐ విచారణ కు ఆదేశించాలని, మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10లక్షల నష్టపరిహారం చెల్లించాలని శరత్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
 
దిక్కులేనివారమైనాము - సంక్షేమ బోర్డుతో బాధిత కుటుంబాల ఆవేదన ఇంటి పెద్దదిక్కును దారుణంగా పొట్టనపెట్టుకున్న ఏపీ ప్రభుత్వం వల్ల తాము దిక్కులేని వారమైనామని మృతుల కుటుంబీకులు బోరుమన్నారు. చెన్నై చేపాక్‌లోని ప్రభుత్వ అతిధి గృహంలో జాతీయ కొండప్రాంత ప్రజల సంక్షేమ బోర్డు సహాయ కమిషనర్ రవి ఠాకూర్ బాధిత కుటుంబాలను శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్బంగా పలువురు హాజరై తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. సేలం జిల్లా ఆత్తూరు సమీపం కల్లుకట్టుకు చెందిన మృతుడు శశికుమార్ భార్య రంజితం, తల్లి పూంగొడి ఇతర కుటుంబ సభ్యులు కమిషన్ ముందు కన్నీరు మున్నీరయ్యారు.
 
రంజితం మాట్లాడుతూ ఏర్కాడుకు వెళ్లివస్తానని చెప్పి బయలుదేరిన తన భర్త ఇక తిరిగిరాలేదని వాపోయింది. తన భర్త శవాన్ని పరిశీలించగా, ముఖం కాలినట్లు కమిలిపోయి ఉందని, కళ్లలోని గుడ్లను తొలగించారని, కాళ్లు, చేతులు విరిగి ఉన్నాయని ఆమె తెలిపింది. భర్త మృతితో తాము దిక్కులేని వారయ్యామని ఆదుకోవాలని కోరింది.
 
గత ఏడాది ముగ్గురిని పొట్టనపెట్టుకున్నారు
గత ఏడాది సెప్టెంబరు 25వ తేదీన ఏపీ పోలీసులు తమ ప్రాంతానికి చెందిన ముగ్గురిని కాల్పులతో హతమార్చారని తిరువణ్ణామలై జిల్లా జవ్వాదికొండ గ్రామానికి చెందిన మృతుడు చిన్నస్వామి భార్య మలర్ చెప్పింది. విజయకాంత్ (25), శివ (25), వెంకటేష్ (27) ఆనాటి కాల్పుల్లో మృతిచెందగా ఏపీ ప్రభుత్వం నుంచి నేటికీ నష్టపరిహారం అందలేదని మృతుల భార్యలు పవిత్ర, రేఖ, తల్లి పూమల్లి కమిషనర్‌కు చెప్పారు.

ఇలా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన బాధిత కుటుంబాల నుంచి తీసుకున్న వాంగ్మూలాన్ని నమోదుచేశారు. అనంతరం ఠాకూర్ మాట్లాడుతూ బాధితుల అందజేసిన వివరాలను జాతీయ మానవహక్కుల కమిషన్‌కు అందజేస్తామని, ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివరాలు ఇస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం మొత్తాన్ని పెంచాలని, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సిఫార్సు చేస్తామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement