పేటీఎంకు మరో షాక్!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తరువాత బాగా పాపులర్ అయిన మొబైల్ కామర్స్ , చెల్లింపుల కంపెనీ పేటిఎం కు భారీ షాక్ తగలనుంది. ట్రేడ్ మార్క్ ఉల్లంఘన ఆరోపణలతో అమెరికన్ పేమెంట్ దిగ్గజం, ప్రపంచ చెల్లింపుల కంపెనీ పేపాల్ తాజాగా కేసు నమోదు చేసింది. తమ లోగోకు సమానమైన ఒక లోగోను పేటీఎం అక్రమంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది. దీంతో ప్రముఖ డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం ట్రేడ్ మార్క్ ఉల్లంఘన ఆరోపణల్లో ఐటీసీ, మెక్ డోవెల్ లాంటి భారతీయ కంపెనీల సరసన చేరింది.
కాలిఫోర్నియాకు చెందిన పే పాల్ ట్రేడ్ మార్క్ ఉల్లంఘనల కింద పే టీఎంపై కేసు నమోదు చేసింది. సుమారు14 పేజీల పత్రంలో పేటీఎంపై ఫిర్యాదు చేసింది. 1999 ఇండియన్ ట్రేడ్ మార్క్ చట్టం అయిదు రకాల లోగోలను రిజిస్టర్ చేసినట్టు తెలిపింది. వీటిల్లో ఏదో ఒకటి వాడుకునే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. 2007 సం.రం నుంచి తాము దీన్ని వాడుతున్నట్టు పేర్కింది. తమ లోగోను అక్రమంగా వాడుకోవడం ద్వారా తమ ఖాతాదారుల్లో, ప్రజల్లో అయోమయం సృష్టిస్తోందని తెలిపింది. ఈ గందరగోళం, మోసంకారణంగా తమ బ్రాండ్ ఈక్విటీ తగ్గిపోయే అవకాశ ఉందనే ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఈ ఏడాది ఆగస్టులో వన్ 97 పేరుతో దాఖలైన పేటీఎం ట్రేడ్మార్క్ దరఖాస్తును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత అతి పెద్ద లబ్దిదారుగా అవతరించిన పే టీఎం గత నెలలో తన వినియోగదార్ల బేస్ గా భారీగా పెంచుకుంది. దేశంలో చిన్న చెల్లింపులు బ్యాంకుగా ఆర్బిఐ లైసెన్స్ ఉన్న పేటీఎం 14 మిలియన్ కొత్త వినియోగదారులను సాధించింది. సుమారు 100 మిలియన్ల యూజర్లతో దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపులపై ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో పేటీఎం చురుగ్గా కదులుతోంది. నగదు రహిత భారతంకోసం భారీ ప్రచారాన్ని నిర్వహిస్తూ తన సేవలను ప్రమోట్ చేసుకుంటోంది.
మరోవైపు కొంతమంది ఆన్‌లైన్ మోసగాళ్లు తమను చీట్ చేశారని డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 48 మంది కస్టమర్లు తమను రూ 6.15 లక్షల మేర మోసం చేశారని ఆరోపించారు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.