గండభేరుండం
గండభేరుండం అనేది అతి పెద్ద, అతి బలమైన పక్షి. ఇది ఎంత బలమైన పక్షి అంటే... ఏనుగును సైతం కాళ్లతో తన్నుకొని పోగలదట. ‘గండభేరుండం’ నిజానికి ఉందో లేదో తెలియదుగానీ... కాల్పనిక సాహిత్యంలో దీని గురించి ఎన్నో వర్ణనలు కనిపిస్తాయి. ఈ పక్షి నుంచే ‘గండర గండడు’ ‘గండభేరుండ’ అనే మాటలు పుట్టుకువచ్చాయి.
బలవంతులను, సాహసాలు చేసేవారిని ‘గండర గండడు’ అంటుంటారు.
కంచి మేక!
‘ఎంత ఆస్తి ఉండి మాత్రం ఏంలాభం? కంచి మేకలాంటోడు...ఎవరికీ ఉపయోగపడడు’
‘చెప్పుకోవడానికేగాని ఆ స్థలం వల్ల ఏ ఉపయోగమూ లేదు. కంచి మేకలాంటిది’ ఇలాంటి మాటలు వింటుంటాం.
కంచి మేకలకు ఇతర ప్రాంతాల మేకల కంటే పొదుగు పెద్దదిగా ఉంటుందని, ఎక్కువగా పాలు ఇస్తాయని అంటారు.
కానీ గేదె పాలు, ఆవు పాలతో పోల్చితే... మేక పాలు తాగేవారు అతి తక్కువగా ఉంటారు. అందువల్ల... కంచి మేక ఎక్కువ పాలు ఇచ్చినా...దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. దీన్ని దృష్టిలో పెటుకునే అన్నీ ఉండీ కూడా పెద్దగా ఎవరికీ ఉపయోగపడని వ్యక్తులను కంచి మేకతో పోల్చుతారు.
కహ కహ నవ్వు!
కోపం కోపమే...
నవ్వు నవ్వే!
నవ్వినప్పుడు...కోపం రాదు.
కోపం వచ్చినప్పుడు...నవ్వు రాదు.
మరి కోపంతో నవ్వితే?
అదే...కహ కహ నవ్వు!
కొన్ని సందర్భాలలో విపరీతమైన కోపం వస్తుంది. అయితే ఆ కోపం కప్పిపుచ్చుకునే క్రమంలో....నవ్వును అడ్డుతెరగా తెచ్చుకుంటారు. అయినప్పటికీ ఆ తెర నుంచి కూడా కోపం కనిపిస్తుంది. నిజమైన కోపం, కృత్రిమ నవ్వుతో విచిత్రమైన దృశ్యం కనబడుతుంది.
ఎవరైనా నవ్వలేక నవ్వుతున్నప్పుడు, కోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నవ్వుతున్నప్పుడు ఉపయోగించే జాతీయం ఇది.
ఎల్లయ్య మల్లయ్య చదువు!
‘అందరూ అనుకున్నట్లు అతడేమీ పండితుడు కాదు. ఏదో ఎల్లయ్య మలయ్య చదువుతో నెట్టుకొస్తున్నాడు.
‘ఎల్లయ్య మల్లయ్య చదివిన వాళ్లు కూడా పాఠాలు చెప్పడానికి సిద్ధమైతే ఎలా?’ ఇలాంటి మాటలు వింటుంటాం.
కొందరికి చదువు వస్తుంది. అంతమాత్రాన పూర్తిగా చదువు వచ్చినట్లు కాదు.
వారి అక్షర జ్ఞానం పేర్లు రాయడానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. దీన్నే చదువు వచ్చినట్లు అనుకుంటారు. ఏ విషయంలోనైనా చాలా పరిమితమైన జ్ఞానం ఉన్నవారిని ఎల్లయ్య మల్లయ్య చదువుతో పోల్చుతారు.
జాతీయాలు
Published Sat, Sep 24 2016 9:47 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
Advertisement
Advertisement