Crow
-
ఓటు ఎవరికి అంటే.. కాకే మన ఆదర్శం!
‘‘కాకిని ఆదర్శంగా తీసుకుంటే ఓటును సరిగా వేయొచ్చు’’ అంటూ విలక్షణంగా సెలవిచ్చారు స్వామి ఎలక్షనానంద అలియాస్ స్వామి సలక్షణానంద. ‘‘అదెలా స్వామీ?’’ అయోమయంగా అడిగాడు శిష్యుడు. ‘‘కథల్లో కాకుల్నీ, కాకమ్మ కథల్నీ గుర్తు పెట్టుకుంటే ఓటు వేయడంలో పొరబాట్లు జరగవు. చెబుతా విను’’ అంటూ తన స్టేట్మెంట్ను పునరుద్ఘాటిస్తూ, దానికి తగిన దాఖలా కూడా ఇచ్చారు స్వామీజీ. ‘‘అనగనగా ఓ కాకి. అదెంతో కష్టపడి ఓ మాంసం ముక్కను సంపాయించుకుంది. పక్షి ప్రపంచంలో కాకి పిల్లే కాకుండా..కాకి తిండీ కాకికి ముద్దే. దాని భోజనం దానికి పవిత్రమే కదా..అచ్చం మనలోకంలో మన ఓటులాగే.కాకి నోటనున్న మాంసం ముక్కను చూసి, నక్కకు నోరూరింది. అది చెట్టుకిందికి వచ్చి. ‘‘కాకి బావా... కాకి బావా... గానగంధర్వులంటూ మనుషులేవో తప్పుడు కూతలు కూస్తూ ఉంటారుగానీ..పాటంటే అసలు నీదే కదా. పక్షుల్లో పి.సుశీల నువ్వే కదా’’ అని పొగుడుతుంది. ఆ పొగడ్తలకు పరవశించిన కాకి గొంతెత్తి పాడుతుంది. అంతే..కాకి నోటనున్న నల్లి బొక్క సహిత మాంసం ముక్క కాస్తా నక్కకు దక్కుతుంది. కాకి తెలివైనదే. కానీ ఎవరి తెలివితేటలైనా అవి ఒక రంగానికే పరిమితం. కాకికి కాస్త సైన్సుతోపాటు బోలెడంత యుక్తి కూడా తెలుసు. కాకి యుక్తిని తెలిపే కథ మరొకటుంది. కాకి, జింక, ఎలుక ఈ మూడూ ఫ్రెండ్సు. ‘నన్ను కూడా మీ గ్రూపులో చేర్చుకొమ్మంటుం’ది ఓ నక్క. బోలెడంత డౌటు పడుతూనే, తప్పని పరిస్థితుల్లో దాంతో ఫ్రెండ్షిప్ చేస్తాయి కాకి, జింక, ఎలుక. ఓ పక్క ఫ్రెండ్షిప్ నటిస్తూనే జింకను ఉచ్చులో చిక్కేలా చేస్తుంది నక్క. ‘నక్కబావా.. నక్కబావా ఉచ్చు కొరికి నన్ను విడిపించవా’ అని అడుగుతుంది జింక. ‘‘ఉచ్చును జంతునరంతో చేస్తారు. ఇవాళ్ల శనివారం కదా. నేను నాన్‌వెజ్ ముట్టను. కాస్త వెయిట్ చెయ్. రేపొచ్చి విడిపిస్తానం’’టూ వేటగాడొచ్చి జింకను చంపడం కోసం దూరంగా వెళ్లి వేచిచూస్తుంటుంది. సంగతంతా తెలుస్తుంది కాకికీ, ఎలుకలకు. జింక దగ్గరికెళ్లి ఓ ఐడియా చెబుతుంది కాకి. ఆ ప్రకారం... జింక తన కడుపును ఉబ్బించి, చచ్చినట్టు నటిస్తూ పడి ఉంటుంది. జింక కంటిని పొడుస్తున్నట్టు యాక్షన్ చేస్తుంది కాకి. ఈలోపు వేటగాడు దూరం నుంచే చూసి, జింక చచ్చిందనుకుని వెళ్లిపోతాడు. ఇంతలో ఉచ్చు కొరికేస్తుంది ఎలుక. జింక సేఫ్. ఇలా కాకికి కొంత సోషల్ ఎవేర్నెస్సు ఉంది. మరి కాస్త సైన్సు తెలుసంతే. అందుకే తనకు తెలిసిన సైన్స్‌తో గులకరాళ్లు కుండలో వేసి, అడుగునున్న నీళ్లను పైకి రప్పించగలిగింది. ఇలా..దానికి ఫ్లుయిడ్ మెకానిక్స్ కొంత తెలుసుగానీ మ్యాథమేటిక్స్ అస్సలు తెలియదు. అందువల్ల..కోకిల తన గుడ్లను.. కాకి గూట్లో పెట్టి, దాంతోనే పొదిగించినా దానికి తెలియరాలేదూ..ఆ ఎక్స్ట్రా గుడ్లు ఎక్కణ్ణుంచి వచ్చాయోనన్న తెలివీ లేదు. సైన్సు తెలిసిన కాకికి మ్యాథ్సూ, సాంగ్సూ తెలియాలనే రూలేమీ లేదు కదా. బల్బ్ కనిపెట్టినంత తేలిగ్గా ఎడిసన్ గారు బట్టలు నేయలేకపోవచ్చూ, బాదం హాల్వా చేయలేకపోవచ్చు కదా. కాబట్టి దీన్ని బట్టి తెలిసే నీతి ఏమిటి? కాకి మాంసం ముక్క ఎంత విలువైనదో... మన నోటికాడికి కూడూ, గూడూ, గుడ్డా వచ్చేలా చేసే ఓటూ అంతే విలువైనది. దాన్ని తమ వశం చేసుకోడానికి చాలా మంది అభ్యర్థులు...‘ఓటర్లంతా తెలివైనవాళ్లు. వాళ్లెప్పుడూ తప్పుచేయరు’ అంటూ ఉబ్బేస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఓటరూ తన బలమేమిటో తెలుసుకోవాలి. తనకు లేని బలాన్ని ఉన్నట్టుగా చూపే యుక్తుల్ని తెలుసుకుని తెలివిగా మసలాలి. అంతేకాదు... తెలివైన కాకిలా మనకు కావాల్సిన లబ్ధిని కుండలో నీళ్లలా సాధించుకోవాలి. మన సోషల్ ఎవేర్నెస్సుతో... మన ఫ్రెండ్సూ, నైబర్ల ఓట్లను కొట్టేయాలనుకునే నక్కజిత్తుల వాళ్లనూ, ముప్పు తెచ్చే వేటగాళ్లలాంటి వాళ్ల గురించి అప్రమత్తం చేయాలి. అంతేతప్ప... తెలివైన ఓటరెప్పుడూ పొగడ్తలకు పొంగిపోయి, విలువైన ఓటును కాకి నోట మాంసం ముక్కలా అర్హత లేని అభ్యర్థుల పాలు చేయకూడదు’’ అంటూ ముగించారు స్వామి ఎలక్షనానంద. ఇది చదవండి: ఓటరు దేవుడో... నీకో దండం -
అబద్ధాలు చెబితే కాకి తంతుంది.. ఎంపీ చద్దాపై బీజేపీ ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఓ విచిత్ర సంఘటన వెలుగుచూసింది. ఆమ్ ఆద్మీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాపై ఓ కాకి దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పార్లమెంట్ ఆవరణంలో రాఘవ్ చద్దా నిల్చొని ఫోన్ మాట్లాడుతుండా ఓ కాకి ఆయన తలపై తన్ని వెళ్లింది. అనూహ్య పరిణామానికి ఆయన కాస్తా కంగారుపడ్డారు. అయితే ఆ ఘటనకు చెందిన ఫోటోలను బీజేపీకి చెందిన ఢిల్లీ యూనిట్ తమ ట్విట్టర్లో పోస్టు చేసింది. ‘జూట్ బోలే కౌవా కాటే’అంటూ ఆ ఫోటోకు కామెంట్ పెట్టింది. అబద్ధం చెబితే కాకి పొడుస్తుందనే సామెతను ఇప్పటి వరకు విన్నాం, కానీ ఇప్పుడు అబద్దాలు చెప్పిన ఎంపీ రాఘవ్‌ను కాకి కొట్టడం ద్వారా కళ్లారా చూస్తున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: మీ మాటలకు చేతలకూ పొంతన లేదు: మోదీ, షాలపై ఖర్గే విమర్శలు ‘रामचन्द्र कह गए सिया से ऐसा कलयुग आएगा, हंस चुगेगा दाना दुनका और कौवा मोती खाएगा’ आज तक सिर्फ़ सुना था, आज देख भी लिया https://t.co/skKUCm4Kbs — Raghav Chadha (@raghav_chadha) July 26, 2023 మరోవైపు కాకి దాడి చేయడంపై ఎగతాళి చేస్తూ బీజేపీ చేసిన కామెంట్‌కు రాఘవ్ చద్దా గట్టి కౌంటర్ ఇచ్చారు. హంస గింజలు తినే.. కాకి ముత్యాల విందు చేసే కలియుగం వస్తుందని శ్రీరాముడు సీతతో చెప్పాడు’ అనేది మనం ఇప్పటివరకు విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం’ అంటూ రామాయణ ఇతిహాసం గురించి ప్రస్తావిస్తూ అటాక్ చేశారు. -
‘కాకి ఇలా కూడా చేస్తుందా?’.. ఇంతకుముందెన్నడూ చూడని స్ఫూర్తిదాయక వీడియో!
సోషల్ మీడియాలో లెక్కుమించిన వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని వింతైనవి, మరికొన్ని అమూల్యమైనవి కూడా ఉంటాయి. అయితే గతంలో ఎవరూ కూడా చూడని ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిని చూసినవారంతా కాకి ఇలాంటి పనిచేయడమేమిటంటూ, తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు. ఈ వీడియో ప్రతీఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉండటం విశేషం. అలాగే ఈ వీడియోను చూసిన వారంతా ఇకపై తాము కూడా బాధ్యతగా మెలుగుతామని కూడా చెప్పడం విశేషం. ఈ వీడియోను ట్విట్టర్లో @TansuYegen పేరుతో ఒక యూజర్ షేర్ చేశారు. ఈ 20 సెకెన్ల వీడియోలో ఒక కాకి తన ముక్కుతో ఒక ప్లాసిట్ బాటిల్ పట్టుకుని, ఇటునటు ఎగరడం కనిపిస్తుంది. తరువాత దానికి ఒక డస్ట్‌బిన్ కనిపించగానే దానిపై కూర్చుని, పలు ప్రయత్నాల అనంతరం ఆ బాటిల్‌ను ఆ డస్ట్‌బిన్ రంధ్రంలో నుంచి లోనికి పడవేస్తుంది. ఈ కాకి చేసిన పని చూసినవారంతా ఆశ్యర్యపోతున్నారు. ఈ విధమైన కాకిని ఎక్కడా చూడలేదని అంటున్నారు. అంత్యంత వేగంగా వైరల్ అయిన ఈ వీడియోకు ఇప్పటి వరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసినవారంతా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మనుషులు చేయాల్సిన పనిని ఒక పక్షిచేయడాన్ని చూసి మనమంతా సిగ్గుపడాలని అన్నారు. మరో యూజర్ పక్షులను చూసి మనం మరో గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ఇది కూడా చదవండి: స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..! Be like this raven😊 pic.twitter.com/fyMhMqBWQJ — Tansu YEĞEN (@TansuYegen) July 20, 2023 -
వినాయకస్వామి ఆలయంలో గంట మోగిస్తున్న కాకి
తమిళనాడు: సంగోటై సమీపంలోని వినాయకస్వామి ఆలయంలో ఓ కాకి గంటను మోగిస్తుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తెన్‌కాశీ జిల్లా సెంగోటై సమీపంలోని చెరువు వద్ద గణేశుని ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బుధ, శనివారాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే భక్తులు సందర్శిస్తారు. ఈ రెండు రోజులు పూజారి ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు. అయితే మిగిలిన రోజుల్లో ఓ కాకి గంట కొడుతుండాడాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై గుడి సమీపంలో టీ దుకాణం నడుపుతున్న శివకుమార్ మాట్లాడుతూ.. పూజలు జరిగే ఆ రెండు రోజులు కాకుండా మిగిలిన ఐదు రోజులు ఉదయం 7 గంటలకు, సాయంత్రం 5 గంటలకు గుడి ముందు గంటను కాకి మోగిస్తోందని తెలిపారు. తొలుత తాము పెద్దగా పట్టించుకోలేదని.. అయితే వారంలో పూజలు జరగని ఐదు రోజులు మాత్రమే కాకి వచ్చి గంట కొట్టడం గమనించామన్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్దఎత్తున వస్తున్నారని తెలిపారు. -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘కాకి’!
సాధారణంగా కొన్ని సినిమాల్లో జంతువులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు దర్శకులు. ముఖ్యంగా పెంపుడు కుక్క, గుర్రం, ఏనుగు లాంటి జంతువులను బేస్ చేసుకొని సినిమాలను తెరకెక్కించారు. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. అంతేకాదు హీరో కంటే ఆ జంతువులకు సంబంధించిన సన్నివేశాలే ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మన దర్శకుల కన్ను కాకులపై పడింది. కాకులను బేస్ చేసుకొని సన్నివేశాలను రాసుకుంటున్నారు. అవి ప్రేక్షలను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాకి కాన్సెప్ట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. కాకి కాన్సెప్ట్ అనగానే ఇప్పుడు అందరికి గుర్తొచ్చె సినిమా ‘బలగం’. ఓ మనిషి తదానానంతరం కాకి పిండం ముట్టడం అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వేణు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మనిషి చనిపోయిన తర్వాత కాకి పిండంను తినకపోవడం గురించి చూపించారు. కథంతా కాకి చుట్టే తిరుగుతుంది. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఇక రీసెంట్గా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’చిత్రంలోనూ కాకికి ఇంపార్టెంట్ రోల్ లభించింది. క్షుద్రపూజల నేపథ్యంలో మిస్టరీ,థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 21న విడుదలై పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ప్రేక్షకులను భయపెట్టడానికి కాకిని చాలా సన్నివేశాల్లో వాడారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కాకులన్నీ గుంపుగా వచ్చి అగ్నికి ఆహుతి అవ్వడం అనేది సినిమాకి హైలెట్‌గా నిలిచింది. అలాగే ఇటీవల విడుదలైన నాని తొలి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’లోనూ కాకిని వాడేశారు. ఈ సినిమాలో కూడా కాకి పిండాన్ని తినకపోవడాన్ని చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో టాలీవుడ్‌కి కాకి సెంటిమెంట్‌గా మారిపోయింది. మరి ఈ కాకుల కాన్సెప్ట్‌తో ఇంకెన్ని చిత్రాలు వస్తాయో చూడాలి. (చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు వీరే) -
పిల్లల కథ: ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా?
వంశీ పెరట్లో నిల్చుని చూస్తున్నాడు. జామచెట్టు మీద ఉడుత అటూ ఇటూ పరుగులు తీస్తోంది. మధ్యలో ఆగి కాయనందుకుకుని, కాసేపు కొరికి కింద పడేసింది. ఆ తర్వాత ఎక్కడి నుంచో ఓ కాకి రివ్వున వచ్చింది. దాంతో ఉడుత కొమ్మల చాటుకు మాయమైపోయింది. కాకి చెట్టు కొమ్మ మీద దర్జాగా వాలింది. వెంటనే ఠాప్ మని ఏదో పడ్డ చప్పుడు. కిందకు చూస్తే సగం కొరికిన బాదం కాయ. కాకి కాసేపు నాలుగు దిక్కులా పరిశీలనగా చూసి, స్నేహితులకు తన ఉనికి తెలియజేస్తూ మళ్లీ కావ్ కావ్ అంటూ ఎగిరిపోయింది. ‘ఎవరింట్లోని బాదం చెట్టు కాయో.. ఈ పక్షులు, జంతువులు అన్నీ ఇలా పాడుచేస్తున్నాయి. కష్టపడి చెట్లను పెంచుకుంటే మధ్యలో ఇవొచ్చి అన్నిటినీ తిన్నంత తిని, పారేస్తుంటాయి’ కోపంగా అనుకున్నాడు. అంతలో రెండు కోతులు వచ్చాయి. వంశీ భయంతో వెనక్కు నడిచి, లోపలికి వెళ్ళాడు. అయినా ఆ కోతుల్ని చూడాలనే కుతూహలంతో మెష్ తలుపు వేసి, అక్కడ నిలబడి చూస్తున్నాడు. ‘అయ్యో! ఆకుల చాటు జామకాయల్ని చూడనే చూశాయి. తీరిగ్గా కొరుక్కు తింటున్నాయి. తను తినాల్సిన జామకాయల్ని ఈ కోతులు తింటున్నాయి’ కోపంగా అనుకున్నాడు. అటువైపు పావురాలు కూడా సపోటా చెట్టు మీద వాలుతూ, ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నాయి. తన జామకాయల్ని తినేసిన కోతుల మీద పట్టరాని కోపం వచ్చింది. తలుపు వెనక ఉన్న కర్ర తీసుకుని వాటిని బెదిరించాడు. అవి వంశీ వంక గుర్రుగా చూస్తూ, తమ భాషలో వంశీపై అరచి వెళ్లిపోయాయి. హమ్మయ్య అనుకున్నాడు వంశీ. ఆ వెంటనే ఉడుత బయటికి వచ్చింది. వంశీకి మళ్లీ కోపం వచ్చింది. ‘ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా? నీకు తోడు ఆ కాకులు, పావురాలు, కోతులు.. మీరంతా చెట్లకు శత్రువులు. అన్ని కాయల్ని నాశనం చేస్తారు. మీరు తిండికి తప్ప ఎందుకూ పనికిరారు’ అని విసుక్కుంటూ పెరట్లోకి నడిచి, ఉష్ ఉష్ అంటూ ఉడుతను తోలాడు. అది చటుక్కున మరో కొమ్మ మీదకు చేరి ‘మిత్రమా.. వంశీ!’ అనడంతోనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయాడు. ‘ఏమన్నావు, మాకు పనీ పాట లేదా? జంతువులు.. పక్షులు కాయలు, పళ్లను కొరికేసే మాట నిజమే. కానీ అలా కొరికి పడేయడం వల్ల ఆ గింజలు, విత్తనాలుగా నేలలో చేరి, మళ్లీ మొలకెత్తి.. మొక్కలై, క్రమంగా చెట్లై, మహావృక్షాలవుతున్నాయని, పూలు, కాయలు, పండ్లను ఇస్తున్నాయని నువ్వు తెలుసుకోవాలి. పైగా మా ఉడుత జాతి అయితే మంచుకురిసే ప్రాంతాల్లో, చలికాలం కోసం ముందు చూపుతో గింజల్ని పోగుచేసి వేర్వేరు చోట్ల, గుంతల్లో దాచిపెట్టుకుంటుంది. కానీ మాకు, మీకు మాదిరే కాస్తంత మతిమరుపు. దాంతో ఆ తర్వాత గింజల్ని ఎక్కడ దాచుకున్నదీ మర్చిపోవటంతో ఆ గింజలన్నీ మొలకెత్తి, చెట్లుగా ఎదుగుతాయి. పక్షి జాతులయితే దూర దూర ప్రాంతాలకు విత్తనాలను ఎంతగా వ్యాప్తి చేస్తాయో! అంతేనా, మా విసర్జనల ద్వారా కూడా రకరకాల విత్తనాలు నేలకు చేరి, మొలకెత్తి, మొక్కలుగా ఎదుగుతున్నాయి తెలుసా? నిజానికి మానవులు, అంటే మీరు నాటే చెట్ల కన్నా మేం నాటే చెట్లే ఎక్కువ. మేం తినేది గోరంత, నాటే చెట్లు కొండంత. ఆవిధంగా మేం, మీకు ఎంతో సేవ చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు చెట్లు అధికంగా పెంచాలని నువ్వు చదువుతుంటావుగా! మేం ఆ పని చేస్తున్నాం. పర్యావరణం బాగుండాలంటే సకల జీవుల ఉనికి అవసరమే. అదే.. జీవ వైవిధ్యం ఉండడం ప్రధానం. మరి, మేం మీ మిత్రులమని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ’ అంది ఉడుత. అంతా విన్న వంశీ ‘ఉడుతా! నన్ను క్షమించు. ఇన్ని రోజులూ నీ సేవలు తెలుసుకోలేక పోయాను. ఇవాళ్టి నుంచి మనం స్నేహితులం. ఒట్టు’ అంటుంటే.. ‘ఒరే వంశీ! ఎంత ఆదివారమైనా మరీ ఇంత పొద్దెక్కేదాకా పడుకుంటావా? పైగా కలలొకటి.. ఎవరితో క్షమించు, ఒట్టు.. అని ఏదేదో అంటున్నావు’ అంటూ అమ్మ అరవడంతో వంశీ ఉలిక్కిపడి లేచాడు. ఏమీ అర్థం కాలేదు. ‘పెరట్లో ఉడుత, కాకి, కోతులు మాట్లాడడం అంతా కలా? ఎంత బాగుంది కల’ అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి పెరట్లోకి పరుగుతీశాదు. జామచెట్టు మీద ఉడుత ఏదో కొరుకుతూ కనిపించింది. ‘అమ్మ దొంగా! కల్లో మేం కూడా విత్తనాలు నాటుతాం అని పాఠం చెప్పి, ఇప్పుడేమో ఏమీ తెలీనట్లు అమాయకంగా చూస్తావా?’ అని వంశీ అంటుంటే వెనకే ఉన్న అమ్మ నవ్వింది. -
Robotic Crow: జీవం ఉట్టిపడే కాకి.. ఏం చేస్తుందంటే!
Iran Designer Robotic Crow: అచ్చం కాకిలా రూపొందించిన రోబోకాకి ఇది. ఇరాన్‌కు చెందిన కాన్సెప్ట్ డిజైనర్ అమీన్ అక్షీ ఈ రోబోకాకిని రూపొందించారు. ఇది ఉత్త రోబో మాత్రమే కాదు, డ్రోన్ కూడా. ఇందులో అన్నివైపులా కెమెరాలు, సెన్సర్లూ అమర్చడంతో ఎక్కడికంటే అక్కడకు ఎగురుతూ పోయి వాలగలదు. రెక్కలను మెత్తగా జీవం ఉట్టిపడేలా రూపొందించడం, కాళ్ల పంజాలను ఎలాంటి ఉపరితలంపైన అయినా తేలికగా వాలి నిలబడేలా తీర్చిదిద్దడం ఇందులోని విశేషం. జనసమ్మర్దం ఉండే చోట్ల వాలడానికి కాకులు భయపడుతుంటాయని, వాటిలో ఆ భయం తొలగించే ఉద్దేశంతో ఈ రోబోకాకికి రూపకల్పన చేశానని అమీన్ చెబుతున్నారు. చదవండి: Laser Comb: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ఒత్తైన కురులు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే! -
ఇది మా గగన విహారం మీరు ఎగరడానికి వీల్లేదు!
మన పెద్దవాళ్లు ధాన్యం, ఎండు మిరపకాయలు, వడియాలు, పిండి వంటి ఆహార పదార్థాలను ఆరు బయట ఎండ పెట్టేవారు. పైగా పక్షులు, కోతులు వచ్చి పాడుచేయకుండా ఉండటానికి వల లేక దాన్ని భయపెట్టించేలా శబ్దాలు చేయడం లేదా చనిపోయిన పక్షి బొమ్మలు పెట్టడం వంటివి చేసేవారు. అప్పుడు మనం ఇళ్లలోకి రానివ్వక పోవడం వల్లనో మరీ ఏమో గానీ ఇక్కడోక కాకి ఫుడ్ డెలివరీ చేసే ఒక డ్రోన్‌ని ఇది మా గగన విహారం నువ్వు ఎగరడానికి వీల్లేదూ....అన్నట్లుగా దాన్ని తరిమికొట్టేదాక వదల్లేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటో ఆ విషయం అని ఆశ్చర్యంగా ఉంది కదూ! కాన్బెర్రా: ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా గూగుల్ భాగస్వామ్యంతో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్ వింగ్‌ని ప్రజా సేవల వినియోగ నిమిత్తం 2019 నుంచి ప్రారంభించింది. ఈ డ్రోన్ ఆహారం, మెడిసిన్, కాఫీ తదితర వాటిని ప్రజలకు సరఫరా చేయడానికి వినియోగిస్తోంది. ఇటీవల కోవిడ్ సమయంలో ప్రజలకు కావల్సిన ఆహారం, నిత్యావసరాలకు సంబంధించిన పదివేల ఆర్డర్లను డెలవరీ చేసి ఎంతో విశేష ప్రజాదరణ పొందింది. (చదవండి: వెరైటీ థెరపీలు... విలువైన ప్రయోజనాలు!) ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన డెలివరీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఒక కాకి ఆకాశంలో ఫుడ్ డెలివరీ చేసే డ్రోన్ పై ఆకస్మాత్తుగా దాడికి పాల్పడింది. దానిని గట్టిగా నోటితో పట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తోంది. పైగా ఆ కాకి చూడటానికి ఆకారంలో చాలా పెద్దగా ఉంది. వెంటనే సదరు కస్టమర్ ఆశ్చర్యానికి గురై దాన్ని వీడియో తీశాడు. ఆ డ్రోన్ పై కాకి చాలా భయంకరంగా దాడి చేసింది. దీంతో ఆ డ్రోన్ ఆ డెలివరీని కింద పడేసింది. ఆ తర్వాత ఆ కాకి ఒక్కసారిగా అక్కడ నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం కొన్ని ప్రదేశాలలో ఆ వింగ్ డ్రోన్‌ని తాత్కాలికంగా నిషేధించారు. ఈ దాడిలో పక్షికి ఏమి కాలేదని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో డ్రోన్లు తిరగపోవడం వల్ల దాన్ని తరిమి కొట్టడంలో పక్షి విజయవంతమైందని పక్షుల సంరక్షణ నిపుణుడు ఒకరు చెప్పారు. (చదవండి: అపహరణకు గురైన ఇరాక్ పురాతన శాసనాన్ని తిరిగి ఇచ్చేశాం!) -
హమ్మా! కాకికే షాకిచ్చిందిగా..!!
-
హమ్మా! కాకికే షాకిచ్చిందిగా..!! వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: అనగనగా ఒక కాకి.. ఆ కాకికి దాహం వేసింది. చుట్టూ వెదికింది. ఎక్కడా నీళ్లు కనిపించలేదు.. దాహంతో గొంతు తడారిపోతుండగా. ఎక్కడో అడుగున కాసిన్ని నీళ్లతో ఒక కూజా కనిపించింది. ఆ నీళ్లు అందకపోవడంతో తెలివిగా కొన్ని గులకరాళ్లను తెచ్చి అందులో వేసి.. నీళ్లు పైకి వచ్చాక తన దాహాన్ని తీర్చుకుంది.. హాయిగా ఎగిరిపోయింది..ఈ కథ తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. అంతేనా కాకమ్మ తెలివితేటల గురించి చాలా స్టోరీలు ఇప్పటిదాకా వైరల్ అయ్యాయి. మనుషులు అతి నిర్లక్ష్యంగా పారవేసిన చెత్తను, ప్లాస్టిక్ బాటిళ్లతో సహా ఏరి చెత్త కుండీలో పారవేసిన స్వచ్ఛ్ భారత్ కాకి కథను కూడా విన్నాం. కానీ తాజాగా అలనాటి పాత కథను తలపించేలా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న నీళ్ల కోసం ఒక పిట్ట కష్టపడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. కాకికే షాకిచ్చిందిగా బుల్లి పిట్ట. ఔరా అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలోకనిపించిన మాగ్పై పక్షలు కూడా కాకుల్లాగే చాలా తెలివైనవట. గత ఏడాది స్టీవ్ స్టీవార్డ్ విలియమ్స్ అనే యూజర్ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. అది తిరిగి తిరిగి మళ్లీ ఇపుడు వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి! -
కాకి స్వచ్ఛ్ భారత్ : నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: ఓ కుండలో అడుగున ఉన్న నీటిని గులకరాళ్ల సాయంతో పైకి తీసుకొచ్చిన కాకి ఎంత తెలివైన జీవో మనం చాలా చిన్నపుడే తెలుసుకున్నాం. ఎంత విసుక్కున్నా..విసిరి కొట్టినా. ఒడుపుగా ఆహారాన్ని అందిపుచ్చుని కవ్విస్తూనే ఉంటుంది. అంతేకాదు తెలివైనదాన్నే కాదు.. నేను చాలా స్మార్ట్ అని నిరూపించు కున్న సందర్భాలు కూడా కోకొల్లలు. తాజాగా సామాజిక బాధ్యతను మరిచి ప్రవర్తించే మానవ జాతి సిగ్గు పడేలా చేసిందో కాకి. తాను సామాజిక జీవినని మరోసారి నిరూపించుకుని అందర్నీ ఫిదా చేస్తోంది. డస్ట్‌బిన్ పక్కనే ఉన్నా.. దాన్ని వినియోగించుకోకుండా పక్కన పారేసిన చెత్తను ఒక్కొక్కటిగా తన ముక్కుతో తీసుకొని డస్ట్‌బిన్‌లో వేసిన వైనం ఔరా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సుశాంత నందా 38 సెకన్ల క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖాళీ డబ్బాలు, చెత్త పేపర్ ఇలా ఒక్కొక్కదాన్ని చాలా స్మార్ట్‌గా ఏరి డస్ట్‌బిన్‌లో వేసి మరీ ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తీరు నెటిజనులను ఆకట్టుకుంటోంది. మనుషులు సిగ్గు అనే విషయాన్ని మర్చిపోయారని కాకికి తెలుసు అనే క్యాప్షన్‌తో సుశాంత పోస్ట్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేయడమే కాదు.. వేగంగా వైరల్ అవుతోంది. సుమారు 2 వేలకు పైగా లైక్‌లను 14వేల వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాకి తెలివికి కొంతమంది అబ్బుర పడుతున్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను ఈ చిన్న జీవి సైతం అర్థం చేసుకుంది. ఇకనైనా సిగ్గు తెచ్చుకుని.. బాధ్యతగా పవర్తిద్దాం అనే సందేశాల వెల్లువ కురుస్తోంది. This crow knows that humans have lost the sense of shame pic.twitter.com/9ULY7qH4T2 — Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021 -
అమ్మో, దీని తెలివి సల్లగుండ..
-
వైరల్: అమ్మో, దీని తెలివి సల్లగుండ..
కాకి మీద బోలెడు సామెతలున్నాయి. కాకి పిల్ల కాకికి ముద్దు, కాకి గూటిలో కోయిల పిల్లలాగా, కాకి ముక్కుకు దొండ పండు, కాకిలా కలకాలం మన్నేకంటే హంసై ఆరు నెలలున్నా చాలు, కాకులను కొట్టి గద్దలకు వేయడం, కాకి అరిస్తే చుట్టాలు వస్తారు, కాకమ్మ కబుర్లు.. అబ్బో ఇలానే చాలానే ఉన్నాయి. అయితే ఈ వార్త చదివాక ఆ లిస్టులో కాకి తెలివితేటలు అనే సామెత కూడా చేర్చాలంటున్నారు కొందరు జనాలు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. కుండ అడుగులో ఉన్న నీళ్లను తాగేందుకు ఓ కాకి అందులో రాళ్లు వేసి నీళ్లు పైకి రాగానే ఎంచక్కా తాగేసిందనే కథ బాల్యంలో దాదాపు అందరూ వినే ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే కాకి మాత్రం అలా పెద్దగా కష్టపడకుండా ఈజీగా తన దాహం తీర్చుకుంది. ఎక్కడినుంచో ఎగురుకుంటూ వచ్చి ఓ కుళాయి మీద కూర్చున్న కాకి తన కాళ్లతో దాహార్తిని తీర్చుకుంది. కాళ్లతో బలంగా ఆ కుళాయిని తిప్పడంతో అందులో నుంచి నీళ్లు రాగా, వాటిని ఎంచక్కా తాగి దప్పిక తీర్చుకుంది. ఇక్కడివరకు బాగానే ఉన్నా చివర్లో ఆ కుళాయిని కట్టేసిందా? లేదా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ వీడియోను అటవీశాఖ అధికారి సుశాంత్ నందా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. కాకి తెలివి చూసిన నెటిజన్లు 'దీని తెలివి సల్లగుండ..' అని అబ్బురపడుతూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం అది కుళాయి బంద్ చేయలేదంటూ కాకి మీద చిరుకోపం ప్రదర్శిస్తున్నారు. చదవండి: ఇది ఏ‘కాకి’ కాదు! రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం! -
ఇది ఏ‘కాకి’ కాదు!
సాక్షి, ఖమ్మం: ఎవరైనా కుక్కనో, చిలకనో పెంచుకుంటారు గానీ, కాకిని సాకుతారా? దానిని అందరూ అరిష్టం అంటారు. కానీ ఈమెకు మాత్రం ఇష్టం. దానిని ఎంచక్కా పెంచుకుంటోంది ఖమ్మం నగరంలోని రేవతి సెంటర్‌కు చెందిన మీనా. రెండేళ్ల క్రితం తన ఇంటి ముందు ఉన్న చెట్టుపై నుంచి కాకిగూడు కిందపడింది. దీంతో అందులోని ఐదు పిల్లల్లో ఒకటి చనిపోయింది. నాలుగు పిల్లలను మీనా చేరదీసింది. కొద్దిరోజులకు మరో రెండు చనిపోయాయి. ఇంకో కాకిపిల్ల ఎటో ఎగిరిపోయింది. చివరికి ఏ‘కాకి’గా మిగిలిన దానికి వాణి అనే పేరు పెట్టి సాదుకుం టోంది. అది కూడా కుటుంబసభ్యురాలిగా ఆ ఇంట్లో కలిసిపోయింది. ఆ కాకి బయటకు వెళ్తే వాణి అని పిలిస్తే చాలు వచ్చి మీనా దగ్గర వాలిపోతుంది. అయితే, ఈ కాకిని పెంచుకోవడం వల్ల తమకు ఎటువంటి నష్టం జరగలేదని, మంచే జరుగుతోందని మీనా ఆనందం వ్యక్తం చేస్తోంది. -
లోకంలో.. పలు కాకులు; ఆసక్తికర సంగతులు
లోకులు పలు కాకులు అనే సామెత మనకు తెలిసిందే. ఆ సామెత ఎలా ఉన్నా.. కాకుల్లో పలు రకాలు ఉన్నాయి. మనం సాధారణంగా కావ్ కావ్ మంటూ చెవులు చిల్లులు పడేలా అరిచే నల్ల కాకులనే చూస్తాం. కానీ కాకుల్లో కూడా అందమైనవి. ఆకట్టుకునే రంగుల్లో ఉన్నవి కూడా లోకంలో ఉన్నాయి. కార్విడె కుటుంబానికి చెందిన కాకుల్లో హౌస్ క్రోలని, రావెన్స్ అని, జాక్‌డా అని, మాగ్ పీ అని రకరకాలుగా ఉన్నాయి. వాటి వివరాలు ఓ సారి చూద్దాం. రుఫోస్ ట్రీపీ.. కాకి జాతిదే అయినా ఇది గోధుమ రంగులో ఉంటుంది. భారత ఉపఖండం దీని ఆవాసం. సాధారణ వర్షపాతం ఉండే ప్రాంతాలు, అడవులు, పట్టణాల్లోని ఉద్యానవనాల్లో ఇది కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతుంది. పళ్లు, గింజలు, కీటకాలు, చిన్న చిన్న జీవులు దీని ప్రధాన ఆహారం. వైట్ బెల్లీడ్ ట్రీ పీ.. తోక పొడుగ్గా, అందంగా ఉండే ఈ కాకి, ఎక్కువగా పశ్చిమ కనుమల్లో నివసిస్తుంది. రూఫోస్ ట్రీపీతో స్నేహం చేస్తుంది. జనావాసాలు అంటే దీనికి పడదు. గింజలు, కీటకాలు, సరీసృపాలు, ఎలుకలు దీని ఆహారం. కామన్ గ్రీన్ మాగ్పీ.. దేశంలోని పక్షి జాతుల్లో అందమైనది. పచ్చని రంగుతో చూడముచ్చటగా ఉంటుంది. పరిమాణంలో చిన్నగా ఉండే ఈ కాకి హిమాలయాల్లో, ఈశాన్య భారతంలో కనిపిస్తుంది. ఇండియన్ జంగిల్ క్రో.. రతదేశం మొత్తం ఈ కాకి కనిపిస్తుంది. హౌస్ క్రోకి దీనికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి నల్లగా, కొంచెం పెద్దగా ఉంటుంది. జంగిల్ క్రో అయినా జనావాసాలకు దగ్గరలోనే నివసిస్తుంది. లార్జ్ బిల్లెడ్ క్రో.. ది కూడా అడవి కాకిలాగే పెద్దగా ఉంటుంది. కానీ సైజులో తేడా కనిపిస్తుంది. భారత్, ఆగ్నేయ ఆసియా దేశాల్లోని కాకుల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇది కూడా ప్రతిభ గలది. పరిస్థితులకు అనుకూలంగా మారుతుంది. యెల్లో బిల్లెడ్ బ్లూ మాగ్పీ.. వైట్ బెల్లీడ్ ట్రీ పీలాగే దీనికి కూడా పొడవైన తోక ఉంటుంది. కామన్ గ్రీన్ మాగ్పీలా అందంగా ఉంటుంది. భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇది నివసిస్తుంది. నేలపై ఉండే ఆహారాన్ని సేకరించి కడుపునింపుకుంటుంది. బ్లాక్ హెడెడ్ జే.. హిమాలయాల్లో ఈ కాకి జాతి జీవిస్తుంది. నేపాల్, భూటాన్ వ్యవసాయ భూముల్లో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంది. దీని తలపైన నల్లగా ఉంటుంది. యూరేసియన్ జేకి ఇది దగ్గరి చుట్టం. అదే పరిమాణంలో కూడా ఉంటుంది. హౌస్ క్రో.. పంచంలో అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కాకి ఇది. దీని ఆవాసాలు మనుషులకు చేరువలో ఉంటాయి. కాకి జాతుల్లో కర్ణకఠోరంగా కావ్ కావ్ మంటూ కూసే కాకి ఇదే. నల్లగా ఉన్నా.. కొంత భాగం బూడిద రంగులో మెరుస్తూ ఉంటుంది. కామన్ రావెన్.. కాకి జాతుల్లో పెద్ద వాటిల్లో ఇది ఒకటి. ఇది అత్యంత ప్రతిభ కలిగినది. తెలివైనది. అంతేగాక అవకాశవాది అనే పేరున్నది. వాయవ్య భారతంలో మాత్రమే కనిపిస్తుంది. రాజస్థాన్, పంజాబ్‌తో పాటు సమీపంలోని ఎడారుల్లో జీవిస్తుంది. వెస్ట్రన్ జాక్‌డా.. కాకి జాతిలో చిన్న రకం ఇది. ఉత్తర భారత దేశంలోని కశ్మీర్లో కనిపిస్తుంది. తిండి విషయంలో ఇది కూడా అవకాశవాదే. ఇది పలు రకాలైన ఆహారం భుజిస్తుంది. మొక్కలు, క్రిములు చివరకు వాన పాములు లాంటి వాటికి కూడా గుటుక్కుమనిపిస్తుంది. -
