Women lawyers
-
న్యాయ వృత్తిలో మహిళలు పెరగాలి: సీజేఐ
మదురై: న్యాయ వృత్తిని చేపడుతున్న పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మరోసారి తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘నైపుణ్యమున్న మహిళా లాయర్లకు మన దేశం కొదవేమీ లేదు. అయినా పురుషులతో పోలిస్తే వారి సంఖ్య ఎప్పుడూ చాలా తక్కువే. మహిళలు ఇంటిపని తదితరాల కారణంగా వృత్తికి న్యాయం చేయలేరేమోనని లా చాంబర్లు భావిస్తుండటం వంటివి ఇందుకు కారణాలు’’ అన్నారు. ‘‘పిల్లల్ని కనడం, వారి సంరక్షణ తదితరాల వల్ల మహిళలకు వృత్తిపరంగా శిక్ష పడకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి వారికి వ్యక్తిగతంగానే గాక వ్యవస్థాగతంగా కూడా చేయూతనివ్వాలి. కోర్టు సముదాయాల్లో క్రెష్ సదుపాయం దిశగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు తీసుకున్న చర్యల వంటివి దేశవ్యాప్తం కావాలి’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం మదురైలో జిల్లా కోర్టుల సముదాయం తదితరాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ వృత్తి మహిళలకు సమానావకాశాలు కల్పించడం లేదన్నారు. తమిళనాడులో న్యాయవాదులుగా నమోదు చేసుకుంటున్న పురుషుల సంఖ్య 50 వేల దాకా ఉంటే మహిళలు ఐదు వేలకు మించడం లేదంటూ ఉదాహరించారు. ‘‘ఇటీవల పరిస్థితి మారుతుండటం శుభసూచకం. జిల్లా స్థాయి న్యాయ నియామకాల్లో 50 శాతానికి పైగా మహిళలే చోటుచేసుకున్నారు. ఈ ధోరణి మరింత పెరగాలి’’ అని సీజేఐ ఆకాంక్షించారు. జూనియర్ లాయర్లకు నెలకు కేవలం రూ.5,000–12,000 వేతనం సరికాదన్నారు. ఘర్షణ లేదు: రిజిజు ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య ఉన్నది అభిప్రాయ భేదాలేనని తప్ప ఘర్షణ కాదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు. ‘‘మా మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు గొడవలేమీ కాదు. అవి సంక్షోభం కాదు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించేందుకు కేంద్రం ఎప్పుడూ సహకరిస్తుంది’’ అని చెప్పారు. చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాల్లో సుప్రీంకోర్టు బెంచిలు ఏర్పాటు చేయాలని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ సీజేఐని కోరారు. -
కోర్టులో మహిళా లాయర్ల సిగపట్లు.. వీడియో వైరల్..
లక్నో: ఇద్దరు మహిళా లాయర్లు కోర్టు ఆవరణలోనే రెచ్చిపోయారు. తాము న్యాయవాదులమని మర్చిపోయి సిగపట్లు పట్టారు. జట్లు పట్టుకుని ఒకరిపై ఒకరు చెంపదెబ్బల వర్షం కురిపించుకున్నారు. వారిని ఆపేందుకు అక్కడున్న వారు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఉత్తర్‌ప్రదేశ్ కాస్గంజ్ కోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చివరకు మహిళా ఎస్సై జోక్యం చేసుకుని ఇద్దరు లాయర్లను ఆపింది. ఆ తర్వాత వారు శాంతించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఈ ఇద్దరు ఎందుకు అంతలా గొడవపడ్డారనే విషయం మాత్రం తెలియరాలేదు. లాయర్లు అయి ఉండి ఇలా ఫైటింగ్ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు महिला वकीलों में जमकर मारपीट, एक-दूसरे के खींचे बाल, जमकर बरसाए थप्पड़। वीडियो हुआ वायरल... यूपी के कासगंज से सामने आया मामला pic.twitter.com/vhpZvRdiMP — News24 (@news24tvchannel) October 28, 2022 చదవండి: ఇండిగో విమానంలో చెలరేగిన మంటలు.. వీడియో వైరల్.. -
50 శాతం మీ హక్కు: జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: యాభై శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ‘‘వేలాది సంవత్సరాల అణచివేత ఇక చాలు, న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు.. ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. మీరు చింతిస్తూ కూర్చోకూడదు. ఆగ్రహంతో గట్టిగా నినదించాలి. 50 శాతం రిజర్వేషన్లు కావాలని బలంగా డిమాండ్ చేయాలి. నా మద్దతు మీకు ఉంటుంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌లోని మహిళా న్యాయవాదులు ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల్లో మహిళలు 15 శాతమే ‘‘దిగువ న్యాయస్థానాల్లో మహిళా జడ్జీలు కేవలం 30 శాతం లోపే ఉన్నారు. హైకోర్టుల్లో 11.5 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టులో 11 నుంచి 12 శాతం ఉన్నారు. దేశంలోని మొత్తం 17 లక్షల న్యాయవాదుల్లో 15 శాతం మాత్రమే మహిళలున్నారు. బార్ కౌన్సిళ్లలో ఎన్నికైన ప్రతినిధుల్లో కేవలం 2 శాతం మాత్రమే మహిళలు. బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళల ప్రాతినిధ్యం లేదు. దీన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైన దిద్దుబాటు చర్యల గురించి కార్యనిర్వాహక వ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తా. ఉన్నత న్యాయస్థానాల్లో అంతరాన్ని తగ్గించడానికి సహచర కొలీజియం సభ్యులు కూడా చొరవ చూపడం సంతోషంగా ఉంది. న్యాయవాద వృత్తిలోకి రావడానికి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ అడ్డంకులు, లింగ వివక్ష ఎదుర్కొంటున్నారు. చాలామంది క్లయింట్లు పురుష న్యాయవాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కోర్టు గదుల్లో సౌలభ్యంగా లేని వాతావరణం, మౌలికవసతుల లేమి, రద్దీగా ఉండే కోర్టు గదులు, వాష్‌రూమ్స్ లేమి వంటివి మహిళలు న్యాయవాద వృత్తిలోకి రావడానికి అడ్డంకిగా ఉంటున్నాయి. 6 వేల ట్రయల్ కోర్టుల్లో 22 శాతం కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని నా సర్వేలో తేలింది. మహిళలకు మరింతగా స్వాగతం పలికే వాతావరణం కల్పించాలి. న్యాయ విద్యలో లింగ నిష్పత్తిపై దృష్టి సారించాలి. తొలి చర్యగా న్యాయ కళాశాలలు, యూనివర్సిటీలలో మహిళలకు తగినంతగా రిజర్వేషన్లు కలి్పంచాలి. మహిళా జడ్జీలు, లాయర్లు గణనీయంగా పెరుగుతారు. అన్ని రంగాల్లోకి మహిళలు వచ్చేలా స్ఫూర్తి కావాలి. న్యాయవాద వృత్తిలో లింగ అసమానతలు తొలగించడానికి తీసుకొనే చర్యలకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. సీనియర్ న్యాయవాదుల ఎంపికకు త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రత్యక్ష విచారణ విషయానికొస్తే.. దీని వల్ల జడ్జీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. లాయర్లకే ఒకింత ఇబ్బంది. దసరా తర్వాత ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని భావిస్తున్నాం. థర్డ్‌వేవ్ రాకూడదని ప్రారి్థద్దాం. ప్రత్యక్ష విచారణకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పట్ల అడ్వొకేట్ల అసోసియేషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటిని సరిచేయాలని రిజిస్ట్రీని ఆదేశించా. మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని సీజేఐ జస్టిస్ ఎన్ వీ రమణ పేర్కొన్నారు. వలస పాలకుల చట్టాలతో ఇబ్బందులు: జస్టిస్ పి.ఎస్.నరసింహ వలస పాలకుల హయాం నాటి కాలం చెల్లిన చట్టాలు, వాటికి ఇచ్చిన భాష్యాలతో భారత్ 70 ఏళ్లకు పైగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను లోతుగా అధ్యయనం చేసి వాటికి కొత్త వివరణ ఇవ్వాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనే ఉందని అన్నారు. సుప్రీంకోర్టు బెంచ్‌లో నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉండడం అసాధారణమైన విషయమన్నారు. కోర్టుల్లో 50 శాతానికి మహిళలు పరిమితమవకుండా ఇంకా ఎక్కువ మంది ఉండాలన్నదే తన ఆకాంక్షని చెప్పారు. ప్రతిభ ఆధారంగా ఎంత ఎక్కువ మంది మహిళలుంటే అంత మంచిదని, మగవారి కంటే మహిళలే లోతైన ఆలోచన చేస్తారని జస్టిస్ నరసింహ కొనియాడారు. -
Vidhi Collections: ఈ క్లాత్‌లో అస్సలు గంజి ఉండదు!
న్యాయవాదులు న్యాయం గురించి ఆలోచిస్తారు. న్యాయవాదుల గురించి కేరళ కసవు చేనేత ఆలోచించింది. ‘విధి’ కలెక్షన్ పేరుతో కొంగొత్త ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీరలను వారి ముందుంచింది. ‘కసవు’ అనేది కేరళలో ధరించే సంప్రదాయ హాఫ్‌వైట్ ఫ్యాబ్రిక్. ఇది అక్కడి స్థానిక చేనేతకారుల చేతుల్లో రూపుద్దుకుంటుంది. కసవు చీరలు కేరళ సంప్రదాయ పండగ సీజన్లలో ముఖ్యంగా ఏప్రిల్–ఆగస్టు నెలలో విరివిగా కొనుగోళ్లు జరుగుతాయి. ఓనమ్ పండగకు మహిళలు తప్పక కసవు సంప్రదాయ చీరను ధరిస్తారు. కోవిడ్–19 మహమ్మారి వల్ల లాక్డౌన్ విధింపులతో పండగలు, వేడుకలు లేవు. అంతకుముందు ఏడాది వరదల కారణంగా నేత కార్మికులు ఘోరమైన నష్టాలను చవిచూశారు. ఈ కష్టం నుంచి గట్టెక్కడానికి ఈ కొత్త మోనోక్రామ్ చీరలు వినూత్నంగా రూపొందించారు. అయితే, ‘ప్రజలు వీటినే కొనాలని మేం కోరుకోవడం లేదు. మేం సమకాలీన ఉత్పత్తులను సృష్టించాలి, మా హస్తకళ ప్రావీణ్యం తెలియాలనే వీటిని రూపకల్పన చేశాం’ అని సేవ్ ది లూమ్ వ్యవస్థాపకుడు రమేష్ మీనన్ ఈ సందర్భంగా వివరిస్తారు. వీరి ఆలోచనా విధానం నుంచే ‘విధి’ అనే నూతన డిజైన్ కసవు నేతలో పుట్టుకొచ్చింది. సౌకర్యానికే ప్రథమ స్థానం న్యాయవాదుల వేషధారణ గురించి 18వ శతాబ్దం నుండి ఆలోచించనేలేదు. బ్రిటీష్ కోర్టుల నుంచి ప్రేరణ పొందిన ఈ యూనిఫాం చీరలు, సల్వార్ కుర్తాలు నలుపు, తెలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి. ప్రత్యేక కాలర్ గల జాకెట్, ఫార్మల్ గౌన్ అదనంగా మహిళలకు నిర్ణయించారు. అంతేకాదు, మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరిస్తారు మీనన్. ‘మన దేశంలో న్యాయస్థానాలు వేడి వాతావరణంలో ఉంటాయి. న్యాయవాదులు రోజుకు 12 నుండి 14 గంటలపాటు పనిలో ఉంటారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. వారు తమ రెగ్యులర్ వేర్ని మెయింటెయిన్ చేయడానికి సమయం ఉండదు. కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు గౌన్లను శుభ్రపరుచుకోవడానికి మాత్రమే కాస్త అవకాశం లభిస్తుంది. కసవు నేతలో నాణ్యమైన పత్తి ఉంటుంది. ఈ క్లాత్‌లో అస్సలు గంజి ఉండదు. దీంతో పనిలో ఉండేవారికి ఈ చీరలు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఈ చేనేతకు ముష్రూ పట్టు నుండి ప్రేరణ పొందాం. మొఘల్ రాచకుటుంబీకుల కోసం అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్‌గా దీనిని చెప్పవచ్చు. బట్ట ఎంతో మృదువుగా ఉంటుంది’ అని వివరిస్తారు. న్యాయవాది అన్నా చాందీ పుట్టిన రోజు సందర్భంగా ‘విధి’ క్లాత్‌ను లాంచ్ చేశారు. ఈ కొత్త చీరల కలెక్షన్‌ను యువ మహిళా న్యాయవాదులు ధరించి అందమైన, అత్యద్భుతమైన, సౌకర్యవంతమైన ఈ చీరల్లో కొత్తగా మెరిసిపోయారు. ఈ చీరలను న్యాయవాదులే కాదు దేశ మహిళలందరూ ధరించి, హుందాతనాన్ని మూటగట్టుకోవచ్చు. ముఖ్యంగా వర్కింగ్ వేర్‌గా ఈ ‘విధి’ సరికొత్త శారీస్ పేరొందుతాయి అని చెప్పచ్చు. -
చట్టానికి మహిళలంటే పక్షపాతమేమీ లేదు!
లీగల్ కౌన్సెలింగ్ మేడం, మహిళల గురించి ఏమైనా కంప్లైంట్ చేస్తే మహిళా న్యాయవాదులు కస్సుమంటుంటారు. మరి వారు చేసే మోసాలకూ, అన్యాయాలకూ అడ్డుకట్టవేయలేమా? ప్రతి విషయంలో మగవారే నిందితులా? నా ప్రశ్న ఏమిటంటే.. మా ఏరియాలో గత ఐదేళ్ల నుంచి జరుగుతున్న ఒక విషయం గురించి.... మేడం, మా ఏరియాలో ఒక గొప్ప కంపెనీలో పనిచేసే అందమైన మహిళ ఒకామె నివసిస్తున్నారు. ఆమె నైట్‌షిఫ్ట్‌లో పని చేస్తున్నారు. పగలు అప్పుడప్పుడు కొందరు మగవాళ్లు వస్తూ పోతూ ఉండేవాళ్లు. ఆమెది స్వంత ఇల్లు కనుక ఎవరూ ఏమీ ప్రశ్నించలేదు. వారు ఆమెకు స్నేహితులు, బంధువులు అనుకున్నాము. ఆ మధ్యనే నా ఫ్రెండ్ కూడా ఆమె ఇంటికి వెళ్లి రావడం జరిగిందట. వాడు నాకు ఒక భయంకరమైన విషయం చెప్పాడు. తనకు ఇటీవలే హెచ్ఐవీ పాజిటివ్ సోకిందని! అంతకంటే భయంకరమైన విషయం ఆమె వద్దకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఆ జబ్బు సోకిందని చెప్పాడు. చివరకు వారంతా ఆమె గురించి వాకబు చేస్తే, ఆమె ఆ వ్యాధిగ్రస్థురాలనీ, ఆమెకు ఆ వ్యాధి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదనీ. కానీ ఆమె సమాజం పట్ల ముఖ్యంగా మగవారి పట్ల క్రోధం, ద్వేషం పెంచుకుని సాధ్యమైనంతమందికి ఆ వ్యాధి సోకేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిసింది. ఆ విషయం ఆమె కూడా కొందరిముందు ఒప్పుకుందని చెప్పాడు. ఇప్పుడు మీరు పురుషులకు ఏమి సమాధానం ఇస్తారో చెప్పండి. -సత్యకృష్ణ, సికిందరాబాద్ సార్, మీరు చాలా అపోహల్లో ఉన్నారు. చట్టాలు ఇరువురికీ సమానంగానే వర్తిస్తాయి. కొన్ని మాత్రమే స్త్రీలకు నిర్దేశించినవి ఉన్నాయి. అలా ఉన్నా కూడా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాలు పురుషులకు మెండుగా ఉన్నాయి. ఇక మీ ప్రశ్నకు సమాధానం... సెక్షన్ 269, 279 ఐపీసీ ప్రకారం నిర్లక్ష్యంగా రోగాలను వ్యాపింపజేయడం, విచక్షణారహిత చర్యల వల్ల అంటువ్యాధులు సోకేలాగా వ్యవహరించడం నేరం. వీటికి ఆరునెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ 269, 279 ప్రకారం నేరపూరితంగా, హెచ్.ఐ.వి. వైరస్‌ని సంక్రమింపజేస్తే వారిని ప్రాసిక్యూట్ చేయవచ్చు. కలరా, ప్లేగు, సిఫిలిస్, గనేరియా లాంటి వ్యాధులను ఇతరులకు సంక్రమింపచేసే వ్యక్తులకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. కాకపోతే ముద్దాయి ఉద్దేశ్యపూర్వకంగా, ప్రాణాంతకమైన చర్యలను చేశాడని రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ నేరాలు స్త్రీలకూ, పురుషులకూ ఇరువురికీ వర్తిస్తాయి. పరస్త్రీ సాంగత్యం కోసం వెంపర్లాడినందుకు మీ స్నేహితులను ఏమనాలో మీరే ఆలోచించుకోండి. మీరు చెప్పిన ఆ మహిళపై కేసు పెట్టే అవకాశం ఉంది. అమ్మా! నేనూ, నా భర్తా కూలీనాలి చేసుకుని పొట్టపోసుకుని జీవించేవాళ్లం. మాకు ఇద్దరు చిన్నపిల్లలు. ఇటీవల నా భర్త రైలుప్రమాదంలో చనిపోయాడు. నాకు కుటుంబం గడవడం కష్టమైపోతోంది. మాకు ఏదైనా నష్టపరిహారం వ స్తుందా? - రంగమ్మ, ఓ అభాగ్యురాలు తప్పకుండా మీకు నష్టపరిహారం వస్తుంది. మీలాంటి బాధితులకు న్యాయం చేసేందుకే రైల్వేచట్టం ఉంది. వీటికి సంబంధించిన విషయాలను పరిష్కరించేందుకు రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సికిందరాబాద్‌లో ఉంది. రైలు ప్రమాదాలలో చనిపోయినా, గాయాలపాలైనా, వికలాంగులైనా, అటువంటి ప్రయాణీకులు లేదంటే చనిపోయిన వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించమని కోరుతూ దరఖాస్తు పెట్టుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి వివరాలు, వారి టికెట్, ఎఫ్.ఐ.ఆర్, మెడికల్ రిపోర్ట్, పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వంటి సంబంధిత డాక్యుమెంట్లు అన్నీ జతపరచాలి. అలాగే చనిపోయి వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలు, వాటికి తగిన ఆధారాలు కూడా ట్రిబ్యునల్‌లో ఫైల్ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న వారికి, కావాలని గాయాలు చేసుకున్నవారికి, కావాలని గాయాలు చేసుకున్నవారికి నష్టపరిహారం రాదు. మీ భర్త రైలు ప్రమాదంలో మరణించారు కనక మీ భర్త రైలు ప్రమాదంలో మరణించారు కనుక మీకు నష్టపరిహారం వస్తుంది. వెంటనే న్యాయవాదిని సంప్రదించండి. లేదంటే ఉచిత న్యాయసహాయం కోసం లీగల్ సర్వీసెస్ వారిని సంప్రదించండి. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com కేస్ స్టడీ కమ్లీబాయ్... మంగ్లీబాయ్ కటకటాల పాలయ్యారు! సోని, రేణులు అక్కాచెల్లెళ్లు. ఇద్దరూ టెన్ట్ పాసై, ఇక చదివే అవకాశాలు లేక, చెప్పించే వాళ్లు లేక, వ్యవసాయకూలీలుగా మారారు. పగలంతా పొలంలో పని చేయడం, సాయంత్రం కూలి డబ్బులు తీసుకెళ్లి మారుటితల్లికి ఇవ్వడం, ఆమె తిట్టుకుంటూ పోసే గంజినీళ్లు తాగడం వారి దినచర్య. ఇద్దరూ టీనేజ్ అమ్మాయిలే. పైగా కాయకష్టం చేస్తున్నవాళ్లు కనక తగిన పోషణ లేకపోయినా, కంటికి నదురుగా కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్లు కనక ఉన్నంతలో శుభ్రంగా తయారై, పనికి వెళుతున్నారు. వారి తల్లి వారు చిన్నవయసులో ఉండగానే చనిపోయింది. తండ్రి రెండోపెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి మంగ్లీబాయి ఆరళ్లతోనే పెరిగి పెద్దవాళ్లయ్యారు వారు. ఇరుగూపొరుగూ, చుట్టాలకు భయపడి పదో తరగతి వరకూ ఓపిక పట్టింది వారి సవతి తల్లి. కాలేజీకైతే డబ్బులు ఖర్చవుతాయని, అంతటితో ఆపేసింది. తండ్రి ఒక ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగి. మంచి జీతమైనా సగం తాగుడుకే ఖర్చు చేసేవాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పనికి వెళ్లసాగారు సోని, రేణు. విషయం తెలిసిన తండ్రి, భార్య నోటికి దడిచి, కిక్కురు మనలేదు. ఇంతలో మంగ్లీబాయ్కి దూరపుచుట్టమైన కమ్లీబాయ్ బొంబాయి నుంచి వచ్చింది. ఆమె గురించి రేణూ, సోనిల సవతి తల్లి ఎప్పుడూ గొప్పగా చెబుతుండేది. ఆమె బొంబాయిలో అనాథలైన ఆడపిల్లలకోసం ఆశ్రమం నడుపుతోందని, వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తుందని, ఆమెకు పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయని, బాగా ధనవంతురాలని చెబుతుండేది. వచ్చీ రావడంతోనే సోనీ, రేణూలపై కన్నేసింది కమ్లీబాయ్. మంగ్లీతో ఒకటే మంతనాలు జరుపుకుంది. చివరికి సోనీ, రేణూలకు బేరం కట్టి మంగ్లీబాయికి లక్షరూపాయలిచ్చింది. వారిని బలవంతంగానైనా బొంబాయికి తీసుకుని పోవడానికి సిద్ధమైంది. కమ్లీబాయితో బొంబాయికి వె ళ్లమని, అక్కడ మంచి ఉద్యోగంలో పెడుతుందని, వచ్చేవారమే ప్రయాణమని డిక్లేర్ చేసింది మంగ్లీబాయి. సోనీ, రేణూల్లో ఏదో అనుమానం. సవతి తల్లి ఏదో దాస్తోందని, తమకు బాగా పరిచయం ఉన్న అంగన్ వాడీ వర్కర్‌గా పని చేస్తున్న సుమిత్రక్కకు విషయం చెప్పారు. ఆమె వెంటనే అసలు విషయం పసిగట్టింది. కమ్లీబాయి అమ్మాయిల తో వ్యాపారం చేసే మనిషని తెలుసుకుని మహిళా న్యాయవాదిని సంప్రదించింది. అనుభవజ్ఞురాలైన ఆమె ఇది అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే వ్యవహారమని, కమ్లీబాయ్, మంగ్లీబాయ్లు ఐపీసీ సెక్షన్ 372, 373ల ప్రకారం నేరస్థులవుతారని, వ్యభిచారం కోసం మైనర్ పిల్లలను అమ్మితే సెక్షన్ 372 ఐపీసీ ప్రకారం నేరమని, పది సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుందని, అలాగే వ్యభిచారం నిమిత్తం కానీ, ఎవరితోనైనా అక్రమ సంభోగం జరిపే నిమిత్తం కానీ, చట్టవ్యతిరేక నీతిబాహ్య చర్యలు జరిపే నిమిత్తం కానీ 18 సంవత్సరాలలోపు మైనరు బాలికలను కొన్నా, కిరాయికి తెచ్చినా అది సెక్షన్ పది సంవత్సరాలు జైలుశిక్ష పడుతుందని తెలియజెప్పి, అంగన్వాడీ వర్కర్‌తో, పిల్లలతో కలసి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. భయంకరమైన కూపంలోకి నెట్టివేయకుండా సోనీ, రేణూలు కాపాడబడ్డారు. కమ్లీబాయ్, మంగ్లీబాయ్లు కటకటాల పాలయ్యారు.