trademark infringement
-
సుప్రీంకోర్టులో రెండు మద్యం సీసాలు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా రెండు మద్యం సీసాలు కోర్టు గదిలో ప్రత్యక్షమయ్యాయి. ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనపై రెండు మద్యం కంపెనీల మధ్య నెలకొన్న వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. పిటిషనర్ల వాదించిన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ ఈ మద్యం సీసాలను కోర్టులోకి తీసుకొచ్చారు. ధర్మాసనం ఎదుట ప్రదర్శించారు. వాటిని చూసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. బిగ్గరగా నవ్వారు. అసలు ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జేకే ఎంటర్ప్రైజెస్ అనే లిక్కర్ కంపెనీ ‘లండన్ ప్రైడ్’ పేరుతో మద్యం తయారు చేస్తోంది. ఈ పేరు తాము తయారుచేస్తున్న ‘బ్లెండర్స్ ప్రైడ్’ మద్యం పేరును పోలి ఉందని పెర్నాడ్ రికార్డ్స్ అనే మరో లిక్కర్ కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా లండన్ ప్రైడ్ లిక్కర్ బాటిల్ ‘ఇంపీరియల్ బ్లూ’ లిక్కర్ బాటిల్ మాదిరిగానే ఉందని ఆరోపించింది. లండన్ ప్రైడ్ పేరుతో లిక్కర్ తయారు చేయకుండా దాన్ని నిషేధించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ పెర్నాడ్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున రోహత్గీ వాదనలు వినిపించారు. ధర్మాసనం అనుమతితో లండన్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ లిక్కర్ సీసాలను తీసుకొచ్చి తన టేబుల్‌పై ఉంచారు. వాటిని చూసి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ‘వాటిని మీతోపాటే తీసుకొచ్చారా?’ అని రోహత్గీని ప్రశ్నించారు. రెండు సీసాల మధ్య సారూప్యతను స్వయంగా చూపించడానికే తీసుకొచ్చానని ఆయన బదులిచ్చారు. ఈ కేసులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన జరిగిందని చెప్పారు. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. గతంలో బాంబే హైకోర్టులో ఇలాంటి కేసులో తాను తీర్పు ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధిస్తున్నట్లు చెప్పారు. జేకే ఎంటర్‌ప్రైజెస్‌కు నోటీసు జారీ చేశారు. -
పేటీఎంకు మరో షాక్!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తరువాత బాగా పాపులర్ అయిన మొబైల్ కామర్స్ , చెల్లింపుల కంపెనీ పేటిఎం కు భారీ షాక్ తగలనుంది. ట్రేడ్ మార్క్ ఉల్లంఘన ఆరోపణలతో అమెరికన్ పేమెంట్ దిగ్గజం, ప్రపంచ చెల్లింపుల కంపెనీ పేపాల్ తాజాగా కేసు నమోదు చేసింది. తమ లోగోకు సమానమైన ఒక లోగోను పేటీఎం అక్రమంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది. దీంతో ప్రముఖ డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం ట్రేడ్ మార్క్ ఉల్లంఘన ఆరోపణల్లో ఐటీసీ, మెక్ డోవెల్ లాంటి భారతీయ కంపెనీల సరసన చేరింది. కాలిఫోర్నియాకు చెందిన పే పాల్ ట్రేడ్ మార్క్ ఉల్లంఘనల కింద పే టీఎంపై కేసు నమోదు చేసింది. సుమారు14 పేజీల పత్రంలో పేటీఎంపై ఫిర్యాదు చేసింది. 1999 ఇండియన్ ట్రేడ్ మార్క్ చట్టం అయిదు రకాల లోగోలను రిజిస్టర్ చేసినట్టు తెలిపింది. వీటిల్లో ఏదో ఒకటి వాడుకునే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. 2007 సం.రం నుంచి తాము దీన్ని వాడుతున్నట్టు పేర్కింది. తమ లోగోను అక్రమంగా వాడుకోవడం ద్వారా తమ ఖాతాదారుల్లో, ప్రజల్లో అయోమయం సృష్టిస్తోందని తెలిపింది. ఈ గందరగోళం, మోసంకారణంగా తమ బ్రాండ్ ఈక్విటీ తగ్గిపోయే అవకాశ ఉందనే ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఈ ఏడాది ఆగస్టులో వన్ 97 పేరుతో దాఖలైన పేటీఎం ట్రేడ్‌మార్క్ దరఖాస్తును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అతి పెద్ద లబ్దిదారుగా అవతరించిన పే టీఎం గత నెలలో తన వినియోగదార్ల బేస్ గా భారీగా పెంచుకుంది. దేశంలో చిన్న చెల్లింపులు బ్యాంకుగా ఆర్బిఐ లైసెన్స్ ఉన్న పేటీఎం 14 మిలియన్ కొత్త వినియోగదారులను సాధించింది. సుమారు 100 మిలియన్ల యూజర్లతో దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపులపై ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో పేటీఎం చురుగ్గా కదులుతోంది. నగదు రహిత భారతంకోసం భారీ ప్రచారాన్ని నిర్వహిస్తూ తన సేవలను ప్రమోట్ చేసుకుంటోంది. మరోవైపు కొంతమంది ఆన్లైన్ మోసగాళ్లు తమను చీట్ చేశారని డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 48 మంది కస్టమర్లు తమను రూ 6.15 లక్షల మేర మోసం చేశారని ఆరోపించారు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.