వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌తో జస్టిస్ ఎంఆర్ షా
న్యూఢిల్లీ: ఇప్పుడే పదవీవిరమణ చేయాల్సిన వ్యక్తిని కాదని, మరో కొత్త ఇన్నింగ్స్ మొదలెడతా అని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ముఖేశ్‌కుమార్ రసిక్‌భాయ్(ఎంఆర్) షా సోమవారం వ్యాఖ్యానించారు. భారత సర్వోన్నత న్యాయస్థానంలో నాలుగో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన ఎంఆర్ షా సోమవారం పదవీవిరమణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన సుప్రీంకోర్టు బార్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ షా ప్రసంగించారు.
‘ రిటైర్ అవ్వాల్సిన వ్యక్తినికాదు. జీవితంలో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతా. కొత్త ఇన్నింగ్స్ ఆడేందుకు సరిపడ ధైర్య, స్థైర్య, ఆయుఃఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. రాజ్‌కపూర్ సినిమాలో పాటలోని పదాలు నాకు గుర్తొస్తున్నాయి. రేపు నేను ఆటలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ వినీలాకాశంలో సదా తారనై ఉంటా. పుట్టుక ఇక్కడే. మరణమూ ఇక్కడే’ అంటూ ఉద్వేగంతో మాట్లాడారు. ‘లాయర్లకు నాదో విన్నపం.
అస్తమానం కేసులపై వాయిదాలు కోరకండి. వాదనలకు సిద్ధమై రండి. యువ లాయర్లకు నాదో సలహా బార్ రూమ్‌లోనో, క్యాంటీన్‌లో కాలక్షేపాలొద్దు. కోర్టు హాల్‌లో వాదనలు విని అనుభవం గడించండి’ అని అన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు. ‘ ధైర్యం, పోరాట స్ఫూర్తి చూస్తే ఆయనను టైగర్ షా అనాల్సిందే. తర్కంతో ఆలోచించే జ్ఞాని. టెక్నాలజీని త్వరగా ఆకళింపుచేసుకుంటారు. కొలీజియం నిర్ణయాలు తీసకునేటపుడు అద్భుతమైన సలహాలిచ్చారు.
నేను అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు మొదలైన స్నేహం ఆనాటి నుంచీ కొనసాగింది. ఎవరి ఇళ్లల్లో వాళ్లం ఉన్నాసరే ఫోన్‌చేస్తే చాలు ఆయన ఎప్పుడూ కీలకమైన అంశాలపై చర్చిస్తుండేవారు. కోవిడ్ సంక్షోభకాలంలోనూ విధులు నిర్వర్తించాం’ అని అన్నారు. 2018 నవంబర్ రెండో తేదీన సుప్రీంకోర్టు జడ్జిగా షా నియమితులయ్యారు. సోమవారం ఆయన రిటైర్‌అవడంతో సుప్రీంకోర్టులో సీజేతో కలిపి మొత్తం జడ్జీల సంఖ్య 32కు పడిపోయింది. ఆదివారం మరో జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి రిటైర్‌కావడం తెల్సిందే. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టులో జడ్జీల గరిష్ట సంఖ్య 34.
జస్టిస్ ఎంఆర్ షా న్యాయ ప్రస్థానం 1982లో గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా మొదలైంది. 2004 మార్చిలో గుజరాత్ హైకోర్టులో అదనపు న్యాయవాదిగా నియమితులయ్యారు. ఆ తర్వాతి ఏడాది శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2018 ఆగస్ట్‌లో పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అదే ఏడాది నవంబర్‌లో పదోన్నతితో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment