Supreme Court Bar Association
-
రిటైర్ అవ్వాల్సిన వ్యక్తిని కాను... కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతా
న్యూఢిల్లీ: ఇప్పుడే పదవీవిరమణ చేయాల్సిన వ్యక్తిని కాదని, మరో కొత్త ఇన్నింగ్స్ మొదలెడతా అని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ముఖేశ్‌కుమార్ రసిక్‌భాయ్(ఎంఆర్) షా సోమవారం వ్యాఖ్యానించారు. భారత సర్వోన్నత న్యాయస్థానంలో నాలుగో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన ఎంఆర్ షా సోమవారం పదవీవిరమణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన సుప్రీంకోర్టు బార్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ షా ప్రసంగించారు. ‘ రిటైర్ అవ్వాల్సిన వ్యక్తినికాదు. జీవితంలో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతా. కొత్త ఇన్నింగ్స్ ఆడేందుకు సరిపడ ధైర్య, స్థైర్య, ఆయుఃఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. రాజ్‌కపూర్ సినిమాలో పాటలోని పదాలు నాకు గుర్తొస్తున్నాయి. రేపు నేను ఆటలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ వినీలాకాశంలో సదా తారనై ఉంటా. పుట్టుక ఇక్కడే. మరణమూ ఇక్కడే’ అంటూ ఉద్వేగంతో మాట్లాడారు. ‘లాయర్లకు నాదో విన్నపం. అస్తమానం కేసులపై వాయిదాలు కోరకండి. వాదనలకు సిద్ధమై రండి. యువ లాయర్లకు నాదో సలహా బార్ రూమ్‌లోనో, క్యాంటీన్లో కాలక్షేపాలొద్దు. కోర్టు హాల్లో వాదనలు విని అనుభవం గడించండి’ అని అన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు. ‘ ధైర్యం, పోరాట స్ఫూర్తి చూస్తే ఆయనను టైగర్ షా అనాల్సిందే. తర్కంతో ఆలోచించే జ్ఞాని. టెక్నాలజీని త్వరగా ఆకళింపుచేసుకుంటారు. కొలీజియం నిర్ణయాలు తీసకునేటపుడు అద్భుతమైన సలహాలిచ్చారు. నేను అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు మొదలైన స్నేహం ఆనాటి నుంచీ కొనసాగింది. ఎవరి ఇళ్లల్లో వాళ్లం ఉన్నాసరే ఫోన్‌చేస్తే చాలు ఆయన ఎప్పుడూ కీలకమైన అంశాలపై చర్చిస్తుండేవారు. కోవిడ్ సంక్షోభకాలంలోనూ విధులు నిర్వర్తించాం’ అని అన్నారు. 2018 నవంబర్ రెండో తేదీన సుప్రీంకోర్టు జడ్జిగా షా నియమితులయ్యారు. సోమవారం ఆయన రిటైర్‌అవడంతో సుప్రీంకోర్టులో సీజేతో కలిపి మొత్తం జడ్జీల సంఖ్య 32కు పడిపోయింది. ఆదివారం మరో జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి రిటైర్‌కావడం తెల్సిందే. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టులో జడ్జీల గరిష్ట సంఖ్య 34. జస్టిస్ ఎంఆర్ షా న్యాయ ప్రస్థానం 1982లో గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా మొదలైంది. 2004 మార్చిలో గుజరాత్ హైకోర్టులో అదనపు న్యాయవాదిగా నియమితులయ్యారు. ఆ తర్వాతి ఏడాది శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2018 ఆగస్ట్‌లో పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అదే ఏడాది నవంబర్‌లో పదోన్నతితో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చారు. -
కోర్టు హాల్ నుంచి వెళ్లిపోండి.. సీజేఐనే బెదిరిస్తున్నారా?
న్యూఢిల్లీ: న్యాయవాదుల చాంబర్ల కోసం సుప్రీంకోర్టు ప్రాంగణంలోని కొంత స్థలం కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధివాలాల ధర్మాసనం ఎదుట సంబంధిత కేసు విషయమై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తన వాదనలు వినిపించారు. ‘ అప్పూ ఘర్ స్థలం ఎస్‌ఈబీఏ పిటిషన్ కారణంగానే సుప్రీంకోర్టు చేతికొచ్చింది. కానీ అందులో కేవలం ఒక్క బ్లాక్ మాత్రమే ఎస్‌ఈబీఏ, బార్‌కు కేటాయించారు. సంబంధిత కేసు ఆరునెలలైనా విచారణకు నోచుకోవట్లేదు’ అని వికాస్ గట్టిగా మాట్లాడారు. దీంతో సీజేఐ ఆగ్రహంగా.. ‘ ‘సీజేఐనే బెదిరిస్తున్నారా ? ఇలాగేనా ప్రవర్తించేది ? కోర్టు హాల్ నుంచి వెళ్లిపోండి. మార్చి 17న విచారిస్తాం’ అని సీజేఐ ఆగ్రహంగా మాట్లాడారు. 2000 మార్చి 29వ తేదీ నుంచి ఇక్కడే ఉన్నాను. 22 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నా. ఎప్పుడూ ఇలా ఎవరితో ఇంతగా ఇబ్బంది పడలేదు’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. -
రిటైరైన జస్టిస్ నజీర్
న్యూఢిల్లీ: జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విశేష సేవలందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొనియాడారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ వీడ్కోలు సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జస్టిస్ నజీర్‌ది బహుముఖీన వ్యక్తిత్వం. సాధారణ కుటుంబంలో జన్మించి స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ప్రజా న్యాయమూర్తిగా పేరుగడించారు’’ అన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం తగినంత లేకపోవడం బాధాకరమని జస్టిస్ నజీర్ అన్నారు. జూనియర్ లాయర్లకు మంచి వేతనాలు, మరిన్ని అవకాశాలు కావాలని అభిప్రాయపడ్డారు. -
Constitution Day: ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం కాదు
న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొలీజియంతో సహా ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం, లోపరహితం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రస్తుత ఉన్న వ్యవస్థ నుంచే కనిపెట్టాలని తెలిపారు. రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగాన్ని అమలుపర్చే న్యాయమూర్తులను విశ్వసనీయమైన సైనికులుగా అభివర్ణించారు. ప్రజాసేవ పట్ల అంకితభావం, అనురక్తి ఉన్నవాళ్లు న్యాయ వ్యవస్థలో చేరాలని సీజేఐ సూచించారు. న్యాయవాద వృత్తిలో వలస పాలన కాలం నాటి ఆచారాలను వదిలించుకోవాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. లాయర్లకు కఠినంగా అమల్లో ఉన్న డ్రెస్ కోడ్‌ను పునఃపరిశీలించాలన్నారు. మన జీవన విధానం, మన వాతావరణానికి తగ్గట్టుగా డ్రెస్ కోడ్ ఉండాలని సూచించారు. -
వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా
న్యూఢిల్లీ: ఇచ్చిన వాగ్దానాలను కొంత వరకు నెరవేర్చగలిగానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ చెప్పారు. ఎల్లవేళలా పనిచేసే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, కేసుల జాబితాను క్రమబద్ధం చేసే వ్యవస్థను నెలకొల్పడం, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం వంటి విషయాల్లో తన వంతు కృషి చేశానని తెలిపారు. జస్టిస్ యు.యు.లలిత్ పదవీ కాలం మంగళవారం ముగియనుంది. ఆరోజు సెలవు దినం కాబట్టి సోమవారమే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పెండింగ్ కేసులపై దృష్టి పెట్టానని, వేలాది కేసులు పరిష్కరించానని వివరించారు. ఈ వీడ్కోలు సభకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. నా ప్రయాణం సంతృప్తికరం సుప్రీంకోర్టులో 37 ఏళ్ల వృత్తి జీవితంలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ప్రతి దశను ఆనందించానని జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. తన ప్రయాణం సంతృప్తికరంగా సాగిందన్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి, 16వ సీజేఐ జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ముందు న్యాయవాదిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఇదే కోర్టులో మొదలైన తన ప్రయాణం, ఇక్కడే ముగుస్తోందంటూ భావోద్వేగానికి గురయ్యారు. పలు రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయడం తనకు మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తులందరినీ రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యులుగా చేశానని తెలిపారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 74 రోజులు పదవిలో కొనసాగారు. -
