విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
రాంచీ: రాంచీ విమానాశ్రయంలో ఎయిర్‌ఏసియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో విమానంలో ఉన్న 174 ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాంచీ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఏసియా విమానం బిర్సాముండా ఎయిర్‌పోర్ట్ లో టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు.
అకస్మాత్తుగా ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడం వల్ల విమాన బ్లేడ్లు దెబ్బతిన్నాయి. వీటి చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. విమానంలోని ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా సిబ్బంది దింపివేశారు. విమానం కాస్త దెబ్బతిన్నా, ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
జూలై 12న రాంచీకి వెళ్తున్న ఎయిర్ ఆసియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. సిబ్బంది వెంటనే డోర్ మూసివేశారు. అనంతరం రాంచీ ఎయిర్‌పోర్టులో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్‌కు తరలించారు.