చట్టానికి మహిళలంటే పక్షపాతమేమీ లేదు! | Legal counseling | Sakshi
Sakshi News home page

చట్టానికి మహిళలంటే పక్షపాతమేమీ లేదు!

Published Sun, Jul 3 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

చట్టానికి మహిళలంటే పక్షపాతమేమీ లేదు!

చట్టానికి మహిళలంటే పక్షపాతమేమీ లేదు!

లీగల్ కౌన్సెలింగ్
మేడం, మహిళల గురించి ఏమైనా కంప్లైంట్ చేస్తే మహిళా న్యాయవాదులు కస్సుమంటుంటారు. మరి వారు చేసే మోసాలకూ, అన్యాయాలకూ అడ్డుకట్టవేయలేమా? ప్రతి విషయంలో మగవారే నిందితులా? నా ప్రశ్న ఏమిటంటే.. మా ఏరియాలో గత ఐదేళ్ల నుంచి జరుగుతున్న ఒక విషయం గురించి.... మేడం, మా ఏరియాలో ఒక గొప్ప కంపెనీలో పనిచేసే అందమైన మహిళ ఒకామె నివసిస్తున్నారు. ఆమె నైట్‌షిఫ్ట్‌లో పని చేస్తున్నారు. పగలు అప్పుడప్పుడు కొందరు మగవాళ్లు వస్తూ పోతూ ఉండేవాళ్లు. ఆమెది స్వంత ఇల్లు కనుక ఎవరూ ఏమీ ప్రశ్నించలేదు. వారు ఆమెకు స్నేహితులు, బంధువులు అనుకున్నాము. ఆ మధ్యనే నా ఫ్రెండ్ కూడా ఆమె ఇంటికి వెళ్లి రావడం జరిగిందట. వాడు నాకు ఒక భయంకరమైన విషయం చెప్పాడు. తనకు ఇటీవలే హెచ్‌ఐవీ పాజిటివ్ సోకిందని! అంతకంటే భయంకరమైన విషయం ఆమె వద్దకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఆ జబ్బు సోకిందని చెప్పాడు. చివరకు వారంతా ఆమె గురించి వాకబు చేస్తే, ఆమె ఆ వ్యాధిగ్రస్థురాలనీ, ఆమెకు ఆ వ్యాధి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదనీ. కానీ ఆమె సమాజం పట్ల ముఖ్యంగా మగవారి పట్ల క్రోధం, ద్వేషం పెంచుకుని సాధ్యమైనంతమందికి ఆ వ్యాధి సోకేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిసింది. ఆ విషయం ఆమె కూడా కొందరిముందు ఒప్పుకుందని చెప్పాడు. ఇప్పుడు మీరు పురుషులకు ఏమి సమాధానం ఇస్తారో చెప్పండి.
 -సత్యకృష్ణ, సికిందరాబాద్

 
సార్, మీరు చాలా అపోహల్లో ఉన్నారు. చట్టాలు ఇరువురికీ సమానంగానే వర్తిస్తాయి. కొన్ని మాత్రమే స్త్రీలకు నిర్దేశించినవి ఉన్నాయి. అలా ఉన్నా కూడా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాలు పురుషులకు మెండుగా ఉన్నాయి. ఇక మీ ప్రశ్నకు సమాధానం... సెక్షన్ 269, 279 ఐపీసీ ప్రకారం నిర్లక్ష్యంగా రోగాలను వ్యాపింపజేయడం, విచక్షణారహిత చర్యల వల్ల అంటువ్యాధులు సోకేలాగా వ్యవహరించడం నేరం. వీటికి ఆరునెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ 269, 279 ప్రకారం నేరపూరితంగా, హెచ్.ఐ.వి. వైరస్‌ని సంక్రమింపజేస్తే వారిని ప్రాసిక్యూట్ చేయవచ్చు. కలరా, ప్లేగు, సిఫిలిస్, గనేరియా లాంటి వ్యాధులను ఇతరులకు సంక్రమింపచేసే వ్యక్తులకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. కాకపోతే ముద్దాయి ఉద్దేశ్యపూర్వకంగా, ప్రాణాంతకమైన చర్యలను చేశాడని రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ నేరాలు స్త్రీలకూ, పురుషులకూ ఇరువురికీ వర్తిస్తాయి. పరస్త్రీ సాంగత్యం కోసం వెంపర్లాడినందుకు మీ స్నేహితులను ఏమనాలో మీరే ఆలోచించుకోండి. మీరు చెప్పిన ఆ మహిళపై కేసు పెట్టే అవకాశం ఉంది.
 