న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. సమ వాటాదారులైన కేంద్ర ప్రభుత్వం, బార్, బెంచ్‌లు ఈ మేరకు చొరవ తీసుకోవాలని సూచించారు. జీవితంలో ఎన్నో పోరాటాల తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నానని, ఆ క్రమంలో అనేక కుట్రపూరిత పరిశీలనలకు గురయ్యాయని చెప్పారు. తన పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. బాల్యం నుంచి సీజేఐ వరకూ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. తల్లిదండ్రులను, విద్యనేర్పిన గురువులను స్మరించుకున్నారు. తన అనుభవాల్లో తీపి కంటే చేదు ఎక్కువగా ఉందన్నారు. అనేక ఆందోళనలు, పోరాటాల్లో భాగస్వామి అయిన తాను ఎమర్జెన్సీ సమయంలో బాధలు పడ్డానని తెలిపారు. ఆయా అనుభవాలే ప్రజలకు సేవ చేయాలన్న అభిరుచిని తనలో పెంపొందించాయని వ్యాఖ్యానించారు. మొదటి తరం న్యాయవాదిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని, విజయాలకు షార్ట్‌కట్ ఉండదని తెలుసుకున్నానని వెల్లడించారు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ ఉద్దేశం అదే.. గొప్ప న్యాయమూర్తినని తాను ఎప్పుడూ చెప్పుకోలేదని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సామాన్యులకు న్యాయం చేయడమే న్యాయ వ్యవస్థ అంతిమ ఉద్దేశమని నమ్ముతానన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బార్ కృషి చేయాలని కోరారు. న్యాయ వ్యవస్థపై సాధారణ ప్రజల్లో అవగాహన, విశ్వాసం పెంపొందించాలని అన్నారు. న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 16 నెలల తన పదవీ కాలంలో 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 15 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 224 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగిందని గుర్తుచేశారు. న్యాయ వ్యవస్థ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం వాస్తమేనని వివరించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను భీష్మ పితామహుడిగా జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఛైర్మన్ వికాస్ సింగ్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీజేఐ (నియమిత ) జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. హైకోర్టుల్లో నియామకాలు, మౌలిక సదుపాయాల కోసం జస్టిస్ ఎన్వీ రమణ సాగించిన కృషిని అభినందించారు. నూతన సీజేఐగా తన పదవీ కాలంలో కేసుల జాబితా, అత్యవసర విషయాల ప్రస్తావన, రాజ్యాంగ ధర్మాసనాలపై దృష్టి సారిస్తానన్నారు. పెండింగ్ కేసులే అతిపెద్ద సవాల్ విచారించాల్సిన కేసుల జాబితా సమస్యలను పరిష్కరించడంపై తగిన శ్రద్ధ చూపలేకపోయినందుకు జస్టిస్ ఎన్వీ రమణ క్షమాపణలు కోరారు. దేశంలోని కోర్టులు పెండింగ్ కేసుల రూపంలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. న్యాయ వ్యవస్థను ఒక ఉత్తర్వు, ఒక తీర్పుతో నిర్వచించలేమని, అదేవిధంగా ఒక తీర్పుతో మార్చలేమని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కోర్టుల పనితీరును సంస్కరించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. శాశ్వత పరిష్కారాలకు ఆధునిక సాంకేతికతను, కృత్రిమ మే«ధను వాడుకోవాలన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ వీడ్కోలు సందర్భంగా సీనియర్ లాయర్ దుష్యంత్ దవే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణను ప్రజాన్యాయమూర్తి అంటూ కొనియాడారు.. జస్టిస్ రమణ సేవలను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశంసించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలతో సాయంతో పూర్తిస్థాయిలో పనిచేశారని జస్టిస్ రమణను అభినందించారు. కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం సుప్రీంకోర్టు శుక్రవారం చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టిన విచారణలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే దిశగా జస్టిస్ ఎన్వీ రమణ తీసుకున్న చొరవను పలువురు అభినందించారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు జరగాలని సీజేఐ ఆకాంక్షించారు. సుప్రీంకోర్టులో విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. నేడు జస్టిస్ యు.యు.లలిత్ ప్రమాణం సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో జస్టిస్ లలిత్‌తో ప్రమాణం చేయించనున్నారు. వీడ్కోలు సమావేశంలో అభివాదం చేస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్ -
పార్లమెంటులో లాయర్లు తగ్గుతున్నారు
న్యూఢిల్లీ: ‘‘పార్లమెంటులో గతంలో న్యాయ కోవిదులు ఎక్కువగా ఉండేవారు. రాజ్యాంగ పరిషత్తులోనూ, స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కొలువుదీరిన పలు పార్లమెంటుల్లోనూ చాలామంది వాళ్లే. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యంగాన్ని, తిరుగులేని చట్టాలను మనకందించారు. కానీ కొంతకాలంగా పార్లమెంటులో న్యాయ కోవిదుల సంఖ్య బాగా తగ్గుతోంది. ఆ స్థానాన్ని ఇతరులు భర్తీ చేస్తున్నారు. ఇంతకు మించి మాట్లాడబోను’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన జగ్దీప్ ధన్‌ఖడ్ గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదిగా అపార అనుభవం ధన్‌ఖడ్ సొంతమన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఎలాంటి రాజకీయ గాడ్‌ఫాదర్లూ లేకుండానే దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొలువుదీరే స్థాయికి ఎదిగారు. ఇది మన ప్రజాస్వామ్య గొప్పదనానికి, ఉన్నత రాజ్యాంగ విలువలకు తార్కాణం’’ అన్నారు. ‘‘ప్రతి సభ్యుడినీ సంతృప్తి పరచడం తేలిక కాదు. కానీ ధన్‌ఖడ్ తన అపార అనుభవం సాయంతో రాజ్యసభ చైర్మన్‌గా రాణిస్తారని, అందరినీ కలుపుకునిపోతారని నాకు నమ్మకముంది. న్యాయవాదిగా అపార అనుభవం, గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహించి ఉండటం ఆయనకెంతో ఉపయోగపడతాయి. అతి త్వరలో రిటైరవుతున్న నేను ధన్‌ఖడ్ పర్యవేక్షణలో రాజ్యసభలో జరిగే నాణ్యమైన చర్చలను టీవీలో చూస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు. ధన్‌ఖడ్‌ను ఆయన సన్మానించారు. న్యాయ మంత్రి కిరెన్ రిజిజు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంబార్ అసోసియేసన్ అధ్యక్షుడు వికాస్‌సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతకాలంగా పార్లమెంటులో చర్చల కంటే అంతరాయాలే ఎక్కువయ్యాయని రిజిజు ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చర్చల నాణ్యత బాగా పడిపోయింది. ఇటీవలి దాకా లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభ కాస్త ప్రశాంతంగా ఉండేది. ఈ మధ్య అక్కడా గలాభా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సభను అదుపు చేసేందుకు ధన్‌ఖడ్ అనుభవం పనికొస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఓ లాయర్ ఉపరాష్ట్రపతి కావడం ఇదే తొలిసారని తుషార్ మెహతా అన్నారు. ధన్‌ఖడ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ -
జస్టిస్ ఖన్విల్కర్ క్రమశిక్షణ గల జడ్జి: సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ శ్రమించేతత్వం, క్రమశిక్షణగల వ్యక్తి అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. సుప్రీం కొలీజియంలో భాగమైన జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఖన్విల్కర్‌తో కలిసి తాము ఏడాది కాలంలో ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాల కోసం 250 పేర్లను పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. సుప్రీం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ ఖన్విల్కర్ వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. సుప్రీంకోర్టులో ఆయన 8,446 కేసులను పరిష్కరించడంతోపాటు 187 తీర్పులను రాశారన్నారు. ఆయన శ్రమించే తత్వం అందిరికీ తెలిసిందేనన్నారు. జస్టిస్ ఖన్విల్కర్ సుప్రీంకోర్టులో సుమారు ఆరేళ్లపాటు పనిచేశారు. ఆయన పదవీ విరమణ కారణంగా అత్యున్నత న్యాయస్థానంలోని 34 జడ్జీల పోస్టులకు గాను 31 మంది మిగిలారు. ఇదీ చదవండి: ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు -
విజేత సీజేఐ ఎలెవెన్
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం టీ–20 క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించారు. మోడర్న్ స్కూల్ గ్రౌండ్లో సీజేఐ ఎలెవెన్, ఎస్బీఏ ఎలెవెన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సీజేఐ–ఎలెవన్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా సుప్రీం బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ప్రెసిడెంట్ వికాస్ సింగ్ వేసిన కొన్ని బంతులను సీజేఐ ఆడారు. సీజేఐ ఎలెవన్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎస్సీబీఏ ఎలెవెన్ జట్టు 12.4 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది. -
50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: యాభై శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ‘‘వేలాది సంవత్సరాల అణచివేత ఇక చాలు, న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు.. ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. మీరు చింతిస్తూ కూర్చోకూడదు. ఆగ్రహంతో గట్టిగా నినదించాలి. 50 శాతం రిజర్వేషన్లు కావాలని బలంగా డిమాండ్ చేయాలి. నా మద్దతు మీకు ఉంటుంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌లోని మహిళా న్యాయవాదులు ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల్లో మహిళలు 15 శాతమే ‘‘దిగువ న్యాయస్థానాల్లో మహిళా జడ్జీలు కేవలం 30 శాతం లోపే ఉన్నారు. హైకోర్టుల్లో 11.5 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టులో 11 నుంచి 12 శాతం ఉన్నారు. దేశంలోని మొత్తం 17 లక్షల న్యాయవాదుల్లో 15 శాతం మాత్రమే మహిళలున్నారు. బార్ కౌన్సిళ్లలో ఎన్నికైన ప్రతినిధుల్లో కేవలం 2 శాతం మాత్రమే మహిళలు. బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళల ప్రాతినిధ్యం లేదు. దీన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైన దిద్దుబాటు చర్యల గురించి కార్యనిర్వాహక వ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తా. ఉన్నత న్యాయస్థానాల్లో అంతరాన్ని తగ్గించడానికి సహచర కొలీజియం సభ్యులు కూడా చొరవ చూపడం సంతోషంగా ఉంది. న్యాయవాద వృత్తిలోకి రావడానికి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ అడ్డంకులు, లింగ వివక్ష ఎదుర్కొంటున్నారు. చాలామంది క్లయింట్లు పురుష న్యాయవాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోర్టు గదుల్లో సౌలభ్యంగా లేని వాతావరణం, మౌలికవసతుల లేమి, రద్దీగా ఉండే కోర్టు గదులు, వాష్‌రూమ్స్ లేమి వంటివి మహిళలు న్యాయవాద వృత్తిలోకి రావడానికి అడ్డంకిగా ఉంటున్నాయి. 6 వేల ట్రయల్ కోర్టుల్లో 22 శాతం కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని నా సర్వేలో తేలింది. మహిళలకు మరింతగా స్వాగతం పలికే వాతావరణం కల్పించాలి. న్యాయ విద్యలో లింగ నిష్పత్తిపై దృష్టి సారించాలి. తొలి చర్యగా న్యాయ కళాశాలలు, యూనివర్సిటీలలో మహిళలకు తగినంతగా రిజర్వేషన్లు కలి్పంచాలి. మహిళా జడ్జీలు, లాయర్లు గణనీయంగా పెరుగుతారు. అన్ని రంగాల్లోకి మహిళలు వచ్చేలా స్ఫూర్తి కావాలి. న్యాయవాద వృత్తిలో లింగ అసమానతలు తొలగించడానికి తీసుకొనే చర్యలకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. సీనియర్ న్యాయవాదుల ఎంపికకు త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రత్యక్ష విచారణ విషయానికొస్తే.. దీని వల్ల జడ్జీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. లాయర్లకే ఒకింత ఇబ్బంది. దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని భావిస్తున్నాం. థర్డ్‌వేవ్ రాకూడదని ప్రారి్థద్దాం. ప్రత్యక్ష విచారణకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పట్ల అడ్వొకేట్ల అసోసియేషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని సరిచేయాలని రిజిస్ట్రీని ఆదేశించా. మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని సీజేఐ జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు. వలస పాలకుల చట్టాలతో ఇబ్బందులు: జస్టిస్ పి.ఎస్.నరసింహ వలస పాలకుల హయాం నాటి కాలం చెల్లిన చట్టాలు, వాటికి ఇచ్చిన భాష్యాలతో భారత్ 70 ఏళ్లకు పైగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను లోతుగా అధ్యయనం చేసి వాటికి కొత్త వివరణ ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనే ఉందని అన్నారు. సుప్రీంకోర్టు బెంచ్‌లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండడం అసాధారణమైన విషయమన్నారు. కోర్టుల్లో 50 శాతానికి మహిళలు పరిమితమవకుండా ఇంకా ఎక్కువ మంది ఉండాలన్నదే తన ఆకాంక్షని చెప్పారు. ప్రతిభ ఆధారంగా ఎంత ఎక్కువ మంది మహిళలుంటే అంత మంచిదని, మగవారి కంటే మహిళలే లోతైన ఆలోచన చేస్తారని జస్టిస్ నరసింహ కొనియాడారు. -
నిర్దిష్ట చర్చ లేకుండా చట్టాలా!?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చట్టాలను రూపొందిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాల రూపకల్పన ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని చెప్పారు. పార్లమెంట్లో నిర్దిష్ట చర్చ జరగకుండానే చట్టాలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల వాటిలో స్పష్టత లేకుండా పోతోందని తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. రాజ్యాంగ సవరణ బిల్లులపై, అవి ప్రజలపై చూపించే ప్రభావంపై గతంలో పార్లమెంట్లో ఎన్నో చర్చలు, సంవాదాలు జరిగేవని గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. న్యాయ పరిజ్ఞానం కలిగిన వారు చట్టసభలో లేకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పార్లమెంట్లో చట్టాలను రూపొందించే సమయంలో విస్తృతమైన చర్చ జరిగితే కోర్టులు వాటి ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాయని, తద్వారా న్యాయ వివాదాలు తగ్గుతాయని సూచించారు. తొలి పార్లమెంట్లో చాలామంది న్యాయవాదులు ఉన్నారు. మహత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్ తదితర నేతలు న్యాయవాదులే. న్యాయవాదులు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని దేశానికి అందించాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా చర్చ లేకుండానే కీలకమైన బిల్లులను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఎల్ఎల్బీ ఎందుకు చదవకూడదు?
న్యూఢిల్లీ : మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు చదివేందుకు చేసుకున్న దరఖాస్తును కళాశాల అధికారులు తిరస్కరించారంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌కు మారి త్యాగి(77) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) పెట్టిన 30 ఏళ్ల వయో పరిమితి నిబంధన తనకు గల రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఐదేళ్ల ఎల్ఎల్బీకి గరిష్ట వయోపరిమితి 20, మూడేళ్ల ఎల్ఎల్బీకి 30 ఏళ్ల వయోపరిమితి విధిస్తూ బీసీఐ ఇటీవల నిబంధనలు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తమకున్న ఎస్టేట్‌ను కాపాడుకోవడానికి లా చదవాలని అనుకుంటున్నట్లు సాహిబా బాద్‌కు చెందిన రాజ్‌కుమారి త్యాగి పేర్కొన్నారు. బీసీఐ నిబంధనలతో రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు, ఏ వృత్తినైనా చేపట్టే హక్కు, జీవించే హక్కులకు భంగం కలుగుతున్నాయని ఆ పిటిషన్లో తెలిపారు. -
ప్రధానిని పొగడడంపై లాయర్ల సంఘాల్లో విభేదాలు