కాకి చనిపోయింది.. కోట మూసేశారు
సాక్షి, న్యూఢిల్లీ: ఎర్రకోట మీద ఓ కాకి చనిపోయింది... పరీక్షలు నిర్వహిస్తే కాకికి బర్డ్‌ఫ్లూ సోకిందని తేలింది. దీంతో ఈ నెల 26 వరకు ఎర్రకోట మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నెల 10న సుమారు 15 కాకులు ఎర్రకోట ప్రాంగణంలో మృతిచెందడాన్ని అధికారులు గుర్తించారు. జలంధర్‌లోని లేబరేటరీకి పరీక్షల నిమిత్తం వాటిని పంపించగా ఒక కాకికి బర్డ్‌ఫ్లూ సోకిందని తేలిందని ఢిల్లీ ప్రభుత్వ పశు సంరక్షణ విభాగం డైరెక్టర్ రాకేష్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే రోజైన ఈ నెల 26 వరకు సందర్శకులను ఎర్రకోట లోపలికి అనుమతించడం లేదని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఒక గూడ్లగూబ మృతదేహం పరీక్షించగా దానికి బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్థారణ అయిందని అధికారులు తెలిపారు. -
మానవతా దృక్పథంతో వ్యవహరించారు
సాక్షి, హైదరాబాద్ : ఎవరు ఎలా పోతే మాకేంటని పట్టించుకోని కాలమిది. సాటి మనుషులకు ప్రమాదం జరిగినా చూసీచూడనట్టు వెళ్లిపోయే సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. మనుషులకే దిక్కులేని ఈ సమాజంలో ఇక పసుపక్షాదుల సంగతి చెప్పనక్కరలేదు. అందులోనూ కాకి లాంటి పక్షులకు దిక్కుండదు. కానీ, కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఒక కాకిని కాపాడటానికి కొందరు యువకులు చేసిన ప్రయత్నాలు అభినందనీయం. హైదరాబాద్‌లోని సైనిక్‌పురి ప్రాంతంలో ఒక కాకి విద్యుత్ తీగలపై పెనవేసుకుపోయిన పతంగి మాంజాలో చిక్కుకుపోయింది. కాకి కాళ్లకు పెనవేసుకున్న మాంజా నుంచి తప్పించుకోలేక గిలగిలా కొట్టుకుంది. ఒకటికాదు రెండు కాదు. మూడు రోజులుగా అలా కొట్టుకుని నీరసించి ఇంక చేతకాక విద్యుత్ వైర్ల నుంచి కిందకు వేలాడింది. అప్పుడప్పుడు బలం తెచ్చుకుని అరవడం మాత్రం ఆపలేదు. మూడురోజులుగా ఈ తతంగం గమనిస్తున్న స్థానికుల్లో ఒకరు విషయాన్ని నగరంలోని వన్యప్రాణులను సంరక్షించే ఎనిమిల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీకి చేరవేశారు. అంతే, ఆ వారియర్స్ వెంటనే వాలిపోయారక్కడ. ఆ సొసైటీకి చెందిన యువకులు వచ్చి స్థానికంగా అగ్నిమాపక కేంద్రానికి వెళ్లి సహాయాన్ని అర్థించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సానుకూలంగా స్పందించి ఫైరింజన్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకొని కాకిని పరిశీలించి చూడగా అది ప్రాణాలతోనే ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది కాకికి చిక్కుకున్న మంజాను తొలగించి కాకిని పట్టుకుని ఎనిమల్ వారియర్స్ సంస్థకు అందించారు. వారు దానిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని ఒక వస్త్రాన్ని చుట్టి దానిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాకి ప్రాణాలను కాపడానికి అక్కడ జరుగుతున్న తతంగమంతా చూస్తున్న స్థానికి ఎనిమల్ వారియర్స్ ప్రతినిధులను అభినందించారు. ‘పక్కవారికి కష్టం వచ్చినా పట్టించుకోని ఈ కాలంలో ఒక కాకి ప్రాణాల కోసం ఎనిమల్ వారియర్స్ ప్రతినిధులు పడిన తాపత్రయం అభినందనీయం’ అంటూ స్థానిక సీనియర్ న్యాయవాది కే. రాజగోపాల్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ సంస్థ పెంపుడు జంతువులు, ఇంకా ఇతరత్రా జంతువులు ఆపదలో ఉన్నప్పుడు సాయం అందించడానికి ముందుంటుంది. -
అక్కడ పెద్ద ఎత్తున కాకుల మృతి
సాక్షి, చెన్నై(తమిళనాడు): పనపాక్కం సమీపంలో రోజురోజుకూ కాకుల మృతి పెరుగుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇవి ఆకలితో చనిపోతున్నాయా లేదా వ్యాధి బారిన పడి చనిపోతున్నాయా అనే విషయంపై స్పష్టత రావడం లేదు. రాణిపేట జిల్లా పనపాక్కం సమీపంలోని పన్నియూర్ గ్రామంలో 800 మందికిపైగా ప్రజలు జీవిస్తున్నారు. ఈప్రాంతంలో ఉన్న ప్రజలు ముఖ్య జీవనాధారం వ్యవసాయం. ఈ గ్రామంలో గత 1వ తేది సాయంత్రం 5 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న కులత్తుమేడు ప్రాంతంలో అకస్మాత్తుగా పదికి పైగా కాకులు మృతి చెంది పడి ఉన్నాయి. దీన్ని గమనించిన ఆ ప్రాంత ప్రజలు కరోనా నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉండడంతో ప్రజలు ఎవరూ బయటకు రాకపోవడంతో ఆహారం లేక కాకులు చనిపోయి ఉండవచ్చని సాధారణంగా భావించారు. కాకులు చనిపోవడాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ స్థితిలో తర్వాత రోజు సాయంత్రం అదే ప్రాంతంలో ఉన్న ప్రజలు నివాస గృహాలపై నీరసంగా వాలిన కాకులు, అకస్మాత్తుగా ఒకదాని తర్వాత ఒకటి పెద్దసంఖ్యలో మృతి చెందుతున్నాయి. శనివారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. (ఎంత నమ్మకం ఉంటే ఇలా చేస్తారు!) -
కాకి మాట
నందనవనంలో పెద్ద మర్రిచెట్టు ఉంది. నెమలి, చిలుక, మైనా, కోకిల, పావురం, కాకి వంటి పక్షులన్నీ ఆ చెట్టు మీద గూళ్లు పెట్టుకుని నివసిస్తున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ చెట్టు మీదకు చేరుకుని కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకునేవి. ఒకరోజు అవి కబుర్లలోంచి వాదనలోకి దిగాయి. ‘‘నేనెంత అందమైన దాన్నో తెలుసా? నేను జాతీయ పక్షిని. నా ఈకలను అలంకరణ వస్తువులుగా అందరూ ఇళ్లలో అలంకరించుకుంటారు. చిత్రకారులు నా అందమైన రూపాన్ని చిత్రిస్తారు. నాట్య కళాకారుల్లో మేటి వారిని నాట్యమయూరి బిరుదుతో గౌరవిస్తారు’’ అంటూ నెమలి వయ్యారాలు పోయింది. ఈ మాటలతో రామచిలుకకు చిర్రెత్తింది. ‘‘ఏంటేంటీ... నువ్వొక్కదానివే అందగత్తెవా? నేను కానా? ఏ అమ్మాయి అందాన్నయినా నాతోనే పోలుస్తారు. ఎవరు ఏ మాట మాట్లాడినా తిరిగి అంటాను. చాలామంది నన్ను పంజరంలో ఉంచి ముద్దుగా పెంచుకుంటారు తెలుసా?’’ అంది. చిలుక మాటలు విన్న పావురం తానేమీ తక్కువ తినలేదంటూ... ‘‘నన్ను అందరూ శాంతికి గుర్తుగా భావిస్తారు. జాతీయ పండుగ రోజుల్లో నన్ను ఎగురవేస్తారు. పర్యాటక ప్రదేశాల్లో నేను కనిపిస్తే గింజలు చల్లి ఆనందిస్తారు’’ అంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న కోకిల కూడా గొంతు విప్పింది. ‘‘నా పాటకు సాటి ఎవరు? ప్రకృతిలోని అందమంతా నా పాటలోనే ఉంది. కవులకు కవితా వస్తువును నేను’’ అంది. ఇలా పక్షులన్నీ నేను గొప్పంటే నేను గొప్పని తెగ వాదించుకున్నాయి. చివరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న కాకి మీద పడ్డాయి. ‘‘అసలు ఏ విషయంలో నువ్వు గొప్పదానివి? నిన్ను చూస్తేనే అందరికీ చీదర. నిన్ను చూస్తేనే హుష్ కాకి అని తరిమేస్తారు’’ అని హేళన చేశాయి. కాకి ఏమీ బదులివ్వకుండా తన గూటికి వెళ్లిపోయింది. మర్నాడు మళ్లీ అన్నీ కలిసి ‘‘నిన్న ఏమీ మాట్లాడకుండా అలా వెళ్లిపోయావేం?’’ అంటూ రెచ్చగొట్టాయి. అప్పుడు కాకి గొంతు సవరించుకుని, ‘‘మీరందరూ నాకంటే గొప్పవారే. కాదనను. కానీ మీకూ కష్టాలున్నాయే! వాటిని మరచిపోయారు. నెమలి ఎంత అందమైనదైనా స్వేచ్ఛగా ఎగరలేదు. కనిపిస్తే మనుషులు బంధిస్తారు. మరి చిలుకనూ పంజరంలో బంధిస్తారు. పావురాన్నీ, కోకిలనూ రుచికరమైన మాంసం కోసం మట్టుపెట్టేస్తారు. నేను అందంగా లేకపోయినా, నాకు ఏ విద్యలూ రాకపోయినా మనుషులకు పుణ్యలోకాలు ప్రాప్తించేందుకు సాయం చేస్తుంటాను. ఎవరు ఎంత ఘనత కలిగి ఉన్నా, ఒదిగి ఉంటేనే వారి గొప్పతనానికి అందం’’ అంటూ ముగించింది. కాకి సమాధానంతో మిగిలిన పక్షులన్నీ అక్కడి నుంచి చల్లగా జారుకున్నాయి. - ఉలాపు బాలకేశవులు -
కాకులందు తెల్లకాకి వేరయా..!
హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద మండలం గజ్జహళ్లీ గ్రామంలో గురువారం తెల్లకాకి కనిపించింది. నల్లకాకులతో ఇది కలిసి విహరిస్తోంది. నల్లకాకి లక్షణాలతో తెల్లరంగు కలిగి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. -
వైరల్: కాకిని చూసి బుద్ది తెచ్చుకోండయ్యా!
న్యూయార్క్ : 'కాకిలా కలకాలం బతికేకంటే హంసలాగా ఒక్కరోజు బతికినా చాలు' అంటుంటారు సాధారణంగా. మనిషి ఎలా బ్రతకకూడదో కాకుల్ని ఉదాహరణగా చూపుతుంటారు. కానీ నేటి సమాజంలో కాకుల్ని చూసి మనిషి నేర్చు కోవాల్సింది చాలా ఉందని అవి నిరూపిస్తున్నాయి. ఓ కాకి చేసిన చిన్న పని దాన్నో ఇంటర్నెట్ హీరోను చేసేసింది. దాని తెలివికి నెటిజన్లు జోహార్లు చేస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. ప్లాస్టిక్ బాటిల్‌ను నోటితో పట్టుకుని రీసైకిల్ డస్ట్ బిన్మీద వాలిన ఓ కాకి బాటిల్‌ను డస్ట్‌బిన్ లోపల వేయటానికి ప్రయత్నిస్తుంది. కొద్దిసేపు ప్రయత్నించి దాన్ని లోపలపడేసి ఎగురుకుంటూ వెళ్లిపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికాకు చెందిన ఓ వ్యక్తి స్టాన్స్ గ్రౌండెడ్ అనే ట్విటర్ ఖాతాలో ఉంచాడు. దీంతో ఆ కాకి సోషల్ మీడియా ఫేమ్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు ‘‘కాకులు చాలా తెలివైనవి.. ఆ కాకిని చూసి మనిషి బుద్ది తెచ్చుకోవాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి : మహిళ అతి తెలివి.. గోధుమ పిండితో.. -
అతడి దశ మార్చిన కాకి
సాక్షి, బెంగళూరు : ఉపాయం ఉంటే ఏదీ వృథా కాదు. ఉడుపి జిల్లా కాపుకు చెందిన ఒక యువకుడు కాకిని ఒక వ్యాపార వస్తువుగా ఉపయోగిస్తున్నారు. పిండ ప్రదానాల్లో వంటకాలను కాకితో తినిపించడం ద్వారా కాసులు ఆర్జిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే మూడు, హిందూ సంప్రదాయం ప్రకారం 11 రోజుల వైకుంఠ సమారాధన రోజున వారికి ఇష్టమైన వంటకాలను వండి బయట నైవేద్యంగా పెడతారు. ఆ వంటకాలను కాకి ముట్టుకుంటే చాలని భావిస్తారు. ఆ తరువాతే బంధువులకు తిథి భోజనం వడ్డిస్తారు. ఇదే ప్రశాంత్‌పూజారి అనే యువకునిలో ఆలోచన రేకెత్తించింది. పల్లెల్లో ఎక్కడైన కాకులు కనపడుతాయి. మరీ పట్టణాలు, నగరాల్లో వాటి సంతతి క్షీణిస్తోంది. తిథి వంటకాలను కాకులు ముట్టుకోవడం ఎంతోసేపు నిరీక్షిస్తే కానీ జరగడం లేదు. ఈ లోటును ఉడుపి సమీపంలో కాపులోనున్న ప్రశాంత్ పూజారి పెంచుతున్న కాకి తీర్చుతోంది. కరావళి ప్రాంతం లో కాకులు లేకపోవటంతో ప్రశాంత్‌పూజారి దశ తిరిగింది. చాలా డిమాండ్ ఇది ప్రశాంత్‌కు ఎంతో సంతృప్తినిచ్చింది. ఇలా అనేక మంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న ప్రశాంత్ తన వద్ద సమారాధనలకు కాకి దొరుకుతుందని ఫేస్బుక్లో సందేశం పెట్టాడు. దీనిని తెలుసుకున్న వారు