న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా రెండు మద్యం సీసాలు కోర్టు గదిలో ప్రత్యక్షమయ్యాయి. ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనపై రెండు మద్యం కంపెనీల మధ్య నెలకొన్న వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. పిటిషనర్ల వాదించిన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ ఈ మద్యం సీసాలను కోర్టులోకి తీసుకొచ్చారు. ధర్మాసనం ఎదుట ప్రదర్శించారు.
వాటిని చూసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. బిగ్గరగా నవ్వారు. అసలు ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జేకే ఎంటర్‌ప్రైజెస్ అనే లిక్కర్ కంపెనీ ‘లండన్ ప్రైడ్’ పేరుతో మద్యం తయారు చేస్తోంది. ఈ పేరు తాము తయారుచేస్తున్న ‘బ్లెండర్స్ ప్రైడ్’ మద్యం పేరును పోలి ఉందని పెర్నాడ్ రికార్డ్స్ అనే మరో లిక్కర్ కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా లండన్ ప్రైడ్ లిక్కర్ బాటిల్ ‘ఇంపీరియల్ బ్లూ’ లిక్కర్ బాటిల్ మాదిరిగానే ఉందని ఆరోపించింది.
లండన్ ప్రైడ్ పేరుతో లిక్కర్ తయారు చేయకుండా దాన్ని నిషేధించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ పెర్నాడ్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున రోహత్గీ వాదనలు వినిపించారు. ధర్మాసనం అనుమతితో లండన్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ లిక్కర్ సీసాలను తీసుకొచ్చి తన టేబుల్‌పై ఉంచారు.
వాటిని చూసి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ‘వాటిని మీతోపాటే తీసుకొచ్చారా?’ అని రోహత్గీని ప్రశ్నించారు. రెండు సీసాల మధ్య సారూప్యతను స్వయంగా చూపించడానికే తీసుకొచ్చానని ఆయన బదులిచ్చారు. ఈ కేసులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన జరిగిందని చెప్పారు. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. గతంలో బాంబే హైకోర్టులో ఇలాంటి కేసులో తాను తీర్పు ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధిస్తున్నట్లు చెప్పారు. జేకే ఎంటర్‌ప్రైజెస్‌కు నోటీసు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment