
బెంగళూరు: చట్ట వ్యతిరేక కంటెంట్, సెన్సార్ షిప్ పేరుతో భారత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి ముఖ్యంగా సెక్షన్ 79(3)(బీ) విషయంలో 2015 నాటి శ్రేయా సంఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తోందని, ఆన్‌లైన్‌లో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించింది. జ్యుడీషియల్ ప్రక్రియకు లోబడి కంటెంట్‌ను బ్లాక్ చేయడం లేదా సెక్షన్ 69 ఏ ప్రకారం చట్ట ప్రకారం చర్య తీసుకోవాలన్న నిబంధనలను భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొంది.
కాగా, ప్రభుత్వ నోటిఫికేషన్ లేదా కోర్టు ఉత్తర్వుతో అక్రమ కంటెంట్‌ను ఆన్‌లైన్ వేదికలు తొలగించడం తప్పనిసరని ఐటీ చట్టంలోని 79(3)(బీ) చెబుతోంది. 36 గంటల్లోగా ఆ విధంగా చేయకుంటే, సంబంధిత వేదికలకు సెక్షన్ 79(1) ప్రకారం రక్షణలను కోల్పోతుంది. ఐపీసీ తదితర చట్టాల ప్రకారం ఆ వేదికలపై చర్యలు తీసుకునే అవకాశమేర్పడుతుంది. అయితే, ఈ నిబంధనను వాడుకుంటూ స్వతంత్రంగా కంటెంట్‌ను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నది ఎక్స్ వాదన.
తగు ప్రక్రియను అనుసరించకుండా అధికారులు ఏకపక్షంగా కంటెంట్ సెన్సార్ షిప్ విధిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తోంది. అదేవిధంగా, సామాజిక మాధ్యమ వేదికలు, పోలీసులు, దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం కోసం హోం శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన సహయోగ్ పోర్టల్‌ను ఎక్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. న్యాయపరమైన సమీక్ష లేకుండానే ఫలానా కంటెంట్‌ను తొలగించాలంటూ ‘సహయోగ్’నేరుగా తమపై ఒత్తిడి చేస్తోందని కూడా ‘ఎక్స్’అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment