
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్స్ పథకం అమలు, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుప ర్చడం వల్ల ప్రజల్లో ప్రజావైద్యంపై నమ్మకం పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఎక్కువ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. మాతాశిశు రక్షణలో అమ్మ ఒడి (102) సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ఏర్పాటు చేసిన 200 అదనపు వాహనాలను, పట్టణాల్లో అత్యవసర వైద్యసేవలు అందించే 50 బైకు అంబులెన్స్‌లను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. గ్రామాల్లో పర్యటించేందుకు ఏఎన్‌ఎంలకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.