న్యూఢిల్లీ: గతవారం జరిగిన అంతర్జాతీయ న్యాయ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రధాని మోదీని ప్రశంసించడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీని జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశంసించడం అభ్యంతరకరమని పేర్కొంటూ ఒక తీర్మానం చేసినట్లు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు దుష్యంత్ దవే పేరుతో బుధవారం ప్రకటన వెలువడింది. జస్టిస్ మిశ్రా తీరును విమర్శిస్తూ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. ప్రధానిని పొగడుతూ జస్టిస్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ స్వతంత్రత, నిష్పక్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. అయితే జస్టిస్ మిశ్రాను ఎస్సీబీఏ అధ్యక్షుడు విమర్శించడం హ్రస్వ దృష్టికి నిదర్శనమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ ఓ ప్రకటనలో అన్నారు. -
జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ గురువారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులోని ప్రముఖ న్యాయమూర్తుల్లో జస్టిస్ జోసెఫ్ ఒకరని సుప్రీం బార్ అసోసియేషన్ సభ్యులు ప్రశంసించారు. ఈ ఏడాది జనవరిలో బెంచ్‌లకు కేసుల కేటాయింపులో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ మదన్.బి.లోకూర్‌తో కలిసి జస్టిస్ జోసెఫ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగవిరుద్ధమనీ, చెల్లదని ప్రకటించిన ధర్మాసనంలో జోసెఫ్ ఉన్నారు. కొలీజియం సిఫార్సులపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై, తాజ్‌మహల్ పరిరక్షణపై జస్టిస్ జోసెఫ్ చాలాసార్లు బహిరంగ లేఖలు రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జీల నియామకానికి కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ జ్యూడీషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ చట్టాన్ని జస్టిస్ జోసెఫ్ బెంచ్ కొట్టివేసింది. 1,035 తీర్పులతో టాప్–10 సుప్రీం జడ్జీల జాబితాలో పదో స్థానం దక్కించుకుని జస్టిస్ జోసెఫ్ అరుదైన ఘనత సాధించారు. కాగా, ఉన్నత న్యాయస్థానాలు యువ న్యాయవాదులను జడ్జీ బాధ్యతలు స్వీకరించేలా ఆకర్షించలేకపోతున్నాయని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కేరళ నుంచి మొదలైన ప్రస్థానం.. జస్టిస్ జోసెఫ్ కేరళలో 1953, నవంబర్ 30న జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఎర్నాకులం జిల్లాలోని సెయింట్ జోసెఫ్ స్కూలులో పూర్తిచేశారు. అనంతరం తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీని అందుకున్నారు. కేరళ హైకోర్టులో 1979లో ప్రాక్టీసును ప్రారంభించిన ఆయన, 1994లో అక్కడే అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆరేళ్ల అనంతరం జస్టిస్ జోసెఫ్ కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2010, ఫిబ్రవరి 8 నుంచి 2013 మార్చివరకూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2013, మార్చి8న సుప్రీంకోర్టు జడ్జీగా జోసెఫ్ పదోన్నతి పొందారు. -
వీడ్కోలు కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన జస్టిస్ చలమేశ్వర్
న్యూఢిల్లీ: వచ్చే నెల 22న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) తలపెట్టిన వీడ్కోలు కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించారు. గతవారం జస్టిస్ చలమేశ్వర్‌ను కలిసి వీడ్కోలు సమావేశానికి ఆహ్వానించగా ఆయన తిరస్కరించారని ఎస్సీబీఏ కార్యదర్శి వికాస్ సింగ్ తెలిపారు. దీంతో బుధవారం తాము మరోసారి వెళ్లి, ఆయన్ను ఒప్పించేందుకు యత్నించగా వ్యక్తిగత కారణాలు చూపుతూ ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ అయినప్పుడూ వీడ్కోలు సమావేశానికి వెళ్లలేదని ఆయన తెలిపారని వికాస్ సింగ్ చెప్పారు. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆఖరి పనిదినమైన ఈనెల 18న జస్టిస్ చలమేశ్వర్ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వికాస్ సింగ్ వివరించారు. కాగా, జస్టిస్ చలమేశ్వర్ గత మూడు వారాలుగా బుధవారం రోజు కోర్టు విధులకు హాజరుకావడం లేదని కోర్టు వర్గాలు తెలిపాయి. -
వీడ్కోలు సభ : జస్టిస్ చలమేశ్వర్ అనూహ్య నిర్ణయం!
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించిన నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ చలమేశ్వర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేకించి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నిర్ణయాలపై సర్వత్త్రరా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించాలనుకోగా అందుకు సాధ్యం కాలేదు. బార్ అసోసియేషన్ ఆహ్వానాన్ని జస్టిస్ చలమేశ్వర్ సున్నితంగా తిరస్కించారు. సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జీగా కొనసాగుతున్న జస్టిస్ చలమేశ్వర్ పదవీకాలం జూన్ 22 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బార్ అసోషియేషన్ ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించాలని భావించింది. వేసవి కాలం సెలవులకు ముందు సుప్రీంకోర్టు చివరి పనిదినమైన ఈ నెల 18న వీడ్కోలు కార్యక్రమ సభ నిర్వహించాలని బార్ అసోషియేషన్ భావించింది. అందులో భాగంగా అసోసియేషన్ సభ్యులు గతవారం జస్టిస్ చలమేశ్వర్‌ను కలిసి కార్యక్రమం గురించి వివరించగా అందుకు జస్టిస్ చలమేశ్వర్ అంగీకరించలేదు. దాంతో బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం మరోసారి జస్టిస్ చలమేశ్వర్‌ని కలిసి ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ బార్ అసోషియేషన్ సభ్యులతో మాట్లాడుతూ.. ‘గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి బదిలీ అయినప్పడు కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తామంటే నేను ఒప్పుకోలేదు’ అని చెప్పారు. ఇదే అంశంపై బార్ అసోషియేషన్ గౌరవ కార్యదర్శి విక్రాంత్ యాదవ్ స్పందిస్తూ, అసోసియేషన్త తరఫున సీనియర్ జస్టిస్ చలమేశ్వర్‌ను వీడ్కోలు సభ ఏర్పాటు చేయాలని భావించినా అందుకు ఆయన అంగీకరించలేదన్నారు. పదవీ విరమణ పొందుతున్న జడ్జీలకు న్యాయస్థానం వేసవి సెలవులను ప్రకటించడానికి ముందు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీ వస్తుందన్నారు. ఇలావుండగా, జస్టిస్ చలమేశ్వర్ బుధవారం రోజున విధులకు హాజరుకాలేదు. సుప్రీంకోర్టు జడ్జీలలో వారం వారం ఒకరు వంతుల వారీగా తమ సొంత రాష్ట్ర వంటకాలతో (ఘర్ కా ఖానా) విందు ఇస్తున్న విషయం తెలిసిందే. అందరూ కలిసి ఒకే చోట విందు భోజనం చేస్తున్న సంప్రదాయ కార్యక్రమానికి కూడా గత మూడు బుధవారాల నుంచి జస్టిస్ చలమేశ్వర్ దూరంగా ఉంటున్నారని తెలిసింది. -
కొలీజియంపై ‘బార్’ విమర్శలు
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)కి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బలంగా మద్దతు తెలిపింది. కొలీజియం వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. సినీ తారలు, రాజకీయ నాయకులకు ఊరటనిస్తూ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల బాధితులకు న్యాయం ఇవ్వని జడ్జీలను ఈ కొలీజియం వ్యవస్థ అందించిందని ధ్వజమెత్తింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బుధవారం జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సారథ్యంలోని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. మానవ విలువలు, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో సామాన్యులకు న్యాయం అందించలేకపోవటం మనకు సిగ్గుచేటని అన్నారు. ఒకవైపు అల్లర్ల కేసులో దోషిగా నిర్ధారితుడైన మాయా కొద్నాని వంటి వ్యక్తులు ఊరట పొందుతుంటే.. మరొకవైపు తీస్తా సెతల్వాద్ వంటి కార్యకర్తలు ముందస్తు బెయిలు కోసం అన్నివైపులా పరుగులు తీయాల్సి వస్తోందని ఆయన ఒక దశలో తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయమూర్తుల వల్లే సినీతారలు, రాజకీయ నేతలకు తక్షణం ఊరట లభిస్తోందన్నారు. జడ్జీలు బురఖాలతో కోర్టుల ఆవరణలో తిరిగితే.. న్యాయవ్యవస్థ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవచ్చన్నారు.