Legal counseling
-
నా భార్య మెచ్యూర్ కూడా కాలేదు
లీగల్ కౌన్సెలింగ్ మేడం, నా వయసు 28 సంవత్సరాలు. పోలీసు డిపార్టుమెంట్లో పని చేస్తున్నాను. నా సమస్య వివరించాలంటే సిగ్గుగా, భయంగా ఉంది. భయమెందుకంటే 498 ఎ గురించి. పైగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని. అందరూ నన్నే దుమ్మెత్తి పోస్తారు. సిగ్గెందుకంటే నా వివాహమై పదినెలలైంది. ఇంతవరకూ మా మధ్య శారీరక బంధం ఏర్పడలేదు. కొత్తకదా భయపడుతోందేమో అని కొన్ని నెలలు సర్దుకున్నాను. ఎవ్వరికీ చెప్పలేదు. తనలో చాలా ఫ్రెండ్లీగా మెలిగాను. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మా మధ్య ఆ చర్య కష్టమైంది. చివరికి ఆమెను ఎంతో అనునయించి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లాను. లేడీ డాక్టర్ చెప్పిన విషయం విని నాకు నోటమాట రాలేదు. నా కలలు కుప్పకూలాయి. ఒకవైపు కోపం, మరోవైపు ఆవేదన. ఆమెకు అసలు జననాంగాలు అభివృద్ధి చెందలేదట. గర్భసంచి కూడా లేదట. పిల్లలమాట అటువంచి సంసార జీవితమే సాధ్యం కాదట. నాకే ఎందుకిలా జరిగిందో ఏం పాపం చేశానో అర్థం కావట్లేదు. పైగా నా భార్య ఇంతవరకూ మెచ్యూర్ కూడా కాలేదని, సంసారం, సంతానం అసాధ్యమని లేడీ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు.సెకండ్ ఒపీనియన్లో కూడా అలాంటి రిపోర్ట్‌లే వచ్చాయి. సిగ్గుతో, అవమానంతో, భయంతో చచ్చిపోతున్నాను. ఆడవాళ్లకు మంచి సలహాలు ఇస్తారుగా. మరి నాకేం చెప్తారో, దయచేసి చెప్పండమ్మా! - వై.కె.శ్రీనివాస్, పామర్రు దిగులు పడకండి శ్రీనివాస్, ఇందులో మీ తప్పేమీ లేదు. మీ భార్య, ఆమె తల్లిదండ్రులు మిమ్మల్ని మోసం చేశారు. ఎందుకంటే అసలు రజస్వలే కాని పిల్లకు పెళ్లి చేయడం వారు చేసిన తప్పు. మీ వివాహం జరిగి పదినెలలు అయిందంటున్నారు కదా, మీ వివాహాన్ని కోర్టు ద్వారా రద్దు చేసుకోవచ్చు. మీ కేసులో మీ భార్య ఇంపొటెంట్. అంటే సంసారానికి, సంతానానికి అర్హురాలు కాదు కాబట్టి సెక్షన్ 12, హిందూ వివాహ చట్టం 1955ను అనుసరించి, మీ వద్దనున్న మెడికల్ రిపోర్టుల ఆధారంగా మీ వివాహాన్ని రద్దు పరుచుకోండి. అంటే నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేయించుకోండి. ఈ కేసు వివాహమైన సంవత్సరంలోగా వేయాలి. త్వరపడండి. వారు మీమీద 498 ఎ పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఆందోళన అవసరం లేదు. మేడమ్, నా పేరు సల్మా. మేము ముస్లిమ్స్. నా వివాహమై 15 సంవత్సరాలయింది. నా భర్త ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవారు. మాకు ఒక బాబు. హై స్కూల్లో చదువుకుంటున్నాడు. ఐదేళ్ల కిందట మావారు ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు. ఆయనకు చెడు అలవాట్లు అనేకం. బాగా తాగడం, పేకాటాడటం, అప్పులు చేయడం మొదలైనవి నేను అతని ఆచూకీ గురించి ఎన్నో ప్రయత్నాలు చేశాను. మా అత్తామామలు కూడా ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యం. మిస్సింగ్ కేసు పెట్టి నాలుగేళ్లైంది. అదీ తేలలేదు. నాకు దుబాయ్‌లో ఆయాగా ఉద్యోగం వచ్చింది. నా బతుకుతెరువు నేను చూసుకోవాలి. నా బాబును చదివించుకోవాలి. బాబు బాధ్యత నా తలిదండ్రులకు అప్పగించి, ఉద్యోగానికి వెళ్లాలి. నేను విడాకులు తీసుకుని దుబాయికి పోవాలి. నేను ఏమి చేయాలో సలహా ఇవ్వగలరు. నాకు మా చట్టం పట్ల సరియైన అవగాహన లేదు. మీరు తప్పకుండా విడాకులు తీసుకోవచ్చు. ఆచూకీ తెలియని భర్తకోసం ఎన్నాళ్లు ఎదురు చూస్తారు? మీకోసం ఉన్న చట్టం డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ 1939. అంటే ముస్లిం వివాహాల రద్దు చట్టం అన్నమాట. ముస్లిం మహిళలు ఈ చట్టాన్ని అనుసరించి వివాహం రద్దు చేసుకోవచ్చు. ఏయే కారణాల వల్ల ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చా ఇందులో తెలియపరిచారు. ఒక ముస్లిం మహిళ భర్త ఆచూకీ తెలియవలసిన వారికి; అంటే కుటుంబానికి, స్నేహితులకు, బంధువులకు నాలుగు సంవత్సరాల నుండి తెలియకుండా ఉంటే ఆమె ఆ కారణంగా కోర్టులో విడాకుల దావా వేయవచ్చు. ప్రతివాదులుగా భర్త దగ్గరి బంధువులకు, వారసులుంటే వారికి నోటీసు ఇచ్చి, దావా వేయాలి. ప్రతివాదుల వాదనలు విన్న ఆరునెలల తర్వాత మాత్రమే అమలులోకి వస్తుంది. ఈ ఆరునెలల కాలంలో భర్త స్వయంగా కానీ, ఏజెంట్ ద్వారా కానీ కోర్టు ముందు హాజరై, తన భార్యతో వైవాహిక జీవితం గడుపుతానని కోర్టును సంతృప్తి పరిచినప్పుడు కోర్టు ఆ డిక్రీని రద్దు పరిచే అవకాశం ఉంది. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
మెయిల్స్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, ఆహ్వానాలు
బహిరంగ ప్రదేశాలలో న్యూసెన్స్ చేస్తే... నెలరోజుల జైలు, జరిమానా తప్పదు! లీగల్ కౌన్సెలింగ్ మేడమ్, మేము ఒక చిన్నబస్తీలో ఉంటున్నాము. నేను ఆ బస్తీ మహిళా సంఘం అధ్యక్షురాలిని. మా సమస్య ఏమిటంటే, కొంతమంది మహిళలు, పురుషులు అస్తమానం రోడ్డు మీదికి వచ్చి పెద్ద పెద్ద గొంతులతో అరుస్తూ ప్రతినిత్యం కొట్లాడుకుంటున్నారు. వారి అరుపులు, కేకలకు మేము ఉలిక్కిపడుతున్నాము. పిల్లలైతే గుక్కపట్టి ఏడుస్తున్నారు. నేను చాలాసార్లు వాళ్లను హెచ్చరించాను. మెల్లగా మాట్లాడుకోండని, గొంతులు తగ్గించుకొని పోట్లాడుకోండని అభ్యర్థించాను. రోడ్డు నీ సొమ్మా అని నాపై గొడవకు దిగారు. బస్తీ వాసులేమో వారి గోల భరించలేకపోతున్నామని, ఏదో ఒకటి చేయమని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మేము ఏం చేయాలో సలహా ఇవ్వండి. - కుసుమకుమారి, హైదరాబాద్ ఇలాంటి విషయాలు చాలా చోట్ల గమనిస్తున్నాము. కాకుంటే మన ప్రజలలో ప్రశ్నించే తత్వం చాలా తక్కువ. ఎవరైనా ప్రశ్నిస్తే కనీసం వారికి సపోర్టు కూడా చేయరు. మనకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు. మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఎంతో ఆసక్తితో ఈ ప్రశ్న అడిగారు. మీకు నా అభినందనలు. ఇక మీ సమస్యకు సంబంధించి తగిన పరిష్కారానికి ఐ.పి.సి 159 సెక్షన్‌ను ఉపయోగించుకోవచ్చును. ఆ సెక్షన్ ప్రకారం ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది బహిరంగ ప్రదేశాలలో ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ, అనునిత్యం కొట్లాడుకుంటుంటే అది నేరం. దానికి సెక్షన్ 160 ఐపీసీ ప్రకారం ఒక నెల జైలుశిక్ష, కొంత జరిమానా పడుతుంది. ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మీ సమస్య సద్దుమణుగుతుంది. మేడం, నేనొక డాక్టర్‌ను. ఒక పేరు ప్రఖ్యాతులు గల వైద్యశాలలో పని చేస్తున్నాను. నిత్యం ఎంతోమంది రోగులు కన్సల్టేషన్ కోసం వస్తుంటారు. వారికి తగిన మందులు, చికిత్సల గురించి లెటర్ హెడ్ మీద రాస్తుంటాము కదా, లెటర్ హెడ్‌పై నా మెయిల్ ఐడీ ఉండటం వల్ల అది చాలా మందికి తెలుసు. దాంతో కొందరు వ్యక్తులు గత కొంతకాలంగా మెయిల్స్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, ఆహ్వానాలు పెడుతున్నారు. నా గురించి, నేనిచ్చే ట్రీట్మెంట్ గురించి బాధాకరమైన అభిప్రాయాలు పెడుతున్నారు. దాంతో మెయిల్ ఓపెన్ చేయాలంటే దడపుడుతోంది. ఆ మెయిల్ ఐడీ ఉన్న అకౌంట్‌ను క్లోజ్ చేసేశాను. కానీ ఇంకో ఐడీ తీసుకున్నా, ఇవి తప్పవేమోనని భయంగా ఉంది. ఈ వేధింపులకు అడ్డుకట్ట వేయడం ఎలా? - డా. కల్యాణి, అనంతపురం కంప్యూటర్ ఆధారిత నేరాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ -2000 వచ్చింది. ఈ నేరాలను సైబర్ క్రైమ్స్ అంటారు. సైబర్ నేరాలకు గురవుతున్నవారు అధికశాతం మహిళలే అని కొన్ని సర్వేలు తెలిపాయి. ఫేస్బుక్, ట్విటర్, మెయిల్స్ ద్వారా అనేకమంది వేధింపులకు గురవుతున్నారు. కొన్ని సైట్స్‌లో చైల్డ్ పోర్నోకు సంబంధించిన అనేక అసభ్యమైన అశ్లీలమైన విషయాలు పోస్ట్ చేస్తున్నారు. ప్రసారం చేస్తున్నారు. ఇవి చూసి యువత, పిల్లలు పెడత్రోవ పడుతున్నారు. ఇక మీ సమస్యను హెరాస్మెంట్ వయా ఇ-మెయిల్స్ అంటారు. మెయిల్స్ ద్వారా వేధించినా, బెదిరించినా పరువు నష్టం వాటిల్లే సమాచారం పోస్ట్‌చేసినా, పబ్లిష్ చేసినా అది నేరమవుతుంది. సెక్షన్ 66 ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష, రెండులక్షల జరిమానా పడుతుంది. సైబర్ నేరాల విచారణకు ప్రత్యేకమైన పోలీస్స్టేషన్లు ఉన్నాయి. మీరు వారిని సంప్రదించి ఫిర్యాదు చేయండి. మీరు మనోవేదన నుండి బయటపడి సమస్యను పరిష్కరించుకోండి. అమ్మా, మాకు ముగ్గురు ఆడపిల్లలు. అందరికీ వివాహాలు అయ్యాయి. ముగ్గురూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఉన్నదంతా వారి చదువుకూ, పెళ్ళిళ్లకూ ఖర్చు చేశాము. వృద్ధాప్యంలో మాకు చిన్న ఇల్లు కూడా లేకుండా చేసుకున్నాము. గతిలేక అభిమానం చంపుకొని అమ్మాయిలను ఆర్థిక సాయం చేయమని అడిగితే, ‘కన్నందుకు పెంచి, పోషించి, పెళ్లిళ్లు చేశారు. అది మీ బాధ్యత’ అని కోప్పడుతున్నారు. ఏం చేయమంటారు? - రామయ్య, లక్ష్మమ్మ, చీరాల తల్లిదండ్రులను అందులో వయోవృద్ధులను పోషించవలసిన బాధ్యత వారి పిల్లలదే. అంటే ఆడపిల్లలు/మగపిల్లలు మీరు మీ పోషణ కోసం సీఆర్పీసీ 125 ప్రకారం కేసు వేయండి. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com బాల్య వివాహం నుంచి అలా బయటపడింది! కేస్ స్టడీ పదిహేడేళ్ల అమూల్య ఒక కార్పొరేట్ కళాశాలలో హాస్టల్లో ఉండి ఇంటర్ చదువుకుంటోంది. తండ్రి పెద్ద భూస్వామి. లంకంత ఇల్లు. పనివాళ్లతో, వచ్చీపోయే బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది. ఇంటర్మీడియెట్ మంచి మార్కులతో పాస్ కావాలనీ ఎంసెట్ రాసి, ఎలాగైనా మెడికల్ సీట్ సాధించాలనీ తమ గ్రామంలో ధర్మాసుపత్రి పెట్టి సేవచేయాలనీ పట్టుదలగా చదువుకుంటోంది అమూల్య. ఇంతలో ఒకరోజు ఉన్నఫళంగా ఇంటికి రావాలని ఆమె చిన్నాన్న హాస్టల్‌కు వచ్చారు. వార్డెన్‌కి ఏం చెప్పాడో ఏమో, ఆమె పర్మిషన్ ఇచ్చింది. తీరా ఇల్లు చేరుకునేసరికి ఇల్లంతా పెళ్లి హడావుడి. పందిళ్లూ, బాజాలు, భజంత్రీలు, చుట్టాలు.. కన్నుమూసి తెరిచేంతలో మేనత్త కొడుకు అమూల్య మెళ్లో మూడుముళ్లూ వేశాడు. తీరా విచారిస్తే మేనత్త కొడుకు ఎవరినో ప్రేమించాడని చూచాయగా తెలిసిందనీ, పరాయి వారికి ఆస్తి దక్కకూడదనీ వారి రక్త సంబంధీకులకే చెందాలనీ, తండ్రులూ, మేనత్తలూ ఆలోచించి, ఈ రకంగా తన గొంతుకోసి బాల్యవివాహం చేశారని అర్థమైంది ఆమెకు. ఏం చేయాలో అర్థం కాలేదు. అంతా మంచివారే. గారాబంగా పెంచిన అమ్మానాన్నలు, చిన్నాన్న, పిన్నమ్మలు, మేనత్తలు, వారిని చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద పోలీస్ స్టేషన్‌కు లాగడానికి మనస్కరించలేదు. వెంటనే తన క్లాస్మేట్ సంయుక్త అమ్మగారు పేరున్న లాయర్ అని గుర్తుకొచ్చింది. ఆమెను సంప్రదించి ఎవరికీ బాధ కలగకుండా ఏం చేయాలో చెప్పమంది. ఆమె అమూల్య బావ/భర్తను పిలిపించారు. అతనితో సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎటువంటి క్రిమినల్ కేసులూ వేయకుండా, ఆ వివాహాన్ని రద్దు పరిచేలాగా సలహా ఇచ్చారు. అమూల్య హాస్టల్‌కి వెళ్లిపోయింది. ఇంటర్ పాసై, ఎంసెట్ లాంగ్‌టెర్మ్‌లో చేరింది. 18 నిండాయి. తను మైనర్‌గా ఉన్నప్పుడే తనకు వివాహమైందనీ, దానిని తాను వ్యతిరేకించాననీ, తనకు, భర్తకు ఏ సంబంధం లేదనీ, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాననీ, తన మైనర్ వివాహాన్ని రద్దు చేయమని (అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్) ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయించారు న్యాయవాది. ఆమె బావ కూడా అందుకు అంగీకరించాడు. కుటుంబ సభ్యులు మొదట బాధపడ్డా, తాము చేసిన తొందరపాటు పెళ్లికి పశ్చాత్తాప పడ్డారు. అమూల్య అలా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. -
నా వయస్సు 19 సంవత్సరాలు ..నేను మేజర్ని కదా...
వైద్యచికిత్సలో నిర్లక్ష్యానికి గురైతే తగిన పరిహారం పొందవచ్చు! లీగల్ కౌన్సెలింగ్ మేడం, నా వయస్సు 19 సంవత్సరాలు. కొన్నేళ్ల కిందట మా అమ్మానాన్న విడాకులు తీసుకున్నారు. మా అమ్మే ఇన్నాళ్లూ నా బాగోగులు చూసుకుంది. నా దురదృష్టం... నెలరోజుల కిందట అమ్మ చనిపోయింది. మా నాన్న ప్రభుత్వ ఉన్నతోద్యోగి. అమ్మతో విడాకులైన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుకున్నాడు. వికలాంగుడినైన (పోలియోబాధితుడిని) నా బాధ్యత తీసుకున్న అమ్మ పునర్వివాహం చేసుకోలేదు. నేను పనీ చేయలేని అశక్తుడిని. రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. చేతివేళ్లలో కూడా సత్తువ లేదు. మా నాన్న నుండి ఏదైనా ఆర్థిక సాయాన్ని ఆశించవచ్చా? నా అనుమానం ఏమిటంటే, నేను మేజర్ని కదా, నాకు మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉందా? - రాజు, కరీంనగర్ మీకు తప్పకుండా మీ తండ్రి నుంచి మెయింటెనెన్స్ వస్తుంది. ఎందుకంటే మీరు శారీరక వికలాంగులు. పైగా మీ శరీరం ఏ శ్రమా చేయలేని పరిస్థితిలో ఉంది కనక మీరు మేజరైనప్పటికీ మీకు మెయింటెనెన్స్ వస్తుంది. సెక్షన్ 125 సి. ఆర్.పి.సి ప్రకారం ఎవరైనా వ్యక్తి తనకు సరియైన వననులు ఉండి (ఆర్థికపరంగా) తమను తాము పోషించుకొనలేని భార్యను, మైనర్ పిల్లలను, తల్లిదండ్రులను, ఇల్లెజిటిమేట్ పిల్లలను, పోషించకుండా, నిర్లక్ష్యం చేస్తే లేదా తిరస్కరిస్తే ఆటువంటివారు కోర్టును ఆశ్రయించి పోషణ ఉత్తర్వులను పొందవచ్చు. మీ విషయంలో 125 (సి) మీకు వర్తిస్తుంది. అంటే మెజారిటీ వయసు వచ్చినప్పటికీ, శారీరక, మానసిక వైకల్యమున్న లేదా తీవ్రమైన గాయం వల్ల తమను తాము పోషించుకోలేని అక్రమ, సక్రమ సంతానాన్ని పోషించవలసిన బాధ్యత తండ్రిదే. మీరు వెంటనే కోర్టును ఆశ్ర యించవచ్చును. దానికంటే ముందుగా ఒకసారి మీ నాన్నగారిని మీరు సంప్రదిస్తే బాగుంటుంది. ఆయన స్పందించి మీకు శాశ్వతమైన ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. మేడమ్, నేనొక చిరుద్యోగిని. నాకు భార్య, ఇద్దరు పిల్లలు. నా తల్లికి 75 ఏళ్లుంటాయి. ఇటీవల చూపు మందగించిందంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. రెండు కళ్లలో శుక్లాలు ముదిరి పోయాయన్నారు. డాక్టర్లను వివరాలడిగితే తప్పకుండా చూపు బాగుపడుతుందనీ, అమ్మకంటే పెద్ద వయసు వారికి కూడా కాటరాక్ట్ ఆపరేషన్ చేసి చూపు మెరుగు పరిచామని చెప్పారు. అమ్మకు శుక్లాల ఆపరేషన్ చేయించాను. దురదృష్టం ఏమిటంటే, ఆపరేషన్ తర్వాత అమ్మకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకి, కళ్లు వాచి అరకొరగా ఉన్న చూపు కూడా పోయింది. ఈ వయసులో ఆమెకు ఈ కష్టం రావడం నాకు ఎంతో బాధగా ఉంది. డాక్టర్ల నిర్లక్ష్యం అని అనుమానంగా ఉంది. అమ్మ ఇంకా హాస్పిటల్లోనే ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - కూతురు నారాయణరావు, విశాఖపట్నం మీరు అనుమానిస్తున్నట్లు అది తప్పకుండా వారి నిర్లక్ష్యమే అయి ఉంటుంది. అసలెందుకు అలా అయిందో డాక్టర్లను అడగండి. ఇటీవల ఇటువంటి సంఘటనలు ప్రతినెలా ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఉచిత శస్త్ర చికిత్స శిబిరాల్లో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. కొన్ని కేసుల్లో డాక్టర్ల నిర్లక్ష్యం, కొన్ని సందర్భాల్లో నైపుణ్యం లేని, అనుభవం లేని డాక్టర్లు శస్త్రచికిత్సలు చేయడం కారణాలైతే, మందుల కల్తీలు, సెలైన్ కల్తీలు, ఆఖరికి రక్తం కల్తీలు కూడా కారణాలవుతున్నాయి. వీటికి తోడు అపరిశుభ్రమైన ఆపరేషన్ థియేటర్స్, స్టెరిలైజేషన్ చేయని శస్త్ర చికిత్స పరికరాలు వాడటం కూడా కారణాలవుతున్నాయి. మీరు మొదట డాక్టర్లను నిలదీయండి. కేస్ షీట్లో ఏమి రాశారో తెలుసుకోండి. మీరు డాక్టర్లపై, వారి నిర్లక్ష్యంపై ఉంటే కేసు పెట్టవచ్చు. ఐపీసీ సెక్షన్ 338 ప్రకారం ఒక వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత రక్షణకు ప్రమాదం వాటిల్లే పనులు చేస్తే అది నేరం. రెండు సంవత్సరాల శిక్ష పడుతుంది. మీరు మీ తల్లిగారికి కలిగిన శారీరక, మానసిక వేదనలకు నష్టపరిహారం కూడా పొందవచ్చును. మె డికల్ బిల్స్, రిపోర్టులు, ఎక్స్‌రేలు అన్నీ సేకరించుకోండి. వివాహమై ఐదేళ్లయింది. నాకూ, నా భార్యకూ సరిపడక సంవత్సరం నుంచి వేర్వేరుగా ఉంటున్నాము. నేను హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆమె నల్గొండలో ఉద్యోగం చేసుకుంటూ తలిదండ్రులతో ఉంటోంది. మా వివాహం వరంగల్‌లో జరిగింది. నేను నా భార్యనుండి విడాకులు తీసుకుందామనుకుంటున్నాను. ఆమె పరస్పర అంగీకార విడాకులకు ఒప్పుకోవడం లేదు. నేను ఏ కోర్టు పరిధిలో కేసు వేయాలి? తెలియజేయగలరు. అన్నట్లు మేము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ కింద వివాహం చేసుకున్నాము.- వివేక్, హైదరాబాద్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954ను అనుసరించి సెక్షన్ 31 ప్రకారం అందులో చెప్పినట్లు జ్యూరిస్ డిక్షన్ చూసుకుని పిటిషన్ వేయాలి. సెక్షన్ 31 ప్రకారం...వివాహమైన ప్రదేశం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడ విడాకుల పిటిషన్ వేయవచ్చు.ప్రతివాది ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ కేసు వేయాలి.వాది, ప్రతివాదులు ఏ ఊరిలో ఆఖరిసారి కలిసి నివసించారో, ఆ కోర్టు పరిధిలో విడాకుల కేసు వేయవచ్చు.ఒకవేళ భార్య పిటిషనర్ (వాది)అయితే కేసే వేసేటప్పుడు ఆమె ఎక్కడ నివసిస్తోందో ఆ పరిధిలోని కోర్టులో కేసు వేయవచ్చును. నా సలహా ఏమిటంటే, మీ భార్య ప్రస్తుతం నల్గొండలో ఉన్నారని చెప్పారు కనుక అక్కడే విడాకుల కేసు వేయండి. మీరు ఇతరత్రా ఎక్కడ కేసు వేసినా, ఆమె బదిలీ చేయించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే భార్యలు నివసించే జ్యూరిస్డిక్షన్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మేడమ్, మా పక్కింటివాళ్లు ఒక మైనర్ అమ్మాయిని పనిలో పెట్టుకున్నారు. ప్రతిరోజూ ఆ ఇంటియజమానులు ఆమెను విపరీతంగా హింసిస్తున్నారు. మొన్న మిల్క్‌బూత్ దగ్గర కనిపించింది. ముఖమంతా వాచిపోయి ఉంది. మేము అడిగితే, బట్టలు శుభ్రంగా ఉతకలేదని వాళ్ల ఆంటీ (తను ఆమెకు ఆంటీ అవుతుందని, అలా అందరికీ చెప్పమని యజమానురాలి ఆదేశం) కొట్టిందనీ, తనకు అక్కడ ఉండటం ఇష్టం లేదనీ, ఏదైనా సాయం చేసి తనను బయటపడేయమని కన్నీళ్ల పర్యంతమైంది. మేము ఆరా తీస్తే, ఆ అమ్మాయి తమకు దూరపు చుట్టమని, ఏదైనా ఆధారం చూపిద్దామని తెచ్చుకున్నామని ఆ ఇంటివాళ్లు చెప్పుకుంటున్నారని తెలిసింది. ఆ పాపకు మేము ఏవిధంగా సాయం చేయగలం?- ఎం.సాయికిరణ్, కరీంనగర్ తప్పకుండా సాయం చేయవచ్చు. మీరు బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించవ చ్చును. అలాగే లేబర్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయవచ్చు. మైనర్లతో చాకిరీ చేయించుకోవడం, హింసించడం చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం నేరం. పిల్లల హ క్కుల ఉల్లంఘన అవుతుంది. అయితే ఫిర్యాదు ఇచ్చేముందు ఆ అమ్మాయి చెప్పినట్లు ఆమె మైనరై ఉండాలి. పనికోసమే ఆమెను ఆమె పేరెంట్స్ పంపి ఉండాలి. అది నిర్ధారించుకోండి. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
చట్టానికి మహిళలంటే పక్షపాతమేమీ లేదు!
లీగల్ కౌన్సెలింగ్ మేడం, మహిళల గురించి ఏమైనా కంప్లైంట్ చేస్తే మహిళా న్యాయవాదులు కస్సుమంటుంటారు. మరి వారు చేసే మోసాలకూ, అన్యాయాలకూ అడ్డుకట్టవేయలేమా? ప్రతి విషయంలో మగవారే నిందితులా? నా ప్రశ్న ఏమిటంటే.. మా ఏరియాలో గత ఐదేళ్ల నుంచి జరుగుతున్న ఒక విషయం గురించి.... మేడం, మా ఏరియాలో ఒక గొప్ప కంపెనీలో పనిచేసే అందమైన మహిళ ఒకామె నివసిస్తున్నారు. ఆమె నైట్‌షిఫ్ట్‌లో పని చేస్తున్నారు. పగలు అప్పుడప్పుడు కొందరు మగవాళ్లు వస్తూ పోతూ ఉండేవాళ్లు. ఆమెది స్వంత ఇల్లు కనుక ఎవరూ ఏమీ ప్రశ్నించలేదు. వారు ఆమెకు స్నేహితులు, బంధువులు అనుకున్నాము. ఆ మధ్యనే నా ఫ్రెండ్ కూడా ఆమె ఇంటికి వెళ్లి రావడం జరిగిందట. వాడు నాకు ఒక భయంకరమైన విషయం చెప్పాడు. తనకు ఇటీవలే హెచ్ఐవీ పాజిటివ్ సోకిందని! అంతకంటే భయంకరమైన విషయం ఆమె వద్దకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఆ జబ్బు సోకిందని చెప్పాడు. చివరకు వారంతా ఆమె గురించి వాకబు చేస్తే, ఆమె ఆ వ్యాధిగ్రస్థురాలనీ, ఆమెకు ఆ వ్యాధి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదనీ. కానీ ఆమె సమాజం పట్ల ముఖ్యంగా మగవారి పట్ల క్రోధం, ద్వేషం పెంచుకుని సాధ్యమైనంతమందికి ఆ వ్యాధి సోకేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిసింది. ఆ విషయం ఆమె కూడా కొందరిముందు ఒప్పుకుందని చెప్పాడు. ఇప్పుడు మీరు పురుషులకు ఏమి సమాధానం ఇస్తారో చెప్పండి. -సత్యకృష్ణ, సికిందరాబాద్ సార్, మీరు చాలా అపోహల్లో ఉన్నారు. చట్టాలు ఇరువురికీ సమానంగానే వర్తిస్తాయి. కొన్ని మాత్రమే స్త్రీలకు నిర్దేశించినవి ఉన్నాయి. అలా ఉన్నా కూడా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాలు పురుషులకు మెండుగా ఉన్నాయి. ఇక మీ ప్రశ్నకు సమాధానం... సెక్షన్ 269, 279 ఐపీసీ ప్రకారం నిర్లక్ష్యంగా రోగాలను వ్యాపింపజేయడం, విచక్షణారహిత చర్యల వల్ల అంటువ్యాధులు సోకేలాగా వ్యవహరించడం నేరం. వీటికి ఆరునెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ 269, 279 ప్రకారం నేరపూరితంగా, హెచ్.ఐ.వి. వైరస్‌ని సంక్రమింపజేస్తే వారిని ప్రాసిక్యూట్ చేయవచ్చు. కలరా, ప్లేగు, సిఫిలిస్, గనేరియా లాంటి వ్యాధులను ఇతరులకు సంక్రమింపచేసే వ్యక్తులకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. కాకపోతే ముద్దాయి ఉద్దేశ్యపూర్వకంగా, ప్రాణాంతకమైన చర్యలను చేశాడని రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ నేరాలు స్త్రీలకూ, పురుషులకూ ఇరువురికీ వర్తిస్తాయి. పరస్త్రీ సాంగత్యం కోసం వెంపర్లాడినందుకు మీ స్నేహితులను ఏమనాలో మీరే ఆలోచించుకోండి. మీరు చెప్పిన ఆ మహిళపై కేసు పెట్టే అవకాశం ఉంది. అమ్మా! నేనూ, నా భర్తా కూలీనాలి చేసుకుని పొట్టపోసుకుని జీవించేవాళ్లం. మాకు ఇద్దరు చిన్నపిల్లలు. ఇటీవల నా భర్త రైలుప్రమాదంలో చనిపోయాడు. నాకు కుటుంబం గడవడం కష్టమైపోతోంది. మాకు ఏదైనా నష్టపరిహారం వ స్తుందా? - రంగమ్మ, ఓ అభాగ్యురాలు తప్పకుండా మీకు నష్టపరిహారం వస్తుంది. మీలాంటి బాధితులకు న్యాయం చేసేందుకే రైల్వేచట్టం ఉంది. వీటికి సంబంధించిన విషయాలను పరిష్కరించేందుకు రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సికిందరాబాద్‌లో ఉంది. రైలు ప్రమాదాలలో చనిపోయినా, గాయాలపాలైనా, వికలాంగులైనా, అటువంటి ప్రయాణీకులు లేదంటే చనిపోయిన వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించమని కోరుతూ దరఖాస్తు పెట్టుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి వివరాలు, వారి టికెట్, ఎఫ్.ఐ.ఆర్, మెడికల్ రిపోర్ట్, పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వంటి సంబంధిత డాక్యుమెంట్లు అన్నీ జతపరచాలి. అలాగే చనిపోయి వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలు, వాటికి తగిన ఆధారాలు కూడా ట్రిబ్యునల్‌లో ఫైల్ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న వారికి, కావాలని గాయాలు చేసుకున్నవారికి, కావాలని గాయాలు చేసుకున్నవారికి నష్టపరిహారం రాదు. మీ భర్త రైలు ప్రమాదంలో మరణించారు కనక మీ భర్త రైలు ప్రమాదంలో మరణించారు కనుక మీకు నష్టపరిహారం వస్తుంది. వెంటనే న్యాయవాదిని సంప్రదించండి. లేదంటే ఉచిత న్యాయసహాయం కోసం లీగల్ సర్వీసెస్ వారిని సంప్రదించండి. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com కేస్ స్టడీ కమ్లీబాయ్... మంగ్లీబాయ్ కటకటాల పాలయ్యారు! సోని, రేణులు అక్కాచెల్లెళ్లు. ఇద్దరూ టెన్ట్ పాసై, ఇక చదివే అవకాశాలు లేక, చెప్పించే వాళ్లు లేక, వ్యవసాయకూలీలుగా మారారు. పగలంతా పొలంలో పని చేయడం, సాయంత్రం కూలి డబ్బులు తీసుకెళ్లి మారుటితల్లికి ఇవ్వడం, ఆమె తిట్టుకుంటూ పోసే గంజినీళ్లు తాగడం వారి దినచర్య. ఇద్దరూ టీనేజ్ అమ్మాయిలే. పైగా కాయకష్టం చేస్తున్నవాళ్లు కనక తగిన పోషణ లేకపోయినా, కంటికి నదురుగా కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్లు కనక ఉన్నంతలో శుభ్రంగా తయారై, పనికి వెళుతున్నారు. వారి తల్లి వారు చిన్నవయసులో ఉండగానే చనిపోయింది. తండ్రి రెండోపెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి మంగ్లీబాయి ఆరళ్లతోనే పెరిగి పెద్దవాళ్లయ్యారు వారు. ఇరుగూపొరుగూ, చుట్టాలకు భయపడి పదో తరగతి వరకూ ఓపిక పట్టింది వారి సవతి తల్లి. కాలేజీకైతే డబ్బులు ఖర్చవుతాయని, అంతటితో ఆపేసింది. తండ్రి ఒక ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగి. మంచి జీతమైనా సగం తాగుడుకే ఖర్చు చేసేవాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పనికి వెళ్లసాగారు సోని, రేణు. విషయం తెలిసిన తండ్రి, భార్య నోటికి దడిచి, కిక్కురు మనలేదు. ఇంతలో మంగ్లీబాయ్కి దూరపుచుట్టమైన కమ్లీబాయ్ బొంబాయి నుంచి వచ్చింది. ఆమె గురించి రేణూ, సోనిల సవతి తల్లి ఎప్పుడూ గొప్పగా చెబుతుండేది. ఆమె బొంబాయిలో అనాథలైన ఆడపిల్లలకోసం ఆశ్రమం నడుపుతోందని, వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తుందని, ఆమెకు పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయని, బాగా ధనవంతురాలని చెబుతుండేది. వచ్చీ రావడంతోనే సోనీ, రేణూలపై కన్నేసింది కమ్లీబాయ్. మంగ్లీతో ఒకటే మంతనాలు జరుపుకుంది. చివరికి సోనీ, రేణూలకు బేరం కట్టి మంగ్లీబాయికి లక్షరూపాయలిచ్చింది. వారిని బలవంతంగానైనా బొంబాయికి తీసుకుని పోవడానికి సిద్ధమైంది. కమ్లీబాయితో బొంబాయికి వె ళ్లమని, అక్కడ మంచి ఉద్యోగంలో పెడుతుందని, వచ్చేవారమే ప్రయాణమని డిక్లేర్ చేసింది మంగ్లీబాయి. సోనీ, రేణూల్లో ఏదో అనుమానం. సవతి తల్లి ఏదో దాస్తోందని, తమకు బాగా పరిచయం ఉన్న అంగన్ వాడీ వర్కర్‌గా పని చేస్తున్న సుమిత్రక్కకు విషయం చెప్పారు. ఆమె వెంటనే అసలు విషయం పసిగట్టింది. కమ్లీబాయి అమ్మాయిల తో వ్యాపారం చేసే మనిషని తెలుసుకుని మహిళా న్యాయవాదిని సంప్రదించింది. అనుభవజ్ఞురాలైన ఆమె ఇది అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే వ్యవహారమని, కమ్లీబాయ్, మంగ్లీబాయ్లు ఐపీసీ సెక్షన్ 372, 373ల ప్రకారం నేరస్థులవుతారని, వ్యభిచారం కోసం మైనర్ పిల్లలను అమ్మితే సెక్షన్ 372 ఐపీసీ ప్రకారం నేరమని, పది సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుందని, అలాగే వ్యభిచారం నిమిత్తం కానీ, ఎవరితోనైనా అక్రమ సంభోగం జరిపే నిమిత్తం కానీ, చట్టవ్యతిరేక నీతిబాహ్య చర్యలు జరిపే నిమిత్తం కానీ 18 సంవత్సరాలలోపు మైనరు బాలికలను కొన్నా, కిరాయికి తెచ్చినా అది సెక్షన్ పది సంవత్సరాలు జైలుశిక్ష పడుతుందని తెలియజెప్పి, అంగన్వాడీ వర్కర్‌తో, పిల్లలతో కలసి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. భయంకరమైన కూపంలోకి నెట్టివేయకుండా సోనీ, రేణూలు కాపాడబడ్డారు. కమ్లీబాయ్, మంగ్లీబాయ్లు కటకటాల పాలయ్యారు. -
తప్పులేకున్నా తప్పుడు కేసు పెట్టింది
లీగల్ కౌన్సెలింగ్ నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాను. నా పెళ్లయి ఆరునెలలైంది. పెద్దలు కుదిర్చిన వివాహమే మాది. నా భార్య బాగా చదువుకున్న వ్యక్తి. తను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. మొదటినుండి ఆమె నా పట్ల ఆసక్తి చూపించలేదు. కొత్త కదా కొంత టైమ్ పడుతుందిలే అని ఊరుకున్నాను. నేను ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్ వెళ్లేవాడిని. తను కనీసం నవ్వుతూ కూడా రిసీవ్ చేసుకునేది కాదు. మా సంసార జీవితం మొదలవలేదు. నేను మాత్రం తనతో ఎంతో ఫ్రెండ్లీగా వ్యవహరించేవాడిని. అయినా మాటామంతీ లేకపోవడంతో ఐదునెలలు వేచి చూసి మా అత్తామామలకు ఈ విషయం చెప్పాను. వారు నేను చేతగానివాడినంటూ నన్నే నిందించడం ప్రారంభించారు. అంతేకాని కూతుర్ని నా ముందు కూర్చోబెట్టి అడగలేదు. పరిస్థితి ఇలా ఉంటే, ఎక్కడో మారుమూల పల్లెటూళ్లో ఉండే మా అమ్మానాన్నలపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. పోలీసులు వాళ్లకు ఫోన్ చేశారట. వాళ్లిద్దరూ సీనియర్ సిటిజన్స్. పైగా ఆరోగ్యాలు బాగాలేని వాళ్లు. ఇక నాకైతే వాళ్లకంటే ముందుగానే పోలీసుల నుండి ఫోన్లు వచ్చాయి. చాలా కరకుగా మాట్లాడుతున్నారు. అసలు నాతో సంసారమే చేయని అమ్మాయి.. పట్టుమని పదిరోజులు కూడా నాతో గడపని అమ్మాయి మా పైన కేసు వేయడం న్యాయమా? ఏ సంబంధం లేని అమాయకులైన నా తల్లిదండ్రులకు నేను ఏం సమాధానం చెప్పాలి? నేను ఎంతో కుంగిపోతున్నాను. దయచేసి సలహా ఇవ్వండి. - రాజేష్, బెంగళూరు మీ ఆవేదన అర్థమైంది. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యా. పెద్దవయసులో తలిదండ్రులకు మనోవేదన, కోటి ఆశలతో వివాహం చేసుకున్న వారికి దారుణమైన వేధింపులు ఎదురవుతున్నాయి. ఆ అమ్మాయికి మీతో వివాహం ఇష్టం లేకపోయినా, తలిదండ్రుల బలవంతం మీద పెళ్లికి ఒప్పుకొని ఉంటుంది. అందుకే మీతో సంసారం చేయలేదు. దిక్కుతోచని పేరెంట్స్ విషయం వివరించి, సజావుగా సమస్య పరిష్కరించుకోకుండా మీమీద ఇలా కేసు వేయడం న్యాయం కాదు. కనీసం ఆ అమ్మాయి మీతో మనసు విప్పి మాట్లాడితే బాగుండేది. మీరు, మీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి. ధైర్యంగా వారికి మీ వాదన వినిపించండి. పేరెంట్స్‌ని, సిస్టర్స్‌ని వేధించవద్దని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. మీరు కూడా వివాహమైనప్పటినుంచి ఆమె ప్రవర్తన ఎలా ఉండేది, మీరు అసలు ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చారో అన్నీ గుర్తుకు తెచ్చుకుని పోలీసులకు వివరించండి. ఒకవేళ వాళ్లు అంటే మీ అత్తమామలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే ముందుగా మీరు యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నాలు చేయండి లేదా స్టేషన్ బెయిల్ అడగండి. తర్వాత ఎఫ్.ఐ.ఆర్ క్వాష్ చేయమని హైకోర్టును ఆశ్రయించండి. మీ పేరంట్స్‌ను తప్పనిసరిగా పోలీస్ కేసునుండి డిలీట్ చేస్తారు. మంచి అనుభవజ్ఞులెన క్రిమినల్ లాయర్‌ను సంప్రదించండి. ఇక మీ వివాహం ఫలప్రదం (కాంజుమేట్) కాలేదు కనుక నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేయమని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించండి. ఏది ఏమైనా ఉట్టిపుణ్యానికి ఇన్ని బాధలా అనిపిస్తుంది. అది నిజం కూడా! కాని కొన్ని పరిస్థితులలో తప్పవు. మా అమ్మగారు ఇటీవలే కాలం చేశారు. ఆమె పేరు మీద కొంత వ్యవసాయ భూమి, ఒక ఇల్లు ఉన్నాయి. మా నాన్నగారు తన సంపాదనతో అవి కొని అమ్మపేరున రిజిస్టర్ చేయించారు. అమ్మ ఎలాంటి వీలునామా రాయలేదు. నాన్నగారు వృద్ధులైపోయారు. మేం ముగ్గురం సంతానం. ఇద్దరు అన్నదమ్ములం, ఒక చెల్లెలు. అందరికీ వివాహాలు అయ్యాయి. నాన్నగారు నా దగ్గరే ఉంటున్నారు. అమ్మపేరున ఉన్న ఆస్తిని ఎలా పంచుకోవాలి? చెల్లెలికి వాటా ఇవ్వాలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఎన్.శివ కుమార్, మంచిర్యాల ఒక హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె తదనంతరం ఆమె ఆస్తికి మొదట కొడుకులు, కూతుళ్లు, భర్త, ఆమెకంటే ముందే చనిపోయిన కుమారుడు లేదా కుమార్తె సంతానం వారసులవుతారు. మీకు తండ్రి, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు కాబట్టి మీ అందరూ సమాన వాటాదారులవుతారు. నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేవారు. ఒకరోజు రాత్రి విధులు ముగించుకుని కంటోన్మెంట్ ఏరియా నుండి వస్తుండగా ఒక మిలిటరీ ట్రక్ ఢీకొని నా భర్త రెండుకాళ్లూ ఫ్రాక్చర్ అయి ఎడమ కాలు తీసేశారు. మేం నష్టపరిహారం గురించి కేసు వేద్దామంటే ఆ ట్రక్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ బలగాలకు సంబంధించినది కనుక నష్టపరిహారం రాదంటున్నారు. నిజమేనా? వివరించగలరు. - శివమ్మ, సికిందరాబాద్ మీకు తప్పకుండా నష్టపరిహారం వస్తుంది. సాధారణంగా తమ వాహనాలకు నష్టపరిహార బాధ్యత ఉండదని ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వానికి మినహాయింపు ఇవ్వాలని వారి వాదన. తమ సేవకులు చేసిన తప్పిదానికి తాము బాధ్యత వహించమని ప్రభుత్వాల వాదన. కాని ఇది తప్పని సుప్రీంకోర్టు తన తీర్పులలో స్పష్టం చేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వ్యక్తులకు ప్రమాదం వాటిల్లితే ప్రభుత్వం ఆ తప్పుకు బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని కోర్టువారు అనేక కేసులలో తెలియపరిచారు. పుష్పా టాగోర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు వారు ప్రభుత్వానికి నష్టపరిహార మినహాయింపు ఉండదని తీర్మానించారు. ఇక్కడ ట్రక్ ప్రభుత్వానిది. సేవకుడు డ్రైవర్. అంటే ప్రభుత్వంతో నియమించబడిన వ్యక్తి అని అర్థం. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మీకు తప్పకుండా పరిహారం అందుతుంది. మీరు నిపుణులైన లాయర్‌ను సంప్రదించి, కేసు వేయండి. విష్ యు ఆల్ ది బెస్ట్. - ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
అత్యాచారం కేసులో.. చట్టప్రకారం వారు చెప్పేవి చెల్లవు!
లీగల్ కౌన్సెలింగ్ మాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి పెళ్లయి అత్తారింటికి వెళ్లింది. చిన్నమ్మాయి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. సమస్యేమిటంటే పెద్దమ్మాయి ప్రెగ్నెంట్‌గా ఉంది. తనకు ఎవరూ తోడు లేరని, సమ్మర్ వెకేషన్లో మా చిన్నమ్మాయిని తన దగ్గరకు పంపించాము. మా చిన్నమ్మాయితో మా అల్లుడి ప్రవర్తన బాగా లేదని తెలిసింది. ఏదో ఒకవంకతో మా చిన్నమ్మాయిని తాకుతూ, సన్నిహితంగా మెలిగే ప్రయత్నాలు చేస్తున్నాడట. అమ్మాయి మొదట్లో బావగారనే గౌరవంతో పట్టించుకోలేదు. కానీ అతని ప్రవర్తన మరీ ఘోరంగా తయారైందట. తన కోరిక తీర్చకపోతే అక్కను వదిలేస్తానని, తనకు పెళ్లికాకుండా చేస్తాననీ బెదిరిస్తున్నాడట. మా అమ్మాయి వెంటనే మా ఇంటికి వచ్చేసింది. మేము ఏం చేయాలి? -ఒక తల్లి, రాజమండ్రి మీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. అల్లుడిపై సెక్సువల్ హెరాస్మెంట్ కింద కేసు వేయవచ్చు. కానీ అలా చేస్తే పెద్దమ్మాయి పరిస్థితి ఏమవుతుంది? పైగా తను ప్రెగ్నెంట్ అంటున్నారు. అల్లుడిపై చర్య తీసుకోవాలంటే కూతురి భవిష్యత్తును మీరే కూలదోసినట్లవుతుంది. మీరు ఒక పని చేయండి. డెలివరీకి మీ పెద్దమ్మాయి మీ దగ్గరకి వస్తుంది కదా! అప్పుడు ఆమె భర్త ప్రవర్తన గురించి హెచ్చరించండి. కేసు వేస్తే పరిస్థితి ఏమవుతుందో విచారించండి. ఆమె తన భ భర్తకు చెప్పుకుని మార్చుకుంటారు. భార్యకు తెలిసిందని మీ అల్లుడికి బుద్ధి వస్తుంది. ఇక మీరు కూడా ఇన్డెరైక్టుగా మీ అల్లుడిని మందలించండి. బుద్ధిగా మసలుకుంటే మంచిదే. లేకుంటే కేసు పెట్టచ్చు. ఇక మీ చిన్నమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదు కనక సగం సమస్య పరిష్కారం అయినట్లే లెక్క. మాకు ఒక్కగానొక్క కూతురు. అత్యంత గారాబంగా పెంచాము. ఉన్నత చదువులు చదివించాము. కారులో తప్ప ఆటో కూడా ఎక్కి ఎరగదు. ఏమైందో ఏమో ఒకరోజు తనకు మూడోనెల ప్రెగ్నెన్నీ అని, ఎవరినో ప్రేమించాననీ, పరిస్థితి తన చేయిదాటి పోయిందని ఉత్తరం రాసి పెట్టి ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. మా గుండె బద్దలయింది. మా వారు మంచం పట్టారు. ప్రేమ వివాహాలకు మేం వ్యతిరేకం ఏమీ కాదు. మేము తనను ఎంతగా ప్రేమించామో తనకు తెలియంది కాదు. అయినా సరే, మాకు కనీసం చూచాయగా కూడా చెప్పలేదు. ఒకరోజు ఫోన్ చేస్తే మా చుట్టాలను పంపాము. ఒక చిన్నగదిలో ఆ అబ్బాయితో కలిసి ఉంటోందట. బాబు పుట్టాడట. మరో విషయమేమిటంటే.. ఆ అబ్బాయి జీతం కనీసం మా అమ్మాయి పార్లర్ ఖర్చులకు కూడా సరిపోదు. మా అమ్మాయి మాకు కావాలి. మేము ఏం చేయాలి? - రాజ్యలక్ష్మి, గంజాం తలిదండ్రుల మనోవేదన మాకు బాగా తెలుసు. ఇటీవల కాలంలో యువత వైవిధ్యభరితమైన జీవితం కావాలని కోరుకుంటున్నారు. అంటే తమ వాస్తవ పరిస్థితులకన్నా భిన్నమైన జీవితం. బస్‌లలో వెళ్లేవాళ్లు బెంజికారులో వెళ్లాలని అనుకుంటే, బెంజికారులో తిరిగే వాళ్లు గంజి తాగి చూడాలని కోరుకుంటున్నారు. ఒకేరకమైన జీవితమంటే బోరెత్తిపోతున్నారు. మీ పాప పరిస్థితి అలానే ఉంది. నేనైతే అది ప్రేమ అనుకోను. ఒక తొందరపాటు, ఎంథూసియాజమ్ అనుకుంటాను. ఎందుకంటే అతనికి చదువూ, హోదా, సంపాదనా ఏదీ లేదంటున్నారు. బహుశా మీ అమ్మాయికి చాలా ఆస్తి వస్తుందని ట్రాప్ చేసి ఉంటాడు. మీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా వాళ్లు వచ్చి మేము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం అంటారు. కొన్నాళ్లు వేచి చూడండి. ప్రస్తుతం మీ అమ్మాయి తొందరపాటులో ఉంది. త్వరలోనే తన తప్పు తెలుసుకుంటుంది. నిజంగా ఆ అబ్బాయి అంత మంచివాడైతే రాత్రింబవళ్లు కష్టపడి మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. మోసగాడైతే డబ్బు తెమ్మని ఒత్తిడి తెచ్చాడు. అప్పుడెటూ మీరు ఆదరించక తప్పదు. ఆ ప్రేమ మైకం నుంచి అమ్మాయి బయటకి రాక తప్పదు. కొంతకాలం ఓపిక పట్టి చూడండి. మేడమ్, మా అమ్మాయికి 21 సంవత్సరాలు. ఇంజినీరింగ్ ఫైనల్లో ఉంది. మొన్న ఒక ఫంక్షన్‌కు స్నేహితులంతా కలిసి వెళ్లారు. మేము ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించాము. ఒక పెద్ద రిసార్ట్‌లో పార్టీ జరిగిందట. మా అమ్మాయి డ్రింక్‌లో ఏదో కలిపి, తోటి స్టూడెంట్ అత్యాచారం చేశాడని మా అమ్మాయి ఏడుస్తూ చెప్పింది ఇంటికొచ్చాక. మేం పోలీసు కంప్లైంట్ చేశాము. అబ్బాయి వాళ్ల నాన్న చాలా పలుకుబడి గల వ్యక్తి. అసలు మా అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని, తనకు ఇంతకుముందే కొందరితో సంబంధం ఉందని, కనుక రేప్‌కేస్ అవదని పోలీసులను ప్రలోభ పెడుతున్నట్లు తెలిసింది. మా అమ్మాయి ఇష్టపడే ఆ అబ్బాయితో గడిపిందని ఆరోపిస్తున్నారు. ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన వేరేవాళ్లు దాన్ని ఆసరాగా చేసుకొని అత్యాచారం చేయవచ్చా? అత్యాచారాలకు ఆడపిల్లల పూర్వపరిచయాలకు ముడిపెట్టవచ్చా? - ఒక తల్లి ఆవేదన ఆడపిల్ల ఇష్టం లేకుండా, సమ్మతి లేకుండా జరిపే లైంగిక దాడిని మానభంగం అంటారు. మీ కేసులో మీ అమ్మాయి ఇంటర్కోర్సుకు ఇష్టపడిందని, అంటే ఆమె అనుమతి ఉందని వాళ్ల వాదన. పైగా మీ అమ్మాయికి అంతకుముందే వేరే సంబంధాలు ఉన్నాయన్నది వాళ్ల వెర్షన్. కనుక ఇది రేప్ కేసు అవదని వాళ్ల పాయింట్. ఇది చాలా తప్పు. మీ అమ్మాయిపై జరిగింది ఖచ్చితంగా లైంగిక దాడి కిందికే వస్తుంది. పైగా మీ అమ్మాయిపై మత్తుపదార్థాలను ప్రయోగించారంటున్నారు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఎవిడెన్స్ యాక్ట్‌లో సెక్షన్ 53 ఎ ని ప్రవేశపెట్టారు. అత్యాచార కేసులో అమ్మాయిల పూర్వపరిచయాలు, పూర్వలైంగిక ప్రవర్తనలు, పూర్వ సంబంధాలు పరిగణనలోకి తీసుకోరాదని, ఒక అమ్మాయికి అంతకుముందే వేరేవారితో సంబంధం ఉందని, కనుక తాము అత్యాచారం చేస్తే అది నేరం కాదని, ఆ అమ్మాయి అంగీకారంతో జరిగిందంటే కుదరదని ఎవిడెన్స్ యాక్ట్ 53 ఎ స్పష్టపరుస్తుంది కాబట్టి వారు ఎంత పలుకుబడి కలవారయినా, చట్టప్రకారం వారు చెప్పేవి చెల్లవు. మీరు ధైర్యంగా ఉండండి. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ ఆ బెదిరింపులకు లొంగనక్కరలేదు కేస్ స్టడీ మాధవి, రమేష్‌ల వివాహమై ఆరేళ్లయింది. మాధవికి మహబూబ్‌నగర్‌లో గవర్నమెంట్ ఉద్యోగం. రమేష్ హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు. ఆదివారం ఒకరి ప్లేస్‌కి ఒకరు వస్తూ పోతూ ఉంటారు. మాధవికి ఒక బాబు, ఇటీవలే ఒక పాప పుట్టింది. రమేష్ పాప తనకు పుట్టలేదని, మాధవికి అక్రమ సంబంధం ఉందని, ఆమె ట్రెయినింగ్ పీరియడ్‌లో ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉందని అనుమానం. ఆమెపై కక్ష పెంచుకుని, చిత్రహింసలు పెట్టసాగాడు. ఆమె ఉద్యోగం చేసే ప్రదేశానికి వచ్చి దుర్భాషలు ఆడి పోతుంటాడు. అసలు రమేష్ ఒక తాగుబోతు, పైగా వ్యసనపరుడు. ఇన్ని రోజులూ సంఘానికి భయపడి, కుటుంబ పరువు పోతుందని జంకి, పిల్లల కోసం అతన్ని భరించింది మాధవి. చివరికి అతని ప్రవర్తన ఎంతవరకూ వెళ్లిందంటే, ఆమె నగ్నచిత్రాలు తన వద్ద ఉన్నాయని, అక్రమ సంబంధాలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. చాలా విచిత్రంగా, తనకు పదిలక్షలు ఇస్తే ఊరుకుంటానని, లేదంటే విడాకుల కేసు వేసి, పరువు తీస్తానంటూ భార్యను బెదిరించాడు. మాధవి బెంబేలెత్తిపోయి లాయర్‌ను సంప్రదించింది. లాయర్ ఆమెకో సలహా ఇచ్చారు. ఆమె ఉద్యోగి, పిల్లలను పోషించుకోగలదు. ముందునుంచి కూడా రమేష్ ప్రవర్తన బాగాలేదు. సిగ్గులేకుండా భార్యనే డబ్బుకోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. డబ్బిచ్చి కాపురం నిలుపుకునే ప్రసక్తి వద్దు. ఒకవేళ విడాకులకోసం అతను కేసు వేస్తే మరీ మంచిది. చక్కగా విడాకులు తీసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. రోగి పాలే కోరాడు. వైద్యుడూ పాలే తాగమన్నాడు అన్నట్లుగా ఉంటుందని చెప్పారు. ఒకవేళ అతను విడాకులు అడగకపోయినా మాధవినే కేసు వేయమని సలహా ఇచ్చారు. దాంతో మాధవి ఊపిరి పీల్చుకుంది. తన బెదిరింపులకు దిగిరాకపోయేసరికి రమేష్ దెబ్బకి దారిలోకొచ్చాడు. -
అమ్మాయిలు చదువుల్లో ఫస్ట్, ఉద్యోగాల్లో బెస్ట్..కానీ..!
లీగల్ కౌన్సెలింగ్ మాకు ఒక్కగానొక్క కూతురు. నేనొక చిరుద్యోగిని. అమ్మాయిని ఏ లోటూ లేకుండా పెంచాము. తను చాలా బ్రైట్ స్టూడెంట్. ఇంజినీరింగ్ పాసై క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం తెచ్చుకుంది. వివాహం చేద్దామని సంబంధాలు చూడటం మొదలుపెట్టాం. తన క్లాస్‌మేట్‌ను ప్రేమిస్తున్నానని వివాహం చెయ్యండని అడిగింది. అబ్బాయిని చూశాము. బాగున్నాడు. అతనికి ఎవరూ లేరని, ఉన్న ఒక అక్క విదేశాల్లో సెటిలైందని చెప్పాడు. సింపుల్‌గా పెళ్లి చేశాం. అమ్మాయి కోసం జాగ్రత్త చేసిన పది లక్షలు ఇచ్చాం. వాళ్లు వేరే కాపురం పెట్టారు. నెలకోసారి వచ్చివెళ్లేవాళ్లు. కొత్త జంట అని మేమూ పెద్దగా వెళ్లేవాళ్లం కాదు. ఆర్నెల్లు గడిచాయి. ఒక రోజు అల్లుడు ఫోన్ చేసి మీ అమ్మాయి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేశాడు. మా గుండె ఆగిపోయింది. ఎవరెవరో వచ్చారు. ఏమేమో అడిగారు. సంతకాలు తీసుకున్నారు. అంతా అయోమయం. అంత్యక్రియలు హడావిడిగా ముగిశాయి. మూడో రోజు అమ్మాయి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. తన టేబుల్ డ్రాలో ఉన్న వస్తువులు పట్టుకెళ్లమని. ఆ వస్తువుల్లో హ్యాండ్‌బ్యాగ్‌లో మా అమ్మాయి రాసిన లెటర్ దొరికింది. తనది రాంగ్ సెలక్షన్ అని, అతను పెట్టే వేధింపులు భరించలేకపోతున్నానని, అతనికి అంతకు ముందే పెళ్లి అయిందని, మోసపోయానని.. ఎన్నో విషయాలు ఉన్నాయి. అల్లుడిని నిలదీశాం. కేస్ వేస్తామన్నాము. అమ్మాయి మానసిక స్థితి బాగాలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుందని మేం సంతకాలు చేసిన పేపర్స్ బయటకు తెచ్చాడు. అవి మేం దుఃఖంలో ఉన్నప్పుడు పెట్టిన సంతకాలు. మేమేం చేయాలి? - ఓ ఆడపిల్ల తల్లిదండ్రులు, హైదరాబాద్ మీ పరిస్థితి చూస్తే బాధగా ఉంది. ఇప్పటి అమ్మాయిలు చదువుల్లో ఫస్ట్, ఉద్యోగాల్లో బెస్ట్, కానీ భర్తల సెలక్షన్లో లీస్ట్. మీరు వెంటనే కంప్లైట్ ఇవ్వండి. పోలీసులు ఎటూ కేస్ నమోదు చేసి ఉంటారు. మీ దగ్గర దొరికిన ఆధారాలు వారికి చూపించండి. విషాదంలో, దిగ్భ్రాంతిలో ఉన్నప్పుడు సంతకాలు పెట్టమని, అది ఎందుకో ఎవరూ చెప్పలేదని తెలియజేయండి. వివాహిత మహిళ వివాహమైన ఏడు సం॥కాలిన గాయాలతోకాని, శారీరక గాయాలతోకానీ, అనుమానస్పద పరిస్థితుల్లో చనిపోతే దానికి కారణం భర్త, అతని కుటుంబ సభ్యుల వేధింపులు, హింస కారణమైతే దానిని వరకట్నపు మరణము లేక ‘డౌరీ డెత్’ అంటారు. సెక్షన్ 304బి ఐ.పి.సి. ప్రకారం ఏడు సం॥నుండి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. దానితోపాటు సెక్షన్ 306 ఐ.పి.సి. కూడా మీ కేస్‌లో అన్వయిస్తారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తే అది 306 ఐ.పి.సి. కిందకు వస్తుంది. పదేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. అది హత్యా లేక ఆత్మహత్యా అన్నది పోలీసులు తేలుస్తారు. కనుక జాగ్రత్తగా కేస్ నడుపుకోండి. అది హత్య అయితే శిక్షలు వేరుగా ఉంటాయి. మేడమ్, మా అక్కకు ఇద్దరు చిన్న పిల్లలు. అనారోగ్యంతో ఆమె ఇటీవలే చనిపోయింది. బావగారు బాగా ఆస్తిపరుడు. పిల్లలను తన దగ్గరే ఉంచుకుంటానని అనడంతో మేము వాళ్ల గురించి పట్టించుకోలేదు. కన్న తండ్రికే పిల్లలు చెందుతారని అనుకున్నాం. ఒక సం॥బాగానే ఉన్నారు. అక్క సంవత్సరీకాలకు వెళ్లి వచ్చాం. వారం క్రితం పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. వెళ్లి చూస్తే, నా ఇద్దరు మేనకోడళ్లు ఏడుస్తూ నన్ను అల్లుకుపోయారు. వాళ్ల నాన్నే వారిని పార్క్‌కు తీసుకొని వెళ్తానని కార్లో తెచ్చి ఊరి బయట వదిలేసి వెళ్లాడంట. వాళ్ల ఇంటికి ఇటీవల ఎవరో ఒక మహిళ వచ్చి తిష్ట వేసిందట. ఆమె, వాళ్ల నాన్న ఇద్దరూ పిల్లలను వేధించేవారట. నాన్న అంటే వణికిపోతున్నారు. మా అమ్మానాన్నలు ఉన్నారు. మేం లక్షణంగా పిల్లలను పెంచుకోగలం. కస్టడీ కోసం కేస్ వేయలేకపోతున్నాం. పిల్లలను ఆ రకంగా నిర్జనమైన ప్లేస్‌లో వదిలి వెళ్లాడు అతను. మాకు గుండె రగిలిపోతుంది. ఎవరో సమయానికి ఆదుకోకపోతే వాళ్ల గతేమయ్యేది. అతనిపై ఏమైనా కేస్ పెట్టవచ్చా? - పరమేశ్వరి, విశాఖపట్నం తప్పకుండా. పన్నెండు సం॥వయసులోపు పిల్లలను వారి తండ్రి, తల్లి, లేక వారి రక్షణ వహించే వారెవరైనా, ఆ పిల్లలను శాశ్వతంగా వదిలించుకునే ఉద్దేశంతో, ఏదైనా ప్రదేశంలో విడిచిపెట్టి వెళ్లితే అలాంటి వారికి సెక్షన్ 317 ఐ.పి.సి. ప్రకారం ఏడు సం॥జైలు శిక్ష పడుతుంది. మీ పిల్లలను పోలీస్‌లు మీకు అప్పగించారు కనుక వారి దగ్గర నుండి మీకు పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయి. నా పేరు సరోజ, మాకు ఇద్దరు పిల్లలు. నా భర్త యాక్సిడెంట్లో మరణించారు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుండగా ఒక ట్రక్కు ఢీ కొట్టింది. హాస్పిటల్‌కి తీసుకెళ్లే సమయానికే ప్రాణం పోయింది. మోటారు వాహన ప్రమాదాల చట్టం ప్రకారం నష్టపరిహారం కోరమని తెలిసిన వారు చెబుతున్నారు. ఆ ట్రక్కు యజమాని తనకేం సంబంధం లేదంటున్నారు. డ్రైవర్కేమో లెసైన్సే లేదని తెలిసింది. ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదిస్తే మాకు సంబంధం లేదంటున్నారు. మాకు ఎవరు నష్టపరిహారం ఇస్తారో తెలియచేయండి. పిల్లల వయస్సులు రెండేళ్ల లోపే. నా పరిస్థితి దీనంగా ఉంది. - గుంటూరు మీ కేస్‌లో ట్రక్కు యజమానినీ, డ్రైవర్నీ, ఇన్సూరెన్స్ కంపెనీని పార్టీలుగా చేస్తారు. కానీ డ్రైవర్‌కి లెసైన్స్ లేదు. ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనల ప్రకారం లెసైన్స్ లేని వ్యక్తులు వాహనం నడిపితే వారు నష్టపరిహారం చెల్లించరు. కనుక మీ కేస్‌లో యజమానే.. అంటే ట్రక్కు యజమానే నష్టపరిహారం చెల్లించాలి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు వారు కొన్ని కేసులలో తీర్మానించారు. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
భర్త మీద కూడా నిర్భయ కేసు పెట్టవచ్చు!
లీగల్ కౌన్సెలింగ్ మా పెళ్లయ్యి సంవత్సరం దాటింది. మాది పెద్దలు కుదిర్చిన సంబంధమే. నా భర్తకు నాపై చాలా అనుమానం. ప్రతిరోజూ నా సెల్‌ఫోన్ చెక్ చేస్తాడు. నేను ఎవరికి కాల్ చేశానో వారందరికీ రీ కాల్ చేస్తాడు. వారెవరో, నాకెలా పరిచయమో కనుక్కుంటాడు. ఇక వాళ్లు మగవాళ్లయితే వారితో అక్రమ సంబంధం అంటగట్టి నన్ను విపరీతంగా తిడతాడు. ఆడవాళ్లయితే వారి క్యారక్టర్ మంచిది కాదని, మాట్లాడవద్దని కట్టడి చేస్తాడు. ఎప్పుడు తీశాడో తెలీదు కానీ, నేను దుస్తులు మార్చుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు వీడియోలు తీసి, వాటిని నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు. ఇక నన్ను సెక్స్‌పరంగా కూడా విపరీతంగా హింసిస్తున్నాడు. అన్నట్టు ఈ దుర్మార్గుడికి మా వాళ్లు కట్నకానుకల కింద 20 లక్షల దాకా ముట్టచెప్పారు. నేను ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్నయినా, ఉద్యోగం చెయ్యనివ్వట్లేదు. ఈ శాడిస్ట్ భర్తతో కాపురం చేయలేక నాలుగు నెలల క్రితం పుట్టింటికి వచ్చాను. నాపై యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నాడు. నేను ఏం చేయాలి? - అరుణ, జహీరాబాద్ మీరు బాగా చదువుకున్నవారయి ఉండీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా? మొదట మీరు వీడియోల గురించి, నెట్లో పెడతాననే బెదిరింపుల గురించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. వారు వెంటనే చర్య తీసుకుంటారు. తర్వాత, మీ కాళ్లమీద మీరు నిలబడేందుకు వీలుగా ఏదయినా ఉద్యోగం చూసుకోండి. ఇక రెండవ విషయం మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి 498 ఎ కేస్ వేయండి. ఫిర్యాదును వివరంగానూ చాలా జాగ్రత్తగానూ రాయండి. ఇంకా ఓపిక ఉంటే (ఉండాలి కూడా) డొమెస్టిక్ వయొలెన్స్ కేస్ వేసి, రక్షణ ఉత్తర్వులు పొందండి. ముందు ఈ కేసులన్నీ నంబర్ అయి, నోటీసులు వెళ్తే దెబ్బకు దెయ్యం వదులుతుంది. నిర్భయ చట్టం కింద కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది. మీ వారికి మీ వాళ్లు కట్నంగా ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి వస్తాయి. ఇందుకు మీ తలిదండ్రుల సహకారం చాలా అవసరం. నా వివాహమై ఐదేళ్లయింది. నాకు ఒక బాబు. పెళ్లినాటికి మా వారు దుబాయిలో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లి కాగానే నన్ను అక్కడికి తీసుకెళ్లారు. నేను కన్సీవ్ అయ్యాను. డెలివరీకి ఇండియా వచ్చాను. బాబుకు 6 నెలలు రాగానే ఆయన వచ్చి చూసి వెళ్లారు. వాడికి ఏడాది నిండగానే వచ్చి మమ్మల్ని దుబాయికి తీసుకెళతానన్నారు. అంతా సజావుగా ఉందని అనుకునేలోగా మా వారు తీవ్ర అనారోగ్యంతో మరణించారు. అతను చేసేది చాలా చిన్న ఉద్యోగం కావడం వల్ల మాకు పెద్దగా ఆర్థిక సాయం ఏమీ అందలేదు. అయితే మా అత్తమామలు బాగా ఉన్నవాళ్లు. స్థిరచరాస్తులు చాలా ఉన్నాయి. మా వారి మరణం తర్వాత నన్నూ, బాబునూ ఆదరించకపోగా, బయటికి గెంటి వేశారు. నేను పెద్దగా చదువుకోలేదు. పైగా బాబు చిన్నవాడు. ఇప్పట్లో ఏ పనీ చేయగలిగే పరిస్థితులు లేవు. మా వారికి రావలసిన ఆస్తిలో నాకూ, బాబుకూ వాటా వస్తుందా? - మానస, రాజమండ్రి తప్పకుండా వస్తుంది. చనిపోయిన మీ వారికి తండ్రి ఆస్తిలో చట్టప్రకారం ఎంత ఆస్తి రావాలోఅంత వాటా మీకు వస్తుంది. ఒక వితంతువైన కోడలికి మెయింటెనెన్స్ ఇవ్వవలసిన బాధ్యత చట్టప్రకారం మీ మామగారిదే. మీకు, బాబుకు మెయింటెనెన్స్ వస్తుంది. మీరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించి ప్రీ లిటిగేషన్ కేస్ (పిఎల్సీ) వేయండి. దీనికి ఖర్చులేం ఉండవు. మీ మామగారిని పిలిపించి (నోటీసుల ద్వారా) మీ విషయం సెటిల్ చేస్తారు. వినకుంటే కేసును కోర్టుకు పంపుతారు. మేడమ్, ఇటీవలే నేను ఎంబిఏ పూర్తి చేశాను. అయితే నేను ఫస్ట్ ఇయర్లో ఉండగా నా క్లాస్మేట్ రాఘవను ప్రేమించాను. అతనూ నన్ను ఇష్టపడ్డాడు. మా కులాలు వేరు కావడం వల్ల పెద్దలు అంగీకరించరని తెలుసు. అందుకని మేము రహస్యంగా వివాహం చేసుకోవాలనుకున్నాము. కొందరు మిత్రుల సమక్షంలో దండలు మార్చుకున్నాము. సంప్రదాయబద్ధంగా మంగళసూత్రం కూడా కట్టాడు. స్నేహితులంతా దాన్ని వీడియో కూడా తీశారు. మా పేరెంట్స్‌కు ఈ విషయాన్ని చెప్పకుండా దాచాము. ఎవరి హాస్టల్లో వాళ్లం ఉంటూ, అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. ఒక రూమ్ అద్దెకు తీసుకుని అందులో గడిపేవాళ్లం. ఓనర్స్ కూడా పక్కనే ఉండేవాళ్లు. ఇలా సంవత్సరం గడిచింది. మా చదువులైపోయాయి. మధ్యలో కన్సీవ్ అవడం, తనే దగ్గరుండి అబార్షన్ చేయించడం జరిగింది. తనకు మంచి ఉద్యోగం దొరికింది. అయితే అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. నాకూ మొన్ననే ఉద్యోగం వచ్చింది. ఇపుడు నా భర్త వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. మా వివాహం గురించి పెద్దలకు తెలియదు. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. - రాగిణి, హైదరాబాద్ మీరు చేసింది తప్పు. అంతేకాకుండా మోసపోయారు కూడా. ఎవరినైనా ఈరోజుల్లో ఇలాంటి పెళ్ళిళ్లు చేసుకుంటారా? ఒకవేళ అంత అవసరమైతే రిజిస్టర్ పెళ్లి ఉండనే ఉంది కదాఐ. కాకుంటే మీరు అతని భార్య అనే ఆధారాలు మీ వద్ద చాలు ఉన్నాయి. ఫొటోలు, వీడియోలూ, స్నేహితుల సాక్ష్యాలు పనికి వస్తాయి. మీ ఓనర్స్ కూడా మీరు ఆ రూమ్‌కి ఒక సంవత్సరం పాటు వస్తూ, వెళుతూ ఉన్నారని చెబుతారు. హాస్పిటల్లో కూడా మీవారు సంతకం చేసే ఉంటారు కదా! ఇక మీవారు వివాహాన్ని నిరాకరించలేరు. కాదనలేరు. మీరు వెంటనే మీ తలిదండ్రులను సంప్రదించి ఈ విషయాలు వివరించండి. మీ మిత్రులను, పేరెంట్స్‌ను తోడు తీసుకుని వెళ్లండి. వారు అర్థం చేసుకుని ఆశీర్వదిస్తే మంచిది. లేదంటే క్రిమినల్ కేసు పెట్టొచ్చు. చీటింగ్, నమ్మకద్రోహం, బైగమీ మొదలైన కేసులు పెట్టవచ్చు. రెండో వివాహం చేసుకోకుండా కోర్టునుండి ఇంజన్క్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి రహస్యపు పెళ్లిళ్లు అనేక అనర్థాలకు దారితీస్తాయి. - ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
మళ్లీ కలవాలంటే పెళ్లి చేసుకోవలసిందే!
