
చైల్డ్ అబ్యూజ్
పసిపిల్లలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వాడుకునే నీడలు ఎక్కువ. నీడలు వారిని బంధిస్తాయి వారితో చెడు పనులు చేస్తాయి వారి పసితనాన్ని అశుభ్రం చేస్తాయి.
నీడలు ఈ పనికి దేవుణ్ణో, దెయ్యాన్నో తోడు తెచ్చుకుంటాయి. తల్లిదండ్రులు స్వయంగా తీసుకెళ్లి అమాయకత్వంతోనో మూర్ఖత్వంతోనో పిల్లల్ని ఈ నీడలకు అప్పగిస్తారు. పిల్లలు పులి నోటికి చిక్కుతారు. న్యాయం ఎప్పుడోగాని ఉదయించదు. జమ్ము–కశ్మీర్‌లో మంత్రాల పేరు చెప్పి పిల్లలను లైంగికంగా వేధించిన బాబాకు
శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉద్వేగంగా కవిత రాశారు. భయం లేని వేకువకై ప్రార్థించారు.
జనవరి, 2021.
మదనపల్లె ఘటన అందరికీ గుర్తుంది. మూఢ విశ్వాసం నెత్తికెక్కి ఇద్దరు ఎదిగొచ్చిన కుమార్తెల ఉసురు తీశారు తల్లిదండ్రులు. చనిపోయాక వారు సత్యయుగంలో జన్మిస్తారట. అందుకోసమని బతికుండగానే సమాధి చేశారు.
ప్రాణం పోయడం దైవం. ప్రాణం తీయడం దెయ్యం.
అక్టోబర్, 2024.
చత్తిస్‌గఢ్‌లోని శక్తి జిల్లా.
తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇద్దరు కుమారులను గొంతు పిసికి చంపేసింది. తర్వాత ఉజ్జయినీ నుంచి తెచ్చుకున్న ఒక ‘గురువు’ ఫొటో పెట్టుకొని ఆ చనిపోయిన కుమారులనుప్రాణాలతో లేచేందుకు మంత్రాలు చదవడం మొదలెట్టింది. ఇదంతా ఆమె తంత్ర సాధనలో భాగమట.
కడుపున పుట్టిన వారినే కాటేసే గుడ్డితనమే అంధ విశ్వాసం.
జూన్, 2024.
తమిళనాడులోని అలియలూరు జిల్లా.
లేక లేక మనవరాలు పుడితే ఆ పుట్టిన శకునం బాగ లేదని స్వయంగా తాతే ఆ పసికూన ప్రాణాలు తీశాడు. ఆ శకునం కుటుంబానికి హానికారక సూచన కనుక ఈ పని చేశాడట.
చేతులతో పూజ చేయడం భక్తి. అదే చేతులతో పీక పిసకడం మూఢ భక్తి.
ఫిబ్రవరి 18, 2025.
జమ్ము–కశ్మీర్‌లోని సొపోర్ నగర కోర్టులో చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ మీర్ వజాహత్ ఒక 123 పేజీల తీర్పును వెలువరించారు. ఆ తీర్పు అంతా మూఢ విశ్వాసాల వల్ల చిన్నపిల్లల మీద సాగుతున్న దౌర్జన్యాల పట్ల, అకృత్యాల పట్ల ఆవేదన. కారణం? ఆ తీర్పు ఏజాజ్ అహ్మద్ అనే దొంగబాబా పసిపిల్లల మీద సాగించే అకృత్యాల మీద కావడం. ఈ ఘోరాన్ని ఆ బాబా ఏళ్ల తరబడి కొనసాగిస్తూ ఉండటం. విషయం తెలియకనే తల్లిదండ్రులు అందులో భాగం కావడం.
ఏం జరిగింది?
జమ్ము–కశ్మీర్‌లో ‘పీర్ బాబా’గా పేరుబడ్డ ఏజాజ్ షేక్ దగ్గరకు చాలా మంది తమ దైనందిన బాధల నుంచి విముక్తి కోసం వచ్చేవారు. అనారోగ్యం, ఆర్థిక బాధలు, తగవులు... వీటికి విరుగుడు కోసం ఆయన దగ్గరకు మంత్ర తంత్రాలకు వచ్చేవారు. అయితే ఇక్కడే ఆ బాబా ఒక చిట్కా పాటించేవాడు– ‘మీ కష్టాలు పోవడానికి దైవ సహాయం కంటే ‘జిన్ను’ (భూతం)ల సాయం మంచిది. జిన్నులతో మాట్లాడి పరిష్కారం చేస్తాను. అయితే జిన్నులు పెద్దల కంటే పిల్లలతో మాట్లాడటానికి ఇష్టపడతాయి. మీరు మీ పిల్లల్ని (అబ్బాయిల్ని) తెచ్చి నాకు అప్పగిస్తే తంత్రాలు ముగిశాక మళ్లీ మీకు అప్పగిస్తాను’ అనేవాడు. అమాయక/ఆశబోతు తల్లిదండ్రులు ఈ మాటలు నమ్మి తమ పిల్లల్ని బాబా దగ్గరకు తీసుకెళ్లేవాళ్లు.
పదేళ్లలోపు మగపిల్లలు
ఈ బాబా చేతిలో బాధితులుగా మారిన వారందరూ పదేళ్ల లోపు అబ్బాయిలే. బాబా వారిని పూజ పేరుతో నగ్నంగా మార్చి అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవాడని ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. పిల్లల్ని భయపెట్టేందుకు బాబా తనలోనే ‘జిన్’ ఉందని, అది అన్ని కష్టాల నుంచి దూరం చేస్తుందని, కోరికలు నెరవేరుస్తుందని చెప్పి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. కొందరు పిల్లలు నాలుగైదు ఏళ్లపాటు ఇతని వల్ల బాధ పడ్డారు. భయం వల్ల, ఆ బాబా స్కూల్ టీచర్ కూడా కావడం వల్ల నోరు మెదపలేక తల్లిదండ్రులు బాబా దగ్గరికెళ్దామంటే వారు మొండికేయడం మొదలెట్టారు. అప్పుడు గాని పెద్దలకు అనుమానం రాలేదు. ఒక బాలుడు తెగించి తండ్రికి జరిగేది చెప్పడంతో బండారం బయటపడింది.
శిక్ష పడింది
2016లో బాబా అకృత్యాలు బయటపడి బేడీలు పడ్డాయి. అప్పటి నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న బాబాకు ఫిబ్రవరి 18న న్యాయమూర్తి మీర్ వజాహత్ 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు భక్తి, విశ్వాసాలను జనం బలహీనతగా ఎంచి దొంగ వేషగాళ్లు పసిపిల్లలను కబళించడంపై న్యాయమూర్తి తీవ్రమైన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి బాబాలు మొత్తం విశ్వాస ప్రపంచానికి విఘాతం కలిగిస్తారన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం కేసు మీద ఒక లోతైన, సంకేతపూర్వకమైన కవిత రాశారు. ఎంత కదిలిపోతే ఇంత గాఢమైన కవిత వస్తుందనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
జస్టిస్ మీర్ వజాహత్ రాసిన కవిత
విశ్వాసపు గుసగుసలు...
భయవిహ్వల పెనుకేకలు
వెలుగు దుస్తులు ధరించి నిలిచిన వాడు
కారు చీకటిలో దారి చూపుతానని మాటిచ్చాడు
గుసగుసగా మంత్రాలు జపిస్తూ తన పవిత్ర హస్తాలతో
అంగలార్చే నేలలో విశ్వాసపు బీజాన్ని నాటాడు
సాంత్వనకై వెదుకుతూ అభయానికై తపిస్తూ
వి΄్పారిన నేత్రాలతో చేరవచ్చిందొక పసితనం
కానీ ఆ వెలుగుల మాటున చీకటి నీడలు
గడ్డకట్టిన మంచులా వణికించిన గుసగుసలు
‘భూతమంటే భయమేలే కానీ నాపై నమ్మకముంచు
నిన్ను బయటపడేసే తాళంచెవి నా దగ్గరుంది’
పవిత్ర వేషంలో మాటలే సంకెళ్లు
ఇక గొంతు దాటని రోదన... విశ్వాసం గల్లంతు
చెప్పినట్టు, తాకినట్టు, దయగా చూసినట్టు
మాయామంత్రాల మత్తుగాలి... ఆశలను బూడిద చేస్తూ
కానరాని వలయాల్లో సుళ్లు తిరిగిన ఉత్త మాటలు
ఇక మిగిలింది కలవర పెట్టే పీడకలలు
ఏళ్లు గడిచిపోతాయి... పుళ్లు సలుపుతూనే ఉంటాయి
కాని ఆ నొప్పి వెనుక దాగి వెంటాడే ఆనాటి గుసగుసలు
చీలికలైనదేదీ అతుకు పడనే లేదు
నిబద్ధమై ఉండాల్సిన ఆత్మ గాలివాటుగా పరిభ్రమిస్తూ
కాని నిజం తలెత్తుకుని నిలబడుతుంది
జాతకాలు తలకిందులవుతాయి
న్యాయానికి ఎదురు నిలవక నీడలు చెదిరిపోతాయి
గాయాల ఆనవాళ్లు మాసిపోవేమోలే కానీ
భయం లేని వేకువలో భళ్లున తెల్లారుతుంది
Comments
Please login to add a commentAdd a comment