Proverbs
-
జాతీయాలతో జాతి భాష సంపన్నం
సెప్టెంబర్ 17, 2005. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటోన్న వేళ ఉదయం 10 గంటలకు వేముల పెరుమాళ్లు లేరన్న విషయం తెలిసింది. తెలంగాణ భాష కోసం, తెలంగాణ జాతీయాల కోసం, తెలంగాణ జానపదుల కోసం, తెలంగాణ సామెతల కోసం, తెలంగాణ పల్లె పదాల కోసం జీవితాంతం కృషి చేసిన వేముల పెరుమాళ్లు.. సరిగ్గా తెలంగాణ విమోచనం రోజే లోకాన్ని వీడడం యాధృచ్చికమే కావొచ్చు కానీ మరిచిపోలేని జ్ఞాపకంగా తన మరణాన్ని మార్చుకోవడం మాత్రం గొప్ప విషయం. తెలుగు సంస్కృతి అంతా ఒక్కటే! అయినా తెలంగాణ సంస్కృతిలో కొంత భిన్నత్వం ఉంది. భాషలో యాసలో ప్రత్యేకత ఉంది. అందుకు కారణం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పరాయి పాలనలో తెలుగు చదవడం, రాయడం నిషేధింపబడ్డ రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు వారి భాషను, యాసను పదిల పరుచుకున్నారు. వారి సామెతల్ని, జాతీయాల్ని , మౌఖిక సాహిత్యాన్ని, లిఖిత సాహిత్యాన్ని భద్ర పరుచుకున్నారు. నిజాం పాలకులు సృష్టించిన ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఇక్కడి ప్రజలు వాటిని కాపాడుకోవడం ఒక సాహసవంతమైన చర్య. "సాలు పొంటి సాలు తీరు"గా వారి అవ్వ నుంచి మారుమూల గ్రామీణుల నుంచి వాళ్ల వాక్కును కల్తీ కాకుండా తన భాషగా చేసుకుని కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన (పోయింది పొల్లు ఉన్నది గట్టి) జాతీయాల్ని ఏర్చికూర్చి "తెలంగాణ జాతీయాలు"గా గ్రంథస్తం చేశారు. ఉడుం పట్టు, దీక్ష కార్య శూరత్వం గల వారు ఎలాంటి మహాకార్యాన్నయినా అలవోక గా చేయగలరని తెలంగాణ జాతీయాలు పుస్తకం చూస్తే తెలుస్తుంది. వేముల పెరుమాళ్లు స్వస్థలం నాటి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల తాలుకా రాయికల్ గ్రామం. రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో విద్యాభ్యాసం చేసిన పెరుమాళ్లు.. శ్రీకాళహస్తిలోని గ్రామసేవక్ శిక్షణా కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధిలో డిప్లమో చేశారు. 1963 నుంచి 18 ఏళ్ల పాటు గ్రామీణాభివృద్ధి అధికారిగా మల్యాల, జగిత్యాల పంచాయతీ సమితులలో ఉద్యోగం చేశారు. 1981లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్ష ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాయికల్ మొదటి మండలాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉద్యోగం, రాజకీయం.. ఏ రంగంలో ఉన్నా.. సాహిత్యాన్ని మాత్రం మరవలేదు పెరుమాళ్లు. దశాబ్దకాలంగా కష్టనష్టాలకు ఓర్చి, పేర్చి కూర్చిన ఈ గ్రంథం తెలంగాణ జాతీయాలకు, సామెతలకు నిఘంటవుగా నేటికి ప్రతిబింబిస్తుంది. నోసుక పుట్టినట్టు వీరి మరణానంతరం తెలంగాణ జాతీయాల్ని ఇంటర్ ప్రథమ సంవత్సరం పాఠ్యాంశంగా స్వీకరించి వీరి శ్రమకు, తెలంగాణ భాషకు, యాసకు సముచిత గౌరవాన్ని కల్పించడం వీరికే కాదు తెలంగాణ జాతీయాలకు అగ్రాసనం వేసినట్టయింది. పెరుమాళ్లు తాత కైరం భూమదాసు గొప్ప వైష్ణవ భక్తుడు, కవి, గాయకుడు. కైరం భూమదాసు వ్రాతప్రతులను పరిష్కరించిన పెరుమాళ్లు 2002లో "వరకవి కైరం భూమదాసు కృతులు" గ్రంథాన్ని ప్రచురించారు. 1958 నుంచి 1968 మధ్య కాలంలో జరిగిన ఎన్నో జాతీయ పరిణామాలను వీరు పద్యాలుగా మలిచారు. వీరు రచించిన శ్రీ రాజరాజేశ్వర, శ్రీ ధరమపురి నృకేసరి శతకాలు సంబంధిత దేవాలయాలు ప్రచురించాయి. బాల సాహిత్యంలో వీరు చేసిన కృషి ఫలితంగా కిట్టూ శతకం (బాలనీతి), నిమ్ము శతకం (పర్యావరణ) వెలువడ్డాయి. మహాత్ముని మహానీయ సూక్తులను "గాంధీమార్గం" త్రిశతిగా రచించారు. "లోగుట్టు" వీరు రచించిన రాజనీతి చతుశ్శతి. ఎంతో కాలం వీరు సేకరించిన జాతీయాలు, సామెతలతో వెలువడిన గ్రంథం "తెలంగాణ జాతీయాలు". పెరుమాళ్లు మరణానంతరం వెలువడిన గ్రంథం మానవతా పరిమళాలు. 1983 నుంచి 2001 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి చేసిన "జ్యోతిపథం" లఘు ప్రసంగాల సంకలనం. జానపద సాహిత్యం కూరాడుకుండ లాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యతని సాహితీప్రియులందరిపై వేశారు పెరుమాళ్లు. జానపదుడు రుషీసుంటోడు, ఆయన నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయిలాంటిది. ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్లలో నాని రగిడిల్లింది. తెలంగాణ జాతీయాలు తరతరాల మన సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యం. చిల్లి బొక్కతీరు లక్షల్లో వున్న తెలంగాణ జాతీయాల్ని వేలలో "పోయింది పొల్లు, ఉన్నది గట్టి తీరు"గా గ్రంథస్తం చేశారు పెరుమాళ్లు. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో సజీవంగా జానపదుని నాలుకపై తచ్చాడుతున్న జాతీయాల్ని.. ఔత్సాహికులు మరింత శ్రమించి కొత్త సంపదను జాతికి ఇవ్వాలన్న వారి కోరిక తీర్చాల్సిన తరుణం మళ్లీ వచ్చింది. అదే తెలంగాణ సాహిత్యానికి తిరిగి చెల్లించాల్సిన రుణం. వి.ప్రభాకర్, తెలంగాణ కవి, రిటైర్డ్ రిజిస్ట్రార్, సహకారశాఖ -
జాతీయాలు
అయ్యవారుల గారి నట్టిల్లు! కొందరు చాలా కష్టపడతారు. వచ్చిన సొమ్మును జాగ్రత్తగా పొదుపు చేస్తారు. వర్తమానంలో భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. భవిష్యత్కు మంచి బాటలు వేసుకుంటారు. వారి కష్టానికి కాలం కూడా కలిసి వస్తుంది. కొందరు మాత్రం కష్టపడరు. భవిష్యత్ గురించి అసలే ఆలోచించరు. ‘ఈ పూట గడిచిందా... ఇక చాలు’ అని తృప్తి పడతారు. ఇలా ఒక పద్ధతి అంటూ లేకపోవడం వల్ల అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పడతారు. మరికొందరు బాగా కష్టపడినా... ఎటు పోయినా నష్టం, కష్టమే ఎదురొచ్చి పలకరిస్తుంది. అంటే దురదృష్టజాతకులన్నమాట! ఈ ఇద్దరి విషయంలో ఉపయోగించే జాతీయమే అయ్యవారుల గారి నట్టిల్లు. అంటే... ఆదాయం అనేది ఏ రోజుకు ఆరోజు అన్నట్లుగా ఉండడం, ఆరోజు ఆదాయం లేకపోతే ఆకలి బాధలు ఎదుర్కోవడం. వెనకటికి ఎవరైనా అయ్యవారి జీవితం ఇలా గడిచిందేమో... అందుకే ‘అయ్యవారుల గారి నట్టిల్లు’ అనే జాతీయం పుట్టింది. ఆ అయ్యవారి ఇల్లు ఎప్పుడు చూసినా ఖాళీగా, శూన్యంగా, భారంగా, విషాదంగా ఉండేదట. బాగా నష్టాల్లో కష్టాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఉద్దేశించి ఆ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఉదా: ‘ఆయన ఆర్థిక పరిస్థితి బాగా లేదు. అయ్యవారుల గారి నట్టిల్లులా ఉంది’ ఏనుగుకు కొమ్ములు వచ్చినట్లు! ఏనుగు బలశాలి. మరి అలాంటి బలమైన ఏనుగుతో తలపడడానికి ఎవరికైనా భయమే కదా! ఏనుగు సహజ బలానికి కొమ్ములు తోడైతే? అమ్మో! అనుకుంటాం. ఎవరైనా బలవంతుడికి మరింత బలం చేకూర్చే అధికారమో, అవకాశమో వచ్చినప్పుడు.... ‘ఏనుగుకు కొమ్ములు వచ్చినట్లు ఉంది’ అంటుంటారు. ఇసుక తక్కెడ - పేడ తక్కెడ ఒక గ్రామంలో ఇద్దరు ప్రయాణికులు ఒకచోట బస చేశారు. వారు ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. ఒకడి కావడిలో ఇసుక ఉంది. మరొకడి కావడిలో పేడ ఉంది. ‘‘నీ దగ్గర ఉన్నదేమిటి?’’ అని మొదటి వాడు రెండోవాడిని అడిగితే... ‘‘ముడిబియ్యం’’ అని గొప్పగా చెప్పాడు. ‘‘మరి నీ దగ్గర ఉన్నదేమిటి?’’ అని రెండోవాడు మొదటి వాడిని అడిగితే.. ‘‘వండిన అన్నం’’ అని చెప్పాడు. ఒకరి వస్తువు మీద ఒకరు కన్నేశారు. ఎవరి దారిన వాళ్లు వెళ్లే సమయంలో... ఒకరినొకరు మోసం చేసుకొని ఒకరి కావడిని ఇంకొకరు తీసుకున్నారు. ‘‘అబ్బ... వీడి కావడి కాజేశాను’’ అని ఎవరికి వారు అనుకున్నారు. కొంతదూరం వెళ్లాక కావడి దింపి చూసుకున్నారు. ఒకడికి ఇసుక కనిపించింది. ఇంకొకడికి పేడ కనిపించింది! మోసగించబోయి మోసపోయిన సందర్భాల్లో, పరస్పరం మోసం చేసుకునే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది. అరచేతిలో మాణిక్యం ఒక విషయంలో స్పష్టత, సులువు, పారదర్శకతను సూచించడానికి ఉపయోగించే జాతీయం ఇది. ‘అరచేతిలో ఉసిరికాయ’లాంటి వాటికి ఇది సమానార్థకమైన జాతీయం. అరచేతిలో మాణిక్యం కనిపిస్తే... ‘ఇదీ విషయం’ అని ఎవరూ మనకు పనిగట్టుకొని చెప్పాల్సిన పనిలేదు. అది కంటికి కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఎలాంటి అయోమయం, అస్పష్టత అక్కర్లేదు. ఉదా: బుర్ర పాడుచేసుకొని ఆలోచించేంత విషయం కాదు... అది అరచేతిలో మాణిక్యం -
జాతీయాలు
గండభేరుండం గండభేరుండం అనేది అతి పెద్ద, అతి బలమైన పక్షి. ఇది ఎంత బలమైన పక్షి అంటే... ఏనుగును సైతం కాళ్లతో తన్నుకొని పోగలదట. ‘గండభేరుండం’ నిజానికి ఉందో లేదో తెలియదుగానీ... కాల్పనిక సాహిత్యంలో దీని గురించి ఎన్నో వర్ణనలు కనిపిస్తాయి. ఈ పక్షి నుంచే ‘గండర గండడు’ ‘గండభేరుండ’ అనే మాటలు పుట్టుకువచ్చాయి. బలవంతులను, సాహసాలు చేసేవారిని ‘గండర గండడు’ అంటుంటారు. కంచి మేక! ‘ఎంత ఆస్తి ఉండి మాత్రం ఏంలాభం? కంచి మేకలాంటోడు...ఎవరికీ ఉపయోగపడడు’ ‘చెప్పుకోవడానికేగాని ఆ స్థలం వల్ల ఏ ఉపయోగమూ లేదు. కంచి మేకలాంటిది’ ఇలాంటి మాటలు వింటుంటాం. కంచి మేకలకు ఇతర ప్రాంతాల మేకల కంటే పొదుగు పెద్దదిగా ఉంటుందని, ఎక్కువగా పాలు ఇస్తాయని అంటారు. కానీ గేదె పాలు, ఆవు పాలతో పోల్చితే... మేక పాలు తాగేవారు అతి తక్కువగా ఉంటారు. అందువల్ల... కంచి మేక ఎక్కువ పాలు ఇచ్చినా...దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. దీన్ని దృష్టిలో పెటుకునే అన్నీ ఉండీ కూడా పెద్దగా ఎవరికీ ఉపయోగపడని వ్యక్తులను కంచి మేకతో పోల్చుతారు. కహ కహ నవ్వు! కోపం కోపమే... నవ్వు నవ్వే! నవ్వినప్పుడు...కోపం రాదు. కోపం వచ్చినప్పుడు...నవ్వు రాదు. మరి కోపంతో నవ్వితే? అదే...కహ కహ నవ్వు! కొన్ని సందర్భాలలో విపరీతమైన కోపం వస్తుంది. అయితే ఆ కోపం కప్పిపుచ్చుకునే క్రమంలో....నవ్వును అడ్డుతెరగా తెచ్చుకుంటారు. అయినప్పటికీ ఆ తెర నుంచి కూడా కోపం కనిపిస్తుంది. నిజమైన కోపం, కృత్రిమ నవ్వుతో విచిత్రమైన దృశ్యం కనబడుతుంది. ఎవరైనా నవ్వలేక నవ్వుతున్నప్పుడు, కోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నవ్వుతున్నప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. ఎల్లయ్య మల్లయ్య చదువు! ‘అందరూ అనుకున్నట్లు అతడేమీ పండితుడు కాదు. ఏదో ఎల్లయ్య మలయ్య చదువుతో నెట్టుకొస్తున్నాడు. ‘ఎల్లయ్య మల్లయ్య చదివిన వాళ్లు కూడా పాఠాలు చెప్పడానికి సిద్ధమైతే ఎలా?’ ఇలాంటి మాటలు వింటుంటాం. కొందరికి చదువు వస్తుంది. అంతమాత్రాన పూర్తిగా చదువు వచ్చినట్లు కాదు. వారి అక్షర జ్ఞానం పేర్లు రాయడానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. దీన్నే చదువు వచ్చినట్లు అనుకుంటారు. ఏ విషయంలోనైనా చాలా పరిమితమైన జ్ఞానం ఉన్నవారిని ఎల్లయ్య మల్లయ్య చదువుతో పోల్చుతారు. -
జాతీయాలు
ఆట విడుపు ఇప్పుడు విద్యాలయాలకు ఆదివారాల్లో సెలవు ఉన్నట్లే... పూర్వం వీధి బడులలో వారానికి ఒకసారి సెలవు ఇచ్చేవారు. దీన్ని ఆట విడుపు అంటారు. వారంలోని మిగిలిన అన్ని రోజులు చదువుల కోసం కష్టపడే విద్యార్థులు ఆ సెలవు రోజు మాత్రం తమకు ఇష్టమైన ఆటలు ఆడుకునే వారు. చాలా సంతోషంగా గడిపేవారు. కేవలం విద్యార్థుల విషయంలోనే కాకుండా ఇతర సందర్భాల్లోనూ ఈ జాతీయాన్ని ఉపయోగించడం మొదలైంది. ఒకే పనిలో తలమునకలవుతూ... కాస్త విశ్రాంతి కోసమో, మార్పు కోసమో వేరే పని ఏదైనా చేస్తే... అది ఆట విడుపు అవుతుంది. ఉదా: ‘ఈ పనిలో మూడు రోజుల నుంచి తీరిక లేదు. ఆట విడుపుగా ఏదైనా సినిమా చూసొస్తేగాని బండి కదిలేట్టు లేదు’ ఉంగరాల చేతి మొట్టి కాయ! ‘నాలాంటి బీద వాడు చెబితే వినే రకమా? ఉంగరాల చేతి మొట్టికాయ పడితేగానీ దారిలోకి రాడు’ ‘నా మాటను పూచికపుల్లలా తీసేశాడు. ఆ కోటీశ్వరుడు చెబితే మాత్రం తు.చ తప్పకుండా పాటించాడు. ఉంగరాల చేతి మొట్టికాయ అంటే ఇదేనేమో’ బీదవాడి మాటకు, బలహీనుడి మాటకు కొద్దిమంది విలువ ఇవ్వరు. వారి విషయంలో అది పట్టించుకోవాల్సిన విషయం కూడా కాదు. ‘నాకు అన్యాయం జరుగుతోంది’ అని నెత్తీ నోరు మొత్తుకున్నా చాలా మొండిగా వ్యవహరిస్తారు. ఇక చచ్చినా మారనట్లు కనిపిస్తారు. ఇదే వ్యక్తులు... కాస్త అధికారం, డబ్బు, హోదా ఉన్నవాళ్ల విషయంలో మాత్రం వేరే విధంగా వ్యవహరిస్తారు. వారు చెప్పినట్లు చేస్తారు. పోలీసులు, నాయ్యస్థానాల పుణ్యమా అని కొందరు వ్యక్తులు చచ్చినట్లు దారిలోకి వస్తారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో ఎక్కువగా ఉపయోగించే జాతీయమే... ఉంగరాల చేతి మొట్టికాయ. గజస్నానం ఏనుగు ఎంతో లోతుగల నీటిలో శుభ్రంగా స్నానం చేస్తుంది. చూసేవాళ్లకు... ‘ఆహా! ఎంత శుభ్రత! ఎంత శుభ్రత!’ అనిపిస్తుంది. శుభ్రంగా స్నానం చేసిన ఏనుగు...అవతలికి వచ్చిన వెంటనే... దారిలోని దుమ్మూ ధూళిని పైన చల్లుకుంటుంది. చేసిన స్నానం వృథా అవుతుంది. ఒక పని చేసినప్పటికీ అది వ్యర్థమైన సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది. పులినోటి కండ ‘నువ్వు పులినోటి కండను ఆశిస్తున్నావు. అది సాధ్యమా?’ ‘ఆ పని చేయడం ఎంత ప్రమాదకరం అంటే... పులినోటి కండను తేవడంలాంటిది’ వివిధ సందర్భాల్లో ఇలాంటి మాటలు వింటుంటాం. పులినోట్లో మాంసం కండ ఉంది. దగ్గరకు వెళ్లి దాని నోట్లోని కండను తేవడం సాధ్యమయ్యే పనేనా? ప్రాణాల మీద ఆశ వదులుకున్నప్పుడే అలాంటి దుస్సాహసానికి ఒడిగడతారు. అసాధ్యమైన పని, ప్రమాదకరమైన పని గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగించే జాతీయం ‘పులినోటి కండ’ -
జాతీయాలు
ఈగకు పోక పెట్టినట్లు! అన్ని పనులూ అందరూ చేయలేరు. ఒక్కో పనిలో ఒకరు నిష్ణాతులై ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే...పని బాధ్యతలు అప్పగించే సమయంలో వారి సమర్థతను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలా జరగకపోతే... పనిలో చాలా తేడా వస్తుంది. అలాగే ఇష్టాల్లో కూడా ఒకరికి ఒక రకం ఇష్టాలు ఉంటే, మరొకరికి మరోరకం ఇష్టాలు ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే మాటే... ‘ఈగకు పోక పెట్టినట్లు’ ఈగకు బెల్లం అంటే ఇష్టం. ఇంకా రకరకాల మిఠాయిలు అంటే ఇష్టం. మరి ఈగకు మిఠాయి కాకుండా పోక పెడితే?! హాస్యాస్పదంగా ఉంటుంది కదా! కందాల రాజు వెనకటికి జమీందారుల ఇండ్లల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ల కోసం, అతిథుల కోసం భోజనశాల ఉండేది. బయటి నుంచి వచ్చిన వారు అందులోకి వెళ్లి భోజనం చేయవచ్చు. ఎవరి అనుమతీ అక్కర్లేదు. ‘మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు?’ అని అడిగేవారు ఉండరు. ఈ భోజనశాలలో పెట్టే భోజనానికి కందా అని పేరు. ఈ భోజనశాలలో తిని వెళ్లేవాళ్లను ‘కందాల రాజు’ అని వ్యంగ్యంగా అనేవాళ్లు. పెద్ద మనిషి హోదాలో కనిపిస్తూ తేరగా ఎక్కడ భోజనం దొరికినా తినేవాళ్లను కందాల రాజు అంటారు. ‘ఆయన సంగతి నాకు తెలియదా ఏమిటి? కందాల రాజు. జేబు నుంచి చిల్లిగవ్వ కూడా తీయడు’ ‘మా ఇంటికొచ్చే కందాల రాజుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది’ ఇలా వివిధ సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. కాకః కాకః పికః పికః ఒకరిలో ఉన్న సమర్థత, ప్రతిభ ఇతరులలో ఉండకపోవచ్చు. లేదు కదా... అని ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవచ్చు. అనుకరించాలని ప్రయత్నించే వాళ్లు అపహాస్యం పాలు కావచ్చు. వెనకటికి ఒక కాకి కోకిలను అనుకరించబోయి నవ్వులపాలైందట. తమ సహజత్వాన్ని మరచి గొప్పల కోసం, పేరు ప్రతిష్ఠల కోసం ఇతరులను అనుకరించేవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఉపయోగించే జాతీయం ఇది. ఉదా: ఎవరి స్వభావానికి తగ్గట్టు వారు ఉంటే మంచిది. లేకుంటే అభాసుపాలవుతాం. కాకః కాకః పికః పిక: అనే సత్యాన్ని మరచిపోవద్దు. గుండ్లు తేలి బెండ్లు మునిగినట్లు! అనుకున్నది ఒకటి అయినదొకటి అయినప్పుడు, విషయాలు తారుమారైనప్పుడు, ఊహించని చిత్రాలు జరిగినప్పుడు... ఉపయోగించే మాట ఇది. నీళ్లలో ఇనుపగుండ్లు మునగడం... బెండ్లు తేలడం సాధారణం. అలా కాకుండా... బెండ్లు మునిగి, గుండ్లు తేలితే? అది నమ్మశక్యం కాని విషయం. అసాధ్యం అనుకున్న విషయం సాధ్యం అయినప్పుడు, ఊహించిన విధంగా పరిస్థితి తారుమారైన సందర్భాల్లో ఉపయోగించే జాతీయం ఇది. ఉదా: ‘అందరూ అప్పారావే గెలుస్తారనుకున్నారు. చిత్రంగా సుబ్బారావు గెలిచాడు. గుండ్లు తేలి బెండ్లు మునగడం అంటే ఇదేనేమో!’ -
జాతీయాలు
ఘట్టకుటీ ప్రభాతం తప్పించుకోవాలని ప్రయత్నించినా ఏదో విధంగా దొరికిపోయే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది. ‘నా నుంచి తప్పించుకోవాలని నానా రకాలుగా ప్రయత్నించాడు. కానీ ఏంలాభం? చివరికి ఘట్టకుటీ ప్రభాతం అయింది’ అంటుంటారు. ఘట్టం అంటే పన్నులు వసూలు చేసే స్థలం. కుటీ అంటే గుడిసె. ప్రభాతం అంటే తెల్లవారడం. పూర్వం రాజుల కోటల్లో సింహద్వారం ఉండేది. ప్రజల రాకపోకలన్నీ ఈ సింహద్వారం నుంచే కొనసాగేవి. పన్నులు వసూలు చేసే అధికారులు ఇక్కడ ఒక గుడిసెలో ఉండేవారు. రాకపోకలన్నీ సింహద్వారం నుంచే కాబట్టి పన్నులు ఎగ్గొట్టాలనుకునే వారి పప్పులు ఉడికేవి కావు. చచ్చినట్లు పన్ను కట్టాల్సి వచ్చేది. వెనకటికి ఒక వ్యాపారి పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించాడు. పన్నులు వసూలు చేసే అధికారులు మాంచి నిద్రలో ఉండగా వారి కనుగప్పి తప్పించుకుపోదామనుకున్నాడు. అయితే ఊరంతా తిరిగి ఆ పన్నులు వసూలు చేసే గుడిసె దగ్గరికి వచ్చే సమయానికి ప్రభాతమైంది...అంటే తెల్లవారిందన్నమాట. దీనితో ఆ వ్యాపారి పన్ను కట్టక తప్పలేదు! ఈ కథలో నుంచి పుట్టిన జాతీయమే ‘ఘట్టకుటీ ప్రభాతం’. ఘుణాక్షరం ఏదైనా రాయడానికి కాగితం మీద పెన్నుతో రాస్తున్నాం లేదా టైప్ చేస్తున్నాం. పూర్వం మాత్రం తాటాకులు తప్ప వేరే మార్గం లేదు. తాటాకులపై గంటంతో రాసేవారు. అయితే బాగా పాతబడిన తాటాకులకు పురుగులు పట్టేవి. ఆ క్రమంలో కొత్త కొత్త ఆకారాలు తాటాకుల మీద ఏర్పడేవి. కొన్ని అయితే అచ్చం అక్షరాల్లా ఉండేవి. వీటిని ఘుణాక్షరాలు అనేవాళ్లు. ఏ ఉద్దేశం లేకుండా ఒక పని చేయడాన్ని ‘ఘుణాక్షరం’తో పోల్చుతారు. ‘అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు... ఘుణాక్షరం’ అంటుంటారు. చవితి చంద్రుడు! ‘తెలిసో తెలియకో చిన్న పొరపాటు చేశాను. ఈ మాత్రం దానికే నన్ను చవితి చంద్రుడిని చేశారు’ ‘నన్ను చూడడానికి కూడా భయపడుతున్నావు. నేనేమైనా చవితి చంద్రుడినా ఏమిటి?’....ఇలా రకరకాల సందర్భాలలో ‘చవితి చంద్రుడు’ అనే మాటను ఉపయోగించడం చూస్తూనే ఉంటాం. చవితి రోజు భూలోకంలో నైవేద్యం ఆరగించిన వినాయకుడు కైలాసం చేరుకొని తల్లిదండ్రులకు నమస్కరించడానికి ప్రయత్నించాడుగానీ భుక్తాయాసం వల్ల అది సాధ్యం కావడం లేదు. వినాయకుడు పడే ఇబ్బందిని చూసి శివుడి తలలోని చంద్రుడు నవ్వాడు. తన కుమారుడిని చూసి నవ్వినందుకు... ‘‘నిన్ను చూసిన వారంతా నీలాపనింద లతో బాధపడుగాక’’ అని శపించింది పార్వతిదేవి. ఆ తరువాత మాత్రం ఈ శాపం శుద్ధ చవితికి మాత్రమే పరిమితమైంది. యక్షప్రశ్నలు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు... దర్మరాజుని పరీక్షించడానికి యక్షుని రూపంలో యమధర్మరాజు అడిగిన ప్రశ్నలే యక్షప్రశ్నలు. సూర్యుడిని ఉదయింపచేయువారు ఎవరు? సూర్యుడిని ఆస్తమింపచేయునది ఏది? జీవన్మృతుడెవరు? భూమి కంటే భారమైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? జన్మించి కూడా ప్రాణం లేనిది ఏది? రూపం ఉన్నా హృదయం లేనిది ఏది? మనిషికి ఆత్మ ఎవరు....ఇలా యక్షుని రూపంలో యమధర్మరాజు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు తగిన విధంగా సమాధానం ఇస్తాడు. ఇక వ్యవహారంలోకి వస్తే.... ఎవరైనా చిక్కుప్రశ్నలు, కఠిన ప్రశ్నలు వేసే సందర్భంలో ఉపయోగించే మాట...యక్ష ప్రశ్నలు! -
జాతీయాలు
నాంచారమ్మ వంట! వెనకటికి నాంచారమ్మ అనే పెద్దవ్వ ఉండేదట. ఇంటికి వచ్చిన అతిథులను ఘనంగా ఆదరించేదట. అయినా సరే, ఆమె ఇంటికి వెళ్లడానికి అతిథులు వెనకా ముందు ఆలోచించేవారట. దీనికి కారణం... వంట పేరుతో ఆమె విపరీతమైన జాప్యం చేయడం. ‘ఇదిగో అయింది’ ‘అదిగో అయింది’ అంటూ ఆలస్యం చేసేదట. పొద్దున వచ్చిన అతిథి భోజనం చేయడానికి ఏ అర్ధరాత్రో పట్టేదట! ఆమె ఉద్దేశపూర్వకంగానే అలా చేస్తుందా, వంటను బా....గా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తుందా అనేది ఎవరికి తెలియదుగానీ...‘నాంచరమ్మ వంట’ అంటే జనాలు భయపడే స్థితికి చేరుకున్నారు. ఏదైనా విషయం ఎటూ తేల్చకపోతే, పనిలో అకారణ జాప్యం జరిగితే ‘నాంచారమ్మ వంట’తో పోల్చడం పరిపాటిగా మారింది. చుట్టాల సురభి కొందరు... చుట్టాలు అనే మాట వినగానే వెనక్కి చూడకుండా పారిపోతారు. కొందరికి చుట్టాలు అంటే వల్లమాలిన ప్రేమ. తమ తాహతుకు మించి ఇంటికొచ్చిన చుట్టాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. దీని వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే... తమ వైఖరి మార్చుకోరు. ఇలాంటి వ్యక్తులను ‘చుట్టాల సురభి’తో పోల్చుతుంటారు. ‘ఇంటి కొచ్చిన చుట్టానికి ఏ లోటూ రానివ్వడు. ఆయన చుట్టాల సురభి’ అంటారు. క్షీర సాగర మథనంలో జన్మించిన దేవధేనువు కామధేనువు. ఈ కామధేనువు కోరిన కోరికలన్నీ తీరుస్తుందని ప్రసిద్ధి. అలాగే ఇంటికి వచ్చిన చుట్టం అడిగినా, అడగకపోయినా... వారి కోరికలు తీర్చేవారిని చుట్టాల సురభి అంటారు. పయోముఖ విషకుంభం! కొందరు చూడడానికి అమాయకంగా కనిపిస్తారు. కానీ చేయాల్సినంత చెడు చేస్తారు. ఇలాంటి వారిని ఉద్దేశించి ఉపయోగించే జాతీయం ‘పయోముఖ విషకుంభం’ విషం నిండిన కుండ (కుంభం)పై ముఖం(పై భాగం)లో పయస్సు (పాలు) ఉంచితే అదే పయోముఖవిషకుంభం. స్థూలంగా చెప్పాలంటే... చూడడానికి ఒక రకంగా, చేతల్లో ఒక రకంగా కనిపించే వ్యక్తులను ‘పయోముఖ విషకుంభం’తో పోల్చుతారు. కాకతాళీయం! అనుకోకుండా రెండు సంఘటనలు ఒకే సమయంలో జరిగితే ఉపయోగించే మాట... కాకతాళీయం! తాళవృక్షం (తాడి చెట్టు) మీద కాకము(కాకి) వాలిన క్షణమే... తాళఫలం (తాటిపండు) నేలరాలింది... ఇదే కాకతాళీయం. పై సంఘటనలో కాకి తాడిచెట్టు మీద వాలడానికి, తాడిపండు నేలరాలడానికి ఎలాంటి సంబంధం లేదు. తాడిచెట్టు మీద కాకి వాలడం వల్లే, తాటిపండు నేలరాలింది అనడం తప్పు అవుతుంది. చెట్టుపై కాకి వాలడం, తాటిపండు నేలరాలడం అనేవి పూర్తిగా యాదృచ్ఛికం అని చెప్పడమే కాకతాళీయం! -
జాతీయాలు
పరశురామప్రీతి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. పరశురాముడికి అగ్నికి సంబంధం ఏమిటి? శివుడిని మెప్పించి పరశువు(గండ్రగొడ్డలి)ని ఆయుధంగా పొందుతాడు పరశురాముడు. ఇక పరశురామప్రీతి విషయానికి వస్తే... కార్తవీర్యుని కొడుకులు పరశురాముని తండ్రి జమదగ్ని తలను నరికి మహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక జమదగ్ని శవంపై ఏడుస్తూ ఇరవై ఒక్కసార్లు గుండెలు బాదుకుంటుంది. ఎన్నిసార్లు తల్లి గుండెలు బాదుకుందో అన్నిసార్లు క్షత్రియులందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు పరశురాముడు. కార్తవీర్యుని రాజధాని నగరాన్ని ఆగ్నేయాస్త్రంతో భస్మం చేస్తాడు. ఊరంతా తగలబడిపోతుంది. ఇలా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టడాన్ని ‘పరశురామ ప్రీతి’గా పేర్కొనడం వాడుకలోకి వచ్చింది. ఉత్తారాషాఢ పూర్వాషాఢ చమత్కారం కోసమో, మర్యాద కోసమో... కొన్ని రోగాలను ప్రత్యామ్నాయ పేర్లతో పిలుస్తుంటారు. ఈ క్రమంలో నుంచి వచ్చిందే ఉత్తరాషాఢ పూర్వాషాఢ. * ఉత్తరాషాఢ, పూర్వాషాఢ అనేవి రెండు నక్షత్రాలు. హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల... ఇలా నక్షత్రాలను లెక్కిస్తున్నప్పుడు ఈ రెండు నక్షత్రాలు పక్క పక్కనే వస్తాయి. * అనారోగ్యానికి సంబంధించి ఏవైనా సమస్యలు జంటగా వస్తే లేదా పరిస్థితి తారుమారైతే... * ‘ఉత్తరాషాఢ పూర్వాషాఢలా ఉంది’ అంటారు. ముఖ్యంగా... వాంతులతో పాటు విరేచనాలు అయినప్పుడు ఎక్కువగా ఈ మాటను ఉపయోగిస్తారు. రుద్రాక్ష పిల్లి! చెప్పిందొకటి చేసేదొకటిగా ప్రవర్తించే వాళ్లను ‘రుద్రాక్ష పిల్లి’తో పోలుస్తారు. ‘చెప్పేవి శాంతివచనాలు... చేసేవి రౌడీపనులు. అతడొక రుద్రాక్ష పిల్లి’ అంటుంటారు. వెనకటికో ముసలి పిల్లి మెడలో రుద్రాక్ష వేసుకొని... ఎప్పుడు చూసినా శాంతి, అహింసల గురించి తెగమాట్లాడేదట. మరోవైపు దొరికిన పిట్టను దొరికినట్లు గుటుక్కుమనిపించేదట! మాటకు, ఆచరణకు మధ్య ఉండే అంతరాన్ని సూచించే మాట ఇది. ఊర్మిళాదేవి నిద్ర! ఎవరైనా చాలా ఎక్కువగా నిద్రపోతే ‘ఊర్మిళాదేవి నిద్ర’తో పోల్చడం చూస్తూనే ఉంటాం. రామాయణం నుంచి పుట్టిన మాట ఇది. వనవాస సమయంలో అడవికి రాముడితో సీత వెళ్లిపోతుంటే... ‘‘నేనూ మీతో వస్తాను’’ అని భర్త లక్ష్మణుడిని అడుగుతుంది ఊర్మిళ. కానీ లక్ష్మణుడు అంగీకరించడు. ఈ సందర్భంలో... లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకు ఇస్తాడు. ఊర్మిళ తన ‘మెలకువ’ని లక్షణుడికి ఇస్తుంది. భర్త అడవిలో ఉన్నా పద్నాలుగేళ్లూ ఊర్మిళ నిద్రపోతుంది. ఈ పద్నాలుగేళ్లూ లక్ష్మణుడు అడవిలో మెలకువగా ఉంటాడు. -
జాతీయాలు
కాటి కాపరి ఏడుపు కాటి కాపరి రోజూ... చావులను చూస్తూనే ఉంటాడు. కాబట్టి అతడు చలించడంగానీ, బిగ్గరగా దుఃఖించడంగానీ ఉండదని ఒక అభిప్రాయం ఉంది. జనన మరణాలకు అతీతంగా ఏ భావానికీ చలించకుండా అతని మనసు స్థిరంగా ఉంటుంది. మరి అలాంటి ఒక కాటికాపరి ఒక రోజూ ఏడుస్తూ కనిపించాడట. విషయం ఏమిటని ఆరా తీస్తే... ‘‘ఈరోజు ఒక్క శవమూ రాలేదు’’ అన్నాడట. శవం రాకపోతే సంతోషించాలిగానీ, ఏడ్వడం ఎందుకు? అనే సందేహం వస్తుంది. అయితే మరో కోణంలో చూస్తే మాత్రం... శవసంస్కారంతోనే కాటికాపరి ఉపాధి ముడిపడి ఉంది. శవం రాకపోతే... ఆరోజు అతడు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఎవరి బాధ వారిది. దీన్ని దృష్టిలో పెట్టుకునే...ఎవరైనా లోకనీతి గురించి ఆలోచించకుండా తన స్వప్రయోజనాల కోసం బాధపడితే... అలాంటి వారిని ఉద్దేశించి ‘కాటి కాపరి ఏడుపు ఏడుస్తున్నాడు’ అని అంటారు. గౌతముడి గోవు ‘ఆయన జోలికి వెళ్లకు. గౌతముడి గోవులాంటోడు... ఇబ్బందుల్లో పడతావు’ అంటుంటారు. కొందరు చాలా సున్నిత మనస్కులు ఉంటారు. వారితో వ్యవహరించడంలో ఏ మాత్రం తేడా వచ్చినా... అవతలి వ్యక్తి ఇబ్బందుల్లో పడతాడు. విషయం ఎక్కడికో వెళ్లిపోతుంది. పురాణాల్లో గౌతముడు అనే మహర్షికి సంబంధించిన కథ ఇది. పుష్కరిణి ప్రాంతంలోని వనంలోకి ఒక మాయధేనువు వచ్చింది. గోవు పవిత్రమైనది కాబట్టి దానికి ఏ ఇబ్బందీ కలగకుండా గడ్డిపరకతో సున్నితంగా అదిలించాడు గౌతముడు. ఈమాత్రం దానికే ఆ గోవు కిందపడి ప్రాణాలు కోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకుంది. ఈ పురాణ కథ నుంచే ‘గౌతముడి గోవు’ అనే మాట పుట్టింది, అకారణంగా, ఉత్తపుణ్యానికి ఇబ్బందుల్లో పడినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. గువ్వకుత్తుక! కొందరు చూడడానికి చాలా ధైర్యవంతుల మాదిరిగా కనిపిస్తారు. తీరా ఏదైనా కష్టం వస్తే మాత్రం... గొంతు స్వభావమే మారిపోతుంది... బలహీనమై వినిపిస్తుంది’’ ‘‘నిన్నటి వరకు పులిలా ఉన్నాడు. ఈరోజు కష్టం రాగానే గువ్వకుత్తుక అయ్యాడు’’ అంటారు. గువ్వ అనేది అడవి పావురం. ఇది చూడడానికి బలంగా ఉంటుంది. కానీ దాని గొంతు మాత్రం బలహీనంగా ఉంటుంది. ఆపదలో ఉన్నవారు అరిచినట్లుగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పుట్టిన జాతీయమే గువ్వ కుత్తుక. బాదరాయణ సంబంధం కొందరు బీరకాయపీచు బంధుత్వాలతో చుట్టాలుగా చలామణీ అవుతారు. కొందరికి ఆ ‘బీరకాయపీచు బంధుత్వం’ కూడా అక్కర్లేదు. మాటలతోనే చుట్టాలవుతారు. వెనకటికి ఒక వ్యక్తి ఒక ఎడ్లబండిలో ప్రయాణం చేస్తూ ఒక ఊళ్లో ఒక ఇంటి ముందు ఆగాడట. ఆ ఇంటాయనను పిలిచి ‘అంతా కులాసేనా? పిల్లలందరూ బాగున్నారా?’ అని అడిగాడట. బండిలో వచ్చిన వ్యక్తి చుట్టం కాబోలు అనుకొని ఇంటాయన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేశాడట. బండి వ్యక్తి వెళ్లిపోయే ముందు... ఇంటాయన ఆతృత ఆపుకోలేక ఇలా అడిగాడట... ‘అయ్యా... నేను ఎంత ప్రయత్నించినా నాకు మీరు ఏ వైపు చుట్టమో గుర్తు రావడం లేదు’. దీనికి బండిలో వచ్చిన వ్యక్తి ఇచ్చిన సమాధానం ఇది... ‘మీ ఇంటి ముందు బదరీ చెట్టు ఉంది కదా. నా బండి చక్రాలు కూడా బదరీ చెక్కతో తయారు చేసినవే. ఇదే బాదరాయణ సంబంధం’. -
జాతీయాలు
గోవత్సం! ‘వాడి గురించి చెప్పకు... వాడుత్త గోవత్సం’ ‘గోవత్సంలా బతికాడు... సొంతంగా ఏమీ తెలియదు’ ఇలాంటి మాటలు వింటుంటాం. కొందరు తల్లి చాటు బిడ్డలా పెరుగుతారు. పూర్తిగా తల్లి మీదే ఆధారపడతారు. ఏ పని చేయాలన్నా, చివరికి ఏ విషయమైనా ఒక అభిప్రాయం ఏర్పరచుకోవాలనుకున్నా కూడా అమ్మ జపమే చేస్తారు. ఇలాంటి అమ్మ కూచులను ‘గోవత్సం’ అంటారు. గోవు అంటే ఆవు. వత్సం అంటే దూడ. రెండిటినీ కలిపి ‘గోవత్సం’ అంటారు. ఆవుదూడలు అమ్మకానికి వచ్చినప్పుడు... ‘ఆవు ధర’, ‘దూడ ధర’ అని ప్రత్యేకంగా ఉండవు. ఆవు ధర లేదా విలువే దూడ ధర, విలువ అవుతుంది. అంతే తప్ప... ఆవుకు ఒక ధర, విలువ దూడకు ఒక ధర, విలువ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఈ నేపథ్యంలో నుంచి వచ్చిందే ‘గోవత్సం’ జాతీయం. కేతిగాడు! కొందరు ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్లను నవ్విస్తుంటారు. దీంతో వారు ఏది చెప్పినా ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోరు. ‘వాడు చెప్పింది నమ్ముతున్నారా? వాడో కేతిగాడు’, ‘పట్టించుకో దగ్గ వ్యక్తి కాదు... కేతిగాడికి ఇతడికి తేడాలేదు’ ‘కేతిగాడిలా తెలివితక్కువ పనులు, పిచ్చి వేషాలు వేయకు’... ఇలాంటి మాటలు అక్కడక్కడా వినబడుతుంటాయి. తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రల్లో జుట్టుపోలిగాడు, అల్లాటప్పగాడు, బంగారక్కలతో పాటు కేతిగాడు ఒకరు. మధ్యలో ఊడిపడి అప్పటికప్పుడు హాస్యం సృష్టించడంలో ఈ కేతిగాడు దిట్ట. తాపత్రయం తాపాలు మూడు రకాలు... 1. ఆధ్యాత్మికతాపం, 2. అధిభౌతికతాపం, 3. అధిదైవికతాపం మూడు రకాల తాపాలను భరించడమే తాపత్రయం. తన వ్యక్తిగత విషయాలకే కాకుండా ప్రపంచ సమస్యను తన సమస్య అనుకోవడం. కవి మాటల్లో చెప్పాలంటే ‘ప్రపంచ బాధే నా బాధ’ అనుకోవడం. అయితే వాడుకలో మాత్రం ఆధ్యాత్మిక అర్థంలో కాకుండా ‘తాపత్రయం’ అనేదాన్ని ‘అత్యాశ’, ‘ఆరాటం’ అనే అర్థంలో వాడడం కనిపిస్తుంటుంది. వాతాపి జీర్ణం భోజనం చేశాక మన పెద్దలు వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అంటూ పొట్టమీద చేతితో నిమురుకుంటారు. దీనికి నేపథ్యంగా మహాభారతంలో ఒక కథ ఉంది. వాతాపి, ఇల్వలుడూ ఇద్దరు అన్నదమ్ములు, వీళ్లు రాక్షస రాజులు. ఒకరోజు ఇల్వలుడు తాను కోరుకున్నది జరిగే వరం ఇవ్వమని ఒక మునిని అడుగుతాడు. అలాంటి వరం ఇవ్వడం కుదరదని ఆ ముని చెప్పగానే ఆగ్రహించిన ఇల్వలుడు... రుషి హత్యలు మొదలుపెడతాడు. తమ్ముడు వాతాపిని ఆహారంగా చేసి... మునులను, బాటసారులను విందుకు పిలిచి భోజనం పెడతాడు. విందు ఆరగించాక ... ‘వాతాపీ! బయటకు రా..’ అని పిలవగానే... అతడు వాళ్ల పొట్ట చీల్చుకుంటూ బయటకు వస్తాడు. ఇలా మునులను, బాటసారులను చంపుతూ రాక్షసానందం పొందుతుంటారు ఇల్వలుడూ, వాతాపి. ఒకరోజు అగస్త్య మునిని విందుకు పిలుస్తారు. వాతాపిని ఆహారంగా మార్చి భోజనం పెడతాడు ఇల్వలుడు. మహా ముని అయిన అగస్త్యుడు సుష్టుగా భోంచేసి... తన మంత్ర శక్తితో పొట్ట లోపల వాతాపిని జీర్ణం చేసేస్తాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటకు రాడు. ఇలాంటి నీచ కార్యాలు మానుకోమని ఇల్వలుడికి బుద్ధి చెప్తాడు అగస్త్యుడు. ఇది ఇతిహాస కథ. అయితే, నిత్యజీవితంలో మాత్రం సందర్భాన్ని బట్టి ‘జీర్ణం చేసుకున్నాడు’ అని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తారు. -
జాతీయాలు
అంపశయ్య భీష్ముడు తనను నిరాకరించాడనే కోపంతో ‘నిన్ను సంహరిస్తాను’ అని శపథం చేస్తుంది అంబ. దీనికి సమాధానంగా ‘నువ్వు ఏ రోజు అయితే ఆయుధం చేతపూని నా ఎదుట నిల్చుంటావో... అప్పుడు నేను అస్త్రసన్యాసం చేస్తాను’ అని ప్రతిన పూనుతాడు భీష్ముడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి శివుడి కోసం తపస్సు చేసి ‘అంబ’ శిఖండిగా మారుతుంది. మహాభారత యుద్ధంలో... శిఖండిని అడ్డు పెట్టుకొని పాండవులు యుద్ధం చేయడం వల్ల భీష్ముడు అస్త్రసన్యాసం చేస్తాడు. భీష్ముడు అస్త్రసన్యాసం చేసిన వెంటనే అర్జునుడు అతని శరీరంపై బాణాల వర్షం కురిపిస్తాడు. ఆ బాణాలే అతని శయ్యగా మారుతాయి. ఎవరైనా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు లేదా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ‘అంపశయ్య పై ఉన్నట్లు ఉన్నాడు’ అంటారు. పెదగంగ ఉదకం గంగానది గురించి పురాణాల్లో ఎన్నో విశిష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. ‘దేవగంగ’, ‘ఆకాశగంగ’ అనే పేర్లతో స్వర్గలోకంలో ప్రవహించేదట. ఆకాశగంగలో రాజహంసలు విహరిస్తాయట. బంగారు తామరలు అందంగా వికసిస్తాయట. స్వర్గానికి వెళ్లిన వారు ఇందులో స్నానం చేస్తారట. ఆకాశంలోని పాలపుంతను కూడా పెద గంగ అంటారు. ఆకాశ గంగ గొప్పదనం, అందం మాట ఎలా ఉన్నా... అది నిజంగానే ఉందా? లేక కల్పనా? అనేది తెలియదు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టిందే ‘పెదగంగ ఉదకం’ పెదగంగ ఉదకం అంటే ఆకాశగంగ. ఇది ఉందో లేదో ఎవరికీ తెలియదు. అంటే గగన కుసుమం లాంటిదన్నమాట! సంపాతి జటాయువులు... చాలా పాత తరం వ్యక్తులు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఇది. సంపాతి మరియు జటాయువులు రామాయణంలో పాత్రలు. సంపాతి, జటాయువులు అన్నదమ్ములు. గద్దలు. సూర్యమండలానికి ఎవరు త్వరగా చేరుకుంటారనే దానిపై ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడతారు. ఈ పోటీలో జటాయువు త్వరగా సూర్యమండలం వైపు దూసుకెళతాడు. ఈ సమయంలో జటాయువు రెక్కలు కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సంపాతి తన రెక్కలు అడ్డుపెడతాడు. రెక్కలు కాలిపోతాయి. జటాయువు సీతమ్మను రక్షించే ప్రయత్నంలో రావణాసురుడితో యుద్ధం చేసి చనిపోయిన విషయం తెలిసిందే. సంపాతి, జటాయువుల త్యాగాల మాట ఎలా ఉన్నా... ‘పాత తరం వ్యక్తులు’, ‘చాలా అనుభవం ఉన్న వాళ్లు’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘ఏదైనా సందేహం ఉంటే వాళ్లను అడుగు. ఎంతో అనుభవం ఉన్నవాళ్లు. సంపాతి జటాయువులు’ అంటారు. శకారుడు! శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం ‘మృచ్ఛకటికం’. పది అంకాలున్న నాటకం ఇది. ‘వసంతసేన’ అనే పాత్ర ఈ నాటకంలోనిదే. ఉజ్జయినిని పరిపాలించే రాజు బావమరిది శకారుడు. శకారుడికి లేని దుష్ట లక్షణం లేదు. శకారుడిలో మూర్ఖత్వం, అజ్ఞానం, దుర్మార్గం మూర్తీభవించి ఉంటాయి. తన అహంకారంతో ప్రజలను పట్టి పీడించేవాడు శకారుడు. దుర్మార్గాలకు పాల్పడేవాళ్లను, బంధువుల అధికారాన్ని అడ్డు పెట్టుకొని అరాచకాలు సృష్టించేవాళ్లను శకారుడితో పోల్చుతారు. -
జాతీయాలు
కాలనేమి జపం రామాయణం నుంచి పుట్టిన జాతీయం ఇది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ద్రోణగిరిపై ఉన్న ఒక మూలికను తేవడానికి సన్నద్ధుడవుతాడు ఆంజనేయుడు. ఈ విషయం రావణాసురుడికి తెలుస్తుంది. హనుమంతుడిని దారి తప్పించి మాయాసరస్సులో స్నానం చేసేలా చేయమని మారీచుడి కొడుకైన కాలనేమితో చెబుతాడు రావణాసురుడు. ద్రోణగిరిని వెదుకుతూ వెళుతున్న హనుమంతుడికి దారిలో మహర్షి రూపంలో జపం చేస్తున్న కాలనేమి కనిపిస్తాడు. ద్రోణగిరికి దారి చెప్పమని హనుమంతుడు అడిగినప్పుడు- ‘‘అక్కడ ఉన్న కొలనులో స్నానం చేస్తే కొత్త శక్తి వస్తుంది’’ అని తప్పుడు సమాచారం ఇస్తాడు. ఆ తరువాత ఏమైంది అనేది వేరే విషయంగానీ... దొంగ భక్తులను, చిత్తశుద్ధి లేకుండా పూజాపునస్కారాలు చేసేవాళ్లను, పవిత్రంగా కనిపిస్తూ ఇతరులను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించే వాళ్లను ‘కాలనేమి జపం’తో పోల్చుతారు. చిదంబర రహస్యం! పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలసిన ఆలయం చిదంబరం. ఈ ఆలయంలో శివుడు నిరాకార స్వరూపుడిగా కొలవబడతాడు. గర్భగుడిలోని ఖాళీ స్థలాన్ని తెరతో కప్పిపెడతారు. పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ఈ ఖాళీస్థలం ప్రతీక. ఏమీ లేకపోయినా తెరను అలా ఎందుకు కప్పిపెడతారు? దీనికి ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు ఎన్ని ఉన్నా చాలామందికి ఇది ‘రహస్యం’గానే మిగిలిపోయింది. ఆ తెర వెనుక ఎన్నో కనిపిస్తాయనేది కొందరి నమ్మకం. కొందరికి బంగారు బిల్వ పత్రాలు కనిపిస్తే కొందరికి మరొకటి. ఈ మర్మం ఎవరికీ అర్థం కానిది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏదైనా తెలియని రహస్యం లేదా తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని ‘చిదంబర రహస్యం’ అనడం పరిపాటిగా మారింది. తంజావూరు సత్రం ‘రాను రాను ఈ ఇల్లు తంజావూరు సత్రంలా తయారైంది. పని చేసే వాళ్లు తక్కువ... పడి తినేవాళ్లు ఎక్కువ’ ఇలాంటి మాటలు వింటుంటాం. తమిళనాడులోని ప్రాచీన పట్టణం తంజావూరు. కావేరి నది తీరాన ఉన్న ఈ పట్టణం ఆలయాలకి ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణానికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వచ్చేవారు. ఆ రోజుల్లో... రాజులు ఆలయాలు కట్టించడమే కాదు... యాత్రికుల సౌకర్యం కోసం అన్నసత్రాలు కట్టించేవాళ్లు. ఈ అన్నసత్రాల వల్ల జరిగిన మంచి మాట ఎలా ఉన్నా... సోమరులకు ఇవి నిలయాలుగా ఉండేవి. ఈ సత్రాల వ్యవహారం ఒక ప్రహసనంలా తయారైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పుట్టిందే ‘తంజావూరు సత్రం’ జాతీయం. ఒక ఇంట్లో ఒక్కరే కష్టపడుతూ, ఏ పనీ చేయకుండా సోమరిగా కాలం వెళ్లదీసే వాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఇంటిని తంజావూరు సత్రంతో పోల్చుతుంటారు. శ్రావణ భాద్రపదాలు కొందరు ఎప్పుడు చూసినా చాలా సంతోషంగా ఉంటారు. వారికి సమస్యలు లేవని కాదు... ఉన్నా వారి సంతోషానికి అవేమీ అడ్డు కాదు. కొందరు మాత్రం ఎప్పుడు చూసినా ఏడుపు ముఖంతో కనిపిస్తారు. సమస్యలు ఉన్నా లేకున్నా ఒకేవిధంగా ఉంటారు. ఏదో విషయంలో ఏదో ఒక అసంతృప్తి కనిపిస్తూనే ఉంటుంది. వారి కళ్లల్లో సంతోషం కాకుండా దుఃఖ వర్షమే ఎప్పుడూ కనిపిస్తుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ‘అతడి కళ్లు శ్రావణ భాద్రపదాల్లా ఉన్నాయి’ అంటారు. శ్రావణ భాద్రపదాలు తెలుగు నెలలు. ఇవి వర్షాకాలపు నెలలు. వర్షాన్ని గుర్తు చేసే నెలలు. కళ్లు ఎప్పుడూ తడిగానే ఉంటాయి అని చెప్పడానికి ఉపయోగించే జాతీయం ఇది. సంతోషాన్ని ఇష్టపడే వాళ్లు స్నేహితులైనట్లే, ఎప్పుడూ విచారంతో కనిపించేవారు కూడా స్నేహితులవుతారు. ఇలాంటి జంటను ‘శ్రావణ భాద్రపదాలు’ అని పిలుస్తారు. -
జాతీయాలు
నక్షత్రకుడు! ‘నక్షత్రకుడిలా నా వెంటబడి చావగొట్టకు’ ‘అబ్బో... అతని గురించి చెప్పాలంటే నక్షత్రకుడిని మించి ఇబ్బందులు పెడతాడు’ అంటుంటారు. నక్షత్రకుడు విశ్వామిత్రుడి శిష్యుడు. విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు ఇవ్వవలసిన డబ్బును రాబట్టడానికి... హరిశ్చంద్రుడితో పాటు నీడలా వెళతాడు. హరిశ్చంద్రుడు భార్యాబిడ్డలతో నడుస్తుంటే ‘నేను నడవలేను’ అని కూర్చునేవాడు. సరే అని కూర్చుంటే నిలబడేవాడు. ‘‘నేను నడవలేక పోతున్నాను నన్ను ఎత్తుకో’’ అనేవాడు. నీళ్లు దొరకని చోటు చూసి నీళ్లు కావాలి అని అడిగేవాడు. ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు. రకరకాల సమస్యలతో బాధ పడే వారికి ఎవరైనా సరికొత్త సమస్యగా తయారైతే అలాంటి వ్యక్తిని నక్షత్రకుడితో పోల్చుతారు. గజ్జెలు కట్టిన కోడి! తమ సహజ అవలక్షణాలను మార్చుకోని వారి విషయంలో వాడే మాట ‘గజ్జెలు కట్టిన కోడి’. ‘కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించకుండా ఉంటుందా?’ అని అంటుంటారు. వెనకటికి ఒకాయన దగ్గర ఒక కోడి ఉండేది. ఆ కోడి తన సహజశైలిలో పెంటకుప్పల వెంట తిరిగేది. తన ముద్దుల కోడి ఇలా అసహ్యంగా పెంటకుప్పల మీద తిరగడం ఆ ఆసామికి నచ్చలేదు. దీంతో ఆ కోడిని బాగా అలంకరించి కాలికి గజ్జె కట్టాడు. ఈ అలంకారాలతో కోడి ప్రవర్తనలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్మాడు. ఎంతగా అలంకరించినా కోడి మాత్రం తన సహజశైలిలో చెత్తకుప్పలు కుళ్లగించడం మానలేదు! శశ విషాణం అసాధ్యమైన పనులు లేదా వృథాప్రయత్నాల విషయంలో వాడే జాతీయం ‘శశ విషాణం’. ‘నువ్వు చెబుతున్న పని శశ విషాణం సాధించడంలాంటిది’. ‘శశ విషాణం కోసం ప్రయత్నించి విలువైన సమయాన్ని వృథా చేయకు’ ఇలాంటి మాటలు వినబడుతూ ఉంటాయి. శశం అంటే కుందేలు. విషాణం అంటే కొమ్ము. కుందేలుకు పెద్ద చెవులే గానీ కొమ్ములు ఉండవు కదా! ఇలా లేని దాని కోసం ప్రయత్నించడం, అసాధ్యమైన వాటి గురించి ఆలోచించే విషయంలో ఉపయోగించే ప్రయోగమే శశ విషాణం. చగరుడాయ లెస్సా అంటే... శేషాయ లెస్సా అన్నట్లు! ఇద్దరూ సమ ఉజ్జీలైనప్పుడు పలకరింపుల్లో గానీ, పట్టుదల విషయంలో గానీ ఎవరికి వారు ‘నేనే గొప్ప’ అనుకుంటారు. ఈ ఇద్దరిలో ఒకరు చొరవ తీసుకొని మొదట పలకరిస్తే... రెండో వ్యక్తి అతిగా స్పందించడు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ‘బాగున్నారా?’ అని మొదటి వ్యక్తి పలకరిస్తే- ‘బాగున్నాను. మీరు బాగున్నారా?’... అని రెండో వ్యక్తి సమాధానం చెప్పి మౌనంగా ఉండిపోతాడు. ఇంతకు మించి సంభాషణ ముందుకు సాగదు. గరుడుడు, శేషుడు... వీరిలో గొప్ప ఎవరు అంటే ఏమి చెప్పగలం? ఎవరికి వారే గొప్ప! ‘ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు, పలకరించుకోవాలి కాబట్టి పలకరించుకున్నారు...’ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ‘‘వారి మాటల్లో పెద్ద విశేషాలేమీ లేవు. ఏదో... గరుడాయ లెస్సా అంటే శేషాయ లెస్సా అన్నట్లు పలకరించుకున్నారు’’ అంటుంటారు. -
జాతీయాలు
గజకచ్ఛపాలు! పూర్వం విభావసుడు, సుప్రతీకుడు అనే అన్నదమ్ములు ఉండేవారు. అన్నదమ్ములంటే ఐకమత్యానికి ప్రతీకలా ఉండాలి. ఈ ఇద్దరు అన్నదమ్ములు మాత్రం ఆస్తి కోసం ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవారు. ఒకసారి వీరి పోట్లాట శ్రుతి మించింది. ‘‘నువ్వు ఏనుగై పోవాలి’’ అని అన్న శపించాడు. దీనికి ప్రతి శాపంగా- ‘‘నువ్వు తాబేలైపో’’ అని తమ్ముడు శపించాడు. అలా ఇద్దరు ఏనుగు, తాబేలైపోయారు. గజం అంటే ఏనుగు. కచ్ఛపం అంటే తాబేలు. అన్నదమ్ములు ఏనుగు, తాబేళ్లుగా మారినా వారి బుద్ధి మాత్రం మారలేదు. ఎప్పటిలాగే ఆస్తికోసం పోట్లాడుకునేవారు. ఈ కథ నేపథ్యం నుంచి వచ్చిందే ‘గజకచ్ఛపాలు’ జాతీయం. ఆస్తి కోసం తరచూ పోట్లాడుకునే అన్నదమ్ములను, దాయాదులను ‘గజకచ్ఛపాలు’ అంటారు. గట్టి కొమ్మ! ఆపదలో ఉన్నప్పుడో, కష్టాల్లో ఉన్నప్పుడో ఆదుకునే వ్యక్తిని ‘గట్టి కొమ్మ’తో పోల్చడం పరిపాటి. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు గెంతే ప్రయత్నంలో గట్టి కొమ్మను ఊతం చేసుకుంటారు. కొమ్మ గట్టిదైతేనే క్షేమంగా అవతలి వైపుకు చేరుకుంటాం. కొమ్మ బలహీనమైతే ప్రమాదంలో పడతాం. మన క్షేమం అనేది కొమ్మ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. మనుషుల్లో కూడా గట్టి కొమ్మల్లాంటి వారు ఉంటారు. బలహీనమైన కొమ్మల్లాంటి వారు ఉంటారు. గట్టి కొమ్మల్లాంటి వారిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుంది. పదిమందికీ ఉపయోగపడే వ్యక్తిని, ఆదుకునే వ్యక్తిని ‘గట్టి కొమ్మ’తో పోల్చు తుంటారు. పులికి ఏ అడవి అయినా ఒక్కటే! కొందరికి పని అనేది రెండో విషయం. సౌకర్యాలు, అనుకూలమైన విషయాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడతారు. కొందరు మాత్రం పని గురించే ఆలోచిస్తారు. అసౌకర్యాలు, ప్రతికూలతల గురించి ఆలోచించరు. ఇలాంటి వారిని ఉద్దేశించి వాడే మాటే ‘పులికి ఏ అడవి అయినా ఒక్కటే’ పులి తాను ఉన్న అడవికి కాకుండా కొత్త అడవికి వెళితే? అయోమయానికి గురవుతుందా? బెదరుతుందా? భయపడుతుందా?... ఇవేమీ జరగవు. అది ఏ అడవికి వెళ్లినా తన సహజశైలిలో ఎప్పటిలాగే నిశ్చింతగా, నిర్భయంగా ఉంటుంది! సమర్థుడికి ఎక్కడైనా ఒక్కటే అనే భావాన్ని స్ఫురింపచేయడమే ‘పులికి ఏ అడవి అయినా ఒక్కటే’ మాట ఉద్దేశం. సింగడు బూరడు! పూర్వం... యుద్ధం మొదలయ్యే ముందు కొమ్ము బూర ఊదేవారు. కొమ్ము బూర ఊదడం (సింగినాదం) అనేది యుద్ధానికి సన్నద్ధం కావడం, కయ్యానికి కాలుదువ్వడానికి సూచనగా ఉండేది. ఈ నేపథ్యం నుంచే... ఎవరైనా కయ్యానికి కాలుదువ్వితే ‘సింగడు బూరడు’ అయ్యాడు అని అంటుంటారు. -
జాతీయాలు
వెన్ను చలవ ‘అందరినీ ఒకేలా చూడాలి. ఒకరు తక్కువేమిటి? ఇంకొకరు ఎక్కువ ఏమిటి? ఆ శ్రీను కూడా మాలాంటివాడే. మీరు మాత్రం...అతడిని వెన్ను చలవ బిడ్డ కంటే ఎక్కువ ప్రేమగా చూస్తున్నారు’ ‘నువ్వు నా కన్నబిడ్డ కంటే ఎక్కువ... నా వెన్నుచలవ బిడ్డవు నువ్వు’... ఇలాంటి మాటలు నిత్యజీవితంలో వినిపిస్తుంటాయి. వెన్ను చలవ బిడ్డ ఎవరు? సంతానం లేని దంపతులు వేరే వాళ్ల బిడ్డను తెచ్చుకొని పెంచుకోవడాన్ని ‘వెన్ను చలవ’ అంటారు. ఈ బిడ్డను కళ్లలో పెట్టి చూసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే సొంతబిడ్డ కంటే ఎక్కువ ప్రేమతో పెంచుకుంటారు. పరాయి బిడ్డను పెంచుకోవడం వల్ల సంతానం లేని దంపతులకు సంతానయోగం కలుగుతుందనేది ఒక నమ్మకం. పెంచుకుంటున్న బిడ్డను వెన్ను మీద ఉప్పు బస్తాలా మోస్తే... వెన్నుచల్లబడి సంతానం కలుగుతుందనేది కూడా ఆ నమ్మకాలలో ఒకటి. పందిరి మందిరమైనా సరే... ఎంత కష్టమైనా సరే ఆ పని సాధిస్తాం అనే పట్టుదల ఉన్నప్పుడు ఉపయోగించే మాట ఇది. ‘అతడిని తక్కువ అంచనా వేయకు...పందిరి మందిరం అయినా సరే సాధిస్తాడు’లాంటి మాటలు నిత్యం వినబడుతూనే ఉంటాయి. పందిరికి మందిరానికి ఎలాంటి సంబంధం లేదు. పందిరి మందిరం కావడం అనేది అసాధ్యమైన పని. ‘ఆరు నూరైనా నూరు ఆరైన’లాంటిదే ‘పందిరి మందిరమైన సరే’ వాడుక. పిష్ట పేషణం! కొందరు చెప్పిందే చెబుతూ, మాట్లాడిందే మాట్లాడుతూ అవతలి వ్యక్తులను తెగ విసిగిస్తుంటారు. సహనాన్ని పరీక్షిస్తుంటారు. కొందరేమో...పని చేస్తారుగానీ ఆ పని వల్ల కొంచెం కూడా ఉపయోగం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే జాతీయమే ‘పిష్ట పేషణం’ పిండిని మళ్లీ పిండి చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదుగాక ఉండదు! అలా చేయడం తెలివి తక్కువ పని అవుతుంది. ఎందుకు ఉపయోగపడని పని అవుతుంది. పిష్టం అంటే పిండి. పేషణం అంటే నూరడం. పిండిని మళ్లీ పిండిగా మార్చాలనుకోవడమే ‘పిష్ట పేషణం’. చెప్పినదాన్నే మళ్లీ మళ్లీ చెప్పడాన్ని ‘పిష్ట పేషణం’తో పోల్చుతారు. ధృతరాష్ట్ర కౌగిలి! దుర్యోధన వధ తరువాత పాండవులు ధృతరాష్ర్టుడిని కలవడానికి వస్తారు. భీముడే దుర్యోధనుడిని చంపాడని అతడి మీద కోపం పెంచుకుంటాడు ధృతరాష్ట్రుడు. భీముడిని ఆశీర్వదించే నెపంతో కౌగిలించుకొని నలిపివేయాలని పథకం వేస్తాడు. భీముడిని దగ్గరకు రమ్మని పిలుస్తాడు. ధృతరాష్ర్టుడి మనసులోని కుట్రను పసిగట్టిన కృష్ణుడు...భీముడి ఉక్కుప్రతిమను ధృతరాష్ర్టుడి ముందు ఉండేలా ఏర్పాటు చేస్తాడు. ధృతరాష్ట్రుడి కౌగిలిలో ఆ ప్రతిమ పిండి పిండి అవుతుంది. పైకి ప్రేమగా నటిస్తూ, లోపల వినాశనం కోరే వారిని. వారి పనులను ‘ధృతరాష్ట్ర కౌగిలి’తో పోల్చుతారు. ధృతరాష్ట్ర కౌగిలి అనేది వినాశన సంకేతంగా ప్రాచుర్యం పొందింది. -
జాతీయాలు
జైనుడి చేతిలో పేను! జైన మతం అహింసకు పెద్దపీట వేస్తుంది. సూక్ష్మజీవులు చనిపోతాయని నీళ్లు వడగట్టుకొని తాగుతారు, అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాళ్ల కింద సూక్ష్మజీవులు చనిపోతాయని నెమలీకలతో నడిచినంత మేరా నేలను ఊడ్చుకుంటూ పోతారు. నేలను దున్ని చేసే వ్యవసాయం చేయరు. జైనుల అహింసా సిద్ధాంతం ఆచరణసాధ్యం కానంత తీవ్రస్థాయిలో ఉంటుందనే విమర్శ కూడా లేకపోలేదు. వెనకటికి ఒక జైనుడి తలలో పేలు పడ్డాయి. అందులో ఒకటి అతడికి చిక్కింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడేగానీ ఏం చేయాలో అర్థం కాలేదు. చంపకుంటే మనసు శాంతించదు. చంపితే మతధర్మం ఒప్పుకోదు. ‘చంపడమా? వదిలిపెట్టడమా?’ అనే సంఘర్షణలో జైనుడితో పాటు ఆ పేను కూడా నరకం అనుభవించింది. ఈ కథ సంగతి ఎలా ఉన్నా...ఒక విషయం ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నప్పుడు లేదా ఒక అవకాశం చేతికి చిక్కినప్పటికీ ఏమీ చేయలేని స్థితి ఎదురైనప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. రోకలి చిగుళ్లు! ‘రోకలికి చిగుళ్లు కోయవద్దు. జరిగే పనేనా కాదా అనేది చెప్పు’ ‘నువ్వు చెప్పిన పని పొరపాటున కూడా సాధ్యం కాదు. రోకలికి చిగుళ్లు మొలుస్తాయా?’ ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం. చెట్టునో, కొమ్మనో నరికి ఎండబెట్టి రోకలిగా చెక్కుతారు. ఇక అలాంటి రోకలి చిగుళ్లు వేయడం అనేది అసంభవం అనే విషయం అందరికీ తెలుసు. అసాధ్యం, అసంభవం అనుకునే పనుల విషయంలో ఉపయోగించే మాట ఇది! జాపరమేశ్వరా! ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. ఆపదలో ఉన్న వ్యక్తి... ‘‘దేవుడా కాపాడు’’ అని అంటూ పరుగెత్తుతాడు. దీనికి సమానమైనదే ఈ జాపరమేశ్వరా! ‘తన ఇబ్బంది గ్రహించి జాపరమేశ్వర అని పారిపోయాడు’ ‘జాపరమేశ్వర అని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’ ఇలాంటి మాటలు వింటుంటాం. జా, పరమేశ్వరా పదాలతో ఏర్పడినదే జాపరమేశ్వర! ‘జా’ అంటే హిందీలో ‘వెళ్లు’ అని అర్థం. ‘పరమేశ్వరా’ అనేది ఇష్టదైవాన్ని తలుచుకోవడం. -
జాతీయాలు
అనామకంగా! ‘నిన్నా మొన్నటి వరకు అనామకంగా ఉన్న వ్యక్తి కాస్తా ఇప్పుడు ప్రముఖుడయ్యాడు’ ‘పాపం... అతడి జీవితం అనామకంగా ముగిసింది’... ఇలాంటి మాటలను వింటుంటాం. అసలేమిటీ అనామకం? పెద్దగా ఎవరూ పట్టించుకోని, ఎవరి దృష్టీ సోకని వ్యక్తులు, ప్రదేశాల విషయంలో ‘అనామకం’ మాటను వాడుతుంటారు. ఈ అనామకం వెనుక ఒక పురాణకథ ఉంది. బ్రహ్మదేవుడికి ఒకప్పుడు అయిదు తలలు ఉండేవట. ఒకసారి ఆయనకి, శివుడికి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో శివుడు తన ఉంగరపు వేలి గోరుతో శివుడి అయిదవ తలను సంహరించాడు. ఉంగరపు వేలును సంస్కృతంలో అనామిక అంటారు. ఏ వేలుతో అయితే శివుడు బ్రహ్మదేవుడి తలను సంహరించాడో, ఆ వేలును వేదకర్మలలో ఉపయోగించకూడదని, ఉచ్చరించకూడదనే నియమం ఏర్పడింది. ఈ అనామిక నుంచే అనామకం అనే జాతీయం పుట్టింది. బాదరబందీ! పూర్వపు రోజుల్లో రాజుల దగ్గర పని చేసే ఉన్నతోద్యోగులు పొడవాటి అంగరఖా ధరించేవారు. అంగరఖా కుడి, ఎడమ అంచులను చిన్న చిన్న దారాలతో ముడివేసేవాళ్లు. అవి మొత్తం పన్నెండు ఉండేవి. రోజూ ఈ పన్నెండు ముళ్లనూ వేయడమనేది సహనానికి పరీక్షలా ఉండేది. అలా అని కుదరదు అనడానికి లేదు. చచ్చినట్లు వాటిని కట్టుకొని కొలువుకు వెళ్లాల్సిందే. హిందీలో పన్నెండును బారా అంటారు. బారా, బాధ... ఈ రెండూ కలిసి ‘బాదర’గా రూపుదిద్దుకుంది. దీనికి చివర ‘బందీ’ కూడా చేరిపోయింది. చికాకు పుట్టించి, సమస్యగా తోచే వ్యవహారాలు, భారంగా తోచే అనివార్య బాధ్యతల విషయంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘అతడికి ఎలాంటి బాదరబందీ లేదు. హాయిగా కాలం గడుపుతున్నాడు’... ‘నీకేం ఎన్నయినా చెబుతావు. మాలా బాదరబందీ ఉంటే అర్థమవుతుంది’... ఇలా అన్నమాట! కబంధ హస్తాలు! ఎవరైనా చెడ్డవ్యక్తుల బారిన పడినప్పుడు- ‘ఆ కబంధహస్తాల నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు’ అంటుంటారు. ఇంతకీ ఏమిటీ కబంధ? అడవిలో సీతమ్మ కోసం రామలక్ష్మణులు వెదుకుతున్నప్పుడు వారి ముందుకు ఒక విచిత్రమైన వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తికి కాళ్లు, తల, మెడ ఉండవు. కడుపు భాగంలో మాత్రం నోరు ఉంటుంది! చేతులైతే చాలా పొడవు. ఎవరైనా తన నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తే చేతుల్తో పట్టుకునేవాడు. ఆ పట్టు చాలా గట్టిగా ఉండేదట. అందుకే కబంధ హస్తం అని పేరొచ్చింది. ఆ చేతుల్ని తర్వాత రామలక్షణులు నరికేస్తారు. నిజానికి కబంధుడు అందగాడు. కానీ అహంకారి. ఓసారి ఒక మునిని ఆట పట్టించడానికి వికృతరూపం ధరిస్తే.. ఆ మునికి కోపం వచ్చి- ‘‘ఈ రూపమే నీకు శాశ్వతంగా ఉంటుంది’’ అని శపిస్తాడు. అలంకృత శిరచ్ఛేదం! పూర్వపు రోజుల్లో నేరాలు ఘోరాలు చేసిన వారి తల నరికేసేవారు. అయితే నరకడానికి ముందు నేరస్తుడి కోరిక ఏదైనా ఉంటే తీర్చేవారు. అంతేకాదు... అతడి తలను అందంగా అలంకరించేవారు. ఆ తరువాతే ఆ తలను నరికేవారు. దాని ఆధారంగానే ఈ జాతీయం పుట్టింది. కొందరు తమ పని పూర్తయ్యేంత వరకు... చాలా మర్యాదగా, గౌరవంగా వ్యవహరిస్తారు. ఎప్పుడైతే వారి పని పూర్తయిపోతుందో, అప్పటి నుంచి వారి స్వభావంలో అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. వారిలోని దుర్మార్గం బట్టబయలై భయపెడుతుంది. ఇలాంటి వారి విషయంలో ఉపయోగించే జాతీయం ఇది. -
జాతీయాలు
బ్రహ్మాండం! ఒక ఆలోచన గురించో, వస్తువు గురించో ప్రశంసాపూర్వకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు- ‘బ్రహ్మాండంగా ఉంది’ అనడం చూస్తుంటాం. ఇంతకీ ఈ ‘బ్రహ్మాండం’ ఏమిటి? సృష్టికర్త బ్రహ్మ భూగోళాన్ని, ఇతర గోళాలను గుడ్డు(అండం) ఆకారంలో తయారుచేశాడని నమ్ముతారు. భూగోళాన్ని, ఇతర గోళాలను కలిపి ‘బ్రహ్మాండం’ అంటారు. పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినా, పెద్ద పెద్ద రాక్షసులు గట్టిగా అరిచినా... ఇంకేమైనా పెద్ద ఘటనలు జరిగినా బ్రహ్మాండ భాండం(కుండ) బద్దలవుతుంది అంటారు. స్థూలంగా చెప్పుకోవాలంటే ‘బ్రహ్మాండం’ అంటే ‘చాలా పెద్దది’ అని అర్థం. అందువల్ల పెద్ద పనులు, వస్తువుల విషయంలో ఈ మాటను వాడేవారు. అయితే కాలక్రమంలో అద్భుతమైన, అసాధారణ విషయాలు, విజయాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ‘బ్రహ్మాండంగా ఉంది’ అనడం మొదలైంది. దంపతి కలహం! ‘వాళ్ల పోట్లాట చూసి కంగారు పడకు. అది దంపతి కలహం’ ‘దంపతులన్నాక కలహం మామూలే కదా. పెద్దగా పట్టించుకోవాల్సిన కలహం కాదు... దంపతి కలహం అనే మాట ఉండనే ఉంది కదా’... ఇలాంటి మాటలు వింటుంటాం. దంపతి అంటే భార్యాభర్తలు.కలహం అంటే తగాదా. దాంపత్యంలో ప్రేమానురాగాలు ఎంత సహజమో, తగాదాలు కూడా అంతే సహజం. కొందరు దంపతులు తీవ్రంగా తగాదా పడతారు. ఆ తరువాత కాసేపటికే మామూలై పోయి నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. భార్యభర్తలు తగాదా పడుతున్నప్పుడు మధ్యలో వెళ్లినవారిని- ‘అది భార్యభర్తల తగాదా. ఇప్పుడే తిట్టుకుంటారు. ఇప్పుడే కలుసుంటారు. మధ్యలో నువ్వెళ్లడం దేనికి?’ అనే మాట కూడా వింటుంటాం. భార్యభర్తల మధ్య తగాద అనేది తాటాకు మంటలాంటిదని, అది శాశ్వతమైన శత్రుత్వం కాదు అని చెప్పడానికే ‘దంపతి కలహం’ అనే మాట వాడతారు. చీకటిని నెత్తినేసుకొని... సూర్యుడింకా ఉదయించక ముందే, చాలా పొద్దున్నే బయటికి వెళ్లినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. ‘ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీకటిని నెత్తినేసుకొని వెళ్లాడు’ అంటారు. తెల్లవారుజామున చీకటి చీకటిగానే ఉంటుంది. బయటికి వెళ్లేటప్పుడు తలకు రుమాలు కట్టుకొని వెళుతుంటారు. అలా చీకటిని తల మీద వేసుకొని బయటికి వెళుతున్నాడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నాథుడు! ‘ఈ రోడ్డును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు’ ‘నగరంలో ఎటు చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. పట్టించుకునే నాథుడే లేడు’లాంటి మాటలను తరచుగా వింటుంటాం. నాథుడు అనే పదానికి ‘భర్త’ ‘రాజు’ అనే అర్థాలు ఉన్నాయి. అయితే వ్యవహారికంలో మాత్రం వేరే అర్థాలు ఏర్పడ్డాయి. ‘ఆధారం’ ‘పెద్దదిక్కు’ ‘బాగోగులు చూసేవాడు’ మొదలైన అర్థాలతో ఇప్పుడు ‘నాథుడు’ను వాడుతున్నారు. -
జాతీయాలు
పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం! అన్ని సందర్భాలకూ ఒకే రకమైన పరిష్కారాన్ని ఆలోచించే వ్యక్తుల విషయంలో ఉపయోగించే మాట ఇది. మంత్రం అంటే మననం చేయడం వలన రక్షించేది అని అర్థం. అంత మాత్రాన ఒకే మంత్రం అన్ని సమస్యలకూ పరిష్కారం కాదు. అన్ని సందర్భాలకూ సరిపోదు. ఉదాహరణకు పెళ్లి విషయాన్నే తీసుకుందాం. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో చదివే మంత్రం వేరు, మాంగల్య ధారణ సమయంలో చదివే మంత్రం వేరు. రెండు సందర్భాల్లోనూ ఒకే మంత్రం ఎలా చదువుతారు! అలాగే అధిదైవికం... వరదలు, భూకంపాలు, పిడుగులు మొదలైన ప్రమాదాలు జరిగినప్పుడు మూడుసార్లు శాంతి అని పలుకుతారు. పిడుగు పడినప్పుడు ‘అర్జునా... ఫల్గుణా...’ మంత్రం జపించడం కూడా చూస్తుంటాం. పురోహితులు బియ్యం వంటివి దానం తీసుకునేటప్పుడు స్వస్తి మంత్రం చదువుతూ ఆశీస్సులు పలుకుతారు. అయితే పిడుగు పడినప్పుడూ బియ్యం తీసుకున్నప్పుడూ ఒకే మంత్రం జపిస్తే ఎలా ఉంటుంది? చాలా అసంబద్దంగా ఉంటుంది కదా! అదే విధంగా సమస్య ఏదైనా ఒకలాగే పరిష్కరిద్దామని చూడకూడదు అని చెప్పడమే ఈ జాతీయం ఉద్దేశం. తానా అంటే తందానా! సంగీతం, నృత్యం, నాటకం...ఈ మూడింటి మేలు కలయిక బుర్రకథ. ఇందులో ముగ్గురు ప్రదర్శకులు ఉంటారు. ప్రధాన కథకుడు కథ చెబుతుంటే కుడి, ఎడమ వైపు ఉన్నవారు ‘తందాన తాన’ అని వంత పాడతారు. అందుకే దీన్ని తందాన కథ అని కూడా అంటారు. నిజానికి అతను చెప్పే కథ వాళ్లు వింటారో లేదో కూడా తెలీదు. అతని మాట పూర్తవగానే తందాన తాన అనేస్తారు. సమాజంలో కూడా కొందరు ఎదుటివాళ్లు చెప్పేదాన్ని గుడ్డిగా సమర్థించేస్తారు. ఇలా సొంత అభిప్రాయమనేది లేకుండా పక్షపాతంతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విషయంలో ఈ మాటను వాడుతుంటారు. హంసగానం! హంసల అందచందాల గురించి పురాణాల్లో గొప్పగా వర్ణించారు. ఇవి ఆకాశగంగలో బంగారు తామరలు తింటూ విహరిస్తాయట. నల దమయంతుల వివాహానికి హంస చేసిన రాయబారం గురించి కూడా కవులు అందంగా వర్ణించారు. అందచందాలు, ప్రతిభ ఉన్నప్పటికీ హంస ఎప్పుడూ పాడదట. ఒకవేళ పాడితే... అది చని పోయే ముందేనట! దీంతో ‘చావు’ అనేదానికి ‘హంసగానం’ అనేది ప్రత్యామ్నాయం అయింది. చనిపోయిన తరువాత ‘ఆత్మ’ అనేది... హంస పాడే పాట రూపంలో పరమాత్మలో ఐక్యమై పోతుందనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక విశ్వాసం. అందుకే చనిపోయారు అని చెప్పడానికి ‘హంస లేచింది’ ‘హంసగానం’ అనే మాటలను వాడుతుంటారు. కెరటాల కరణం! లంచాలు తీసుకోవడంలో ఆరి తేరిన అధికారుల విషయంలో వాడే జాతీయం ఇది. ‘‘ఆ ఆఫీసర్ అచ్చంగా కెరటాల కరణం’’ అంటుంటారు. ఈ జాతీయం వెనుక ఒక కథ ఉంది: బ్రిటిష్ రాజ్యంలో ఒక కరణం లంచాల కోసం ప్రజలను తెగ పీడించేవాడట. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చి శిక్షగా ‘ఈ కరణాన్ని ఏదైనా ద్వీపంలో పడేయండి’ అని ఆదేశించింది. అలా అండమాన్ చేరుకున్న కరణంగారు బాధపడుతూనో, పశ్చాత్తాప పడుతూనో కాలం వెళ్లబుచ్చలేదు. సముద్రం ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చుని తెల్లకాగితాల్లో లెక్కలు రాసేవాడట. ‘ఈ రోజు వచ్చిన అలల సంఖ్య... పెద్ద అలల సంఖ్య... చిన్న అలల సంఖ్య... ఒడ్డు వరకూ చేరని అలల సంఖ్య’... ఇలా లెక్కలు రాస్తూ కూర్చునేవాడట. ఒక రోజు ఒక పెద్ద ఓడ ఈయనకు సమీపంలోనే లంగరు వేసింది. కరణం ఆ ఓడ కెప్టెన్ను పిలిచి ‘‘ఈ సముద్రం నీ బాబుగాడిది అనుకున్నావా? ఎవరి అనుమతి తీసుకొని ప్రయాణిస్తున్నావు? ఈ విషయం విక్టోరియా రాణిగారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నీ ఓడ వల్ల ఎన్ని అలలు వచ్చాయో లెక్క కూడా వేశాను’’... ఇలా ఉపన్యాసం దంచి జరిమానా కింద ఆ ఓడ కెప్టెన్ నుంచి డబ్బులు రాబట్టాడట. విషయం ప్రభుత్వానికి తెలిసి ‘ ద్వీపాం తరవాసంలోనూ వీడి బుద్ది మార లేదన్నమాట’ అని తలపట్టుకుందట! -
జాతీయాలు
నందో రాజా భవిష్యతి! ‘‘నువ్వు చెప్పిన విషయం వింటుంటే ఆందోళనగా ఉందోయ్.’’ ‘‘ఇప్పుడే ఆందోళన పడడం ఎందుకు? నందో రాజా భవిష్యతి... భవిష్యత్లో ఏం జరగనుందో ఎవరు చెప్పొచ్చారు?’’ ‘భవిష్యత్లో ఏం జరుగుతుందో మనం ఊహించలేం’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. దీని వెనక కథ ఇది: ఉత్తుంగభుజుడు అనే రాజు కుమారుడు నందుడు. ఉత్తుంగభుజుడు చెడు వ్యసనాలకు లోనై ఒక వేశ్య మాయలో పడిపోతాడు. రాణిని, కుమారుడు నందుడిని చిన్న చూపు చూస్తాడు. రాజులో వచ్చిన మార్పుకు ప్రజలు ఆందోళన పడతారు. ‘‘పాపం... ఆ కుర్రాడి భవిష్యత్ తలచుకుంటే బాధగా ఉంది. ఆ మహాతల్లి యువరాజా వారిని ఏం చేస్తుందో ఏమో’’ అని ఒకరంటే... ‘‘యువరాజా వారి భవిష్యత్ గురించి ఇప్పుడు ఆందోళన చెందడం ఎందుకు? కాలం ఎప్పుడూ ఒకే తీరులో ఉండదు. రాజావారు చెడు వ్యసనాల నుంచి బయటపడవచ్చు. ఎప్పటిలాగే రాణిని, కుమారుడిని ప్రేమగా చూసుకోవచ్చు’’ అని ఒకరు ఆశావహదృక్పథంతో అనేవారు. నందుడి భవిష్యత్ గురించి ఆలోచన, ఆందోళన కాస్తా నందో రాజా భవిష్యతి అయ్యింది! జిల్లేడు పెళ్లి! ‘‘అదో పెళ్లంటావా? ఉత్త జిల్లేడు పెళ్లి.’’ ‘‘నువ్వు చేసుకుంది పెళ్లి కాదు జిల్లేడు పెళ్లి’’... ఇలాంటి మాటలు అసహనంతోనో, ఆగ్రహంతోనో వినిపిస్తుంటాయి. ఉత్తుత్తి పెళ్లి, దొంగపెళ్లి, ఎవరూ గుర్తించని పెళ్లిని జిల్లేడు పెళ్లి అంటారు. అసలీ మాట ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే... పూర్వం ఇద్దరు భార్యలు చనిపోయిన వ్యక్తి మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటే అతనికి మొదట జిల్లేడు పెళ్లి చేసేవారు. అంటే... ‘మూడు’ అనేది అంత మంచిది కాదన్న ఉద్దేశంతో జిల్లేడు చెట్టుకు తాళి కట్టించేవారు. దీంతో వరుడు చేసుకునే మూడో పెళ్లి కాస్త... నాలుగో పెళ్లి అయ్యేది. ఈ వ్యవహారం నుంచి పుట్టిందే... జిల్లేడు పెళ్లి! గ్రంథసాంగుడు! గ్రంథసాంగుడుకు నిజమైన అర్థం ఒక పుస్తకాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు అని. గ్రంథం అంటే పుస్తకం. సాంగం అంటే... భాగాలతో కూడిన అని అర్థం. ఒక పుస్తకంలో భిన్నమైన భాగాలన్నింటినీ అధ్యయనం చేసినవాడు గ్రంథసాంగుడు. అయితే వ్యవహారికంలో గ్రంథ అధ్యయనంలో నిష్ణాతుడు అని కాకుండా... మోసం, రసికత్వం మొదలైన వాటిలో ఆరితేరిన వారిని ‘గ్రంథ సాంగుడు’ అనడం మొదలైంది. తాపత్రయం ‘‘ఇంత తాపత్రయం’’ అవసరమా? ‘‘ఈయన తాపత్రయానికి అంతు లేదు’’... ఇలా తాపత్రయం అన్న పదాన్ని నిత్యజీవితంలో పదే పదే వింటూ ఉంటాం. అసలీ పదానికి అర్థం ఏమిటో తెలుసా? ‘అధిక ఆశ’, ‘అధికమైన ఆరాటం’ అనే అర్థాలతో ఈ మాటను వాడుతున్నప్పటికీ... నిజానికి తాపత్రయం అంటే లేని బాధలను కొనితెచ్చిపెట్టుకొని బాధపడడం. ఈ తాపత్రయంలో మూడు రకాలు ఉంటాయి. తన శరీరానికి కలిగిన బాధను తలచుకొని బాధ పడడం... ఆధ్యాత్మిక తాపం. తన కుటుంబానికి, స్నేహితులకు వచ్చిన కష్టాలను తలచుకొని బాధపడడం... అధి భౌతిక తాపం. ప్రకృతి వైపరీత్యాలను తలచుకొని బాధపడడం అధిదైవిక తాపం. ఈ మూడు తాపత్రయాల గురించి ఆలోచిస్తూ విచారపడడాన్ని తాపత్రయ పడడం అంటారు. బాధలు కాని వాటిని బాధలుగా అనుకుని బాధపడడం అన్నమాట. -
జాతీయాలు
ఇప్పటిదా అప్పటిదా... ఇక్ష్వాకుళ కాలం నాటిది! చాలా పాత విషయం, చాలా పాత వస్తువు, వయసు పైబడిన వ్యక్తులు... ఇలాంటి విషయాలలో ఈ జాతీయాన్ని ఉపయోగించడం చూస్తుంటాం. ‘ఇది నిన్న మొన్నటి వస్తువు కాదు... ఇక్ష్వాకుల కాలం నాటిది’... ‘అదేదో నిన్నగాక మొన్న జరిగిన విషయం అన్నట్లు చెబుతావేం? ఇక్ష్వాకుల కాలం నాటిది’ ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. అసలా మాట ఎలా వచ్చింది? వైవశ్వతుడు-శ్రద్ధాదేవి దంపతులకు కలిగిన తొమ్మిది మంది సంతానంలో ఇక్ష్వాకుడు పెద్దవాడు. శ్రీరాముడి వంశానికి ఇతడే మూల పురుషుడు. ఇక్ష్వాక రాజు ఎప్పటి వ్యక్తో కాబట్టి... ‘చాలా పాత’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. మర్కట ముష్టి! ఈ జాతీయాన్ని రక రకాలుగా ఉపయోగిస్తారు. ‘చాలా మొండి మనిషి. పట్టిందే పట్టు. మర్కట ముష్టి!’ ‘నువ్వు ఆయనకు దానధర్మాల గొప్పదనం గురించి ఎంతసేపు చెప్పినా ఆయన మనసు మారదు. అది మర్కట ముష్టి. ఒక్క గింజ కూడా రాలి పడదు!’ ఒక విషయం మీద చాలా పట్టుదలగా, మొండిగా వ్యవహరించే వారి విషయంలోనే కాదు... ‘నేను సంపాదించిన దాంట్లో ఒక్క చిల్లిగవ్వను కూడా ఇతరులకు ఇవ్వను’ అనుకునే పరమ పిసినారుల విషయంలో కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. మర్కటం అంటే కోతి. ముష్టి అంటే పిడికిలి. కోతి తన పిడికిట్లో ఏదైనా పట్టుకుంటే పొరపాటున కూడా వదలదు. దాన్ని ఎంత బతిమిలాడితే అంతగా పట్టు బిగిస్తుంది. బెదిరిస్తే తిరిగి మనల్నే బెదిరిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే... కోతి పిడికిలి బిగించిందంటే, ఆ పిడికిలిని తెరిపించడం చాలా కష్టమైన పని. అందుకే పట్టుదలకు, పీనాసితనానికి ఆ మాట స్థిరమై ఉండిపోయింది. ఏమైంది... నలభై అయింది! ‘ఇంతకీ విషయం ఏమైంది?’ ‘ఏమవుతుంది? సరిగ్గా నలభై అయింది!’ ‘ఏ పని చేసినా విజయం సాధించాలి... నలభై సాధించడం కాదు’... ఇలాంటి మాటలు మన వాడుకలో ఉన్నాయి. ఇక్కడ ‘నలభై’ అనేది కేవలం సంఖ్య కాదు... పరాజయం, పరాభవానికి ప్రతీక. అలా ఎలా అవుతుంది? అసలు నలభైకీ పరాజయానికీ ఉన్న లింక్ ఏమిటి? ఏమిటంటే, మనకున్న తెలుగు సంవత్సరాల పేర్లలో నలభయ్యవది... పరాభవ. అందుకే అపజయం, పరాభవం, అవమానం వంటి విషయాలకు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఇదిగో గుర్రం అదిగో మైదానం! ఒక వస్తువు నాణ్యత, శక్తి గురించి అప్పటికప్పుడు తేల్చుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఈ మాటను వాడుతారు. ‘‘నాణ్యత గురించి ఎలాంటి సందేహం అక్కర్లేదు... ఇదిగో గుర్రం అదిగో మైదానంలా ఎలాంటీ పరీక్ష అయినా చేసుకోవచ్చు.’’ ‘‘ఈ గుర్రంలో చేవ ఉందా?’’ అనే ప్రశ్నకు- ‘‘చాలా ఉంది. భేషుగ్గా ఉంది’’ లాంటి మాటలు సృంతృప్తిని ఇవ్వవచ్చును గానీ... ఎక్కడో ఒక మూల చిన్న సందేహమేదో కదలాడుతూనే ఉంటుంది, ‘అతను చెప్పింది నిజమేనా?’ అని. మాటలు కాదు... చేతలు ముఖ్యమను కున్నప్పుడు... పరీక్ష మాత్రమే సంపూర్ణ సంతృప్తిని ఇస్తుంది. గుర్రంలో ఉన్న చేవను తెలుసుకోవడానికి మైదానంలో ఒక్కసారి సవారీ చేస్తే సరిపోతుంది కదా! -
మన జాతీయాలు
ఐదు పది అవుతుంది! యుద్ధంలో గెలవాలంటే యుద్ధం చేయాలనే ఉత్సాహం ఉండగానే సరిపోదు. తమ శక్తి సామర్థ్యాల మీద తగిన అవగాహన ఉండాలి. లేకపోతే పలాయనం చిత్తగించాల్సి ఉంటుంది! రెండు చేతులూ ఒకచోట జోడించి సమస్కరిస్తూ ఓటమిని ఒప్పుకోవడం అనేది చాలాసార్లు చూస్తూ ఉంటాం. దీన్నించి పుట్టిందే ఈ జాతీయం. ప్రతి చేతికీ ఐదేసి వేళ్లు ఉంటాయి. రెండు చేతులూ దగ్గరకు వచ్చినప్పుడు అయిదూ అయిదూ కలిసి పది వేళ్లవుతాయి. ఓటమిని అంగీకరిస్తూ నమస్కరించినప్పుడు ఐదు వేళ్లు పది అవుతాయి కాబట్టి ఈ మాట పుట్టింది. అందుకే ఎవరితోనైనా పోరాడితే ఓడిపోతావ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ‘వాడితో పెట్టుకోకు... అయిదు పది అవుతుంది’ అని అంటూ ఉంటారన్న మాట! శ్రీరంగం రోకలి! ‘ఆ పని నెత్తి మీద వేసుకున్నావా? ఇక నీ పని శ్రీరంగం రోకలే!’ ‘అతని దగ్గరికి వెళ్లకయ్యా బాబూ... అతనసలే శ్రీరంగం రోకలి!’ వివిధ సందర్భాల్లో వినిపించే మాటలివి. శ్రీరంగం అంటే తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం. దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అంత మందికి ప్రసాదం అందించడం ఆషామాషీ విషయం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే కొందరు భక్తులు స్వచ్ఛందంగా ఈ శ్రమలో పాలుపంచుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో... ఒక వ్యక్తి రోకలి వేస్తున్నాడనుకోండి... అలిసిపోయాను అని ఉన్నపళంగా ఆ పని నుంచి తప్పుకోవడానికి లేదు. అలా చేస్తే పాపం. అందుకే వేరే భక్తుడు వచ్చి ఆ రోకలిని చేతిలో తీసుకునేవరకు దంచుతూ ఉండాలి. వేరే భక్తుడు వస్తే అదృష్టం. రాకపోతే మాత్రం శ్రమ పడక తప్పదు. దీని నుంచి పుట్టిందే ‘శ్రీరంగం రోకలి’ జాతీయం. దురదృష్టవశాత్తూ ఒక పని ఎంతకీ తరగకుండా ఉన్నప్పుడు గానీ, ఎవరైనా విసిగిస్తూ ఒక పట్టాన వదలనప్పుడు గానీ ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. చిటికెల పందిరి! కొందరు మాటలతో కోటలు కడతారు. కోతలతో రాజ్యాలు నిర్మిస్తారు. అలాంటి వారి విషయంలో ఉపయోగించే జాతీయం ఇది. పందిరి వేయడం అంటే ఇల్లు కట్టడానికి పడేంత కష్టం ఉండక పోవచ్చు గానీ... అస్సలు కష్టపడకుండా అయిపోయే పని మాత్రం కాదది. గుంజల కోసం గుంటలు తీయాలి, వాసాలు కట్టాలి. ఇంకా ఇలాంటి ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు చిటికెల పందిరి వేస్తుంటారు. అంటే పందిరి వేసేవాడు ఎలా ఉన్నా, వీళ్లు పక్కన ఉండి అలా వేసేస్తా, ఇలా వేసేస్తా అంటూ చిటికెలు వేసి మరీ చిటికెలో చేస్తానని గొప్పలు పోతుంటారు. అందుకే ఇలా పని చేయకుండా కబుర్లు మాత్రం చెప్పే వాళ్ల మీద ‘చిటికెల పందిరి’ వేసేస్తాడు అంటూ సెటైర్లు వేస్తుంటారు. తద్దినం పెట్టేవాడి తమ్ముడు! ‘నీకేమయ్యా... తద్దినం పెట్టేవాడి తమ్ముడిలా కూల్గా ఉంటావు. సమస్యంతా మాకే’ అన్న మాట ఎప్పుడైనా విన్నారా? పురోహితుడు తద్దిన మంత్రాలు చదువుతున్నప్పుడు అన్నదమ్ములందరూ ఒకచోట కూర్చుంటారు. అయితే వారిలో పెద్దవాడు మాత్రమే పురోహితుడు చెప్పిన పనులు చేస్తుంటాడు. తమ్ముళ్లు మాత్రం ఇవేమీ చేయకుండా జంధ్యాన్ని ఎడమ భుజం నుంచి కుడికి మార్చుకోవడం మాత్రం చేస్తారు. అంటే ముఖ్యమైన పనంతా చేసేది పెద్దవాడేనన్నమాట. ఈ కార్యం నుంచి పుట్టిందే ‘తద్దినం పెట్టే వాడి తమ్ముడు’ జాతీయం. ఇతరులతో పోల్చితే ఎవరైనా చాలా తక్కువ శ్రమ చేస్తున్నప్పుడు, బాధ్యతలు తక్కువగా ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. -
మన జాతీయాలు
ససేమిరా! పూర్వం ఒక రాకుమారుడు అడవికి వెళ్లాడట. అక్కడ పులిని చూసి భయపడి చెట్టు ఎక్కాడట. అప్పటికే ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటి ఉంది. ‘రాకుమారా... నీవేమీ భయపడకు’ అని ధైర్యం చెప్పింది. మరోవైపు చెట్టుకింద ఉన్న పులి... రాకుమారుడికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘నువ్వు ఆ ఎలుగుబంటిని కిందికి తోసేయ్. నిన్నేమీ చేయను’ అంది పులి. ఇదేదో బాగుందే అనుకొని రాకుమారుడు ఎలుగుబంటిని కిందికి తోసేశాడట. దాని అదృష్టం బాగుండి, చెట్టు కొమ్మలను పట్టుకొని కింద పడకుండా ఉండిపోయింది. ‘కృతజ్ఞత లేని మనిషీ... ఈ క్షణం నుంచి నువ్వు గతమంతా మరిచి పోతావు’ అని శపించింది ఎలుగుబంటి. రాకుమారుడి అదృష్టం బాగుండి రెండో రోజే సైనికులు అతడి ఆచూకిని కనుక్కుని కోటకు తీసుకువెళ్లారు. శాప ప్రభావంతో అన్నీ మర్చిపోయిన ఆ వ్యక్తికి తన ఊత పదమైన ‘ససేమిరా’ ఒక్కటే గుర్తుంది. ‘నీవెవరు?’ అని అడిగితే ‘ససేమిరా’ అనేవాడు. ‘మీ తండ్రిగారి పేరేమిటి’ అంటే ‘ససేమిరా’ అనేవాడు. దాంతో కోపం వచ్చిన మంత్రి... ‘రాకుమారా... మూర్ఖంగా ప్రవర్తించకు. అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పు’ అంటే... దానికీ ‘ససేమిరా’ అనే అనేవాడు. ఈ రాకుమారుడి జ్ఞాపకశక్తి ఎలా వచ్చింది అన్న విషయం పక్కనపెడితే... అది తర్వాత అందరికీ ఊతపదమైంది. తమకు నచ్చనిది చెప్పినప్పుడు ససేమిరా అనడం, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అని చెప్పాల్సి వచ్చినప్పుడూ ససేమిరా అనడం అందరికీ అలవాటయ్యింది. కోడిగుడ్డు తంటసం! ఏ పని చేసినా దానికి ప్రయోజనం ఉండాలి. అప్పుడే కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. కాలం, శ్రమ... ఈ రెండూ విలువైనవి. వాటి విలువ పని చేసే క్రమంలో మరింతగా పెరుగుతుంది. పస లేని పనులు, అప్రయోజకమైన పనులు ఎంచుకున్నప్పుడు... ఈ రెండూ వృథా అయిపోయి, మన ఖాతాలో ‘అవివేకం’ మాత్రమే మిగిలిపోతుంది. అందుకే పనులు చేయడం ఎంత ముఖ్యమో, పనులు ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆ విషయాన్ని చెప్పేదే ఈ జాతీయం! ‘కోడిగుడ్డు తంటసంలాంటి పనులు చేయవద్దు’, ‘నేను మొదటి నుంచీ చెబుతున్నాను. మీరు చేసే పని కోడిగుడ్డు తంటసం అని!’.... ఇలాంటి మాటలు నిత్యజీవితంలో వినిపిస్తుంటాయి. ‘తంటసం’ అంటే వెంట్రుకలను లాగే పరికరం. మరి కోడిగుడ్డుకు తంటసం ఎందుకు? దాని మీద ఒక్క వెంట్రుకైనా ఉండదు కదా! ఇది మన అవగాహన. కానీ వెనకటికెవరో ‘ప్రయత్నిస్తే ఎందుకు ఉండదు!’ అని మొండిగా వాదించాడట. గుడ్డు మీద లేని వెంట్రుకలను లాగడానికి తెగ ప్రయత్నించి తీవ్రంగా నవ్వుల పాలయ్యాడట! తెలివి తక్కువ పనులు, పనికిరాని పనులు, ఆశ శృతి మించి చేసే పనుల విషయంలో ఉపయోగించే జాతీయం ఇది. మిట్ట పెత్తనం! ‘ఊరకే అరవడం తప్ప పనేమీ చేయడు... అంతా మిట్ట పెత్తనం’... ‘నువ్వు చేయాల్సింది మిట్ట పెత్తనం కాదు... నలుగురితో కలిసి కష్టించడం’... ఇలాంటి మాటలు తరచూ వింటూ ఉంటాం. పని చేయకుండా హడావుడి చేసేవారి విషయంలో ఉపయోగించే మాట ఇది. పూర్వం పొలాల్లో మిట్ట (ఎత్తయిన ప్రదేశం) మీద కూర్చొని అది చెయ్, ఇది చెయ్, అలా చెయ్, ఇలా చెయ్ అని చెప్ప డానికి ఒక వ్యక్తి ఉండేవాడు. ఎండలో రెక్కలు ముక్కలు చేసుకునేవారి కంటే ఇతడి పని సుఖంగా ఉండేది. వాళ్లను చూసే ఈ మాట పుట్టింది! చిలక చదువు! ‘చదువుకున్నాడన్న మాటేగానీ... అంతా చిలక చదువు’ అంటుంటారు కొందరు. అంటే అర్థం ఏమిటి? చదువు అనేది ‘ఇంతవరకే’ ‘ఇక్కడి వరకే’ అని ఉండదు. అదొక తీరని జ్ఞానదాహం. కొందరు మాత్రం కొంత చదువుకొని ‘ఇక తమకు అంతా వచ్చేసింది’ అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సామాజిక స్థితిగతులు, ధోరణులు వేటి గురించీ అవగాహన ఉండదు. నేర్చుకున్న దానికంటే ఒక్క అక్షరం ముక్క కూడా ఎక్కువ తెలియదు వీరికి. చిలకకు చదువు చెబితే, మనం ఎక్కడి వరకు చెబితే అక్కడి వరకే నేర్చుకుంటుంది. మరింత నేర్చుకోవాలనే ఆసక్తి దానికేమీ ఉండదు. నేర్చుకున్న దాని కంటే ఎక్కువ తెలివినీ ఉపయోగించదు. కొందరు మనుషులు కూడా అంతే అని చెప్పడమే ఈ జాతీయం ఉద్దేశం. -
మన జాతీయాలు
లొట్టాభట్టీయం మనుషుల్లో చేతల మనుషులు, మాటల మనుషులు అని రెండు రకాలు. చేతల మనుషులు... తాము చేయదలిచిన పనిని ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా చేసేస్తారు. మాట మీద నిలబడతారు. అతిగా మాట్లాడరు. గొప్పలకు పోరు. అసాధ్యమైన పనిని సైతం ‘నేను చేస్తాను చూడు’ అని డంబాలు పలుకరు. ఇక మాటల మనుషుల తీరు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఈ కోవకు చెందినవాళ్లు మాటలకు తప్ప చేతలకు ప్రాధాన్యత ఇవ్వరు. పని విషయంలో సాధ్యాసాధ్యాల గురించి విశ్లేషించడం కూడా కనిపించదు. ఏ పని అయినా సరే- ‘‘అదొక లెక్కా... నేను చేసేస్తాను’’ అంటారు. తీరా పనిచేయాల్సి వచ్చేసరికి సాకులు వెదుక్కొని తప్పించుకుంటారు. ఇలాంటి వాళ్లు ఎంతోమంది మనకు నిత్యజీవితంలోనూ తారస పడుతుంటారు. ఈ కోవకు చెందిన వాడే లొట్టాభట్టు. ఈ భట్టుగారు నోరి విప్పితే చాలు... కోతలే కోతలు. ‘ఆకాశంలో చుక్కలు కావాలి’ అని అడిగితే - ‘అదెంత పని’ అనేవాడట వినేవాళ్లు నమ్మేలా. దేనినీ చాతకాదు అనడం ఈయనకు చాత కాదు. ఏదైనా చేసేస్తాను అనడమే ఈయనగారికి వచ్చు. నిజంగా వచ్చా అంటే సమాధానం శూన్యం. అందుకే కోతలు కోయడం, గొప్పలు చెప్పుకోడం లాంటి వాటికి లొట్టాభట్టు పేరు పర్యాయపదం అయిపోయింది. అందుకే ఎవరైనా సాధ్యం కాని పనులను సాధ్యం చేస్తామని చెప్పినా, కోతలు కోసినా - ‘‘ఆయన చెప్పింది నమ్మేవు సుమీ... అదొక లొట్టాభట్టీయం’ అంటుంటారు. దింపుడు కళ్లం ఆశ మనిషిని బతికించేది ఆశ అంటారు. చనిపోయిన మనిషి మళ్లీ బతుకుతాడు అనుకోవడం కూడా ఆశే. కాకపోతే అది తీరే ఆశ కాదు. అయినా కూడా తీరుతుందేమో నని ఆచరించేదే దింపుడు కళ్లం. చనిపోయిన వ్యక్తిని శ్మశానం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్తూ, మధ్యలో ఒకచోట శవాన్ని కిందికి దింపి, చెవిలో మూడుసార్లు పేరు పెట్టి పిలుస్తారు. ప్రాణం మిగిలుంటే లేస్తారని ఆ ప్రయత్నం. దీన్ని దింపుడు కళ్లం ఆశ అంటారు. కళ్లం అంటే ప్రదేశం అని అర్థం. గతంలో ఎప్పుడో, చనిపోయాడని నిర్ధారించుకున్న ఓ వ్యక్తి, నిప్పు పెట్టే ముందు చితిమీది నుంచి లేచి కూర్చు న్నాడట. అదెంతవరకూ నిజమో తెలి యదు కానీ, ఆచార వ్యవహారాల ప్రకారం దింపుడు కళ్లం ఆశకు ఎలాంటి అర్థం ఉన్నా, ఒక చిట్టచివరి ఆశ అన్న భావన వచ్చింది. ఒక పని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగ దని తెలిసినా, మనసులో ఏదో మూల చిన్న ఆశ ఉంటుంది. ఆ ఆశ గురించి చెప్పేటప్పుడు ఈ మాటను వాడతారు. చుట్టమై వచ్చి దెయ్యమై పట్టి! పనులు చక్కబెట్టుకోవడానికి లేదా తమ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది ఆత్మీయత, స్నేహం, బంధుత్వం అనే ఆయుధాలను వాడుతుంటారు. ఒక పని నెరవేర్చుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది, ఎవరి ద్వారా ఎలాంటి లాభాలు పొందవచ్చు అని కనుక్కొని జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. వారితో వ్యూహాత్మకంగా స్నేహమో, బంధుత్వమో కొని తెచ్చుకుంటారు. వీరి నట ఆత్మీయతను చూసి అవతలి వాళ్లు సులభంగా బుట్టలో పడి పోతారు. కాల క్రమంలో ఈ ఆత్మీయులు కాస్తా గుదిబండల్లా తయారవుతారు. దాంతో వీరిని వదిలించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటి వారి విషయంలో వాడే జాతీయం ఇది. ‘‘అలాంటివాడిని ఎందుకు నమ్మావు?’’ అని అడిగితే- ‘‘ఏం చేస్తాం మరి... చుట్టమై వచ్చి దెయ్యమై పట్టాడు’’ అంటారు. ఈగెంతా పేగెంతా! కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలంటారు. వియ్యం సంగతి సరే, కయ్యంలో మాత్రం తరచుగా వినిపించే మాట ఇది. సంపద, జ్ఞానం, వయసు మొదలైన విషయాల్లో పోల్చి చూసే సందర్భాల్లో వాడే జాతీయం ఇది. ‘‘నువ్వెంత, నీ స్థాయి ఎంత? నీ మాటలను నేను లెక్కలోకి తీసుకోను. ఈగెంతా పేగెంతా’ అంటుంటారు. ఈగ అంటేనే చిన్న జీవి. ఇక దాని పేగు ఎంత ఉంటుంది! మరీ చిన్నగా ఉండదూ! తక్కువలో తక్కువ, అల్పంలో అల్పం అని చెప్పడానికి ‘ఈగ’ను ప్రతీకగా వాడుకొని ఇలా చెబుతుంటారన్నమాట. -
మన జాతీయాలు
చేతి చమురు భాగవతం! పూర్వపు రోజుల్లో వీధుల్లో భాగవతం ఆడేవారు. అందులోని వివిధ ఘట్టాలు ప్రేక్షకులను కట్టిపడేసేవి. పోను పోను ఏ నాటకం ఆడినా ‘వీధి భాగవతం ఆడుతున్నారు’ అనడం పరిపాటయింది. ఈ సంగతి ఎలా ఉన్నా... ఆ కాలంలో ఇప్పటిలా సౌకర్యాలేం లేవు కాబట్టి, స్టేజీ వేయడం నుంచి పెద్ద పెద్ద దీపాలు వెలిగించడం వరకు చాలానే కష్టపడాల్సి వచ్చేది. నాటకం జరుగున్నంత సేపూ దీపాలు వెలిగించడానికి అయ్యే చమురు ఖర్చు కూడా ఎక్కువగానే ఉండేది. అయితే నాటకానికి మంచి స్పందన వచ్చినప్పుడు... నటులకు చదివింపులు ఘనంగా ఉండేవి. నటులను సంతోష పెట్టడానికి ఊరివాళ్లు పోటీ పడి రకరకాల కానుకలు సమర్పించే వాళ్లు. అలా అని అన్ని సందర్భాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండేది కాదు. కొన్నిసార్లు నాటకం ప్రేక్షకులకు నచ్చేది కాదు. ఒకవేళ నచ్చినా ఆ నచ్చడం అనేది ప్రశంసలకు మాత్రమే పరిమితమయ్యేది. మరికొన్నిసార్లు భారీ వర్షం వచ్చి నాటకం మధ్యలోనే ఆగిపోవడం లాంటివి జరిగేవి. దీంతో నిర్వాహకులు, నటులు ‘చమురుకు పెట్టిన డబ్బులు కూడా రాలేదు’ అని నిరాశ పడేవారు. పెట్టిన ఖర్చును చూసి బాధపడేవారు. అప్పటి నుంచి... వృథా ఖర్చు చేసి నష్టపోయిన సందర్భాల్లో ‘చేతి చమురు భాగవతం’ అనడం మామూలు అయిపోయింది. నిమ్మకాయ వాటం! అర చేతిలో గుమ్మడికాయ పడుతుందా? పట్టదు గాక పట్టదు. మరి నిమ్మకాయ? చాలా ఈజీగా పట్టేస్తుంది. పనుల్లో కూడా చేయదగినవి, చేయలేనివి, కష్టమైనవి, సులువైనవి ఉంటాయి. ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ‘‘వాడికా పని కష్టమేం కాదు... నిమ్మకాయ వాటం’’ అంటారు. అంటే నిమ్మకాయ చేతిలో పట్టినంత తేలిగ్గా అతడు ఆ పని చేసి పారేస్తాడు అని. అలాగే ఆత్మవిశ్వాసం గురించి చెప్పేటప్పుడు... ‘‘చేయలేను అనడం వాడికి చేతకాదు. వాడిదంతా నిమ్మకాయ వాటం’’ అంటుంటారు. ఉమ్మాయ్ జగ్గాయ్! ‘‘వారి ప్రాణస్నేహాన్ని చూస్తే చూడముచ్చటగా ఉందనుకో’’ అంటాడో వ్యక్తి. ‘‘ప్రాణస్నేహమా పాడా! వాళ్లది ఉమ్మాయ్ జగ్గాయ్ స్నేహం’’ అంటాడు రెండో వ్యక్తి. అంటే అర్థం ఏమిటి? స్నేహం అంటే కలకాలం కలిసి ఉండడం, ఒకరి కోసం మరొకరు ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడడం. కొన్ని స్నేహాలు అలాగే కనిపిస్తాయి. తీరా లోతుల్లోకి వెళితే... అది ‘కాలపరిమితి’తో కూడిన స్నేహం అని అర్థమవుతుంది. కొందరు ఏదైనా నిర్దిష్టమైన పని కోసం స్నేహితులవుతారు. ఆ సమయంలో వారిని చూస్తే- ‘ఆహా! ఎంత బాగా కలిసిపోయారో!’ అనిపిస్తుంది. కానీ వాళ్లు పని పూర్తయ్యాక ఎవరి దారి వారు చూసుకుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి వాడేదే ఈ జాతీయం! ఉమామహేశ్వరుడు, జగన్నాథుడు పేర్ల నుంచి ‘ఉమ్మాయ్’, ‘జగ్గాయ్’ పుట్టుకొచ్చాయి. పురాణాల్లో శివుడు, విష్ణువు... రాక్షసుల పని పట్టడానికి ఏకమవుతారు. పని పూర్తయ్యాక ఎవరి పనిలో వారి పడిపోతారు. అందుకే వారి పేర్ల నుంచి ఈ జాతీయం పుట్టిందంటారు. ఇప్ప పూల వాసన! కొన్ని విషయాలు రహస్యంగా ఉండిపోవు. పైగా కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ప్రతిభ కూడా అంతే. దాచాలని ప్రయత్నించినా, అడ్డుకోవాలనుకున్నా అది ఆగదు. పూల వాసన దాస్తే దాగేది కాదు. ఇప్ప పూల వాసననైతే అస్సలు ఆపలేం. ఆ పూల నుంచి ఘాటైన, మత్తయిన వాసన వస్తుంది. అది చాలా మేరకు విస్తరిస్తుంది. దానినెలాగైతే ఆపలేమో... ఒక వ్యక్తిలో ఉన్న ప్రతిభను కూడా వెలికి రాకుండా ఆపలేం అని చెప్పడమే ఈ జాతీయం ఉద్దేశం. కేవలం ప్రతిభ అనే కాదు... దాగని రహస్యం విషయంలోనూ ఈ ‘ఇప్ప పూల వాసన’ జాతీయాన్ని వాడుతుంటారు. ‘ఈ రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేం, అది ఇప్ప పూల వాసనలాంటిది’ అంటారు.