
సీనియర్ న్యాయవాది, ఎంపీ సిబల్
న్యూఢిల్లీ: దేశ వ్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామకం వంటి అంశాలు పద్ధతి ప్రకారం జరగడం లేదన్నారు. ఈ వాస్తవాన్ని న్యాయ వ్యవస్థతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించినప్పుడే మెరుగైన ప్రత్యామ్నాయం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన సిబల్ శనివారం పీటీఐకి ఇచి్చన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన మనోగతాన్ని వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు దొరికిందన్న వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు. ‘‘దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. ఇలాంటప్పుడు వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం బాధ్యతాయుత పౌరుని లక్షణం కాదు’’ అన్నారు. సిబల్ ఇంకా ఏం చెప్పారంటే...
ఈసీ ఓ విఫల వ్యవస్థ
కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ విఫల వ్యవస్థ. రాజ్యాంగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేని ఈసీపై ప్రజలకు విశ్వాసం లేదు. వారి నమ్మకాన్ని తిరిగి ఎంత త్వరగా పొందగలిగితే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అంతే అవకాశముంటుంది. ఈవీఎంలతోపాటు ఎన్నికల ప్రక్రియ కలుషితమైందని ప్రతిపక్షాలకు చెప్పాలనుకుంటున్నా. ఈసీ వెలువరించే ఫలితాలు అనేక దశల్లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాక విడుదల చేసేవి అయి ఉండొచ్చు. ఇలాంటి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. విపక్ష ఇండియా కూటమి పార్టీలు కూటమిగా ఒకే అజెండాతో సాగాలి. సైద్ధాంతిక ప్రాతిపదిక, విధానాలు రూపొందించుకోవాలి. కూటమి అభిప్రాయాల వ్యక్తీకరణకు సమర్థుడైన ప్రతినిధి ఉండాలి. అప్పుడే కూటమి ప్రభావం చూపే అవకాశముంటుంది.
న్యాయవ్యవస్థలో అవినీతి మూడు రకాలు
మన న్యాయవ్యవస్థ పనితీరుపై ఏళ్లుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందులో ఒకటి అవినీతి. ఈ అవినీతికి అనేక కోణాలున్నాయి. వీటిలో ఒకటి న్యాయమూర్తి ప్రతిఫలం ఆశించి తీర్పులివ్వడం. రెండోది భయం, స్వార్థం లేకుండా తీర్పులిస్తామన్న ప్రమాణానికి భిన్నంగా తీర్పులివ్వడం. దీనికో ఉదాహరణ చెబుతాను. ప్రస్తుతం జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టులు 95 శాతం కేసుల్లో బెయిల్‌ను తిరస్కరిస్తున్నాయి. ఇక్కడే తేడా జరుగుతోంది. బెయిలిస్తే అది వారి కెరీర్‌పై ప్రభావం చూపుతుందని భయపడుతున్నారేమో!
మూడో రకం అవినీతి న్యాయమూర్తులు మెజారిటీ సంస్కృతిని బాహాటంగా ఆమోదిస్తుండటం, రాజకీయపరమైన వైఖరిని వ్యక్తం చేస్తుండటం. పశ్చిమ బెంగాల్‌లో ఓ న్యాయమూర్తి ఒక రాజకీయ పార్టీకి అనుకూల వైఖరిని వ్యక్తపరిచారు. తర్వాత రాజీనామా చేసి అదే పార్టీలో చేరిపోయారు. మరో జడ్జి తాను ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుదారునంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. భారత్‌లో మెజారిటీ సంస్కృతిదే పైచేయిగా ఉండాలని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్ వీహెచ్‌పీకి సంబంధించిన కార్యక్రమంలోనే వ్యాఖ్య లు చేశారు. హిందువులు మాత్రమే ఈ దేశాన్ని విశ్వగురువుగా మార్చగలరనడమే గాక మైనారిటీ సమాజాన్ని అవమానించేలా మాట్లాడారు. ఆయనపై జరిపిన రహస్య విచారణ ఫలితం ఏమైందో ఎవరికీ తెలియదు. ఇలాంటి వ్యవహారాలను సరైన గాడిలో పెట్టాలి. ఇలాంటి వివాదాంశాలపై సుప్రీంకోర్టు తక్షణం స్పందించి ఎందుకు పరిష్కరించలేకపోతోందో అర్థం కావడం లేదు!
ప్రత్యామ్నాయమే లేదు!
అవినీతికి పాల్పడిన న్యాయమూర్తులపై రాజ్యాంగంలోని 124వ అధికరణం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు 50 మందికి మించిన రాజ్యసభ సభ్యుల సంతకాలతో పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. ఇదంత త్వరగా తెమిలేది కాదు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై పెట్టిన తీర్మానం వీగిపోయింది. న్యాయమూర్తులపై రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్లలేనప్పుడు ఇతర ప్రభావవంతమైన ప్రత్యామ్నాయ మార్గాలు లేనే లేవు.
ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్న న్యాయవ్యవస్థ తనకు తాను వేసుకోవాలి. ఇక్కడే న్యాయ వ్యవస్థపై నమ్మకం క్షీణిస్తున్నట్టు కనిపిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థపై విమర్శలు పోవాలంటే ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలిసి ప్రత్యామ్నాయం ఆలోచించాలి. కొలీజియం ఆశించినట్టుగా పనిచేయడం లేదని సుప్రీంకోర్టు గ్రహించాలి. కేవలం నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ)తో సమస్య పరిష్కారం కాదని కేంద్రం కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం.