Belief
-
శాస్త్రీయమైతే సంప్రదాయానికి విలువ
సంప్రదాయ విజ్ఞానం ముఖ్యమైనది. కానీ దానిలోని దురవగాహనలకు తప్పక అడ్డుకట్ట వేయాలి. విమర్శ స్ఫూర్తిని అభివృద్ధి చేయడాన్ని రాజ్యాంగం ఒక విధిగా నిర్దేశించిన భారత్ వంటి దేశంలో నిపుణులు తప్పుడు సమాచారంపై కూడా యుద్ధం చేయాలి. ప్రసవ సమయంలో ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేయడానికి ఉన్న ప్రాధాన్యతపై, ఆధునిక తల్లితండ్రులకు అపసవ్యతలు, మానసిక వ్యాధులతో పిల్లలు ఎందుకు పుడుతున్నారు అనే అంశంపై చర్చ నడుస్తోంది. దీనికి సంస్కార లేమిని కారణంగా చూపుతున్నారు. శాస్త్రీయ, సామాజిక, నైతిక స్థాయిల్లో ఇలాంటి ఆలోచన తప్పు. పిల్లల జెండర్ కారణంగా మహిళలను సంప్రదాయికంగా నిందిస్తున్న వాతావరణం గురించి ప్రతి డాక్టర్ కూడా జాగరూకతతో ఉండాలి. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం కాదు. అది అభివృద్ధికి పరాకాష్టగా ఉండి పతనమైంది, మళ్లీ వృద్ధి చెందుతోంది. ఒకప్పుడు మనకు విలువైన సంప్ర దాయ విజ్ఞానం ఉండేది. అయితే ఇప్పుడది ఆధునిక శాస్త్రీయ మదింపునకు గురికావలసి ఉంది. పైగా సంప్రదాయ విజ్ఞానానికి తగిన సాక్ష్యాధారం లేదని భావిస్తున్నారు. కానీ ఆరోగ్య రంగంలో, స్వావలంబనతో కూడిన జీవన ఆచరణలు ఆయుర్వేదంలో సమృద్ధిగా ఉన్నాయి. ఆధునిక వైద్యం ఇప్పుడు వాటినే ప్రతిధ్వనిస్తోంది. ఉదా హరణకు, ప్రేవుల ఆరోగ్యం(గట్ హెల్త్), పలురకాల ఆరోగ్యకరమైన ఆహార రకాల లక్షణాలను, వంటల పద్ధతులను ఆయుర్వేదం చాలా కాలంగా నొక్కి చెబుతోంది. ఆహారం, ప్రేవుల్లోని సూక్ష్మజీవులు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయనే అంశాన్ని ఆధునిక సైన్స్ ఇటీవల మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. అయితే సంప్రదాయ విజ్ఞానం మూఢనమ్మకాలతో, దురభిప్రా యాలతో కూడి ఉంటోంది. వ్యక్తికీ, సమాజానికీ హాని కలిగించకుండా వీటిని తప్పక వడపోత పోయాలి. వైద్యంలో నిరూపించాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తప్పు సూచన ఇస్తే అది మానవ ప్రాణాలకే ప్రమాదకరం. సందేహాస్పదమైన మూలికా సప్లిమెంట్ల కారణంగా ఆరోగ్యవంతమైన ప్రజల్లో కూడా కాలేయం దెబ్బతింటున్న కేసులు పెరుగుతున్నాయి. వీటన్నింటికీ ఉత్తమమైన వైఖరి ఆరోగ్యపరమైన సంశయవాదమే. అప్పుడు మాత్రమే మూలంతో పనిలేకుండా కొత్త ఆలోచనలు మనలో తెరుచుకుంటాయి. ఏదైనా నిరూపితం కాని కొత్త ఆలోచన కనిపించినప్పుడు, మూడు కోణాల్లోని కచ్చితమైన ప్రమాణాలతో దాని లబ్ధిని పరీక్షించాల్సి ఉంటుంది. మొదటిది, శాస్త్రీయ ఆమోదయోగ్యత. రెండు, జరిగే హానిని పరిశీలించడం. మూడు, నిర్దిష్ట శాస్త్రీయ సంభావ్యత. శాస్త్రీయ వైద్య ఆచరణలో మేళనం వైపుగా సాక్ష్యాన్ని తీసుకురాదగిన సంభావ్యత ఇది. సైన్స్, సైంటిఫిక్ మెథడ్ ద్వారా సత్యాన్ని వెంటా డటం భవిష్యత్ సమగ్ర వైద్యశాస్త్రపు సారాంశం. అలాంటి మార్గాన్ని చాలా సంస్థలు సిఫార్సు చేశాయి. వీటిలో మూఢ నమ్మకాలను పాతిపెట్టిన వారి నుంచి, నీతి ఆయోగ్ వంటి భారతదేశ పరివర్తనకు మార్గదర్శకత్వం వహిస్తున్న సంస్థల వరకు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఇది సవాలుతో కూడుకున్నది. ఇటీవలే, ఏకీకరణ వైద్యానికి సంబంధించి మాతృ, శిశు వైద్యుల సమావేశం ఒకటి జరిగిందని మీడియా కథనాలు వెలువరించాయి. ఇందులో నా పూర్వసంస్థ అయిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సీనియర్ ఫ్యాకల్టీ కూడా పాల్గొ న్నారు. అయితే ఆ కథనంలో కొన్ని భాగాలు అశాస్త్రీ యంగా ఉండటం ఇబ్బంది కలిగించింది. పుట్టబోయేవారికి సంబంధించిన తల్లుల లింగపరమైన అంచనాలు పిల్లల్లో స్వలింగ సంప ర్కానికి దారితీయవచ్చనేది అందులో ఒకటి. ఉదాహరణకు ఆడ పిల్లను కోరుకుంటున్న గర్భిణి మగపిల్లాడిని హోమోసెక్సువల్ (స్వలింగ సంపర్కి)గా పెరిగేట్టు చేస్తుందనే ఆలోచన హాస్యాస్పదం. జీజాబాయి(శివాజీ తల్లి) ప్రార్థనలను గర్భవతిగా ఉన్నప్పుడు అను సరిస్తే ‘హిందూ నాయకుల’ లక్షణాలతో పిల్లలు పుడతారన్న సూచ నలు ఆందోళనకరం. ప్రసవ సమయంలో ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేయ డానికి ఉన్న ప్రాధాన్యతపై, ఆధునిక తల్లితండ్రులకు అపసవ్యతలు, మానసిక వ్యాధులతో పిల్లలు ఎందుకు పుడుతున్నారు అనే అంశంపై చర్చ నడుస్తోంది. దీనికి సంస్కార లేమిని కారణంగా చూపుతున్నారు. శాస్త్రీయ, సామాజిక, నైతిక స్థాయిల్లో ఇలాంటి ఆలోచన చాలా తప్పు. అంతిమ సమగ్ర మొత్తం దాని విడిభాగాల మొత్తం కంటే తక్కువగా ఉండదని మనం ఎలా నిర్ధారించాలి? పలువురు ఆయుర్వేద సహచరులు ఈ చర్చను ‘గర్భసంస్కార్’పై వక్రీకరించిన వైఖరి అని తోసిపుచ్చారు. ప్రసవ సమయంలో ఆరోగ్యకరమైన ఆచరణల ప్రాధాన్యత గురించే గర్భసంస్కార్ మాట్లాడుతుంది. భవిష్యత్తు పిల్లల ఆరోగ్యాన్ని బాహ్య జన్యు ప్రభావాల ద్వారా ఇది ప్రభావితం చేస్తుంది. ఈ మీడియా నివేదికల గురించి ఎయిమ్స్‌లో శిక్షణ పొందిన డాక్టర్ల బృందంలో చాలామంది జాగ్రత్తగా ఉండాలన్నారు. అయితే ఇలాంటి ఆలోచనలు, ఆచరణలు అంత హానికరం కాదని మరి కొంతమంది భావించారు. అలాంటి నివేదికల్లో మంచి భాగాన్ని ప్రజలు తీసుకోవచ్చనీ, మిగతా వాటిని వదిలేయాలనీ వీరు సూచించారు. వీరి దృష్టిలో, సాక్ష్యాధారం లేక పోవడం అంటే సాక్ష్యం లేదని అర్థం కాదు. పైగా మనం సంప్ర దాయాల గురించి మరీ విమర్శనాత్మకంగా ఉండకూడదన్నది వీరి ఆలోచన. భారత్‌లో సమగ్ర పరిశోధనల నిర్వహణకు ఈ రెండో వైఖరి ఎంతమాత్రమూ ఉపకరించదు. ఆయుర్జీనోమిక్స్ అనేది ఆయుర్వేద భావనలు, జీనోమిక్ పరిశోధనల సంగమం. దీనికి నా పూర్వ సంస్థ సీఎస్ఐఆర్–ఐజీఐబీ విజయవంతంగా నేతృత్వం వహించింది. ఎందుకంటే మేము నిజా యితీతో కూడిన శాస్త్రీయ చర్చలు జరిపేవాళ్లం. ఆ చర్చల్లో మేము ఆయుర్వేద టీమ్‌కు సాక్ష్యాధారాల గురించి సవాల్ విసిరేవాళ్లం. ఒక పక్షం నిపుణులు మరొక పక్షంలోని వాళ్లను ప్రశ్నించకూడదని భావిస్తుంటారు. ఇలాంటి వైఖరి తెలివితక్కువతనంతో కూడింది. ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరంగా మారుతుంది. సహకారం అందించు కునే సమయాల్లో శాస్త్రీయ సంభావ్యతల సరిహద్దులను మేం పాటించేవాళ్లం. వాటిని తరచుగా తిరిగి సందర్శించేవాళ్లం. నూతన జ్ఞానాన్ని గుర్తించేవాళ్లం. ఇది అర్థవంతమైన సహకారాన్ని వేగవంతం చేసేది. మరోవైపున అర్థరహితమైన వాటిని తొలగించేవాళ్లం. పైగా, మహి ళలు తప్పుడు సమాచారపు పర్యవసానాలను ఎదుర్కొంటున్న భారత్ వంటి భిన్నమైన సమాజంలో వాస్తవికతల నేపథ్యంలో మాత్రమే మనం ఫలితాన్ని వీక్షించవలసిన అవసరం ఉంది. సీనియర్ నిపుణుల ద్వారా ప్రచారమయ్యే తప్పుడు విశ్వాసాలకు పర్యవసానాలు ఉంటాయి. పైన పేర్కొన్న ఉదాహరణలో, ఇలాంటి చర్చలు పిల్లల్లోని వివిధ సామర్థ్యాలు లేక లైంగిక ధోరణుల కారణంగా తల్లిని నిందించడానికి దారితీస్తాయి. లేదా గర్భిణిపై సామాజిక ఒత్తిడిని కలిగిస్తాయి. పిల్లల జెండర్ కారణంగా మహిళలను సంప్ర దాయికంగా నిందిస్తున్న వాతావరణం గురించి ప్రతి డాక్టర్ కూడా జాగరూకతతో ఉండాలి. అలాంటి సామాజిక అవలక్షణాలకు తప్పుడు సమాచార ప్రచారాన్ని వైద్యులు అనుసంధానించుకోగల గాలి. శాస్త్రీయ ఉ«ధృతిని, మానవవాదాన్ని, విమర్శ స్ఫూర్తిని, సంస్క రణను అభివృద్ధి చేయడం ప్రాథమిక విధిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ (హెచ్)ని కలిగి ఉన్న దేశంలో వైద్య వృత్తిలో ఉన్నవాళ్లు చేయ వలసింది చాలానే ఉంది. ఒక ఆచరణను ప్రశ్నించే లేదా సవాలు చేసే విషయంలో సీని యర్లను లేదా బోధకులను ఆధునిక వైద్య సంస్థలతో సహా భారత్‌లో తగినవిధంగా గౌరవించడం లేదు. పర్యవసానంగా, మనకు మితి మీరిన విశ్వాసం ఉంటోంది తప్పితే సైంటిఫిక్ టెంపర్ ఉండటం లేదు. ఇది తప్పక మారాలి. మన ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాతే ఇత రులతో వ్యవహరించే నమ్మకం మనకు వస్తుంది. మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నట్లే ఇతరుల ఆచరణలను కూడా మనం శాస్త్రీయంగా ప్రశ్నించగలం. చిట్టచివరగా, ఈ ప్రపంచంలో మ్యాజిక్ లేదు, సర్వత్రా సైన్స్ మాత్రమే ఉంది. అనురాగ్ అగర్వాల్ వ్యాసకర్త డీన్, బయోసైన్సెన్ అండ్ హెల్త్ రీసెర్చ్, అశోకా యూనివర్సిటీ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సమాధులు తవ్వి చనిపోయిన వాళ్ల దాహం తీరిస్తే వానలొస్తాయట!
సమాధులు తవ్వితే ఎముకలొస్తాయి. కానీ... సమాధులు తవ్వి చనిపోయిన వాళ్ల దాహం తీరిస్తే వానలొస్తాయని నమ్ముతున్నారు. ఎక్కడో కాదు.. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా కలకేరిలో కొన్ని రోజులుగా వానలు పడకపోవడంతో చనిపోయినవాళ్ల శాపమేనని నమ్మిన గ్రామస్తులు... గత నెలలో మరణించినవాళ్ల జాబితా తీశారు. వాళ్ల సమాధులకు తల ఎటువైపున్నాయో కుటుంబ సభ్యుల సహాయంతో గుర్తించారు. తలకు రెండు అడుగుల దూరంలో ఓ గుంత తవ్వి చనిపోయిన వాళ్ల నోరువైపుగా పైపు పెట్టి వాటర్ ట్యాంకర్‌తో నీటిని వదిలారు. 25 సమాధులకు అలా నీటిని పోసి, ప్రక్రియ పూర్తి చేసిన కొద్దిసేపటికే వర్షపు జల్లులు ప్రారంభమయ్యాయట. .3వేల జనాభా ఉన్న కలకేరి గ్రామస్తుల్లో ఈ నమ్మకం కొన్నేళ్ల కిందటే బలపడింది. నోరు తెరిచి చనిపోయిన ఓ వృద్ధుడి నోటిని మూయకుండానే ఖననం చేశారట. అప్పటినుంచి వానలు పడక... గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చిందట. ఓ జ్యోతిష్యుడి దగ్గరకెళ్లి అడిగితే... చనిపోయిన వృద్ధుడి గురించి చెప్పాడట. వెంటనే వెళ్లి అతని సమాధిని తవ్వి నీటిని పోస్తే... వర్షం వచ్చిందట. ఇక అప్పటినుంచి దాన్నే నమ్ముతూ వానలు రానప్పుడల్లా పాటిస్తున్నారు గ్రామస్తులు. ఈ వింత నమ్మకాలు మనదేశంలోనే కాదు..ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. గ్రామంలో వానలు బాగా పడాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఇటీవల ఓ మెక్సికన్ మేయర్ మొసలినే పెళ్లి చేసుకున్నాడు. చదవండి: మాజీ సీఎంకు ఊహించని చేదు అనుభవం.. మహిళ చేసిన పనికి షాక్ -
ప్రజావైద్యంపై నమ్మకం పెరిగింది
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్స్ పథకం అమలు, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుప ర్చడం వల్ల ప్రజల్లో ప్రజావైద్యంపై నమ్మకం పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఎక్కువ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. మాతాశిశు రక్షణలో అమ్మ ఒడి (102) సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ఏర్పాటు చేసిన 200 అదనపు వాహనాలను, పట్టణాల్లో అత్యవసర వైద్యసేవలు అందించే 50 బైకు అంబులెన్స్‌లను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. గ్రామాల్లో పర్యటించేందుకు ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సిల్లీ
గాఢ నమ్మకం ఓ ఊళ్లో ఒక వ్యక్తి పిల్లిని పెంచుకునేవాడు. అది ఎప్పుడు చూసినా చెంగుచెంగుమని తిరుగుతూ ఉండేది. అందరి కాళ్లకీ అడ్డుపడుతూ ఉండేది. అది పక్కింటి పెద్దాయనకి నచ్చేది కాదు. బైటికెళ్లినప్పుడు అది కానీ ఎదురు పడిందో... కోపం నషాళానికి ఎక్కేది. వెంటనే దాని యజమాని దగ్గరికెళ్లి గొడవ పెట్టుకునేవాడు. ఓరోజు సాయంత్రం కూడా అలాగే గొడవకు వెళ్లాడు. ‘ఈరోజు నీ పిల్లి ఎదురు రావడం వల్ల నా కొడుకు ఇంటర్వ్యూలో ఫెయిలయ్యాడు, వాడికి ఉద్యోగం రాలేదు, పనికిమాలిన పిల్లి’ అంటూ తిట్టాడు. అప్పుడు యజమాని అన్నాడు... ‘నా పిల్లి ఎదురు రావడం వల్ల నీ కొడుక్కి ఉద్యోగమే రాలేదేమో, నీ కొడుకు ఎదురు రావడం వల్ల నా పిల్లి ప్రాణమే పోయింది. మధ్యాహ్నం లారీ కింద పడి అది చచ్చిపోయింది.’ ఇది విన్నప్పుడు ఆ పెద్దాయన రియాక్షన్ ఎలా ఉండివుంటుంది? బాధపడి ఉంటాడా? సిగ్గుపడి ఉంటాడా? లేక ఆ రోజు నుంచీ ఆ మూఢ నమ్మకాన్ని వదిలేసి ఉంటాడా? పైన చెప్పుకున్నది ఎవరో రాసిన కథ. కానీ నిజానికది సమాజంలో ప్రతిరోజూ కనిపించే ఓ వాస్తవం. పిల్లి ఎదురుపడితే అపశకునం. నల్లపిల్లి అయితే మరీను. అది ఎదురొస్తే చెడు తప్ప మంచి జరగదు అంటారు. అలా అని ఎవరు చెప్పారు అంటే మాత్రం సమాధానం ఉండదు. ఎందుకంటే... సమాధానం ఎవరికీ తెలీదు కాబట్టి. నిజానికి చాలా భయాలకు కారణం ఉండదు. కానీ ఏ భయమైనా ఒక్కసారి పుట్టిందంటే... అంత త్వరగానూ పోదు. ఇదీ అంతే. యూరోప్ దేశాల వారికి నల్లపిల్లి అంటే మహా భయం. దురదృష్ట సంకేతమనీ, దుష్టశక్తులకు నిలయమనీ దాని మీద లెక్కలేనన్ని నిందలు మోపుతూ ఉంటారు. ఐర్లండ్ వాళ్లు అయితే మరో అడుగు ముందుకేసి... నల్లపిల్లిని శని అన్నారు. అది కనుక తమ చేతుల్లోనో, ఇంటి చుట్టుపక్కలో చనిపోతే పదిహేడేళ్ల పాటు శని వెంటాడుతుంది అనే కొత్త నమ్మకానికి నాంది పలికారు. మన దేశస్తులకు కూడా నల్లపిల్లిని చూస్తే దడ. అది ఇంట్లోకొస్తే దాని వెనుకే దెయ్యం వస్తుందని నమ్మేవాళ్లు కోకొల్లలు. ఇక చాన్స దొరికింది కదా అని సినిమా వాళ్లు, సీరియళ్ల వాళ్లు నల్లపిల్లికి మరింత మసి పూసేశారు. హారర్ అంటే చాలు... నల్లపిల్లి ఉండాల్సిందే. ఏదో దెయ్యం, నల్లపిల్లి అక్కాచెల్లెళ్లు అన్నట్టుగా రెండిటినీ ముడిపెట్టి చూపిస్తుంటారు. అసలు నల్లపిల్లి అంత పాపం ఏం చేసింది? నిజానికి ఈ మూఢనమ్మకం మధ్య యుగంలో మొదలైందని చెబుతారు. దుష్టశక్తుల్ని పారదోలడానికి అప్పట్లో కొందరు నల్లపిల్లిని బలిచ్చేవారట. అది కాస్తా నల్లపిల్లి చెడ్డది కాబట్టి దాన్ని చంపితే చెడు కూడా పోయి మంచి జరుగుతుంది అన్న నమ్మకంగా మారి పోయింది. అంతే కానీ దీనికంటూ ఓ ఆధారం లేదు. నలుపు చెడ్డది కాబట్టి నల్లగా ఉండే పిల్లి కూడా చెడ్డది అనేస్తే ఎలా? కుక్కలు కూడా నల్లగా ఉంటాయి. అవి ఎదురొస్తే ఏమీ కాదా? స్టైల్‌గా ఉంటామనీ... స్లిమ్‌గా కనిపిస్తామనీ మనం బ్లాక్ డ్రెస్సులు ధరిస్తూ ఉంటాం. మరి ఆ నలుపు చెడ్డది కాదా? మనం వెళ్లిన చోటికి కూడా కీడు రావాలి కదా? నలుపు కేవలం నల్లపిల్లి మాత్రమే ఎందుకు చెడ్డదయ్యింది?! సరైన జవాబు దొరికితే ఇది నమ్మకం. దొరకనంత వరకూ మూఢనమ్మకమే! మైఖేల్ జాక్సన్, మార్లిన్ మన్రో లాంటి కొందరు ప్రముఖులు నల్లపిల్లిని ఎంతో ఇష్టంగా పెంచుకున్నారు. హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టా, బాలీవుడ్ నటి ఆలియా భట్ వంటి మరికొందరు స్టార్సకి కూడా వాళ్లు పెంచుకుంటోన్న నల్లపిల్లి అంటే ప్రాణమట. కొందరు హాలీవుడ్ హీరోయిన్ల పుణ్యమా అని విదేశాల్లో నల్లపిల్లి స్టైల్ స్టేట్మెంట్గా మారింది.పార్టీలకి, ఫంక్షన్లకి వచ్చినప్పుడు చాలామంది హీరోయిన్లు నల్లపిల్లిని చేత పట్టుకుని వస్తుంటారు. నల్లపిల్లి చేతిలో ఉంటే స్టైలిష్‌గానూ రిచ్‌గానూ కన్పిస్తారట. బస్త్ అనే ఈజిప్షియన్ దేవత శరీరం మనిషిలా, తల నల్లపిల్లిలా ఉంటుంది. అందుకే ఈజిప్షియన్లకు నల్లపిల్లి అంటే అమితమైన ప్రేమ. ఒకప్పుడైతే నల్లపిల్లిని ఎవరైనా తక్కువగా చూసినా, హింసించినా మరణ దండన విధించేవారట. కాలక్రమంలో దాన్ని రద్దు చేశారు. స్కాట్లాండ్ వాళ్లకి నల్లపిల్లి అంటే చాలా ఇష్టం. పొద్దున్న లేవగానే దాన్ని చూస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల వారు కూడా నల్లపిల్లిని అదృష్ట సంకేతంగా భావిస్తారు. -
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచండి
గుడ్లూరు, న్యూస్‌లైన్: ఉపాధ్యాయులు అకింతభావంతో పని చేసి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని డీఈఓ రాజేశ్వరరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ జిల్లా స్థాయి విద్యా చైతన్య సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకపోవడంతోనే పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై అభద్రతభావాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుపై ఉందన్నారు. అక్షర ప్రకాశంలో ప్రతి ఉపాధ్యాయుడూ భాగస్వామి కావాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి కాలానికి అనుగుణంగా విద్యా రంగాన్ని సంస్కరించాలన్నారు. స్వార్థ ప్రమోజనాల కోసమే రాష్ట్రాన్ని విడదీస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటంలో యూటీఎఫ్ ముందుందని చెప్పారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ సమైక్యం కోసం పోరాడని సీమాంధ్ర రాజకీయ నాయకులకు పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. విద్యలో జిల్లా వెనకబడి ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు ప్రసంగించారు. సదస్సులో డిప్యూటీ డీఈఓ చాంద్‌బేగం, పీఈఓ వెంకట్రావు, ఎంఈఓ సుధాకరరావు, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెట్ కంచర్ల రామయ్య, దివి శ్రీనివాసులు నాయుడు, రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జాన్ విలియం పాల్గొన్నారు. -
నమ్మకం: అరచేతిలో అంత కథ ఉందా!
అదృష్టం దురదృష్టం: అదృష్టం చేతి గీతల్లో ఉంటుంది అంటారు కొందరు. అయితే కొందరు చేతిలో పుట్టే దురదలో కూడా ఉంటుందంటారు. పలు దేశాల వారు అరచేతిలో పుట్టే దురదతో తమ అదృష్ట దురదృష్టాలను అంచనా వేసుకుంటున్నారు. నమ్మనివారికి ఇది విచిత్రం. నమ్మేవారికి ఓ బలమైన విశ్వాసం. అరచేయి దురదపెడితే ఏదో జరుగుతుందన్న నమ్మకం ఈనాటిది కాదు. కొన్ని దశాబ్దాల నుంచీ జనం దీన్ని నమ్ముతున్నారని తెలుస్తోంది. అయితే ఎక్కడా, ఏ ఒక్కరూ కూడా ఈ నమ్మకం ఎలా పుట్టింది అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగని తమ విశ్వాసాన్ని కూడా పక్కన పెట్టలేకపోతున్నారు. మన దేశంలో అరచేయి దురద పెడితే డబ్బులు వస్తాయని అంటారు. అయితే ప్రపంచంలోని పలు దేశాలవారు అదృష్టంతో పాటు దురదృష్టం కూడా కలుగుతుందని అంటున్నారు. కుడి అరచేయి దురద పెడితే మంచి జరుగుతుందని, ఎడమది పెడితే చెడు జరుగుతుందని కొందరు అంటే... కొన్ని దేశాల్లో మాత్రం ఇది రివర్సులో ఉంది. కుడి చేయి కనుక దురద పెడితే.. సంపద సర్వనాశనమైపోతుందట. ఎక్కడలేని ఖర్చులూ ఒకేసారి వచ్చి చుట్టుముడతాయట. దివాలా తీసి రోడ్డున పడేంత వరకూ శని వదలదట. అయితే ఎడమ చేయి దురద పెడితే... ఊహించని సంపద వెతుక్కుంటూ వస్తుందట. పేదవాడిని పేద్ద ధనవంతుడిగా మార్చేస్తుందట. కొన్ని దేశాల్లో అయితే... చేతి దురద అనేది శక్తికి సంబంధించినది అన్న నమ్మకం కూడా ఉంది. మనిషిలో అంతర్గతంగా ఒక గొప్ప శక్తి ఉంటుందని, ఆ శక్తి, మనిషి అరచేతుల గుండా ప్రవహిస్తూ ఉంటుందని అంటారు వారు. అంతేకాదు, కుడి చేయి శక్తి వంతమైనదని, ఎడమచేయి బలహీనమైనదని నమ్ముతారు. అందుకే కుడి అర చేయి దురదపెడితే శక్తి పెరుగుతుందని, ఎడమచేయి దురదపెడితే శక్తి క్షీణిస్తుందని నమ్ముతారు. ఆ విధంగా శక్తి క్షీణించిపోయి అతడు మరణానికి చేరువవుతాడని కూడా చెబుతారు. మరి రెండు చే తులూ ఒకేసారి దురద పెడితే ఏంటి పరిస్థితి? ఉంది. దాని గురించీ ఒక విశ్వాసం ఉంది. రెండు చేతులూ కనుక ఒకేసారి దురదపెడితే... కచ్చితంగా మంచే జరుగుతుందట. అదృష్టమే వరిస్తుందట. కాబట్టి దిగులు చెందాల్సిన పని లేదు అంటారు. అసలు ఎలా నమ్మాలి వీటిని? దురద అనేది శరీరానికి కలిగే ఒక ఇబ్బంది. అపరిశుభ్రత వల్లనో, చర్మ సమస్య వల్లనో, ఏదైనా పురుగు వంటిది వాలడం వల్లనో, ఏదైనా కీటకం కుట్టడం వల్లనో కూడా దురద పుడుతుంది. మరి అలాంటిదాని గురించి ఇన్ని విశ్లేషణలు, ఇన్ని వివరణలు ఏమిటో అర్థం కాదు. అయినా శరీరంలో ఎక్కడ దురద పుట్టినా రాని అదృష్ట దురదృష్టాలు అరచేతిలో దురద పుడితేనే ఎందుకు వస్తాయి అంటే సమాధానం కూడా దొరకదు. కాబట్టి... దీనిని నమ్మాలో వద్దో ఎవరికి వారు తేల్చుకోవాల్సిందే! కుడి అరచేయి దురద పెడితే ఓ కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తారని ఐర్లాండు వారు భావిస్తారు! అమెరికాలో ఉన్న అటవీ ప్రాంతంలో నివసించే కొన్ని తెగల వారు... కుడి అరచేయి దురద పెడితే అదృష్టంగా భావిస్తారు. ఎడమ అరచేయి దురద పెడితే కంగారు పడిపోతారు. వెంటనే ఎడమ చేతిలో ఉమ్మి వేసి, ఆ చేతిని నడుము దగ్గర రుద్దుకుంటారు. అలా చేస్తే ఏ ఆపదా రాదంటారు! హంగేరీ వారు... అరచేయి కనుక దురద పెడితే వెంటనే జుట్టుతో చేతిని రుద్దుకుంటారు. తర్వాత అదే చేతితో జుట్టును ఒడిసిపడతారు. మొత్తం జుట్టుని ఒడిసి పట్టుకుంటే అదృష్టం వరిస్తుందట. అలా కాకుండా కాస్త బయట ఉండిపోతే కష్టాలు తప్పవని విశ్వసిస్తారు! రెండు చేతులూ ఒకేసారి దురదపెడితే... వెంటనే చేతుల్ని జేబుల్లో ఉంచుకోవాలట. అప్పుడా అదృష్టం ఎక్కడికీ పోదని పలు ఐరోపా దేశాల వారు నమ్ముతారు! -
మంచి ఆలోచనలే మంచి కార్యాలకు నాంది
జరగాలనుకున్నవి జరగకపోయినా, జరిగినవి జరగకూడదనుకున్నా దుఃఖం తప్పదు. అదే కోరిక. మన తలలోని మెదడు కంప్యూటర్లోని హార్డ్‌వేర్‌లాంటిదైతే మనసనేది జరుగుతున్న ప్రోగ్రామ్- సాఫ్ట్వేర్ లాంటిది. మనసు మనం చేసే ప్రోగ్రామ్‌ను బట్టే నడుచుకుంటుంది. కంప్యూటర్లో తప్పుడు ప్రోగ్రామింగ్ వల్ల తప్పుడు ఫలితాలు వచ్చినట్టే మనసులో ప్రోగ్రామింగ్‌లో లోపం ఉంటే తప్పుడు రిజల్టే వస్తుంది. అదే మన ఎదుగుదలకు అవరోధంగా తయారవుతుంది. పుట్టుకతో మెదడు ఉంటుంది కాని మనసు ఉండదు. సమాజం, తల్లిదండ్రులు, పెద్దలు, చదువు- ఇవి మైండ్ ఏర్పడటానికి బాధ్యులు. ఈ మైండ్‌లో నమ్మకాలు, ఆచారాలు, దేశకాల పరిస్థితులు అంతర్లీనంగా దాగి ఉంటాయి. భౌతికంగా ఏ ఉనికిలేని నీ మనసు నీవు ఊహించలేనంత శక్తిమంతంగా తయారవుతుంది. నీవు మాయలో చిక్కుకునేట్లు చేస్తుంది. నీవు ఏది కావాలో అనే నీవు అనుకునే భ్రమలో పడేస్తుంది. అసలు మైండ్ అంటేనే ఆలోచనల ప్రవాహం. గతానికిగాని, భవిష్యత్తుకిగాని సంబంధించిన విషయాలు మైండ్‌లో ఆలోచనలుగా చోటు చేసుకుని నిన్ను నిన్నుగా ఉండనీయవు. శూన్యం, స్వచ్ఛత, శాంతి, ఆనందం అనేవి నీ నిజతత్వమైతే, ఆలోచనలు నిన్ను ఆవిహ ంచి నీ ఆనందాన్ని, శాంతినీ హరించి వేస్తాయి. గతంలో నీవు అనుభవించనిదే కోరిక. కలల రూపంలో, కోరికల రూపంలో ఆలోచనలు నిన్ను ఎప్పుడూ వెంటాడుతుంటాయి. నీవు అన్కాన్షియస్గా ఉంటే అప్పుడు వాటి విజృంభణ మొదలవుతుంది. నీ కాన్షియస్నెస్, స్వచ్ఛత, శూన్యతకు భంగం కలిగిస్తాయి. మైండ్ స్వచ్ఛం అయ్యేంతవరకు నీకు విజయం చేకూరదు. ప్రతికూలమైన ఆలోచనలు, నెగటివ్ భావాలు మనస్సుపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు ఆధ్యాత్మికపరమైన మంచి పుస్తకాల పఠనం, ధ్యానం, జపం, ప్రార్థనలపైన కూడా ఆధారపడాలి. ఎల్లప్పుడూ వేకువతో, చేతనతో, ప్రజ్ఞలో ఉండాలి. కొన్నిసార్లు బద్దకంగా కానీ, నిద్రాస్థలో ఉన్నప్పుడు కానీ కొన్ని ప్రాణాయామాలు, ప్రణవ మంత్రోచ్చారణ చేస్తుండాలి. రక్తానికి అలవాటు పడిపోయిన పులిని ఎలా అడ్డుకోలేమో అలాగే మైండ్ కూడా. ఏదైనా వ్యామోహానికి గురయినప్పుడు మనసు ఈ ఒక్కసారికే కదా! ఏమీ కాలేదులే అని అనుకుంటుంది. ఒక్కసారి అనుకున్నది అల వాటుగా మారి ఇక కోరికలను చంపుకోలేని స్థితికి తీసుకు వస్తుంది. మనసుకి చెడు అలవాటు చేస్తే విముక్తి లభించడం అసాధ్యం. చెడు ఆలోచనలను ఆపేయాలి. టీవీలు, సినిమాలలో చూపించే సీరియల్స్, కథలలోని పాత్రలు ప్రదర్శించే కోపం, ద్వేషం, పగలాంటి నెగటివ్ ఆలోచనలు మనలో లేకపోయినా అవి మనలో కూడా కలిగే అవకాశం ఉంది. వాటిలో చూపించే పగ, ద్వేషం, కోపం లాంటి లక్షణాలు నిజంగా లేకపోయినా ఆ ప్రోగ్రాములు చూసేవారి మనసులో కూడా అవి నాటుకుంటాయి. దానివల్ల మనలో సంస్కారాలు పెరుగుతాయి. అవి ప్రక్షాళన చేసుకోవడానికి ఎన్నో జన్మలు ఎత్తవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి వ్యామోహాలకు తావివ్వకుండా చెడు విషయాలు మీ చుట్టూ లేకుండా బహిష్కరించండి. ఈ సందడిలో పడి అసలు విషయమైన మోక్షసాధనను మరువకూడదు. మనసులో పేరుకుపోయిన సంస్కారాలను, కోరికలను తొలగించుకుని మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసు మనల్ని ఏదో ఒక మాయలో పడేస్తూనే ఉంటుంది. మనసులో మలినాలు పెరగడం వలన నేను ఆత్మను అనే విషయం మరచిపోవడం జరుగుతుంది. మన నిజతత్వాన్ని మరచిపోయి ఒక రకమైన అవిశ్రాంత స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ప్రేమ, కరుణ, శాంతి, సచ్చిదానందానికి దూరంగా ఉంటుంటాం. అందుకే ఆలోచనలలో స్వచ్ఛత ఉండాలి. ఒక ఆలోచనే కార్యాచరణకు నాంది కాబట్టి మంచి ఆలోచనలు చేయడం ఎంతో ముఖ్యం. మైండ్ రకరకాలుగా మనల్ని లోబరచుకుని అహంకారం కలిగిస్తుందని గమనించాలి. సేవ, జపం, భగవన్నామ స్మరణ, దైవచింతన మనల్ని కోపం, దుఃఖం, అహంకారం, ద్వేషంలాంటి భావాలనుంచి బయటపడేస్తాయి. శాంతి, ధైర్యం, సంతోషం కలిగిస్తాయి. -స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక గురువు బుద్ధబోధ ఓమారు పెనుతుపానుకు ఒక బుద్ధవిహారం కూలిపోయింది. అక్కడి బుద్ధవిగ్రహాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిరాదరణకు గురైంది. దీనిని చూసిన ఓ జెన్ గురువు మనసు కకావికలమైంది. ఆలయాన్ని పునర్నిర్మించి బుద్ధ విగ్రహాన్ని అందులో పునఃప్రతిష్టించాలనుకుని విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టాడు. మొదటి రోజు కొంత డబ్బు సేకరించిన తర్వాత ఆయన నిద్రపోయాడు. అప్పుడు కలలోకి బుద్ధుడి విగ్రహం ప్రత్యక్షమై అతనిని చూసి ఇలా అంటుంది.... ‘‘పుత్రా, ఆ ఆలయం నాకొక చెరసాల. ఎగుడుదిగుళ్ళ మధ్య గడపనిదే జీవితమెందుకు? నన్ను నాలుగు గోడల మధ్య బంధించకు. నన్ను ఇలానే వదిలేసెయ్యి’’ అని. అప్పటికి గానీ ఆ గురువుకి బుద్ధతత్వం బోధపడలేదు. -
నమ్మకం: కాకి వాలిందా!
నల్లగా ఉంటే కాకిలా ఉన్నావంటారు. గట్టిగా గోలచేస్తే కాకిలా అరుస్తావెందుకు అంటారు. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. నెగటివ్‌గా (కొన్నిసార్లు పాజిటివ్‌గా కూడా) ఏం చెప్పాలన్నా కాకిని పోలుస్తూ చెప్పడం అలవాటైపోయింది అందరికీ. కాకికి అంత ప్రాధాన్యత ఎందుకొచ్చింది? కాకి చుట్టూ ఏవైనా నమ్మకాలు ఉన్నాయా? అవి నమ్మకాలేనా లేక నిజాలా? ఇంటి గోడ మీద నిలబడి ఠీవిగా అరుస్తూ ఉంటారు కాకిగారు. అది వినగానే... ‘కాకి అరుస్తోంది, ఎవరైనా చుట్టాలొస్తారో ఏమో’ అంటూ దీర్ఘాలు తీస్తారు బామ్మగారు. కాకి అరిస్తే బంధువులు రావడం ఏమిటి? కాకికి జరగబోయేది తెలుస్తుందా? ఈ సందేహం చాలామందికి ఉంటుంది. కానీ సమాధానం కొందరికే తెలుసు. కాకి అరిస్తే చుట్టాలొస్తారన్న నమ్మకం ఏర్పడింది రామాయణం వల్ల. ఆంజనేయుడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ లంకకి వెళ్తాడు. అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది. అంటే అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందన్నమాట. అలా ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. పైగా... ఆంజనేయుడు వచ్చాడన్నది సీతమ్మకి శుభవార్త కాబట్టి, కాకి అరిస్తే ఏదో శుభవార్త వస్తుందని కూడా నమ్ముతుంటారు. ఇది మాత్రమే కాక... భారతదేశంలో కాకికి చాలా ప్రాధాన్యం ఉంది. కాకిని పితృదేవతలకు ప్రతినిధి అంటారు. శ్రాద్ధ కార్యక్రమాలు జరిపించాక, పిండ ప్రదానం చేస్తారు. ఆ పిండాలను కాకి వచ్చి ఆరగిస్తేనే ఆ మరణించిన వారి ఆత్మ శాంతిస్తుందని నమ్ముతారు. అలాగే కాకి చాలా తెలివైన పక్షి అని కూడా అంటారు. కోకిల తన గుడ్లను కాకి గూట్లో పెడితే, అవి పిల్లలు కాగానే కనిపెట్టేస్తుంది కాకి. అన్నీ ఒకలాగే ఉన్నా, కోకిల పిల్లల్ని గుర్తించి వాటిని వెళ్లగొడుతుంది. అందుకే దాన్ని తెలివైన పక్షిగా పేర్కొంటారు. ఇలా మనదేశంలో చాలా ప్రశంసల్ని పొందుతోంది కాకి. చాలా ప్రాధాన్యతను కూడా మూటగట్టుకుంటోంది. అయితే ఇదే కాకి... విదేశాల్లో విలన్ అయిపోయింది. కాకిని అపశకునంగా భావించే దేశాలు చాలా ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్లేప్పుడు కాకి అరిస్తే అశుభమని నమ్మేవాళ్లు ఉన్నారు. ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు కనుక కాకి అరిస్తే, ఆ పని ఎప్పటికీ పూర్తి కాదని, పూర్తి అయినా కూడా అపజయమే కలుగుతుందని భావించి భయపడేవాళ్లు కూడా ఉన్నారు. ఇంటి మీద ఒక కాకి ఉంటే ఏదో దుర్వార్త, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మంచి వార్త వస్తుందట. కొబ్బరాకు మీద గానీ, తాటాకు మీద గానీ ఉన్న కాకిని చూస్తే... త్వరలోనే మృత్యుదేవత ఇంటి తలుపు తడుతుందట. కాకి కనుక కిటికీ తలుపును గుద్దుకుంటే, ఆ ఇంట్లోని వారో, వారికి సంబంధించినవారో చనిపోతారట. అదే తెల్ల కాకి విషయంలో మాత్రం ఈ నమ్మకాలన్నీ రివర్స్ అవుతాయి. కొన్ని దేశాల్లో నలుపును సృజనాత్మకతకు చిహ్నంగా భావిస్తారు. అలాంటి చోట్ల నల్ల కాకిని అదృష్టంగా భావిస్తున్నారు. కానీ మిగతా అన్ని చోట్లా... నలుపు పాపానికి, వేదనకు గుర్తు కాబట్టి కాకి కూడా వేదనకారకమేనని నమ్ముతున్నారు. ఒక మామూలు పక్షి, ఓ చిన్ని అల్పప్రాణి మనిషికి అంత దురదృష్టాన్ని ఎలా తెచ్చిపెడుతుంది? ప్రాణాలు పోయేంత అశుభాన్ని ఎందుకు తీసుకొస్తుంది? ఈ ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేవాళ్లు ఎవరూ లేరు. అందుకే ఇవి ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఎన్నో అపోహలు నమ్మకాలుగా చెలామణీ అయిపోతున్నాయి. ఇంటి మీద ఒక కాకి ఉంటే దుర్వార్త, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మంచి వార్త వస్తుందట. కొబ్బరాకు లేదా తాటాకు మీద ఉన్న కాకిని చూస్తే... మరణం సంభవిస్తుందట. -
నమ్మకం: మనిషి మరణం కుక్కకు తెలుస్తుందా?
కుక్క అనగానే గుర్తొచ్చేది విశ్వాసం. అంతగా విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్క పట్ల మనిషి మూఢ విశ్వాసాన్ని కలిగి ఉండటమనేది కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. కుక్క ఏడిస్తే అరిష్టమని, ఎవరో చనిపోతారని అనడం వినే ఉంటారు కదా! మనలో చాలామంది ఈ విషయాన్ని గట్టిగా నమ్మడమే కాదు... పొరపాటున కుక్క ఏడిస్తే ఏదో జరిగిపోతుందని భయపడిపోతుంటారు కూడా. ఇది ఎంతవరకూ నిజం? కుక్క నిజంగా చావును పసిగడుతుందా? ఎవరికి వారు అనేసుకోవడమే తప్ప ఇంతవరకూ దీన్ని ఎవరూ నిర్ధారించి చెప్పలేదు. పోనీ ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు, చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే... అదీ లేదు. కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. ఈ నమ్మకాన్ని పారద్రోలాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఫలితం అంతంత మాత్రమే. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది. కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, ఎవరో చనిపోతారని అనుకోవడం కూడా వారి నుంచే మొదలైందని అంటారు. వాళ్లు దేని ఆధారంగా ఆ నమ్మకాన్ని పెంచుకున్నారో మనకైతే తెలీదు. ఆధునికుల్లో కూడా కొందరు ఇలాంటి వాదనలను సమర్థించారు. మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత... ఏడు గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనబడతాయని ఓ పుస్తకంలో రాశాడు. కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా కచ్చితంగా దెయ్యాన్ని చూసే అయివుంటుందని, అప్పుడు దాని రెండు చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దెయ్యం మనక్కూడా కనిపిస్తుందని రాశాడాయన. దీన్ని కొందరు కొట్టి పారేశారు కానీ ఎంతోమంది నమ్మారు. దెయ్యాల్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు, చావును పసిగట్టడంలో వింతేముంది అన్నారు వాళ్లు. అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా? ఎంతమాత్రం కాదనే అంటున్నారు శాస్త్రవేత్తలు. దెయ్యాల్ని చూడటం, మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలే అంటారు వారు. కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులని బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయట. చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే, మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే, దాన్నిబట్టి అవి పసిగట్టవచ్చు తప్ప... వాటికవి మరణాన్ని కనిపెట్టేయడమన్నది అసాధ్యమని అంటున్నారు. పైగా ఎవరో మనిషి చనిపోతే అతడితో ఎలాంటి సంబంధం లేని కుక్క ఏడుస్తుందనడం హాస్యాస్పదం అంటున్నారు. అది ఏడవడానికి అనారోగ్యమో, మరేదో కారణమై ఉండొచ్చు అనేది వారి వాదన. నిజమే కదా! ఎవరైనా చనిపోతే వారికి సంబంధించినవాళ్లు ఏడుస్తారు కానీ, ఎక్కడో ఎవరో ఎందుకు ఏడుస్తారు? పెంపుడు కుక్కలు ఏడ్చాయంటే ఒక అర్థముంది కానీ, ఊళ్లో ఎవరో చనిపోతే ఊరి చివర ఉండే కుక్క ఎందుకు ఏడుస్తుంది? ఇలా కాస్త లాజికల్‌గా ఆలోచిస్తే మన నమ్మకం మూఢనమ్మకంగా మారేది కాదేమో! విదేశాల్లో నమ్మకాలు... ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కుక్క చుట్టూ ఎన్నో నమ్మకాలు, సెంటిమెంట్లు అల్లుకుని ఉన్నాయి. స్కాట్లాండ్లో కుక్క ఇంట్లోకి వస్తే కొత్త స్నేహం ఏర్పడుతుందని, ఇంగ్లండ్‌లో వ్యాపార విషయాలు మాట్లాడ్డానికి వెళ్లేటప్పుడు ఒంటి మీద చుక్కలున్న కుక్క ఎదురొస్తే డీల్ ఓకే అవుతుందని నమ్ముతారు. తమ తోటలోకి అపరిచిత కుక్క వస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, మరణం సంభవిస్తుందని ఐర్లాండ్ వాసులు నమ్ముతారు. కుక్క తన తోకను కాస్త పైకి లేపి నిద్రిస్తుంటే ఓ దుర్వార్త వస్తుందని అమెరికాలోని కొన్ని ప్రాంతాలవారు భావిస్తారు. కొన్ని దేశాల్లో మూడు తెల్లకుక్కలు కలసి కనిపిస్తే అదృష్టం వరిస్తుందని, మరికొన్ని దేశాల్లో నల్ల కుక్క ఎదురొస్తే కీడు జరుగుతుందని నమ్మకం!