సాక్షి, న్యూఢిల్లీ: యాభై శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సూచించారు. ‘‘వేలాది సంవత్సరాల అణచివేత ఇక చాలు, న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు.. ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. మీరు చింతిస్తూ కూర్చోకూడదు. ఆగ్రహంతో గట్టిగా నినదించాలి. 50 శాతం రిజర్వేషన్లు కావాలని బలంగా డిమాండ్ చేయాలి. నా మద్దతు మీకు ఉంటుంది’’ అని జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌లోని మహిళా న్యాయవాదులు ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు.
న్యాయవాదుల్లో మహిళలు 15 శాతమే
‘‘దిగువ న్యాయస్థానాల్లో మహిళా జడ్జీలు కేవలం 30 శాతం లోపే ఉన్నారు. హైకోర్టుల్లో 11.5 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టులో 11 నుంచి 12 శాతం ఉన్నారు. దేశంలోని మొత్తం 17 లక్షల న్యాయవాదుల్లో 15 శాతం మాత్రమే మహిళలున్నారు. బార్ కౌన్సిళ్లలో ఎన్నికైన ప్రతినిధుల్లో కేవలం 2 శాతం మాత్రమే మహిళలు. బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళల ప్రాతినిధ్యం లేదు. దీన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైన దిద్దుబాటు చర్యల గురించి కార్యనిర్వాహక వ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తా. ఉన్నత న్యాయస్థానాల్లో అంతరాన్ని తగ్గించడానికి సహచర కొలీజియం సభ్యులు కూడా చొరవ చూపడం సంతోషంగా ఉంది.
న్యాయవాద వృత్తిలోకి రావడానికి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ అడ్డంకులు, లింగ వివక్ష ఎదుర్కొంటున్నారు. చాలామంది క్లయింట్లు పురుష న్యాయవాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోర్టు గదుల్లో సౌలభ్యంగా లేని వాతావరణం, మౌలికవసతుల లేమి, రద్దీగా ఉండే కోర్టు గదులు, వాష్‌రూమ్స్ లేమి వంటివి మహిళలు న్యాయవాద వృత్తిలోకి రావడానికి అడ్డంకిగా ఉంటున్నాయి. 6 వేల ట్రయల్ కోర్టుల్లో 22 శాతం కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని నా సర్వేలో తేలింది. మహిళలకు మరింతగా స్వాగతం పలికే వాతావరణం కల్పించాలి. న్యాయ విద్యలో లింగ నిష్పత్తిపై దృష్టి సారించాలి. తొలి చర్యగా న్యాయ కళాశాలలు, యూనివర్సిటీలలో మహిళలకు తగినంతగా రిజర్వేషన్లు కలి్పంచాలి. మహిళా జడ్జీలు, లాయర్లు గణనీయంగా పెరుగుతారు.
అన్ని రంగాల్లోకి మహిళలు వచ్చేలా స్ఫూర్తి కావాలి. న్యాయవాద వృత్తిలో లింగ అసమానతలు తొలగించడానికి తీసుకొనే చర్యలకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. సీనియర్ న్యాయవాదుల ఎంపికకు త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రత్యక్ష విచారణ విషయానికొస్తే.. దీని వల్ల జడ్జీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. లాయర్లకే ఒకింత ఇబ్బంది. దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని భావిస్తున్నాం. థర్డ్‌వేవ్ రాకూడదని ప్రారి్థద్దాం. ప్రత్యక్ష విచారణకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పట్ల అడ్వొకేట్ల అసోసియేషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని సరిచేయాలని రిజిస్ట్రీని ఆదేశించా. మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని సీజేఐ జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు.
వలస పాలకుల చట్టాలతో ఇబ్బందులు: జస్టిస్ పి.ఎస్.నరసింహ
వలస పాలకుల హయాం నాటి కాలం చెల్లిన చట్టాలు, వాటికి ఇచ్చిన భాష్యాలతో భారత్ 70 ఏళ్లకు పైగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను లోతుగా అధ్యయనం చేసి వాటికి కొత్త వివరణ ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనే ఉందని అన్నారు. సుప్రీంకోర్టు బెంచ్‌లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండడం అసాధారణమైన విషయమన్నారు. కోర్టుల్లో 50 శాతానికి మహిళలు పరిమితమవకుండా ఇంకా ఎక్కువ మంది ఉండాలన్నదే తన ఆకాంక్షని చెప్పారు. ప్రతిభ ఆధారంగా ఎంత ఎక్కువ మంది మహిళలుంటే అంత మంచిదని, మగవారి కంటే మహిళలే లోతైన ఆలోచన చేస్తారని జస్టిస్ నరసింహ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment