నమ్మకం: కాకి వాలిందా!
నల్లగా ఉంటే కాకిలా ఉన్నావంటారు. గట్టిగా గోలచేస్తే కాకిలా అరుస్తావెందుకు అంటారు. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. నెగటివ్‌గా (కొన్నిసార్లు పాజిటివ్‌గా కూడా) ఏం చెప్పాలన్నా కాకిని పోలుస్తూ చెప్పడం అలవాటైపోయింది అందరికీ. కాకికి అంత ప్రాధాన్యత ఎందుకొచ్చింది? కాకి చుట్టూ ఏవైనా నమ్మకాలు ఉన్నాయా? అవి నమ్మకాలేనా లేక నిజాలా?
ఇంటి గోడ మీద నిలబడి ఠీవిగా అరుస్తూ ఉంటారు కాకిగారు. అది వినగానే... ‘కాకి అరుస్తోంది, ఎవరైనా చుట్టాలొస్తారో ఏమో’ అంటూ దీర్ఘాలు తీస్తారు బామ్మగారు. కాకి అరిస్తే బంధువులు రావడం ఏమిటి? కాకికి జరగబోయేది తెలుస్తుందా?
ఈ సందేహం చాలామందికి ఉంటుంది. కానీ సమాధానం కొందరికే తెలుసు. కాకి అరిస్తే చుట్టాలొస్తారన్న నమ్మకం ఏర్పడింది రామాయణం వల్ల. ఆంజనేయుడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ లంకకి వెళ్తాడు. అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది. అంటే అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందన్నమాట. అలా ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. పైగా... ఆంజనేయుడు వచ్చాడన్నది సీతమ్మకి శుభవార్త కాబట్టి, కాకి అరిస్తే ఏదో శుభవార్త వస్తుందని కూడా నమ్ముతుంటారు.
ఇది మాత్రమే కాక... భారతదేశంలో కాకికి చాలా ప్రాధాన్యం ఉంది. కాకిని పితృదేవతలకు ప్రతినిధి అంటారు. శ్రాద్ధ కార్యక్రమాలు జరిపించాక, పిండ ప్రదానం చేస్తారు. ఆ పిండాలను కాకి వచ్చి ఆరగిస్తేనే ఆ మరణించిన వారి ఆత్మ శాంతిస్తుందని నమ్ముతారు. అలాగే కాకి చాలా తెలివైన పక్షి అని కూడా అంటారు. కోకిల తన గుడ్లను కాకి గూట్లో పెడితే, అవి పిల్లలు కాగానే కనిపెట్టేస్తుంది కాకి. అన్నీ ఒకలాగే ఉన్నా, కోకిల పిల్లల్ని గుర్తించి వాటిని వెళ్లగొడుతుంది. అందుకే దాన్ని తెలివైన పక్షిగా పేర్కొంటారు.
ఇలా మనదేశంలో చాలా ప్రశంసల్ని పొందుతోంది కాకి. చాలా ప్రాధాన్యతను కూడా మూటగట్టుకుంటోంది. అయితే ఇదే కాకి... విదేశాల్లో విలన్ అయిపోయింది. కాకిని అపశకునంగా భావించే దేశాలు చాలా ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్లేప్పుడు కాకి అరిస్తే అశుభమని నమ్మేవాళ్లు ఉన్నారు. ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు కనుక కాకి అరిస్తే, ఆ పని ఎప్పటికీ పూర్తి కాదని, పూర్తి అయినా కూడా అపజయమే కలుగుతుందని భావించి భయపడేవాళ్లు కూడా ఉన్నారు. ఇంటి మీద ఒక కాకి ఉంటే ఏదో దుర్వార్త, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మంచి వార్త వస్తుందట. కొబ్బరాకు మీద గానీ, తాటాకు మీద గానీ ఉన్న కాకిని చూస్తే... త్వరలోనే మృత్యుదేవత ఇంటి తలుపు తడుతుందట. కాకి కనుక కిటికీ తలుపును గుద్దుకుంటే, ఆ ఇంట్లోని వారో, వారికి సంబంధించినవారో చనిపోతారట. అదే తెల్ల కాకి విషయంలో మాత్రం ఈ నమ్మకాలన్నీ రివర్స్ అవుతాయి. కొన్ని దేశాల్లో నలుపును సృజనాత్మకతకు చిహ్నంగా భావిస్తారు. అలాంటి చోట్ల నల్ల కాకిని అదృష్టంగా భావిస్తున్నారు. కానీ మిగతా అన్ని చోట్లా... నలుపు పాపానికి, వేదనకు గుర్తు కాబట్టి కాకి కూడా వేదనకారకమేనని నమ్ముతున్నారు.
ఒక మామూలు పక్షి, ఓ చిన్ని అల్పప్రాణి మనిషికి అంత దురదృష్టాన్ని ఎలా తెచ్చిపెడుతుంది? ప్రాణాలు పోయేంత అశుభాన్ని ఎందుకు తీసుకొస్తుంది? ఈ ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేవాళ్లు ఎవరూ లేరు. అందుకే ఇవి ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఎన్నో అపోహలు నమ్మకాలుగా చెలామణీ అయిపోతున్నాయి.
ఇంటి మీద ఒక కాకి ఉంటే దుర్వార్త, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మంచి వార్త వస్తుందట. కొబ్బరాకు లేదా తాటాకు మీద ఉన్న కాకిని చూస్తే... మరణం సంభవిస్తుందట.