అతనికి ఒకరోజు ముందుగా ఫోన్ చేసి పిలుపిస్తారు. అలా కాకితో అతడి తల రాత మారిపోయింది. పిలిపించుకున్నవారు అతనికి పారితోషికంతో పాటు మర్యాదులు ఇస్తాన్నారు. డిమాండ్ పెరగటంతో నేడు ముందుగానే బుకింగ్ చేసుకొనే స్థాయికి తన వ్యాపారం పెరిగిందని ప్రశాంత్ చెప్పాడు. రూ.500 నుంచి రూ.2 వేల వరకు డబ్బులిస్తున్నారు. ఉడుపి ప్రాంతంలో కాకుల సంఖ్య చాలా తక్కువ కావడంతో అతడికీ మంచి డిమాండ్ పెరిగింది. ఎంత డబ్బులైన ఇస్తామంటూ కాకిని రప్పించుకోని కార్యాలను పూర్తి చేస్తున్నారు. కొందరు అతడిని కారులో తీసుకోచ్చి కారులోనే పంపుతున్నారు. నా కాకికి డిమాండ్ ఉంది, నేను డిమాండ్ చేయటం లేదు అని ప్రశాంత్ తెలిపాడు. ఓ రోజు తన ఇంటి ముందున్న చెట్టు మీద గూడు నుంచి మూడు కాకి పిల్లలు పడిపోయాయి. వాటిని చూసిన ప్రశాంత్ పూజారి మూటింటిని ఒక బుట్టలో ఉంచి పెంచుతుండగా రెండు పిల్లలు చనిపోయాయి. ఒక్కటి మాత్రమే బతికింది. దీనికి అతడు ముద్దుగా రాజా అని పేరు పెట్టుకున్నాడు. కొన్నిరోజులకు సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు మూడు రోజుల శాస్త్రం చేశారు. వంటకాలు వండి పల్లెంలో పెట్టారు. ఏ కాకి రాలేదు. దీనితో తన కొడుకుపై ఎవరికీ ప్రేమలేదని మృతుని తల్లిదండ్రులు చింతించసాగారు. మళ్లీ 11వ రోజు వైకుంఠ సమారాధనకు కాకి ముట్టుకోకుంటే ఏమిటని యోచనలో పట్టారు. మృతుడి సమీప బంధువుకు ప్రశాంత్ పూజారి గురించి తెలిసి ఫోన్‌చేసి పిలిపించాడు.తన కాకితో వంటకాలను తినిపించి ఆ కన్నవారి శోకాన్ని కొంచెం తీర్చాడు. -
ఫ్రాన్స్‌లో కాకులకు ‘చెత్త’ పని!
కుండలో అడుగులో ఉన్న నీళ్లను రాళ్లు వేసి నీళ్లు పైకొచ్చాక దాహం తీర్చుకున్న తెలివిగల కాకి కథ.. గుర్తుంది కదా! ఈసారి వెరైటీగా కాకులు చెత్త ఏరివేతకు సిద్ధయయ్యాయి. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత థీమ్ పార్కు పుయ్ డు ఫౌలో ఆరు కాకుల ముక్కులకు బృహత్తర పని అప్పజెప్పారు. వాటి పనల్లా నేలపై పడిన సిగరెట్ ముక్కలు, ఇతర చెత్తా చెదారాన్ని తీసుకెళ్లి చెత్తబుట్లలో వేయడమే. కాకపోతే ట్రైనింగ్ ఇచ్చారు లెండి. ‘పార్కును శుభ్రంగా ఉంచాలన్నది ఒకటే మా లక్ష్యం కాదు.. పర్యావరణం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్వయంగా ప్రకృతి మనకు నేర్పుతుందనే విషయాన్ని చాటి చెప్పడం కూడా తమ ఉద్దేశ’మని పార్కు ఉన్నతాధికారి నికోలస్ డి విల్లీయర్ అంటున్నారు. కాకులు తమ తెలివితేటలను ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. కాకులకు సమస్యను పరిష్కరించే సత్తా ఉందని ఈ ఏడాది ప్రారంభంలో తయారు చేసిన ఒక వెండింగ్ మెషీన్ ద్వారా శాస్త్రజ్ఞులు నిరూపించారు. ఒక ప్రత్యేక సైజ్ కాగితం ముక్కను యంత్రంలో వేస్తేనే యంత్రంలో ఉంచిన ఆహారం బయటికి వస్తుంది. కాకులు ఈ ఫీట్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాయి. యంత్రంలో ఏ సైజ్ కాగితపు ముక్కలను వేయాలనేది గుర్తుంచుకుని.. ఆ మేరకు పెద్ద సైజ్ కాగితాన్ని సైతం చిన్న ముక్కలుగా చేసి యంత్రంతో వేయడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఏదేశమైనా ఎక్కడైనా.. నీకు హేట్సాఫ్ కాకీజీ! -
జాతీయ పక్షిగా కాకి!
సాక్షి, బెంగళూర్ : విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి బీజేపీపై విరుచుపడ్డారు. శనివారం మండ్యాలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే తన ప్రాణాలకు గ్యారెంటీ ఉండబోదన్న ప్రకాశ్ రాజ్.. కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలంటూ వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ గనుక అధికారంలోకి వస్తే నన్ను ఏదో ఒకటి చేయటం మాత్రం ఖాయం. ఈ మధ్యే కలబురగిలో బీజేపీ నేతలు నాపై దాడికి యత్నించారు. నా కారుపై రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు అధికారంలోకి వచ్చాక నన్ను వదిలేస్తారా?. ప్రశ్నించటమే నా తప్పు అయితే ఇది ప్రజాస్వామిక దేశం ఎలా అవుతుంది?’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. భారత్‌ను హిందూ దేశం అనటాన్ని తాను వ్యతిరేకిస్తానన్న ప్రకాశ్ రాజ్.. కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ హిందువులు ఎక్కువగా ఉన్నారని వాళ్లు(హిందూ అతివాద సంస్థలు) భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తున్నారు. మరి దేశంలో నెమళ్ల సంఖ్య కన్నా కాకులు కోకోల్లలుగా ఉన్నాయి. అలాంటప్పుడు కాకినే జాతీయ పక్షిగా ప్రకటించటమే ఉత్తమం!. కేవలం ఒక మతం ఆధారంగా దేశానికి ముద్ర వేయటం మూర్ఖత్వమే అవుతుంది’ అని ఆయన అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. -
ఇంటికి నిప్పు పెట్టిన కాకి!
శ్రీకాకుళం రూరల్: కార్తీక మాసం సందర్భంగా దేవాలయంలో వెలిగించిన దీపాన్ని ఒక కాకి ఎత్తికెళ్లి ఇంటిపై పాడేసింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగమైంది. మండలంలోని బలివాడ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇందులో బలివాడ వెంకటరమణ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కార్తీక మాసపు రోజులు కావడంతో అదే గ్రామంలో ఓ కోవెల వద్ద పెట్టిన నైవేద్యపు దివ్వెను ప్రసాదంతో పాటు ఓ కాకి ఎత్తుకెళ్లి వెంకటరమణ ఇంటిపై పడేసింది. ఇది వ్యాపించడంతో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వారు వచ్చి మంటలను అదుపుచేశారు. ఇందులో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.