అమ్మా! నేనూ, నా భర్తా కూలీనాలి చేసుకుని పొట్టపోసుకుని జీవించేవాళ్లం. మాకు ఇద్దరు చిన్నపిల్లలు. ఇటీవల నా భర్త రైలుప్రమాదంలో చనిపోయాడు. నాకు కుటుంబం గడవడం కష్టమైపోతోంది. మాకు ఏదైనా నష్టపరిహారం వ స్తుందా?
 - రంగమ్మ, ఓ అభాగ్యురాలు

 
తప్పకుండా మీకు నష్టపరిహారం వస్తుంది. మీలాంటి బాధితులకు న్యాయం చేసేందుకే రైల్వేచట్టం ఉంది. వీటికి సంబంధించిన విషయాలను పరిష్కరించేందుకు రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సికిందరాబాద్‌లో ఉంది. రైలు ప్రమాదాలలో చనిపోయినా, గాయాలపాలైనా, వికలాంగులైనా, అటువంటి ప్రయాణీకులు లేదంటే చనిపోయిన వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించమని కోరుతూ దరఖాస్తు పెట్టుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి వివరాలు, వారి టికెట్, ఎఫ్.ఐ.ఆర్, మెడికల్ రిపోర్ట్, పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వంటి సంబంధిత డాక్యుమెంట్లు అన్నీ జతపరచాలి. అలాగే చనిపోయి వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలు, వాటికి తగిన ఆధారాలు కూడా ట్రిబ్యునల్‌లో ఫైల్ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న వారికి, కావాలని గాయాలు చేసుకున్నవారికి, కావాలని గాయాలు చేసుకున్నవారికి నష్టపరిహారం రాదు. మీ భర్త రైలు ప్రమాదంలో మరణించారు కనక మీ భర్త రైలు ప్రమాదంలో మరణించారు కనుక మీకు నష్టపరిహారం వస్తుంది. వెంటనే న్యాయవాదిని సంప్రదించండి. లేదంటే ఉచిత న్యాయసహాయం కోసం లీగల్ సర్వీసెస్ వారిని సంప్రదించండి.
 
 ఇ.పార్వతి
 అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
 parvathiadvocate2015@gmail.com
 
 
కేస్ స్టడీ
కమ్లీబాయ్... మంగ్లీబాయ్ కటకటాల పాలయ్యారు!
 
సోని, రేణులు అక్కాచెల్లెళ్లు. ఇద్దరూ టెన్ట్ పాసై, ఇక చదివే అవకాశాలు లేక, చెప్పించే వాళ్లు లేక, వ్యవసాయకూలీలుగా మారారు. పగలంతా పొలంలో పని చేయడం, సాయంత్రం కూలి డబ్బులు తీసుకెళ్లి మారుటితల్లికి ఇవ్వడం, ఆమె తిట్టుకుంటూ పోసే గంజినీళ్లు తాగడం వారి దినచర్య. ఇద్దరూ టీనేజ్ అమ్మాయిలే. పైగా కాయకష్టం చేస్తున్నవాళ్లు కనక తగిన పోషణ లేకపోయినా, కంటికి నదురుగా కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్లు కనక ఉన్నంతలో శుభ్రంగా తయారై, పనికి వెళుతున్నారు. వారి తల్లి వారు చిన్నవయసులో ఉండగానే చనిపోయింది. తండ్రి రెండోపెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి మంగ్లీబాయి ఆరళ్లతోనే పెరిగి పెద్దవాళ్లయ్యారు వారు. ఇరుగూపొరుగూ, చుట్టాలకు భయపడి పదో తరగతి వరకూ ఓపిక పట్టింది వారి సవతి తల్లి. కాలేజీకైతే డబ్బులు ఖర్చవుతాయని, అంతటితో ఆపేసింది.

తండ్రి ఒక ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగి. మంచి జీతమైనా సగం తాగుడుకే ఖర్చు చేసేవాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పనికి వెళ్లసాగారు సోని, రేణు.  విషయం తెలిసిన తండ్రి, భార్య నోటికి దడిచి, కిక్కురు మనలేదు. ఇంతలో మంగ్లీబాయ్‌కి దూరపుచుట్టమైన కమ్లీబాయ్ బొంబాయి నుంచి వచ్చింది. ఆమె గురించి రేణూ, సోనిల సవతి తల్లి ఎప్పుడూ గొప్పగా చెబుతుండేది. ఆమె బొంబాయిలో అనాథలైన ఆడపిల్లలకోసం ఆశ్రమం నడుపుతోందని, వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తుందని, ఆమెకు పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయని, బాగా ధనవంతురాలని చెబుతుండేది. వచ్చీ రావడంతోనే సోనీ, రేణూలపై కన్నేసింది కమ్లీబాయ్. మంగ్లీతో ఒకటే మంతనాలు జరుపుకుంది.

చివరికి సోనీ, రేణూలకు బేరం కట్టి మంగ్లీబాయికి లక్షరూపాయలిచ్చింది. వారిని బలవంతంగానైనా బొంబాయికి తీసుకుని పోవడానికి సిద్ధమైంది. కమ్లీబాయితో బొంబాయికి వె ళ్లమని, అక్కడ మంచి ఉద్యోగంలో పెడుతుందని, వచ్చేవారమే ప్రయాణమని డిక్లేర్ చేసింది మంగ్లీబాయి. సోనీ, రేణూల్లో ఏదో అనుమానం. సవతి తల్లి ఏదో దాస్తోందని, తమకు బాగా పరిచయం ఉన్న అంగన్ వాడీ వర్కర్‌గా పని చేస్తున్న సుమిత్రక్కకు విషయం చెప్పారు. ఆమె వెంటనే అసలు విషయం పసిగట్టింది. కమ్లీబాయి అమ్మాయిల తో వ్యాపారం చేసే మనిషని తెలుసుకుని మహిళా న్యాయవాదిని సంప్రదించింది.


 అనుభవజ్ఞురాలైన ఆమె ఇది అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే వ్యవహారమని, కమ్లీబాయ్, మంగ్లీబాయ్‌లు ఐపీసీ సెక్షన్ 372, 373ల ప్రకారం నేరస్థులవుతారని, వ్యభిచారం కోసం మైనర్ పిల్లలను అమ్మితే సెక్షన్ 372 ఐపీసీ ప్రకారం నేరమని, పది సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుందని, అలాగే వ్యభిచారం నిమిత్తం కానీ, ఎవరితోనైనా అక్రమ సంభోగం జరిపే నిమిత్తం కానీ, చట్టవ్యతిరేక నీతిబాహ్య చర్యలు జరిపే నిమిత్తం కానీ 18 సంవత్సరాలలోపు మైనరు బాలికలను కొన్నా, కిరాయికి తెచ్చినా అది సెక్షన్ పది సంవత్సరాలు జైలుశిక్ష పడుతుందని తెలియజెప్పి, అంగన్వాడీ వర్కర్‌తో, పిల్లలతో కలసి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది.
 భయంకరమైన కూపంలోకి నెట్టివేయకుండా సోనీ, రేణూలు కాపాడబడ్డారు. కమ్లీబాయ్, మంగ్లీబాయ్‌లు కటకటాల పాలయ్యారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement