
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్(ప్రస్తుతం ‘ఎక్స్’).. ఈ పేరు వినగానే మొదటి గుర్తుకొచ్చేంది దాని ఫేమస్ బర్డ్ లోగో. అదేనండి ‘ట్విటర్ పిట్ట’. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ‘ఎక్స్’గా మార్చి శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి పాత బర్డ్ లోగోను తొలగించారు. ఇప్పుడా బర్డ్ లోగోను వేలానికి ఉంచగా భారీ ధర పలికింది.
ట్విటర్ బర్డ్ లోగోను ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ ద్వారా వేలంలో అమ్మకానికి పెట్టారు. ఈ వేలంలో 34,375 డాలర్లకు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.30 లక్షలు) అజ్ఞాత వ్యక్తి దీన్ని కొనుగోలు చేశారు. 12 అడుగులు 9 అడుగులు (3.7 మీటర్లు 2.7 మీటర్లు) కొలతలు, 560 పౌండ్ల (254 కిలోలు) బరువు ఉన్న ఈ బర్డ్ లోగో 34,375 డాలర్లకు అమ్ముడుపోయిందని ఆర్ఆర్ ఆక్షన్ తెలిపింది. అయితే కొన్నదెవరనేది మాత్రం వెల్లడించలేదు.
ట్విటర్‌ను 2022లో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. దీని కోసం ఆయన 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. అయితే, కొనుగోలు తర్వాత ప్రకటనలను నిలుపుకోవడంలో ట్విటర్ ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో ఇందులో ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్లతో సహా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గణనీయంగా వెనక్కితీసుకున్నారు. ట్విటర్‌ను 'ఎవ్రీథింగ్ యాప్'గా మార్చాలన్న లక్ష్యంతో దీన్ని ఆయన ‘ఎక్స్’గా మార్చేశారు.
ట్విటర్‌ను ‘ఎక్స్’గా మార్చేసిన తర్వాత పాత లోగోలు, జ్ఞాపికలు, ఆఫీస్ ఫర్నిచర్, కిచెన్వేర్ వంటి పలు వస్తువులను మస్క్ ఇప్పటికే వేలంలో విక్రయించేశారు. ఇలా వేలంలో భారీ ధరలు పలికిన ఇతర టెక్ వస్తువులలో యాపిల్ కంప్యూటర్ సంస్థకు చెందిన పలు వస్తువులు ఉన్నాయి. వీటిలో యాక్సెసరీస్ తో కూడిన యాపిల్ -1 కంప్యూటర్ 3,75,000 డాలర్లు, 1976 లో స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన చెక్కు 1,12,054 డాలర్లు, మొదటి తరం 4 జీబీ ఐఫోన్ 87,514 డాలర్లు ధర పలికాయి.
Comments
Please login to add a commentAdd a comment