నాంచారమ్మ వంట!
వెనకటికి నాంచారమ్మ అనే పెద్దవ్వ ఉండేదట. ఇంటికి వచ్చిన అతిథులను ఘనంగా ఆదరించేదట.
అయినా సరే, ఆమె ఇంటికి వెళ్లడానికి అతిథులు వెనకా ముందు ఆలోచించేవారట.
దీనికి కారణం... వంట పేరుతో ఆమె విపరీతమైన జాప్యం చేయడం.
‘ఇదిగో అయింది’
‘అదిగో అయింది’ అంటూ ఆలస్యం చేసేదట.
పొద్దున వచ్చిన అతిథి భోజనం చేయడానికి ఏ అర్ధరాత్రో పట్టేదట!
ఆమె ఉద్దేశపూర్వకంగానే అలా చేస్తుందా, వంటను బా....గా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తుందా అనేది ఎవరికి తెలియదుగానీ...‘నాంచరమ్మ వంట’ అంటే జనాలు భయపడే స్థితికి చేరుకున్నారు.
ఏదైనా విషయం ఎటూ తేల్చకపోతే, పనిలో అకారణ జాప్యం జరిగితే ‘నాంచారమ్మ వంట’తో పోల్చడం పరిపాటిగా మారింది.
చుట్టాల సురభి
కొందరు... చుట్టాలు అనే మాట వినగానే వెనక్కి చూడకుండా పారిపోతారు.
కొందరికి చుట్టాలు అంటే వల్లమాలిన ప్రేమ.
తమ తాహతుకు మించి ఇంటికొచ్చిన చుట్టాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. దీని వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే... తమ వైఖరి మార్చుకోరు. ఇలాంటి వ్యక్తులను ‘చుట్టాల సురభి’తో పోల్చుతుంటారు.
‘ఇంటి కొచ్చిన చుట్టానికి ఏ లోటూ రానివ్వడు. ఆయన చుట్టాల సురభి’ అంటారు.
క్షీర సాగర మథనంలో జన్మించిన దేవధేనువు కామధేనువు. ఈ కామధేనువు కోరిన కోరికలన్నీ తీరుస్తుందని ప్రసిద్ధి. అలాగే ఇంటికి వచ్చిన చుట్టం అడిగినా, అడగకపోయినా... వారి కోరికలు తీర్చేవారిని చుట్టాల సురభి అంటారు.
పయోముఖ విషకుంభం!
కొందరు చూడడానికి అమాయకంగా కనిపిస్తారు. కానీ చేయాల్సినంత చెడు చేస్తారు. ఇలాంటి వారిని ఉద్దేశించి ఉపయోగించే జాతీయం ‘పయోముఖ విషకుంభం’
విషం నిండిన కుండ (కుంభం)పై ముఖం(పై భాగం)లో పయస్సు (పాలు) ఉంచితే అదే పయోముఖవిషకుంభం.
స్థూలంగా చెప్పాలంటే...
చూడడానికి ఒక రకంగా, చేతల్లో ఒక రకంగా కనిపించే
వ్యక్తులను ‘పయోముఖ విషకుంభం’తో పోల్చుతారు.
కాకతాళీయం!
అనుకోకుండా రెండు సంఘటనలు ఒకే సమయంలో జరిగితే ఉపయోగించే మాట... కాకతాళీయం!
తాళవృక్షం (తాడి చెట్టు) మీద కాకము(కాకి) వాలిన క్షణమే... తాళఫలం (తాటిపండు) నేలరాలింది... ఇదే కాకతాళీయం.
పై సంఘటనలో కాకి తాడిచెట్టు మీద వాలడానికి, తాడిపండు నేలరాలడానికి ఎలాంటి సంబంధం లేదు.
తాడిచెట్టు మీద కాకి వాలడం వల్లే, తాటిపండు నేలరాలింది అనడం తప్పు అవుతుంది.
చెట్టుపై కాకి వాలడం, తాటిపండు నేలరాలడం అనేవి పూర్తిగా యాదృచ్ఛికం అని చెప్పడమే కాకతాళీయం!
జాతీయాలు
Published Sat, Aug 20 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
Advertisement
Advertisement