నమ్మకం: మనిషి మరణం కుక్కకు తెలుస్తుందా? | How it known human's death to dog ? | Sakshi
Sakshi News home page

నమ్మకం: మనిషి మరణం కుక్కకు తెలుస్తుందా?

Published Sun, Aug 18 2013 2:30 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

నమ్మకం: మనిషి మరణం కుక్కకు తెలుస్తుందా? - Sakshi

నమ్మకం: మనిషి మరణం కుక్కకు తెలుస్తుందా?

కుక్క అనగానే గుర్తొచ్చేది విశ్వాసం. అంతగా విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్క పట్ల మనిషి మూఢ విశ్వాసాన్ని కలిగి ఉండటమనేది కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. కుక్క ఏడిస్తే అరిష్టమని, ఎవరో చనిపోతారని అనడం వినే ఉంటారు కదా! మనలో చాలామంది ఈ విషయాన్ని గట్టిగా నమ్మడమే కాదు... పొరపాటున కుక్క ఏడిస్తే ఏదో జరిగిపోతుందని భయపడిపోతుంటారు కూడా. ఇది ఎంతవరకూ నిజం? కుక్క నిజంగా చావును పసిగడుతుందా?
 
 ఎవరికి వారు అనేసుకోవడమే తప్ప ఇంతవరకూ దీన్ని ఎవరూ నిర్ధారించి చెప్పలేదు. పోనీ ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు, చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే... అదీ లేదు. కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. ఈ నమ్మకాన్ని పారద్రోలాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఫలితం అంతంత మాత్రమే.
 
 కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది. కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, ఎవరో చనిపోతారని అనుకోవడం కూడా వారి నుంచే మొదలైందని అంటారు. వాళ్లు దేని ఆధారంగా ఆ నమ్మకాన్ని పెంచుకున్నారో మనకైతే తెలీదు. ఆధునికుల్లో కూడా కొందరు ఇలాంటి వాదనలను సమర్థించారు. మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత... ఏడు గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనబడతాయని ఓ పుస్తకంలో రాశాడు. కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా కచ్చితంగా దెయ్యాన్ని చూసే అయివుంటుందని, అప్పుడు దాని రెండు చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దెయ్యం మనక్కూడా కనిపిస్తుందని రాశాడాయన. దీన్ని కొందరు కొట్టి పారేశారు కానీ ఎంతోమంది నమ్మారు. దెయ్యాల్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు, చావును పసిగట్టడంలో వింతేముంది అన్నారు వాళ్లు. అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా?
 
 ఎంతమాత్రం కాదనే అంటున్నారు శాస్త్రవేత్తలు. దెయ్యాల్ని చూడటం, మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలే అంటారు వారు. కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులని బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయట. చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే, మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే, దాన్నిబట్టి అవి పసిగట్టవచ్చు తప్ప... వాటికవి మరణాన్ని కనిపెట్టేయడమన్నది అసాధ్యమని అంటున్నారు. పైగా ఎవరో మనిషి చనిపోతే అతడితో ఎలాంటి సంబంధం లేని కుక్క ఏడుస్తుందనడం హాస్యాస్పదం అంటున్నారు. అది ఏడవడానికి అనారోగ్యమో, మరేదో కారణమై ఉండొచ్చు అనేది వారి వాదన.
 
 నిజమే కదా! ఎవరైనా చనిపోతే వారికి సంబంధించినవాళ్లు ఏడుస్తారు కానీ, ఎక్కడో ఎవరో ఎందుకు ఏడుస్తారు? పెంపుడు కుక్కలు ఏడ్చాయంటే ఒక అర్థముంది కానీ, ఊళ్లో ఎవరో చనిపోతే ఊరి చివర ఉండే కుక్క ఎందుకు ఏడుస్తుంది? ఇలా కాస్త లాజికల్‌గా ఆలోచిస్తే మన నమ్మకం మూఢనమ్మకంగా మారేది కాదేమో!
 
 విదేశాల్లో నమ్మకాలు...
 ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కుక్క చుట్టూ ఎన్నో నమ్మకాలు, సెంటిమెంట్లు అల్లుకుని ఉన్నాయి. స్కాట్లాండ్‌లో కుక్క ఇంట్లోకి వస్తే కొత్త స్నేహం ఏర్పడుతుందని, ఇంగ్లండ్‌లో వ్యాపార విషయాలు మాట్లాడ్డానికి వెళ్లేటప్పుడు ఒంటి మీద చుక్కలున్న కుక్క ఎదురొస్తే డీల్ ఓకే అవుతుందని నమ్ముతారు. తమ తోటలోకి అపరిచిత కుక్క వస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, మరణం సంభవిస్తుందని ఐర్లాండ్ వాసులు నమ్ముతారు. కుక్క తన తోకను కాస్త పైకి లేపి నిద్రిస్తుంటే ఓ దుర్వార్త వస్తుందని అమెరికాలోని కొన్ని ప్రాంతాలవారు భావిస్తారు. కొన్ని దేశాల్లో మూడు తెల్లకుక్కలు కలసి కనిపిస్తే అదృష్టం వరిస్తుందని, మరికొన్ని దేశాల్లో నల్ల కుక్క ఎదురొస్తే కీడు జరుగుతుందని నమ్మకం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement