bird
-
ఏఐ సాయంతో అరుదైన బట్టమేక పిట్ట పిల్ల జననం
జైసల్మేర్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల సుదాసరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బ్రీడింగ్ సెంటర్లో శాస్త్రవేత్తలు ఏఐ సాయంతో కృత్రిమ గర్భధారణ పద్ధతిని అనుసరించి, అరుదైన బట్టమేక పిట్ట పిల్లకు జన్మనిచ్చారు. ప్రపంచంలో ఇటువంటి ఘనత సాధించిన దేశంగా భారత్ నిలిచిందని, ఇకపై అంతరించి పోతున్న అరుదైన బట్టమేకపిట్ట పక్షి జాతికి రక్షణ లభిస్తుందని సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బట్టమేక పిట్ట స్మెర్మ్‌ను సేవ్ చేసేందుకు బ్యాంకును ఏర్పాటు చేయడం ద్వారా ఈ అరుదైన పక్షి జాతి కాపాడుకోగలుగుతామని శాస్త్రవేత్త ఆశిష్ వ్యాస్ తెలిపారు.ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ హౌబారా కన్జర్వేషన్ ఫౌండేషన్ అబుదాబి (ఐఎఫ్హెచ్సీ)లో టైలర్ పక్షిపై ఈ తరహా పరీక్ష నిర్వహించామని, అది విజయవంతమైందని ఆశిష్ వ్యాస్ తెలిపారు. ఇండియాస్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి చెందిన శాస్త్రవేత్తలు గత ఏడాది అక్కడికి వెళ్లి ఈ టెక్నిక్ నేర్చుకున్నారన్నారు. తదనంతరం బట్టమేక పిట్ట పిల్లను సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. సెప్టెంబర్ 20న టోనీ అనే ఆడ బట్టమేక పిట్టకు కృత్రిమ గర్భధారణ చేశామన్నారు.అది సెప్టెంబరు 24న గుడ్డు పెట్టిందని, ఆ గుడ్డును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పర్యవేక్షించారు. అంతిమంగా శాస్త్రవేత్తల కృషి ఫలించి, అక్టోబర్ 16న గుడ్డులోంచి బట్టమేక పిట్ట పిల్ల బయటకు వచ్చిందని వ్యాస్ తెలిపారు. ఆ పిల్లను వారం రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి, అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు బట్టమేక పిట్ట పిల్ల ఆరోగ్యంగా ఉందని వ్యాస్ తెలిపారు. ఈ పద్ధతిని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ (ఏఐ)గా పిలుస్తారన్నారు. ఈ బట్టమేక పిట్ట పిల్లకు ఏఐ అనే పేరు పెట్టాలకుంటున్నామని వ్యాస్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: లోదుస్తులు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు -
నార్కోండం - మాయమైన మేకలు ఆసక్తికర కథనం
దట్టమైన అడవులు, కొండలు, బోలెడన్ని పక్షులు , మంచి నీటి సరస్సులు, అద్భుతమైన పగడపు దీవులతో నాగరికతకు దూరంగా ఒక దీవి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.ఆ దీవిలో ఒక విషపూరితం కాని పాము కూడా ఉందనుకోండి. అలాంటి ఒక దీవిని చూడాలని నేను ఎన్నో ఏళ్లగా అనుకుంటున్నాను. అయితే అనుకోకుండా ఒక రోజు నా కల నిజమైంది.అండమాన్ సముద్రములో 48 అడుగుల పడవపై నేను, మరో తొమ్మిది స్నేహితులు కలిసి నార్కోండం అనే ఒక నిద్రాణ అగ్నిపర్వతపు దీవిని పరిశీలించడం కోసం వెళ్ళాము.ఈ దీవిపై అతి కొద్దిమంది మాత్రమే కాలుమోపారు. ఆలా వెళ్లిన వారిలో నార్కోండం హార్నబిల్ అనే అరుదైన పక్షిని చూడటానికి వెళ్లిన పక్షి ప్రేమికులే ఎక్కువ. నార్కోండం హార్నబిల్ పక్షులు కేవలం 7 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణము కలిగిన ఈ నార్కోండం దీవిపై తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కాకపోతే ఈ మధ్య కాలంలో సింగపూర్‌లోని పక్షులని అధ్యయనం చేసి ఒక సంస్థ ఈ జాతి ఆడ పక్షిని అక్కడ చూసినట్టు చెప్పారు. బహుశా ఎవరో కొన్నింటిని అక్రమంగా రవాణా చేసినట్టున్నారు.మా పడవ దీవి దక్షిణ అంచుని దాటి ఈశాన్య అంచున ఉన్న పోలీస్ పోస్ట్ అనే లంగరు వేసే చోటుకి చేరుకుంటూండగానే మాకు నార్కోండం హార్నబిల్ పక్షులు ఎగురుతూ కనిపించాయి. మా పడవ నుంచి చూస్తే 710 మీటర్ల ఎతైన ఆ అగ్నిపర్వతము ఆంతా దట్టమైన అడవితో నిండి ఉంది.ఈ దీవి భారత భూభాగ పరిధిలోకి వస్తుంది, అందుకే ఇక్కడ ఇండియన్ రిజర్వు బటాలిన్ వారి పారా మిలిటరీ పోలిసుల పోస్టు ఉంటుంది. ఒకప్పుడు ఏపుగా ఉండే బర్మా జీలుగ చెట్ల స్థానంలో ఇప్పుడు అక్కడ కొబ్బరి , అరటి , వక్క వంటి మనుషులకు ఉపయోగ పడే చెట్లు కనిపిస్తున్నాయి. ఆ దట్టమైన అడవిలో అనేక మేకలు మొక్కలను తింటూ హార్నబిల్ పక్షుల మనుగడకు ముప్పుగా తయారయ్యాయని ఒక కధనం విన్నాను.ఈ మేకలు ఆ దీవిపై సహజంగా కనిపించే ప్రాణులు కావు. ఈ మేకల వెనుక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. 15 నుంచి 17వ శతాబ్దం మధ్యలో ఐరోపా నుండి అన్వేషక నావికులు ప్రపంచమంతా నౌకలలో ప్రయాణించే వారు. ఆ ప్రయాణంలో సుదూర ప్రాంతాల్లో ఉండే చిన్న దీవులు కనిపించినప్పుడు ఆ దీవుల్లో కొన్ని మేకలు, పందులు, కోళ్లు, కుందేళ్లు మరియు తాబేళ్లను వదిలి వెళ్లేవారు. ఆ దారిన వెళ్లే ఇతర నౌకలకు లేక దురదృష్టవశాత్తు పడవ మునిగిపోతే బ్రతికి బయటపడి దీవికి చేరుకున్నవారికి ఆహారముగా ఇవి ఉపయోగపడతాయని వారి ఉద్దేశం. 1899 లో ఏ. ఓ. హ్యూమ్ ఒక కధనంలో ఈ దీవిపై పందులు, మేకలు, కోళ్లను వదిలిపెట్టారు అని వ్రాసారు. కానీ మొదటిసారిగా ఎప్పుడు వాటిని అక్కడ వదిలారో ఎవరికీ కచ్చితంగా తెలియదు. ఆ కాలంలో వదిలిన వాటిని సముద్రపు దొంగలు లేక నావికులు ఆహారంగా తినేశారో లేక ఆ జంతువులే చనిపోయావో తెలియదు.అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇలా యాదృచ్ఛికంగా దీవులలో వదిలిన జంతువుల ఆ దీవులలోని జీవ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వ అధికారులు నిర్మూలిస్తుండంగా, 1976 లో మన దేశ పోలీసులు రెండు జతల మేకలను ఈ దీవిపై పనిచేసే పోలీసుల ఆహారంకోసం ఉపయోగపడతాయని తీసుకువచ్చారు. ప్రతీరోజు మేక మాంసం తిని విసుగెత్తిపోయారో లేక తోటలను పెంచినట్టు ఆ దీవిలో మేకల పెంపకం పెద్ద వ్యాపారమే అయ్యిందో లేక మేకలు మిగతా దీవులలో వలె మేకలు నియంత్రణ లేకుండా చేయదాటిపోయాయో తెలియదు కానీ 1998 నాటికి ఆ దీవిపై దాదాపు 400 మేకలు చక్కగా భయంలేకుండా బ్రతుకుతూ కనిపించాయట!1990 దశాబ్దం మొదట్లో పక్షులను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఈ దీవిపై నుండి ఈ మేకలను నిర్మూలించాలని అడగడం మొదలుపెట్టారు. సాధారణంగా అగ్నిపర్వతం పరిసరాలు చిన్న రాళ్లతో నిండి ఉంటుంది. ఈ పర్వతంపై పెరుగుతున్న చెట్ల వేళ్ళు ఆ రాళ్లను ఒడిసి పట్టి ఉంచడం వలనే ఆ దీవిని ఒక్కటిగా ఉంచడం సాధ్యపడిందని కొందరు వాదిస్తారు. ముఖ్యంగా అత్తి జాతి చెట్లు ఈ రకంగా తమ వేళ్ళతో రాళ్ళని ఒడిసిపడతాయి. హార్నబిల్ పక్షుల ఆ చెట్ల పళ్ళను తమ పిల్లలకు ఆహారంగా ఉపయోగిస్తాయి. అయితే ఈ దీవిపై అపరిమితంగా పెరిగిపోయిన మేకలు, మొలకెత్తుతున్న అత్తి జాతి మొక్కలను తినడం మూలంగా, కొత్త చెట్లు పెరగడానికి అవకాశం లేక ఆ హార్నబిల్ పక్షుల ఆహారానికి ఇబ్బంది కలిగి తద్వారా వాటి మనుగడ ప్రమాదంలో పడింది. చివరికి మేకలు ఆ దీవికి ప్రమాదకారులుగా మారాయి. మేము ఈ దీవి చేరుకున్నాక, మూడు రోజులపాటు మేకల అడుగుల గుర్తుల కోసం, అవి తిని విసర్జించిన గుర్తుల కోసం, వాటి ఉనికిని తెలిపే ఏదైనా ఆధారాల కోసం దాదాపు ఆ దీవి మూడు వంతులు నడిచి పరిశీలించాము. ఆశ్చర్యంగా మాకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. బహుశా అధికారులు పక్షి శాస్త్రవేత్తలు అడిగినట్లే ఎంతో కష్టపడి వారి కోరిక తీర్చినట్టు ఉన్నారు. అయితే ఇక్కడ నివసిస్తున్న పోలీస్ మాత్రం, అంతకు ముందరి వారమే రెండు మేకలు కొండపైకి పరిగెడుతూ పారిపోవడం చూశామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ దీవిపైనా ఆ మేకల ప్రభావం తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.రచయిత్రి: జానకి లెనిన్ఫోటోలు- రోహిత్ నానీవాడేకర్ -
కాకి దేశభక్తి.. అసలు సంగతి ఇది!
తిరువనంతపురం: కేరళలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు అద్భుతం జరిగిందట. ఓ స్కూల్లో పిల్లలు, టీచర్లు కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అయితే జెండా పైకి వెళ్లిన తర్వాత కూడా తెరచుకోకుండా ముడుచుకునే ఉంది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందోగాని ఓ కాకి సూపర్ హీరోలా వచ్చి ముడుచుకున్న జెండాను ముక్కుతో పూర్తిగా విప్పి తుర్రుమని ఎగిరిపోయింది. Kerala - National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK— Shilpa (@shilpa_cn) August 16, 2024దీంతో జెండా రెపరెపలాడి అక్కడున్నవారిపై పూల వర్షం కురిసింది. అచ్చం సినిమాల్లో గ్రాఫిక్స్ సీన్‌ను తలపించిన ఈ వీడియోను ఎక్స్(ట్విటర్)లో ఓ నెటిజన్ పోస్టు చేయగా వైరల్‌గా మారింది అంటూ ఓ వీడియో చక్కర్లు కొట్టింది. పక్షి జెండాను రెపరెపలాడించిన ఈ వీడియో చూసిన వారు ఆసక్తికర కామెంట్లు పెట్టారు. గాడ్స్‌ఓన్ కంట్రీ కదా అలాగే జరుగుతుందని ఒకరు, గత జన్మలో ఆ పక్షి దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుడేమో అని మరొకరు ఇది నిజంగా అద్భుతమని ఇంకొకరు కామెంట్ చేశారు. Fact Check: అయితే అసలు విషయం ఏంటంటే.. ఆ కాకి వెనకాల ఉన్న చెట్టు మీద వాలింది. జాతీయ జెండాను ఎగరేసిన వ్యక్తి ఎవరో.. దాన్ని బలంగా లాగడం వల్లే తెరుచుకుంది. ఈలోపు ఆ అలికిడికి చెట్టు మీద కాకి జడుసుకుని ఎగిరిపోయింది. జెండా కర్రను డిఫరెంట్యాంగిల్లో చూపించడంతోనే అలా పక్షి ఎగరేసిన జెండా కథనం వైరల్ అయ్యింది.Is that the bird unfurling the flag? No.It's the camera angle. pic.twitter.com/on3BlxJs6U— Mohammed Zubair (@zoo_bear) August 17, 2024 -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. టేకాఫ్ నిలిపివేత
పనాజి: గోవా డబోలిమ్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌కు సిద్ధమైన ఎయిర్ఇండియా విమానానికి పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం గాల్లోకి ఎగరలేదు. ఈ ఘటన బుధవారం(ఆగస్టు14) తెల్లవాారుజామున 6.45గంటలకు జరిగింది. సౌత్‌గోవాలోని డబోలిమ్ విమానాశ్రయం నుంచి విమానం ముంబై వెళ్లాల్సిఉంది. రన్‌వేపైనే విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో టేకాఫ్ నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానానికి ఏవైనా రిపేర్లు అవసరమా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
దేవుడా..!ఇదేం పిచ్చి..చర్మ సంరక్షణ కోసం..ఏకంగా పక్షి లాలాజలంతో..!
ఇటీవల గ్లామరస్‌గా ఉండటంపై వ్యామోహం మాములుగా లేదు. ఇదివరకు ఎవరో అక్కడక్కడ అందంపై శ్రద్ధ పెట్టేవారు. అందుకోసమని మరి ఇంతలా ప్రయాస పడేవారు కాదు. కానీ ఇప్పుడూ అందం అనేది అతిపెద్ద స్టేటస్. అందుకోసం ఎంత డబ్బులైనా వెచ్చిచ్చేందుకు వెనకాడటం లేదు. ముఖ్యంగా ఎలాంటి వెర్రిపనులు చేసేందుకైనా సై అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా విచిత్రమైన సౌందర్య సాధానాలు వస్తున్నాయి. అలాంటి బ్యూటీ ప్రొడక్టే ఈ ఆసియా పక్షి లాలాజల సూప్. అసలు ఏంటిది? పక్షి లాలాజలంతో సూప్ ఎలా చేస్తారు? మంచిదేనా..?దీన్ని "బర్డ్స్ నెస్ట్ సూప్" అని కూడా అంటారు. చైనా, తైవాన్, హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో చేస్తారు. గట్టిపడిన పక్షి ఉమ్మి గూళ్లతో తయారు చేస్తారు. ఇది వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు. పైగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీన్ని ఈస్ట్ కేవియర్ అని కూడా పిలుస్తారు. ఎలా తయారు చేస్తారంటే..ఇది స్విఫ్ట్లెట్స్ అనే పక్షి జాతికి చెందిన తినదగిన గూడు. ఈ పక్షి ఎక్కువగా ఆగ్నేయా తూర్పు ఆసియాలోనే కనిపిస్తుంది. ఈ స్విఫ్ట్లెట్స్ పక్షులు తమ లాలాజలంతో గూళ్లను తయారు చేస్తాయి. ఇవి గూళ్లను తయారు చేసేందుకు కొమ్మలు, ఈకలను వినియోగించదు. వీటిని మార్కెట్లో విక్రయిస్తారు. ఆ గూళ్లు ఎరుపు, తెలుపు, బంగారు వర్ణంలో ఉంటాయి. ప్రతిఒక్క గూడుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలుగా బాగా విశ్వస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా..! అని చర్మ సంరక్షణకు సంబంధించిన పక్షి ఉమ్మి గూడు సూప్ గురించి అందరికీ తెలిసింది. అయితే దీన్ని కొనుగోలు చేయడం అందరివల్ల కాదు. ఎందుకంటే..? 500 గ్రాములే ఏకంగా రూ. 1,60,000/- పలుకుతుంది. ఈ లాలాజల పక్షి గూళ్లతో తయారు చేసిన కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా మార్కెట్లో విక్రయిస్తున్నారు. యూఎస్‌లో దీనికి సంబంధించిన గోల్లెన్ నెస్ట్ అనే షాపును 1996లో ఏర్పాటయ్యింది కూడా. ఇక్కడ ఈ పక్షి గూడును ప్రధాన పదార్ధంగా చేసే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.ప్రయోజనాలు..పోషకాలు సమృద్ధిగా ఉంటాయిఅమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయికణాల పునరుత్పత్తికి, మరమత్తుకు మంచిదిరోగనిరోదక వ్యవస్థను పెంచుతుంది. అంటువ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుందికొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని చైనా ప్రజల నమ్మకం. నిజానికి ఇది నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ చైనీస్ ఔషధం ప్రకారం ఈ పక్షి గూడు యవ్వన రూపాన్ని ఇస్తుందనేది ప్రజల నమ్మకం మాత్రమేనని తేల్చి చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు దీనివల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అవేంటంటే..పక్షి లాలాజల ప్రోటీన్లు లేదా గూడు కలుషితమైతే అలెర్జీ ప్రతిచర్యలను కలిగి ఉండవచ్చు.హార్వెస్టింగ్ మరియు ప్రాసెసింగ్ పద్ధతుల రీత్యా పక్షి గూడుని పరిశుభ్రంగా నిర్వహించకపోతే బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల వంటి కలుషితాలను కలిగి ఉండవచ్చు.ఆ గూళ్లను నిర్మించుకునే వాతావరణాన్ని బట్టి భారీ లోహాలతో కలుషితం అయ్యే ప్రమాదం కూడా ఉంది. View this post on Instagram A post shared by Golden Nest Inc (@goldennestusa) (చదవండి: ప్రపంచంలోనే తొలి మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో ఇన్ఫ్లుయెన్సర్..!) -
పక్షి ఈక 23.66 లక్షలు
ఒక పక్షి ఈక విలువెంత? సున్నా అనుకుంటున్నారా? మీరు పొరపాటు పడినట్లే. న్యూజిలాండ్‌లో నిర్వహించిన ఓ వేలంపాటలో పక్షి ఈక అక్షరాలా రూ.23,66,007(28,417డాలర్లు) పలికింది. ఇది పవిత్రమైన హుయియా పక్షి ఈక కావడమే ఇందుకు కారణం. దశాబ్దాల క్రితం నాటి అరుదైన ఈ ఈకను న్యూజిలాండ్‌లోని వెబ్స్ వేలం కేంద్రంలో తాజాగా వేలం వేశారు. ఔత్సాహికుడొకరు సొంతం చేసుకున్నారు. ఇదొక ప్రపంచ రికార్డు. పిట్ట ఈకకు ఈ స్థాయిలో ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌లోని మవోరీ ప్రజలకు హయియా పక్షిని దైవంగా భావిస్తారు. వారి తెగ పెద్దలు తలపై ఈ పక్షి ఈకలను తలపై కిరీటంగా అలంకరించుకొనేవారు. ప్రజలు బహుమతులుగా ఇచి్చపుచ్చుకొనేవారు. ఈకల క్రయవిక్రయాలు కూడా జరిగేవి. హుయిమా పక్షలు దాదాపు అంతరించిపోయాయి. చివరిసారిగా 1907లో కనిపించినట్లు నిర్ధారణ అయ్యింది. -
6000 కి.మీ ఎగురుతూ ఛత్తీస్‌గఢ్‌కు అరుదైన పక్షి!
పక్షి ప్రేమికులు సంబరపడే వార్త ఇది. కెనడా, అమెరికాలకు ఆనుకుని ఉన్న మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో కనిపించే వింబ్రెల్ పక్షి తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాఘర్ జిల్లాకు తరలివచ్చింది. ఇది దాదాపు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చింది.ఈ పక్షి మొదటిసారిగా ఈ ప్రాంతంలో కనిపించింది. దీనిని చూసేందుకు అటవీశాఖ సిబ్బందితో పాటు సామాన్యులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వింబ్రల్ పక్షి ఖైరాఘర్ జిల్లా మొహభట్టా గ్రామానికి తరలివచ్చింది. దాని శరీరంపై రేడియో కాలర్ అమర్చారు. ఈ కాలర్ అంచనా ధర రూ.10 లక్షలని తెలుస్తోంది. ఆ పక్షి వెనుక భాగంలో సోలార్ జీపీఎస్ కాలర్ కూడా ఉంది. దీని ద్వారా అది ఎంత దూరం ఎగురుతూ ఇక్కడకు చేరిందో తెలుస్తుంది.ఈ కాలర్‌ను ఆ పక్షికి 2023 నవంబర్ 16న ఒక ద్వీపంలో అమర్చారు. ఆ పక్షి దాదాపు 6 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని దీని ద్వారా తెలుస్తోంది. ఆ పక్షి పాకిస్తాన్ మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్కు చేరుకుంది. దీవి నుంచి బయలుదేరిన ఆ పక్షి అరేబియా సముద్రానికి చేరుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చేరుకుని, అక్కడ నాలుగు రోజుల పాటు మకాం వేసింది.ఈ పక్షి భారత తీరంలో 10 రోజులు ఉండి, తరువాత ఖైరాఘర్ జిల్లాలోని మొహభట్టా గ్రామానికి చేరుకుంది. ఇక్కడ ఈ పక్షి నీటిలో ఉల్లాసంగా తిరుగుతూ కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఈ పక్షి ఇక్కడే ఉంటోంది. ఈ పక్షి రెండు కాళ్లపై ఆకుపచ్చ, పసుపు రంగుల జెండాలు ఉన్నాయి. యూరప్‌లోని ఒక సంస్థ ఈ పక్షిని పర్యవేక్షిస్తున్నదని సమాచారం. వింబ్రల్ పక్షి రాకపై తమకు సమాచారం అందిందని ఖైరాగఢ్ డీఎఫ్ఓ అమిత్ తివారీ తెలిపారు. సాధారణంగా ఈ పక్షి మధ్యధరా సముద్ర తీరంలో నివసిస్తుంది. ఇది సంతానోత్పత్తి కోసం వివిధ ప్రదేశాలను వెతుకుతూ ఉంటుంది. -
శివరాత్రి పూజలో పాల్గొన్న పిచుక్క
-
నీలివర్ణంతో తళుక్కునే మెరిసే పాలపిట్ట.. అందుకే అంత స్పెషల్
పాల పిట్ట చుట్టూ ఎన్ని కథలో.. పసిడి పంటల్లే పచ్చని రంగునలుముకుంది, ఆకాశమళ్లే నీలి రంగు పులుముకుంది,అశ్వినీ మాసంలో అడుగులెడుతుంది,శుక్ల పక్షంలోశోభనిస్తుంది..పంటచేనుల్లో పరుగులెడుతుందివిజయ దశమికి విజయాలనిస్తుంది! ప్రపంచానితో పోటీ పడనంటుంది,నాగరికతతో నగరాలకు దూరమవుతుంది. అందాల హరివిల్లై విశ్వమంతా విస్తరించింది.పసిడి పరువాల విహంగం అద్భుతాల పాల పిట్ట !! దసరా రోజు.. పాలపిట్టను చూడకుంటే ఆ పండగకు అర్థమే లేదని చిన్న వెలతి ఉంటుంది. దాని ప్రత్యేకత అలాంటిది మరి! ఓటమి మీద గెలుపుకు నిదర్శనంగా చేసుకునే దసరా పండగ రోజు పాల పిట్టను చూస్తే ఎన్నో విజయాలతో పాటు సుఖ సంతోషాలు వరిస్తాయని అంటారు. అంటే పక్షులు కేవలం ప్రకృతిలో ఉండే ఒక జీవ రాశి మాత్రమే కాదు అవి మనుషుల జీవన విధానాలతో సంప్రదాయాలతో మమేకమై ఉంటాయి అన్నదానికి పాల పిట్ట ఒక ఉదాహరణ.అలాగని ఇది ఒక్క భారత దేశంలోనే కనిపించే పక్షి కాదు. కెనడా, అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అద్భుతమైన పసిడి, నీలం లాంటి రంగుల కలయికతో కనిపిస్తుంది. భారత దేశంలో పాల పిట్టకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిచుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు కూడా ముడిపడి ఉన్నాయి. పాలపిట్టతో మనిషికి యుగయుగాల సంబంధం ఉందంటే విడ్డూరమే కదా? కానీ ప్రతి యుగంలోనూ, పురాణ, ఇతిహాసాల్లో పాల పిట్ట ప్రస్తావన ఎదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది.దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాల పిట్టను నీల కంఠ పక్షి అని పిలుస్తారు(నీల కంఠ అంటే శివుడికి ఉన్న మరో పేరు) దాని గొంతు విషం తాగిన తర్వాత మారిన శివుడి గొంతు (నీలం) రంగులో ఉండటమే కారణం. అలాగే త్రేతా యుగంలో రాముడు రావణాసురుని మీద యుద్దానికి వెళ్లే ముందు పాల పిట్ట ఎదురు వచ్చిందట. అందుకే రాముడు రావణాసురుడిని చంపిన రోజు చెడు మీద మంచి విజయం సాధించిన రోజుకి ఆదర్శంగా దసరాగా జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయం అయ్యింది. అదే రోజు పాల పిట్టలు ఎక్కడ ఉన్నా గ్రామాల్లోని పంట చేన్లలో, ఊరి పొలిమేరల్లో తిరగడం జరుగుతుంది. అశ్విని మాసంలో (అక్టోబర్ నెల) లో పంటలు చేతికి వచ్చే కాలం, అదే సమయంలో నవరాత్రులు, దసరా పండగలు జరుపుకోవడం జరుగుతుంది. అందుకే ఈ పాల పిట్టలు ఆహారం కోసం ఆ సమయాల్లో ఊర్లలో పంట పొలాల్లో కనిపిస్తాయి. పండగలు వాటి ప్రత్యేకతలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే.ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసినప్పుడు వారి ఆయుధాలన్నీ జమ్మీ చెట్టు మీద దాచి ఉంచుతారు. అప్పుడు ఇంద్రుడు పాల పిట్టలా మారి ఆ చెట్టు మీద పాండవుల ఆయుధాలకు రక్షణగా ఉన్నాడు అని కూడా చెప్పుకుంటారు. అందుకే దసరా రోజు ఆయుధ పూజ అంటే అన్ని కుల వృత్తుల వారు వారి వారి జీవన ఆధారాలకు సంబందించిన వాటికి పూజలు చెయ్యడం కూడా జరుగుతుంది. ఇలా ఒక్కో యుగంలో ఒక్కో ప్రాంతానికి చెందిన సంప్రదాయాలతో ఒకే నెలలో జరిగే పండుగలకు పాల పిట్టకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే పాల పిట్ట అనేది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు అది మనుషుల సాంఘిక సమైక్యతను ప్రతిబింబిస్తుంది. ఒక భావోద్వేగం. పాల పిట్ట జీవన విధానం మనకు ఒక చిన్నపాటి పాఠం లాంటింది దాన్ని నిశితంగా పరీక్షిస్తే అది ఉదయం లేవగానే దాని చుట్టూ ఉన్న పరిస్థితులపైన నిఘా వేస్తుంది. ఎలాంటి అపాయాలు పొంచి ఉన్నాయి, అది నివసించే ప్రాంతం సురక్షితంగా ఉంటుందా? ఉండదా? అని విశ్లేషించుకుంటుంది. దాని పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కానీ అవసరానికి అది దాని పరిమాణం రెండింతలు రెట్టింపు చేస్తుంది. పాల పిట్టలు ఎప్పుడు కూడా ఒక సమూహంలో ప్రయాణం చేస్తాయి అందువల్ల మిగతా బలవంతమైన పక్షులు దాడి చేసినప్పుడు కలిసి కట్టుగా పోరాడుతాయి. మనుషులు కూడా సామాజిక సాంఘిక జీవితంలో సంఘటితమై జీవించాలని అప్పుడే ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా నిబడొచ్చు అని మనకు చూపిస్తాయి. పాల పిట్టల గొంతు దూకుడుగా ఉన్నా ఒకదానితో ఒకటి ఎంతో మృదు స్వభావంతో పలకరించుకుంటాయి. అందుకే పాల పిట్టలు నమ్మకానికి ఐక్యమత్యానికి ప్రతీకలు. ఎంతో ఎత్తులో ఎగురుతున్నా కూడా నెల మీద వాటి ఆహారం మీద దృష్టిని మాత్రం పోగొట్టుకోవు. వాటి కంటి చూపు చాలా సూక్షమైన క్రిమి కీటకాలను కూడా గుర్తిస్తాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఉండే చిన్న చిన్న వాన పాములు వీటి ఆహారం. చెట్లు వీటి ప్రాథమిక నివాస స్థలాలు అందుకే ఇవి ఎక్కువగా అడవుల్లో ఉద్యానవనాల్లో నివసిస్తాయి ఆహారం కోసం నీటి పరివాహక ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. పక్షులు మన చుట్టూ కనిపించకపోవడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే గుర్తొస్తుంది. కానీ అవి అంతరించిపోతున్నప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతిని మనుషుల జీవన ప్రమాణాలు కూడా మెల్లి మెల్లిగా అంతరించి పోతున్నాయనే విషయం చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో విరివిగా విచ్చల విడిగా, చిన్న చిన్న నగరాలలోని ఉద్యానవనాల్లో చెట్ల మీద కనిపించిన పాల పిట్ట ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో కనిపిస్తే మనం ఆశ్చర్యానికి గురవుతున్నాం. మరికొంత మంది వీటిని పంజరాల్లొ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే దానికున్న ప్రత్యేకతలు అలాంటివి. అలాగే మనం నాగరిత ముసుగులో అడవులను, చెట్లను దూరం చేస్తూ వాటి మీద ఆధారపడుతున్న పక్షులను జంతువులను కూడా దూరం చేసుకుంటున్నాము. రచయిత : ప్రదీప్ మాడురి ఫోటో : అల్బిన్ జాకబ్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
పురిటి కోసం విదేశాల నుంచి వస్తున్న పక్షులు.. ఎక్కడో తెలుసా?
తేలినీలాపురం.. సైబీరియా పక్షుల విడిది కేంద్రం. పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం. అల్లంత దూరం నుంచి పక్షులను చూడడం, చెట్టుపై వాలిన వాటి అందాలు గమనించడం సహజం. అవే పక్షులను దగ్గరగా చూస్తే..? వాటి ఆహారం, ఆహార్యం, అలవాట్లను తెలుసుకోగలిగితే..? చింత, రావి, తుమ్మ, గండ్ర, వెదురుపై వాలే అతిథి విహంగాల జీవన క్రమాన్ని అర్థం చేసుకోగలిగితే..? ఎంత బాగుంటుందో కదా. ఆ సరదాను తీర్చడానికి తేలినీలాపురంలో పక్షుల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆహార అన్వేషణ, ఆవాసాలపై జీవించే క్రమంలో ఆయా పక్షుల ప్రత్యేకతలను వివరంగా తెలియజేస్తూ పక్షుల బొమ్మలను ఏర్పాటు చేశారు. పెలికాన్ పెలికాన్ బాతు జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 8 కిలోలు ఉంటుంది. దీని నోరు పొడవు సుమారు 14 సెంటీమీటర్లు. దీని రెక్కల పొడవు సుమారు 118 ఇంచీలు, రోజుకు 4 కిలోల చేపల్ని తింటుంది. ఒకే సారి 2 కిలోల బరువు కలిగిన చేపను సునాయాశంగా తినగలిగే సామర్థ్యం ఉంది. దీని గుడ్డు బరువు సుమారు 150 గ్రాములు. ప్రతీ సీజన్‌కు 4 గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని గుడ్డు 28 రోజుల్లో పిల్లగా పరిపక్వత చెందుతుంది. 3 నెలల్లో పిల్ల తల్లిగా మారుతుంది. దీని దవడ సంచి ఆకారంలో ఉంటుంది. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తాయి. రోజుకు సుమారు 4 సార్లు బయటకు వెళ్తూ ఆహారాన్ని తీసుకువస్తాయి. పెలికాన్ దవడ సంచి ఆకారంలో ఉంటుంది. ఈ దవడలో సుమారు 4 కిలోల వరకు చేపల్ని నిల్వ చేయగలవు. పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. పెయింటెడ్ స్టార్క్ పెయింటెడ్ స్టార్క్ కొంగ జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. దీని రెక్కల పొడవు 63 ఇంచీలు, ఇవి చిన్న చేపలు, పురుగులు, నత్తలు తింటాయి. కేవలం పావు కిలో వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి. తీసుకువచ్చిన ఆహారాన్ని గూడు మీద వేస్తే పిల్లలు తింటాయి. దీని నోటి పొడవు సుమారు 16 సెంటీ మీటర్లు. ఆహారం కోసం రోజుకు 2 సార్లు బయటకు వెళ్తుంటాయి. దీనికి సాధారణ దవడ మాత్రమే ఉంటుంది. దీని గుడ్డు సుమారు 75 గ్రాములు. ఇవి ఒక సీజన్లో 4 గుడ్లు మాత్రమే పెడతాయి. 28 రోజుల్లో గుడ్డును పిల్లగా పరిపక్వత చేస్తుంది. పిల్ల తల్లిగా మారాలంటే సుమారు 3 సంవత్సరాలు కాలం పడుతుంది. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. 120 రకాల పక్షుల్లో కొన్నింటి ప్రత్యేకతలు.. పొడుగు ముక్కు ఉల్లంకి: ఈ పక్షి మట్టిలో ఆహార ఆన్వేషణకు బురద మట్టి ఇసుక నేలలో అనేక రకాలైన చిన్న పురుగులను కొక్కెం వంటి ముక్కుతో వేట కొనసాగిస్తుంది. ఈ పక్షి నమూనా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తెడ్డు మూతి కొంగ: ఈ పక్షి మూతి చెంచా ఆకారంలో ఉంటుంది. నీటి అడుగున ఉన్న చిన్న జీవులను వేటాడుతుంది. అర్ధ చంద్రాకారంలో గల మూతితో వేట కొనసాగిస్తుంది. పాము బాతు : బల్లెం వంటి ముక్కు ఆకారంతో ఈ పక్షి వేట కొనసాగిస్తుంది. మట్టి, నీటిలో పొడుచుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది. రాజహంస: జల్లెడ మాదిరిగా ఉన్న ముక్కు కలిగిన ఈ రాజహంస సూక్ష్మ జీవులను సునాయాశంగా వేటాడుతుంది. ఈ పక్షి ముక్కులో ఒక రకమైన వడపోత పరికరం బిగించి ఉన్నట్లు ఉంటుంది. నత్తగుల్ల కొంగ: నత్తలను వేటాడడంలో ఈ పక్షి ముక్కు ఎంతో షార్ప్‌గా ఉంటుంది. నత్తలను గట్టిగా పట్టుకోవడంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మ్యూజియం చూసొద్దామా... టెక్కలి సమీపంలోని తేలినీలాపురంలొ ఈ మ్యూజియం ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఎంత దూరం 70 కిలోమీటర్లు ఉంటుంది. రవాణా: టెక్కలి వరకు రైలు సదుపాయం ఉంది. బస్సు సదు పాయం కూడా ఉంది. టెక్కలి నుంచి పూండి మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి బస్సులు, ఆటోలు కూడా ఉన్నాయి. సందర్శనీయ వేళలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. -
శీతాకాలం విడిది కోసం వలస వెళ్తున్న పక్షులు, వేలకిలోమీటర్ల ప్రయాణం
శీతాకాలం విడిది కోసం పక్షుల వలసలు మొదలయ్యాయి. దేశీయంగానూ ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు పక్షులు వలస వెళ్తాయి.ఎన్నో జాతుల పక్షులకు వలస వెళ్ళడం వాటి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ప్రపంచ పక్షి జాతుల్లో సుమారు 40శాతం దాకా వలస వెళ్తాయని అంచనా. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. శీతోష్ణస్థితిలో ఏర్పడిన అననుకూల పరిస్థితుల వల్ల, ఆహారం కోసం, గుడ్లను పెట్టి పొదిగి సంతానాభివృద్ధికి, వ్యాధుల నుంచి రక్షణకు పక్షులు వలస వెళ్తాయి. వలసలో భాగంగా పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.వాతావరణం అనుకూలంగా మారిన తరవాత మళ్ళీ వెనుదిరుగుతాయి. ముఖ్యంగా శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్ దేశాల నుంచి పక్షులు భారత్‌లోకి వలస వస్తుంటాయి. అయితే శీతాకాల విడిది కోసం వలస వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షి పేరు ఓనోన్ కుకూ. ఏప్రిల్29న ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న ఈ పక్షి ఈరోజు(శనివారం)మధ్యప్రదేశ్‌కి చేరుకుంది. అరేబియా సముద్రానికి 150 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఈ పక్షి ప్రయాణం సాగింది. మరో వారం రోజుల్లో ఇది 5వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు.దీనిలాగే ఇతర పక్షులు కూడా మార్గమధ్యంలో ఆహారం, విశ్రాంతి కోసం కొంతకాలం ఆగుతాయి. He is Onon a Cuckoo. This bird was in Kenya on 29th April. Today he is in Madhya Pradesh. He has completed his crossing of the Arabian Sea to India and, for good measure, flown another 600 km inland also. It is 5000 Kms flying in a week. Feel that amazing feat. @BirdingBeijing pic.twitter.com/SGfuGO3MkS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 4, 2020 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చే విభిన్న రకాల విదేశీ పక్షులను చూసేందుకు, కెమెరాలతో క్లిక్ మనిపించేందుకు బర్డ్ వాచర్లు క్యూ కడుతుంటారు. అయితే ఒకప్పుడు వందల సంఖ్యలో వచ్చే విదేశీ పక్షుల రాక క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ పక్షులు ఆవాసాలుగా చేసుకునే చెరువులు ఆక్రమణలకు గురవడం, చెరువుల చుట్టూ నిర్మాణాలు పెరిగిపోతుండటంతో వాటి రాక క్రమంగా తగ్గిపోతోంది. 📢Today is the day! Let’s celebrate bird migration on #WorldMigratoryBirdDay! On their epic journeys, migratory birds help inspire many people and cultures along the way. Learn more about their migration & how you can protect them: ➡️https://t.co/SoAJkVyx3z pic.twitter.com/OIiFGSPaTp — World Migratory Bird Day (@WMBD) October 14, 2023 ప్రస్తుతం ఈ సీజన్లోనూ సిటీకి విదేశీ పక్షులు వచ్చినప్పటికీ మునుపటితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని బర్డ్వాచర్లు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే రాను రాను ఈ సంఖ్య మరింత పడిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Pudami Sakshiga :పక్షిగూడు గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
“ఋతుపవనాలు అడవుల గుండా పయనిస్తున్నపుడు మన ప్రపంచంలోనే ఉన్న మరో చిన్న ప్రపంచంలోని ఆకర్షణ, రమ్యత చూసే కనులు పరవశమొందే హృదయం ఉన్న ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది." - Dr. Salim Ali, eminant Ornithologist నిజమేనండి, పక్షుల ప్రపంచం ఎంతో అద్భుతమైనది. కొంచెం పరికించి చూస్తే ఆ చిన్ని ప్రపంచం లోని వింతలు విడ్డూరాలు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. పక్షులు చిన్నగా కనిపించినప్పటికీ అవి నివసించే తీరు వాటి జీవన విధానం మనకందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఆ చిన్ని గూటిలో ఎదుగుతున్న ఆకలితో ఉన్న పిల్లలు తమలో తాము సామరస్యంగా సర్దుబాటు చేసుకునే విధానం నిజంగా ఆశ్చర్యకరం. కుటుంబంలోని ఈ ఇచ్చి పుచ్చుకోవడం మనందరం అలవర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం. ఆ పక్షి ప్రపంచంలోకి వెళ్ళి అవి గూడు కట్టుకునే విధానం గురించిన కొన్ని విశేషాలని తెలుసుకుందామా! గూడు (ఇల్లు) మనందరి మౌళిక అవసరం. సాయంత్రమైతే చాలు ఎప్పుడు ఇంటికి చేరి కొంత సేదదీరుదామా అని మనమందరం ఎదురు చూస్తాం. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నామంటే చాలు బెంగ పట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా అని మనసు గొడవ పెడుతూ ఉంటుంది. మరి పక్షులు సాయంత్రమైతే ఎక్కడికి వెళ్తాయి? ఇదేం ప్రశ్న గూటికి పోతాయి అనుకుంటున్నారు కదూ, అలా అనుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. పక్షులు జతకట్టి, గుడ్లు పెట్టి, పిల్లలను సాకే కాలంలోనే గూళ్ళు కట్టుకుంటాయి. మిగతా సమయాలలో గుబురుగా పెరిగిన పొదలలోనో, బొరియలు చెట్టు తొర్రలలోనో, కొమ్మ వంచలలో శత్రువుల బారిన పడకుండా ఉండేలా చూసుకుని పడుకుంటాయి. సంతానోత్పత్తి కాలంలో రకరకాల పక్షులు వివిధ రకాలుగా గూళ్లను కట్టుకుంటాయి. కొన్ని గడ్డి పరకలను అల్లిగూడు కడితే, కొన్ని ఆకులను కుట్టి గూటిని కడతాయి. పుల్లలు, పుడకలు, బూజు, గరిక, మట్టి వంటి వాటితో ఎలాంటి సివిల్ ఇంజనీరు సాయం లేకుండా తమంతట తామే గూటిని నిర్మించుకుంటాయి. కొన్ని చెట్ల కాండాలపై రంధ్రాలు చేసి గూడును కడితే, కొన్ని నేలలో బొరియలను తవ్వి గూటిని నిర్మించుకుంటాయి. నీళ్ళపై తేలియాడే గూళ్ళు, వేలాడే గూళ్ళు అబ్బో ఎన్నో రకాల గూళ్ళు. కొన్ని కప్పు లాగా ఉంటే మరికొన్ని సాసర్ లా. ఇంకొన్ని గూళ్లయితే నేల మీదే. ఇలా పక్షులు కట్టుకునే గూళ్లను గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందామనుకుంటుంటే చదవడం కొనసాగించండి మరి. ►తీతువ, తెల్ల బొర్ర నీటి కోడి వంటి నీటి పక్షులు నీటి అంచుకు దగ్గరగా ఆకులు, గడ్డితో నేల మీదే గూళ్ళు కట్టుకుంటాయి. గుడ్ల రంగు వాటిపై ఉండే మచ్చలు నేల, గడ్డి రంగులతో కలిసిపోయి శత్రువుల బారిన పడకుండా ఉంటాయి. కబోద పక్షి( నైట్ జార్) రాలిన ఆకులలోనే గుడ్లు పెడుతుంది. ► కాకులు, కొంగలు, గ్రద్దలు, పావురాలు పుల్లలతో గూడును నిర్మించుకుంటాయి. గూడు లోపల మెత్తని పీచు వంటి వాటిని పరిచి గుడ్లను పెడతాయి. ► చెట్ల తొర్రలలో గుడ్లగూబలు, కొమ్ముకసిరి (హార్న్ బిల్), చిలకలు, మైనాలు గూటిని ఏర్పాటు చేసుకుంటాయి. కంసాలి పిట్ట,వడ్రంగి పిట్టలు మొదట చెట్లకు రంధ్రాలు చేసి గూటిని నిర్మించుకుంటే, తరువాత చిలుకలు, మైనాలు వాటిని తమకు అనువుగా మార్చుకుంటాయి. మనం పాత ఇంటిని రీ మోడలింగ్ చేసుకున్నట్లు. ► కొమ్ము కసిరి గూడు కట్టుకుని పిల్లలను సాకే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆడ మగ పక్షులు జతకట్టి గూటిని ఎంచుకోగానే ఆడ పక్షి ఆ తొర్రలో చేరి తన ముక్కు పట్టేంత ఖాళీ మాత్రం ఉంచి ద్వారాన్ని తన విసర్జకాలు, మట్టితో మెత్తి మూసేస్తుంది. ► గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలకు కనీసం ఒక వారం వయసు వచ్చే వరకు ఆడ పక్షి అలా నిర్భందం లోనే ఉండిపోతుంది. ఈ నిర్భందం సమయంలో మగ పక్షే ఆహారాన్ని అందిస్తుంది. పిల్లలకు కనీసం వారం వయసు వచ్చాకకట్టిన గోడను ముక్కుతో పొడుచుకుని ఆడ పక్షి బయటకు వచ్చి, మరలా అడ్డుగోడను కట్టేస్తుంది. అక్కడి నుంచి అమ్మానాన్నలిద్దరు పిల్లలను సాకడంలో నిమగ్నమైపోతారు. ► పసరిక పిట్టలు (బీ ఈటర్స్), లకుముకి పిట్ట (కింగ్ ఫిషర్), కూకూడు పిట్ట (హూపో) వంటి పక్షులు కొంచెం ఎత్తైన నేల మీద మట్టిలో బొరియలు చేసుకుని లేదా కొండ అంచులలో బొరియలు తవ్వి గూడు కట్టుకుంటాయి. ► పికిలి పిట్టలు (బుల్బుల్), పిచ్చుకలు, వంగ పండు (గోల్డెన్ ఓరియల్), పసుపు జిట్ట (ఐయోర) వంటి పక్షులు కొమ్మ వంచలలో దొన్నె లాంటి గూటిని కట్టుకుంటాయి. ► చుక్కల జీనువాయి (మునియ) గడ్డితో గుండ్రటి బంతి లాంటి గూటిని కట్టుకుంటుంది. ఆకుల పోతడు (దర్జీ పిట్ట) ఆకుల అంచులను కలిపి గొట్టంలా కుట్టి గూడు పెడుతుంది. ► తేనె పిట్టలు ఆకులు, గడ్డి, బూజును వాడి వేలాడే గూటిని కడితే, గిజిగాడు (బాయా వీవర్) గడ్డి పోచలతో వేలాడే అందమైన గూటిని అల్లుతుంది. గిజిగాడు నీటి అంచులలో ఉన్న చెట్లపై బాగా వాలి ఉన్న కొమ్మల చివర గడ్డితో గూటిని అల్లుతుంది. ► మొదట గడ్డితో ముడి వేసి, చట్రాన్ని అల్లి మిగిలిన గూటిని అల్లుతుంది. ఇదంతా మగ పక్షి మాత్రమే చేస్తుంది. ఇలా అల్లిన గూటిని ఆడ పక్షి పరిశీలించి నచ్చితే జతకట్టి గూటిని నిర్మించడం కొనసాగిస్తాయి. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షి మరో గూటిని కట్టడం మొదలు పెడుతుంది. ఇలా సంతానోత్పత్తి కాలంలో రెండు నుండీ మూడు గూళ్లను కడుతుంది. ఒక వేళ ఆడపక్షికి గూడు నచ్చక పోతే పని మళ్ళీ మొదటికే, ఆ గూటిని పీకి కొత్త గూటిని అల్లాల్సిందే. ఈ గూటిని కట్టడానికి వెయ్యి దాకా గడ్డి పోచలు అవసరపడతాయట. గూడు పచ్చగా ఉన్నపుడే ఆడ పక్షి పరిశీలించేది, గూడు అల్లటం ఆలస్యం అయినా కధ మళ్ళీ మొదటికే. ఇంతే కాదు, నీటికాకులు, కొంగలు, పసరిక పిట్టలు, అడవి పిచ్చుకలు, వలస పక్షులు కలిసికట్టుగా కాలనీలుగా గూళ్ళు నిర్మించుకుంటాయి. పిల్లలను శత్రువుల బారినుండి సంరక్షించుకునేందుకు కాలనీ సహాయపడుతుంది. ఇక్కడ తమంతట తాము గూటిని నిర్మించుకోలేని కోకిల జాతి పక్షులను గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. కోకిల సొంతంగా గూటిని కట్టుకోలేదు, కాకి గూటిలోనో, బొంత పిచ్చుకల గూటిలోనో గుడ్లను పెడుతుంది. పిల్ల పెరిగి పెద్దదయిన తర్వాత గాని పెంచిన తల్లిదండ్రులకు తెలియదు. ఇలా పక్షులు రకరకాలుగా గూటిని నిర్మించుకునే విశేషాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ! చాలా వరకు పక్షులు మే నుంచి సెప్టెంబరు లోపు అంటే వానలు పడి పురుగులు, గడ్డి, గడ్డి గింజలు, పళ్ళు ఎక్కువగా దొరికే కాలంలో గూటిని కట్టుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. మీరు కొంచెం బద్దకం వీడి నాలుగడుగులు వేసి మీ చుట్టుపక్కల పరిశీలిస్తే తప్పకుండా ఒకటి రెండు గూళ్లను చూసే అవకాశం దక్కించుకోవచ్చు. ఏమిటి లేచే ప్రయత్నం చేస్తున్నారా? రచయిత : రవి కుమార్ ద్వాదశి, ravikumardwadasi@gmail.com తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
అత్యంత పోషక విలువలు కలిగిన కౌజు పిట్టలు..!
-
జస్ట్ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!
ఇది మామూలు పిట్టబొమ్మ కాదు. చాలా స్మార్ట్ పిట్టబొమ్మ. దీనిని గోడకు అలంకరణలా వేలాడదీసుకుంటే చాలు. ఇంట్లోని గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు గమనిస్తూ, గాలిని శుభ్రపరుస్తుంది. వంటగదిలో వంట చేసేటప్పుడు వెలువడే వాసనలను, పెంపుడు జంతువుల నుంచి వెలువడే వాసనలను, గాలిలోని దుమ్ము ధూళి కణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఇంట్లో కార్బన్ డయాక్సైడ్ మోతాదుకు మించి చేరితే, దీని యాప్ ద్వారా వెంటనే కిటికీలు తెరవాలంటూ సందేశం పంపుతుంది. ‘బర్డీ’ అనే డానిష్ కంపెనీ, ఇదే బ్రాండ్ పేరుతో ఈ పిట్టబొమ్మను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ హైటెక్ పిట్ట ఇంట్లో ఉంటే, ఇంట్లో ఉండేవారికి అలెర్జీలు, ఉబ్బసం సమస్యల నుంచి ఎంతో ఉపశమనంగా ఉంటుంది. దీని ధర 189 డాలర్లు (రూ.15,616) మాత్రమే! (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కారు చౌక ఈ ఇల్లు! ఎందుకో తెలుసా!) -
అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!
కాఫీ గుమగుమలు ముక్కు పుటలకు తాకగానే అబ్బా అనేస్తాం. పొద్దున్నే ఓ కప్పు కాఫీ పొట్టలో పడితే గానీ ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించదు. అలాంటి కాఫీ ప్రియులకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ ఉందని తెలుసా!. ఐతే దాన్ని ఎలా తయారచేస్తారో వింటే మాత్రం..ఛీ యాక్ అంటారు. కానీ ఆ కాఫీ చాలా రుచిగా ఉండటానికి కారణం వాటివల్లనేట. ఆ కాఫీ తయారయ్యే విధానం తెలిస్తే మాత్రం..అమ్మబాబోయ్! అంటూ జోలికి వెళ్లే సాహసం చేయలేం. విచిత్రం ఏంటంటే ఆ కాఫీకి ఉన్న డిమాండ్ చూస్తే వామ్మో! అంటారు. కోపి లువాక్ లేదా సివెట్ కాఫీ ప్రంపచంలోనే అత్యంత ఖరిదైన కాఫీగా ప్రసిద్ధిచెందింది. దీన్ని ఎలా తయారు చేస్తారో వింటే మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్క క్షణం నిశబ్దంగా ఉండిపోతాం. దీని ధర ట్యాగ్ వెనుకు ఉన్న రహస్యం తెలుసుకుంటే షాకవ్వడం గ్యారంటీ. ఎలా తయారు చేస్తారంటే.. కోపి లువాక్ అనే కాఫీ ఇండోనేషియా, సుమత్రా, జావా, బాలి నుంచి ఉద్భవించింది. ఇది కాఫీ చెర్రీస్ అనే పండ్ల నుంచి తయారవ్వుతుంది. అయితే ఆ పండ్లను సేకరించి నేరుగా తయారు చేసేయ్యరు. ఆ కాఫీ చెర్రీలను పునుగు పిల్లి(ఆంగ్లంలో (సివెట్) అనే పిల్లి జాతి క్షీరదం తింటుందట. ఆ తర్వాత వాటి గింజలను విసర్జిస్తుతుంది. కాఫీ ఉత్పత్తిదారులు అది విసర్జించిన గింజలను సేకరించి ఈ కాఫీని తయారు చేస్తారు. నిజానికి ఈ కాఫీ చెర్రీలు చాలా చేదుగా ఉంటాయి. వాటిని ఈ పునుగు పిల్లులు తినడంతో వాటి కడుపులోని ఎంజైమ్‌లు బీన్స్ నేచర్‌ని మారుస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే వాటి చేదు గుణాన్ని తగ్గించి వాటిని రుచిగా మారుస్తాయి. ఈ సహజ కిణ్వనప్రక్రియే కోలి లువాక్ అనే కాఫీ రుచికి ప్రధాన కారణమట. సేకరించిన పునుగు పిల్లి విసర్జకాలు ఎందుకింత ఖరీదంటే.. ఈ కాఫీ ఎందుకింత ఖరీదైందిగా పేరుగాంచిందంటే ఈ కాఫీ బీన్స్ సంప్రదాయంగా పండించడానికి బుదులుగా ఈ సివెట్(పునుగు పిల్లుల) రెట్లను సేకరించడం ద్వారానే తయారవ్వుతుంది కాబట్టి. ఉత్పత్తిదారులకు ఇది అధిక ఖర్చులకు దోహదం చేసే అంశం. ఇక సివెట్ తక్కువ మొత్తంలో ఈ కాఫీ చెర్రీలనే విసర్జిస్తాయి. దీంతో పరిమిత స్థాయిలోనే సరఫరా ఉండటంతో డిమాండ్ అధికంగా ఉంటుంది. పునుగు పిల్లి విసర్జక పదార్థాలతో తయారవుతుందనే దృష్ట్యా ఈ కాఫీపై పలు విమర్శలు కూడాఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీ తాగాలనుకునేవారికి ఈ కాఫీ ఒక స్టేటస్ ఆఫ్ సింబల్‌గా ఉంటుంది. ఈ కాపీ తయారీ కోసమనే ఈ పునుగు పిల్లలను బంధిస్తున్నారని జంతుప్రేమికుల నుంచి విమర్మలు కూడా ఉన్నాయి. ఈ కోపీ లువాక్ కాఫీ ఖరీదు, విలక్షణమైన తయారీ విధానం కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటుందట. (చదవండి: మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..) -
Twitter Blue Bird Auction: ట్విటర్ వేలానికి ఉంచిన వస్తువులు ఇవే.. (ఫొటోలు)
-
ట్విటర్ పిట్టను కొంటారా?
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఎక్స్ (ట్విటర్)ను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతున్నాడు దాని అధినేత ఎలాన్ మస్క్. బాగా ప్రాచుర్యం పొందిన ట్విటర్ లోగోతోపాటు పేరునూ మార్చేసిన సంగతి తెలిసిందే. లోగోలో ఉన్న పిట్ట స్థానంలోకి ఇంగ్లిస్ అక్షరం ‘ఎక్స్’ వచ్చేసింది. తాజాగా ట్విటర్లోని పాత విలువైన జ్ఞాపకాలను మస్క్ వేలానికి పెట్టనున్నారు. వీటిలో ట్విటర్ ప్రధాన కార్యాలయంపై పిట్ట బొమ్మతో ఉన్న సైన్బోర్డ్ కూడా ఉండనుంది. ట్విటర్‌ను ఎక్స్ పేరిట రీబ్రాండ్ చేసిన కొన్ని రోజుల్లోనే మస్క్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం 584 లాట్లను వేలానికి తీసుకురానుండగా వీటిలో ట్విటర్ బర్డ్ కాఫీ టేబుల్, భారీ పంజరం, స్టూళ్లు, టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉపకరణాలు, సంగీత పరికరాలు, నియాన్ ట్విటర్ లోగో, హ్యాష్‌ట్యాగ్ గుర్తు వంటివి ఉన్నాయి. కాగా ఈ వేలానికి ‘ట్విటర్ రీబ్రాండింగ్ : ఆన్లైన్ ఆక్షన్ ఫీచరింగ్ మెమోరాబిలియా, ఆర్ట్, ఆఫీస్ అసెట్స్ అండ్ మోర్’ అని పేరుపెట్టారు. ఉపకరణాలు, వస్తువులతోపాటు ప్రముఖుల నుంచి వైరల్ అయిన వారి ఆయిల్ పెయింటింగ్‌లు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఈ కళాకృతులలో చిరస్మరణీయమైన 2014 ఆస్కార్స్ ఎల్లెన్ డిజెనెరెస్ సెల్, సెలబ్రిటీ ట్రిబ్యూట్ ట్వీట్ల ఆకర్షణీయమైన ఫోటో మొజాయిక్ ఉన్నాయి. 2012 నవంబర్‌లో తిరిగి ఎన్నికైన తర్వాత అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన ట్వీట్‌కు సంబంధించిన చిత్రం కూడా ఇందులో ఉంది. ఈ ప్రత్యేక ట్వీట్ అప్పట్లో అత్యధిక లైక్‌లు పొందిన ట్వీట్‌గా గుర్తింపు పొందింది. ఇదీ చదవండి: ట్వీట్లతో రెచ్చిపోండి.. యూజర్లకు మస్క్ బంపరాఫర్ వేలం నిర్వహించే హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ ప్రకారం, ప్రతి లాట్‌కు ప్రారంభ బిడ్ 25 డాలర్లు. కొనుగోలుదారుల ప్రీమియం 19 శాతం, అమ్మకపు పన్ను 8.63 శాతం ఉంటుంది. ఈ వేలానికి సంబంధించిన బిడ్డింగ్ సెప్టెంబర్ 12న ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ట్విటర్ బర్డ్ లోగో శాన్ఫ్రాన్సిస్కోలోని స్ట్రీట్-10లో ఉన్న ట్విటర్ ప్రధాన కార్యాలయ భవనానికి ఇంకా అలాగే ఉంది. దీనిని గతంలో తొలగించాలని ప్రయత్నించినా.. శాన్ఫ్రాన్సిస్కో అధికారులు అడ్డుకొన్నారు. దీంతో ట్విటర్ హెడ్‌క్వార్టర్స్‌పై ఉన్న పిట్ట బొమ్మను వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తే అధికారుల అనుమతి పొంది తరలించుకోవాలని వేలం వివరాల్లో పేర్కొన్నారు. 🔊 Did you miss the first #Twitter #auction? Here is your chance to participate! 👉 https://t.co/rtN7izBGPI#DontMissOut 👀 #X #TwitteRebrand #TwitterRebranding #TwitterAuction #HGP #HGPAuction $HGBL #AssetManagement #Reuse #OnlineAuction #ShoppingOnline pic.twitter.com/m5lvJjfToF — HGP Auction (@HGP_Auction) August 7, 2023 -
బుజ్జి పిట్ట జీవితంలో ఇంజినీరింగ్ + ఎమోషన్
-
మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు!
బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తికి తన పొరుగింటిలో నుంచి ఒక మహిళ కేకలు వినిపించడంతో అతను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి, ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎస్ఎక్స్ పోలీసులు కాన్వే ద్వీపంలోని స్టీవ్వుడ్ ఇంటికి మూడు పోలీసు వాహనాలను పంపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కాన్వే ద్వీపంలో ఉంటున్న స్టీవ్వుడ్స్ గత 21 ఏళ్లుగా పక్షులను పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం అతని దగ్గర పలు రకాల పక్షులు ఉన్నాయి. వుడ్ బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం తన వద్ద ఉన్న పక్షులు సాధారణంగా ఉదయం వేళ అరుస్తుంటాయన్నారు. అయితే తన దగ్గర ఫ్రెడీ అనే రామచిలుక ఉన్నదని, దానిలో అత్యధికంగా హార్మోనులు విడుదలవుతాయని, అప్పుడు అది గట్టిగా అరుస్తుందని తెలిపారు. పోలీసులు రాగానే తాను కంగారు పడిపోయాయని, తాను ఏమి తప్పు చేశానని వారిని అడిగానని అన్నారు. అప్పుడు వారు ఈ ఇంటిలో నుంచి ఒక మహిళ అరుపులు వినిపించాయని తమకు ఫిర్యాదు అందిందని, అందుకే వచ్చామని, ఇంటిని తనిఖీ చేస్తామని తెలిపారు. వారు తనిఖీ చేసి, అంతా సవ్యంగానే ఉందన్నారు. అప్పుడు తాను అసలు విషయం చెప్పానని, అది రామ చిలుక అరుపు అని వివరించానన్నారు. తన పొరుగింటిలోని వ్యక్తి పోలీసులకు ఫోను చేయడం మంచిదే అయ్యిందని, పోలీసుల తనిఖీతో తన తప్పేమీ లేదని అందరికీ అర్థం అయ్యిందని వుడ్స్ తెలిపారు. ఇది కూడా చదవండి: టూత్‌పేస్ట్ ట్యూబ్‌తో నీళ్లు పడుతున్న మహిళ.. మెచ్చుకుంటున్న జనం! -
రక్తం కారుతున్నా లెక్క చేయకుండా విమానాన్ని నడిపిన పైలెట్
ఈక్వెడార్: లాస్ రోస్ ప్రాంతంలో ఓ విమానం పైలెట్ కు వింత అనుభవం ఎదురైంది. విధి నిర్వహణలో విమానాన్ని నడుపుతున్న పైలెట్ కాక్ పిట్ లోకి ఒక పెద్ద పక్షి విండ్ షీల్డుని పగులగొట్టుకుని పొరపాటున లోపలి వచ్చింది. కాక్ పిట్ లో ఇరుక్కున్న ఆ పక్షి తన కాళ్లతో పొడుస్తున్నా, మొహమంతా రక్తం కారుతున్నా ఏమాత్రం లెక్కచేయని పైలెట్ అలాగే విమానాన్ని నడిపాడు. మొహమంతా రక్తం.. లాస్ రోస్ ప్రాంతంలో ఆకాశంలో సుమారు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం పైలెట్ క్యాబిన్లోకి భారీ పక్షి ఒకటి విండ్ షీల్డ్ ను బద్దలుగొట్టుకుని మరీ లోపలికి చొచ్చుకుని వచ్చింది. అద్దంలో ఇరుక్కుపోయిన ఆ పక్షి సగభాగం లోపల వేలాడుతూ ప్రాణాలు కాపాడుకోవటానికి విశ్వప్రయత్నాలు చేసి చివరికి రక్తమోడుతూ గాల్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో పైలెట్ ఏరియల్ వాలియంట్ రక్తమోడుతున్న తన ముఖాన్ని, కాక్ పిట్ లోకి వచ్చిన ఆ భారీ పక్షిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. రాబందు జాతి పక్షి.. అంత ఎత్తులో ఎగిరే ఈ పక్షిని ఆండియాన్ కాండోర్ పక్షిగా గుర్తించారు. ఇది దక్షిణ అమెరికా కాథర్టిడ్ రాబందు జాతికి చెందినదని గుర్తించారు. దీని రెక్కలు సుమారుగా పది అడుగుల వెడల్పు ఉంటాయని ఇవి భూమికి 21 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. Pilot safely lands his plane after a huge bird struck his windshield in the Los Ríos Province, Ecuador. Ariel Valiente was not injured during the incident. pic.twitter.com/Rl3Esonmtp — Breaking Aviation News & Videos (@aviationbrk) June 15, 2023 ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!
ఎలాన్ మస్క్ ట్విటర్లో మరో మార్పు చేశాడు. ఈ సారి లోగోపై పడ్డాడు. ఇప్పటి వరకూ ఉన్న పక్షి (బ్లూబర్డ్) లోగోను పీకేసి దాని స్థానంలో కుక్క (డాగీ) లోగోను పెట్టాడు. అయితే ఇది మొబైల్ యాప్‌లో కాదులెండి.. డెస్క్‌టాప్ వెర్షన్లో మాత్రమే ఇలా చేశాడు. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) pic.twitter.com/wmN5WxUhfQ — Elon Musk (@elonmusk) April 3, 2023 ట్విటర్ వెబ్సైట్లో హోం బటన్‌గా ఉన్న ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో డాగీ కాయిన్ (Dogecoin) క్రిప్టోకరెన్సీ లోగోకు చెందిన డాగ్ మీమ్ ప్రత్యక్షమైంది. ఏప్రిల్ 3న దాన్ని గమనించిన యూజర్లు అవాక్కయ్యారు. ప్రముఖ క్రిప్టోకరెన్సీ డాగీ కాయిన్ లోగోలో ఉపయోగించిన డాగీ (షిబా ఇను డాగ్) చిత్రం చాలా కాలంగా అనేక వైరల్ మీమ్స్‌లో కనిపిస్తోంది. (జొమాటో డెలివరీ పార్ట్నర్స్కు ఎలక్ట్రిక్ స్కూటర్లు!) ట్విటర్ లోగో మార్పుపై ఎలాన్ మస్క్ తనదైన శైలిలో ఓ హాస్యభరితమైన మీమ్‌ను జోడిస్తూ ట్విటర్లో షేర్ చేశారు. అలాగే 2022 మార్చి 26 నాటి తన ట్విటర్ చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. అందులో ఓ అజ్ఞాత యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను ‘డాగ్’గా మార్చమని అడగ్గా దానికి మస్క్ సరే అని బదులిచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నట్లు ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్‌కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్‌ను నిర్వహిస్తున్నారని ఎలాన్ మస్క్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టుల్లో పలు వ్యాజ్యాలు సైతం దాఖలయ్యాయి. మస్క్ ట్విటర్ లోగోను డాగీ లోగోగా మార్చిన తర్వాత డాగీకాయిన్ విలువ 20 శాతం వరకు పెరిగింది. As promised pic.twitter.com/Jc1TnAqxAV — Elon Musk (@elonmusk) April 3, 2023 -
వెరీ ఇంట్రెస్టింగ్.. తేనెను మాత్రమే తిని జీవించే పక్షి.. ప్రత్యేకతలివే..
పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): విమాన వేగంతో ఆకాశంలో నిరంతరం సంచరిస్తూ నల్లమల అభయారణ్యంలోని పక్షి జాతులకు మకుటం లేని మహారాజులు ఈ గద్దజాతి పక్షులు. అభయారణ్యంపై నిరంతర నిఘాతో ఆకాశం నుండే ఆహారాన్ని గుర్తించి, క్షణంలోనే దానిపై వాలి సేకరించటం ఈ పక్షుల ప్రత్యేకత. గద్ద జాతిలో అరుదైన గద్ద హనీ బజార్డ్. తేనెను మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించే ఇటువంటి ప్రత్యేక ఆహారపు అలవాట్లు కలిగిన హనీ బజార్డ్ గద్దపై ప్రత్యేక కథనం.. అభయారణ్యంలోని క్రిమి కీటకాలు, వన్యప్రాణుల కళేబరాలు, పెరుగుతున్న పాముల సంతతి తదితర వాటిని నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతున్న గద్దలు ప్రకృతిలో ఎంతో ముఖ్యమైనవి. నల్లమల అభయారణ్యంలో నైతిక ధైర్యంతో మిగతా జీవులకు ఆదర్శంగా నిలిచే గద్దల జీవనశైలి ఎంతో ముఖ్యమైనది. నల్లమలలో క్రెస్టడ్ సర్పెంటీగల్, షార్ట్టౌడ్ స్నేక్ ఈగల్, క్రెస్టడ్హార్డ్ ఈగల్, బోనెల్లీస్ ఈగల్, శిఖర, బ్లాక్ షోల్డర్ కైట్, బ్లాక్ ఈగల్ లాంటి గద్ద జాతులు సంచరిస్తుంటాయి. పర్యావరణాన్ని సంరక్షించే గద్ద జాతులు: నల్లమల అభయారణ్యంలో ఎన్నో రకాల వన్యప్రాణులతో పాటు, ఆకాశంలో సంచరించే పక్షి జాతులు కూడా ఎక్కువే. పక్షి సంతతిలో అత్యంత ముఖ్యమైనవిగా ప్రాచుర్యం పొందిన గద్దలు ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించి వాతావరణాన్ని సమతుల్యంగా ఉండేందుకు దోహద పడుతున్నాయి. ప్రకృతిలో ఎక్కువవుతున్న పాములు, క్రిమి కీటకాలు, మిడతలు, కుందేళ్లు తదితర వాటిని ఆహారంగా తీసుకోవటంతో పాటు నల్లమలలో జంతువులు వేటాడిన మృతకళేబరాలను భక్షిస్తూ ఎప్పటికప్పుడు నల్లమలను స్వచ్ఛంగా ఉంచేందుకు దోహద పడుతున్నాయి. సహజంగా మాంసాహార జాతులైన గద్దలు కొనతేలిన ముక్కు, పొడవైన రెక్కలతో, ఎంత బరువున్న ఆహారాన్నైనా సునాయాసంగా తీసుకెళ్లే నైపుణ్యం కలిగి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా క్రిస్టడ్ సర్పెంటీగల్, షార్ట్టౌడ్ స్నేక్ ఈగల్‌లు దట్టమైన అభయారణ్యంలోని గడ్డి మైదానాలను, ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పాములను గుర్తించి వాటిని గురి చూసి వేటాడటం వీటి ప్రత్యేకత. క్రెస్టడ్హార్డ్ ఈగల్, బోనెల్లీస్ ఈగల్‌లు అభయారణ్యంలోని కుందేళ్లను ఎక్కువగా వేటాడి చంపుతుంది. ఒక్కో సారి గొర్రెలు, మేకల పిల్లలనుసైతం అవలీలగా ముక్కున కరుచుకుని పోయేటంత బలం వీటికి ఉంటుంది. శిఖర, బ్లాక్ షోల్డర్ కైట్, బ్లాక్ ఈగల్ తదితర రకాల గద్దలు మాత్రం మిడతలు, తొండలు, కీటకాలను ఆహారంగా తీసుకుని జీవనాన్ని కొనసాగిస్తాయి. నల్లమలలో సంచరించే గద్దలపై శ్రీశైలం ప్రాజెక్టు బయోడైవర్సిటీలో ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. నైతిక ధైర్యానికి నిదర్శనం: సహజంగా 70 ఏళ్ల పాటు జీవించే గద్దలకు 40 ఏళ్లు వచ్చే సరికి ఎన్నో జీవన్మరణ సమస్యలు ఎదురవుతాయి. ఆ సమయంలోనే అవి ఎంతో మానసిక స్దైర్యంతో తమ సమస్యను ఎదుర్కొని పునర్జన్మ ఎత్తి మరో ముప్పై ఏళ్ల పాటు జీవిస్తాయి. సాధారణంగా పొడవుగా, వాడిగా, పదునుగా ఉండే దాని ముక్కు నిరంతర రాపిడి వల్ల అరిగిపోతుంది. వాడిగా, పొడువుగా ఉండి సులభంగా ఒంగి ఆహారాన్ని తీసుకు పోయేందుకు ఉపకరించే కాలిగోళ్లు సైతం తమ సామరాధ్యన్ని కోల్పోతాయి. దీంతో పాటు పెరిగిన వయసు వల్ల బరువైన రెక్కలు, దట్టమైన ఈకలు దాని గుండెకు హత్తుకు పోయి ఎగరటంలో కష్టాన్ని కలిగిస్తాయి. దీంతో నిర్వీర్యమైన పరిస్థితిలో ఉన్న గద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని శరీర పునర్నిర్మాణాన్ని చేపడతాయి. ఆ క్రమంలో అవి ఎత్తైన పర్వతాల మీదకు చేరుకుని అక్కడ కొండ రాళ్లకు తన ముక్కును ఢీకొడుతూ దాన్ని రాల్చి కొత్త ముక్కు వచ్చేంత వరకు వేచి ఉంటాయి. కొత్త ముక్కు రాగానే దాని సహాయంతో దాని పాత రెక్కలను పీకేసి కొత్త రెక్కలు వచ్చే వరకు వేచి ఉంటాయి. ఇలా ఐదు నెలల పాటు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని నైతిక ధైర్యంతో దాని జీవిత కాలాన్ని మరో 30 ఏళ్లు వరకు పొడిగించుకుంటాయి. తేనె మాత్రమే తినే హనీ బజార్డ్ నల్లమల అభయారణ్యంలో మిగతా గద్దలకు విభిన్నంగా తేనెను మాత్రమే సేవించి తమ జీవనాన్ని గడిపే గద్దలు ఉన్నాయంటే ఎవరికైనా ఆశ్చర్యమనిపిస్తుంది. అలా జీవించే గద్దలే హనీ బజార్డ్. వీటి జీవనశైలి ఎంతో విచిత్రమైంది. ఇవి నల్లమల అభయారణ్యం యావత్తూ ఆకాశంలో సంచరిస్తుంటాయి. వీటి ప్రయాణంలో ఎక్కడైనా తేనె తుట్టెలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అవి అక్కడ వాలి తేనెను సేకరిస్తుంటాయి. ఈ క్రమంలో అవి వాటి భారీ రెక్కలను విసురుతూ తేనెటీగలను తరిమి వేస్తాయి. ఆకాశం గుండా సంచరిస్తూ ఎంత దూరంలోని తేనె తుట్టలనైనా గుర్తించటం హనీ బజార్డ్ల ప్రత్యేకత. ఇవి తేనె తప్ప మిగతా ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడవు. చదవండి: ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు.. సినిమా స్టైల్లో.. ఆ గద్దకు తేనే ఆహారం హనీ బజార్డ్లు తేనెను మాత్రమే తాగి జీవించే గద్దజాతి పక్షులు. అభయారణ్యంపై సంచరిస్తూ ఎక్కడ తేనె నిల్వలు ఉన్నా అక్కడ వాలి తేనెను సేకరించటం వీటి ప్రత్యేకత. కొన్ని గద్ద జాతులు పాములు, సరీసృపాలు, కీటకాలను భక్షించి పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంటాయి. గద్దలు నైతిక ధైర్యానికి ప్రతీకలు. ఇవి జీవితంలో కఠినమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తాయి. – షేక్ మహమ్మద్ హయాత్, ఫారెస్టు రేంజి అధికారి, శ్రీశైలం బయోడైవర్సిటీ. -
బుల్లిపిట్ట.. ప్రపంచ రికార్డు.. నాన్‌స్టాప్‌గా 13,560 కిలోమీటర్ల ప్రయాణం
ఒక బుల్లి వలస పిట్ట 13,560 కిలోమీటర్లు ఏకబిగిన ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. విశ్రాంతి, ఆహారం లేకుండా నాన్‌స్టాప్‌గా 11 రోజులు ప్రయాణించి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. లిమోసా ల్యాపోనికా జాతికి చెందిన బార్ టెయిల్డ్ గాడ్విట్ అనే చిన్న పక్షి అమెరికాలోని అలాస్కా వద్ద నోమ్ తీరం నుంచి గతేడాది అక్టోబర్ 13న బయలుదేరి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వద్ద ఆన్‌సాన్స్ తీరం వరకు ప్రయాణించి ఈ రికార్డు సాధించింది. – సాక్షి, అమరావతి బహుదూరపు ప్రయాణానికి సిద్ధమైందిలా.. అలాస్కాలో బార్ టెయిల్డ్ గాడ్విట్ జాతికి చెందిన వలస పక్షులు (చిన్న వాటికి) మూడింటికి గతేడాది అక్టోబర్‌లో మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్నిథాలజీ సైంటిస్టులు తమ బర్డ్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా 5 గ్రాముల బరువుండే సోలార్ శాటిలైట్ ట్రాన్స్మిటర్లను అమర్చారు. ఐదు నెలల వయసున్న బీ6 (పక్షికి సైంటిస్టులు పెట్టిన పేరు) కూడా అందులో ఉంది. అయితే వలస వెళ్లిన మిగిలిన రెండు పక్షుల జాడ తెలియలేదు. కాగా, వలసకు సమయం ఆసన్నమైన తరుణంలో ఆ పక్షులు తమ శరీరాన్ని ప్రయాణానికి సిద్ధం చేసుకోవడం ప్రారంభించాయి. అనవసరమైన బరువును తగ్గించేందుకు జీర్ణ వ్యవస్థ సహా కొన్ని అవయవాలను కుదించుకున్నాయి. శక్తిని ఆదా చేసేందుకు తక్కువ పీడనం ఉండి ఎగరడానికి అనుకూలంగా ఉన్న గాలులు వీచే వరకు ఎదురు చూశాయి. అన్నీ అనుకూలంగా మారిన తర్వాత ఎగరడం ప్రారంభించాయి. ఆడ పక్షులే పెద్దవి.. ► బార్ టెయిల్డ్ గాడ్విట్ల రెక్కలు పెద్దగా విప్పి ఎగురుతాయి. ► నీటిపై తేలేందుకు వీలుగా వీటి శరీర అమరిక ఉండదు కాబట్టి సముద్రంలో విశ్రాంతి కోసం ఆగలేవు. ► ఈ పక్షులు 37 నుంచి 41 సెంటీమీటర్ల పొడవుంటాయి. ► మగ పక్షుల కంటే ఆడ పక్షులు పెద్దవిగా ఉంటాయి. మగవి 190 నుంచి 400 గ్రాములు, ఆడవి 260 నుంచి 630 గ్రాముల వరకు బరువు ఉంటాయి. ► ఇవి సముద్ర తీర ప్రాంతాలు, చిత్తడి ప్రాంతాల్లో వేట సాగిస్తూ.. నీటి పురుగులు, నత్తల వంటి జీవులను ఆహారంగా తీసుకుంటాయి. బీ6 ప్రయాణమిలా.. ► ఇది తొలుత హవాయికి పశ్చిమ దిశగా ఎగరడం ప్రారంభించింది. ► అక్టోబర్ 19న పసిఫిక్ ద్వీప దేశమైన కిరిబాటి మీదుగా ప్రయాణించింది. ► దాదాపు రెండు రోజుల తర్వాత సిడ్నీకి దగ్గరగా ఎగిరింది. ► న్యూజిలాండ్ మీదుగా అక్టోబర్ 25న టాస్మానియా తీరానికి చేరింది. ► గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించింది. ► అంతదూరం ఈ చిన్న పక్షి ఒంటరిగా ప్రయాణించిందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. ► అవిశ్రాంత ప్రయాణం కారణంగా పక్షి సగం బరువు కోల్పోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ► ఒక వయసుకు రాగానే సాధారణంగా ఈ జాతి పక్షులు గుంపుగా బయలుదేరి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వైపుకు వలస వెళుతుంటాయి. ► కానీ ఇప్పుడు తక్కువ వయసున్న పక్షులు పెద్ద పక్షుల నుంచి విడిపోయి దక్షిణ దిశగా సుదూరంగా ప్రయాణించాయి. ► 2020లో ఇదే జాతికి చెందిన ఓ పక్షి అలస్కా నుంచి న్యూజిలాండ్ వరకు 12,200 కి.మీ. ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. -
Alexander Zverev: టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం..
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు వింత అనుభవం ఎదురైంది. సీరియస్‌గా మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆకాశంలో ఒక పిట్ట.. పోతూ పోతూ అతని తలపై రెట్ట వేసింది. ఒక్కక్షణం ఆగిన జ్వెరెవ్ ఏంటా అని తల నిమురుకుంటే పిట్ట రెట్ట అతని చేతులకు అంటింది. దీంతో ఇదేం కర్మరా బాబు అనుకుంటూ పక్కకు వెళ్లి తలను టవల్‌తో తుడుచుకొని మ్యాచ్‌ను కంటిన్యూ చేశాడు. ఇది చూసిన అభిమానులు గొల్లుమని నవ్వారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి సెట్లో 2-2 స్కోరు సమానంతో టైబ్రేక్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ప్రపంచ 13వ ర్యాంకర్ అయిన అలెగ్జాండర్ జ్వెరెవ్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ మైకెల్ మోహ్ చేతిలో జ్వెరెవ్ 6-7(1), 6-4, 6-3,6-2తో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత అదే ఆటతీరును కనబరచడంలో విఫలమయ్యాడు. వరుస సెట్లలో మోహ్ చేతిలో ఖంగుతిన్నాడు. A perfect shot from the Australian Open bird 💩🤣 Alexander Zverev will be hoping he gets some good luck after that 🍀#AusOpen | @AlexZverev pic.twitter.com/Bi1TDcfz1q — Eurosport (@eurosport) January 19, 2023 చదవండి: మ్యాచ్ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!? -
అన్‌స్టాపబుల్ జర్నీ.. ప్రపంచ రికార్డు నెలకొల్పింది!
హోబార్ట్(టాస్మానియా): రాత్రిపగలు తేడా లేకుండా ఏకధాటిగా పదకొండు రోజుల ప్రయాణం. ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు. ఆకలి దప్పిక తీర్చుకోలేదు. పదకొండు వేల కిలోమీటర్లు వలస ప్రయాణంతో సరికొత్త రికార్డుతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది ఓ గాడ్విట్ పక్షి. గాట్‌విట్(లిమోసా లప్పినోకా).. నెమలి తరహాలో ఉండే ఓ పక్షి. దానికి 234684 అనే నెంబర్‌తో 5జీ శాటిలైట్ ట్యాగ్‌ను పక్షి కింది భాగంలో బిగించారు. అమెరికా రాష్ట్రమైన అలస్కా నుంచి వలస మొదలుపెట్టి ఆస్ట్రేలియా రాష్ట్రమైన టాస్మానియాకు చేరుకుని ప్రయాణం పూర్తి చేసుకుంది ఈ పక్షి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అది ఎక్కడ ఆగలేదు. ఆహారం, నీటిని తీసుకోలేదు. తద్వారా అధికారికంగా అత్యధిక దూరం వలస ప్రయాణం చేసిన పక్షిగా రికార్డులు బద్ధలు కొట్టింది. అక్టోబర్ 13వ తేదీన దాని ప్రయాణం మొదలైంది. మొత్తం పదకొండు రోజులపాటు ఎక్కడా వాలకుండా ముందుకెళ్లింది అది. ఈ పక్షి ప్రయాణించిన దూరం.. ఈ భూమి పూర్తి చుట్టుకొలతలో మూడో వంతు!. లండన్ నుంచి న్యూయార్క్ మధ్య రెండున్నర సార్లు ప్రయాణిస్తే ఎంత దూరమో అంత!. గతంలో 217 మైళ్ల దూరం ఇదే గాడ్విట్ సంతతికి చెందిన పక్షి విరామం లేకుండా ప్రయాణించింది. ఈ రాత్రిపగలు సుదీర్ఘ ప్రయాణంలో.. ఆ పక్షి బరువు సగం తగ్గిందని టాస్మానియాకు చెందిన వన్యప్రాణి నిపుణులు ఎరిక్ వోఎహ్లెర్ చెప్తున్నారు. చిన్న తోక, పొడుగు ముక్కు, సన్నకాళ్లతో ఉండే గాడ్విట్ పక్షి.. 90 డిగ్రీల యూటర్న్ తీసుకుని నేల మీద వాలే ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంది. అయితే.. రిస్క్‌తో కూడుకున్న జీవితం వీటిది. లోతైన నీటిపై గనుక అవి వాలితే.. ప్రాణాలు కోల్పోతాయి. వాటి కాళ్ల కింద భాగం నీటి తేలేందుకు అనుగణంగా ఉండదు. తద్వారా అవి నీళ్లలో పడితే మళ్లీ పైకి ఎగరలేవు. సుదీర్ఘ దూరం ప్రయాణించిన 234684 గాడ్విట్ పక్షి సముద్రాలు దాటుకుంటూ రిస్క్‌తో కూడిన ప్రయాణమే చేసిందని ఎరిక్ వివరిస్తున్నారు.