లీగల్ కౌన్సెలింగ్ మా పెళ్లయి ఆరేళ్లైంది. మా ఆవిడకు నాపై చాలా అనుమానం. నా సంపాదనంతా మా అమ్మానాన్నలకు ఇస్తున్నానని, తన అవసరాలు పట్టించుకోనని అపోహలు. తనను నమ్మించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా జీతం స్లిప్స్ చూపించాను. మా అమ్మానాన్నల ఆస్తిపాస్తుల వివరాలు తెలియజేసి, వారికి నా డబ్బుతో అవసరం లేదని స్పష్టపరిచాను. అయినా తను కన్విన్స్ అవలేదు. చివరకు నా ఏటీఎం కార్డు కూడా తనకే ఇచ్చాను. ఇంకా ఆమె ప్రవర్తన మారలేదు. ఈసారి నాపై కొత్త ఆరోపణలు మొదలెట్టింది. నా కొలీగ్స్‌తో అక్రమ సంబంధాలు అంటగట్టి, నన్ను సతాయించడం ప్రారంభించింది. ఈ విషయం మా అత్తామామలకి చెప్పాను. మొదటినుంచి ఆమె స్వభావం అదేనని, కొంతకాలం ఓర్చుకోమనీ చెప్పారు. కనీసం నా ముఖం చూపించకుండా ఉంటే అయినా, తను మారుతుందేమో, నా ఉనికికి దూరమైతే రియలైజ్ అవుతుందేమోనని జుడీషియల్ సపరేషన్ కేస్ వేశాను. నాకు ఫేవర్‌గా ఆర్డర్ వచ్చింది. తనకు ఏ లోటూ లేకుండా స్వంత ఇంట్లోపూ ఉండే ఏర్పాటు చే సి, నేను అద్దె ఇంటికి మారాను. ఇది జరిగి రెండేళ్లు అయింది. అయినా మా ఆవిడ లో ఏమార్పూ రాలేదు. నా భవిష్యత్ మాటేమిటి? మాకు పిల్లలు కూడా లేరు. నన్నేం చేయమంటారు? - ఎం. సాంబశివరావు, తెనాలి కోర్టుద్వారా జ్యుడీషియల్ సపరేషన్ ఆర్డర్ పొందిన రెండేళ్ల వరకు కూడా మీ పరిస్థితులు చక్కబడనప్పుడు, ఆ కారణ ంగా మీరు విడాకులు మంజూరు చేయమని కోర్టును ఆశ్రయించవచ్చు. భార్యాభర్తలు పునరాలోచించుకోవడానికి కోర్టు ఇచ్చే అవకాశమే జ్యుడీషియల్ సపరేషన్. ఆ టైమ్‌లో ఒకరి లోటుపాట్లను ఒకరు ఆలోచించుకొని, సమస్యను పరిష్కరించుకుని, కాపురం చక్కదిద్దుకునే సమయం దొరుకుతుంది. తీరిగ్గా, ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా మంచి నిర్ణయం తీసుకోవచ్చు. మీ భార్య విషయం చూస్తే ఆమెలో ఏ మార్పూ లేదని తెలుస్తోంది. మరోసారి ఆమెతో మాట్లాడి చూడండి. ఆమె ససేమిరా అంటే మీకు విడాకులే మార్గం. మా పెళ్లయి రెండు సంవత్సరాలు. నా భర్త చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. నేను ఒక ఏడాదిపాటు చెన్నైలో అతనితో కలిసి ఉన్నాను. సంవత్సరం తర్వాత కుటుంబ పోషణకు తన ఆదాయం సరిపోవడం లేదని అప్పులున్నాయని నన్ను తన తల్లిదండ్రుల దగ్గర ఉండమని అడిగారు. మా అత్తామామలది మారుమూల పల్లెటూరు. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. నా అవసరం వారికి లేదు. నేను మొదటినుండి సిటీలోనే ఉన్నాను. పైగా ఇటీవలే మా నాన్న చనిపోయారు. అమ్మ ఒంటరిదైంది. నేనే ఏకైక సంతానాన్ని. అందువల్ల అమ్మ దగ్గర ఉంటాను, లేదంటే చెన్నైలో ఏదైనా ఉద్యోగం చూసుకుని అతని ఆర్థికభారాన్ని తగ్గిస్తానన్నాను. అతను దేనికీ ఒప్పుకోలేదు. నన్ను బలవంతంగా మా అత్తగారింట్లో దింపి వెళ్లారు. నేను కొన్ని రోజులుండి, అత్తమామలకు చెప్పి అమ్మదగ్గరికి వచ్చాను. అతను ఇంతవరకు నన్ను చూడటానికి రాకపోగా, తరచు ఫోన్ చేసి, నాపై రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు వేస్తానని నన్ను తక్షణం అత్తగాంటికి వెళ్లమని వేధిస్తున్నాడు. నాకు భయంగా ఉంది. అసలు ఈ విషయమై చట్టం ఏమి చెబుతుందో వివరించగలరు. - సుమలత, ఆదోని మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తుంటే మీవారికి మీతో కాపురం చేసే ఉద్దేశ్యం లేదనిపిస్తోంది. దశలవారీగా మిమ్మల్ని వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. అయితే, ఆయనకు తెలియని విషయమేమిటంటే, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ మీ వారికి వర్తించదు. భర్త లేకుండా అత్తగారింట్లో ఉండమని ఏ కోర్టూ ఆర్డర్ ఇవ్వదు. ఆ సెక్షన్ ఉద్దేశ్యం వేరు. సమేతుకమైన కారణం లేకుండా భర్త భార్యను విడిచి దూరంగా ఉన్నా, భార్య భర్తను విడిచి దూరంగా ఉన్నా ఈ కేసు వేసుకోవచ్చు. దీనినే కాపురం హక్కుల పునరుద్ధరణ కేసు అంటారు. మీ విషయంలో మీరు భర్తను వదిలి రాలేదు. ఆయనే మిమ్మల్ని వెళ్లమన్నారు. ఒకవేళ అతను కేసు వేస్తే మీరు లక్షణంగా అతని వద్దకు వెళ్లండి మీరు కూడా అదే కోరుకుంటున్నారు కదా! భర్త లేకుండా అత్తమామల దగ్గర దగ్గర ఉండమని ఎవరూ చెప్పరు. మా వివాహమైన సంవత్సరం తర్వాత మావారు తన కొలీగ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను వేధించారు. తీవ్రమనస్థాపానికి లోనైన నేను విడాకులకు అప్లై చేశాను. కోర్టు నాకు విడాకులు మంజూరు చేసింది. ఇది జరిగి నాలుగేళ్లయింది. నేను తర్వాత వివాహ ప్రయత్నం చేయలేదు. నేను ప్రభుత్వ ఉద్యోగిని. నా మాజీ భర్త తన కొలీగ్తోనే సహజీవనం సాగిస్తున్నాడని, వారికి ఒక పాప కూడా ఉందని తెలిసింది. మొన్నీమధ్య అతను నన్ను కలిశాడు. తన కొలీగ్ ప్రవర్తన బాగోలేదని, ఆమెను వదిలేశానని, ఇక ఆమెతో తనకు ఏ సంబంధం లేదని, మరల నాతో కలిసి ఉంటానని ప్రాధేయపడుతున్నారు. నాకూ ఒక తోడు కావాలని ఉంది. మేం ఒకప్పుడు భార్యాభర్తల మే కదా! తన కొలీగ్ మెడలో అతను తాళి కట్టలేదు కదా! ఏం చేయమంటారు? సలహా ఇవ్వగలరు. - మేరీ, కర్నూలు అడల్టరీ గ్రౌండ్స్ మీద మీకు విడాకులు వచ్చాయి. అంతటితో ఆ బంధం చట్టబద్ధంగా రద్దయిపోయింది. తర్వాత మీ భర్త ఆ స్త్రీతో సహజీవనం చేశారు. సంతానం పొందారు. ఇప్పుడు ఆమె ప్రవర్తనను శంకించి మళ్లీ మీకు ఎర వేస్తున్నారు. మీతో మరల సంబంధం ఎలా కొనసాగిస్తారు? అలా అయితే ఈసారి మీ ఇద్దరిపై క్రిమినల్ కేసు వేసే అవకాశం మీ మాజీ భర్త సహజీవన భాగస్వామికి వస్తుంది. మీరు పునర్వివాహం చేసుకోలేదని, డబ్బు కూడబెట్టి ఉంటారని ఐడియా కావచ్చు. మీతో కొన్నాళ్లు పబ్బం గడుపుకొని మరలా మీ క్యారక్టర్ మంచిది కాదంటే ఏం చేస్తారు? చట్టబద్ధంగా విడిపోయిన భార్యాభర్తలు మరలా కలవాలంటే వివాహం చేసుకోవలసిందే. లేదంటే న్యాయపరమైన చిక్కులు రావచ్చు. -
భార్యాభర్తలు విడాకుల దాకా రావడానికి కారణాలివి...
కేస్ స్టడీ మంగమ్మగారు ఒక మాజీ కార్పొరేటర్. ప్రస్తుతం ఒక ‘కౌన్సెలింగ్ సెంటర్’ ఏర్పాటు చేయాలనుకున్నారు. విడాకుల సంఖ్య ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో అసలు జంటలెందుకు విడిపోతున్నారో తెలుసుకొని వారికి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి, సాధ్యమైనంతమంది జంటలను కోర్టు గుమ్మం తొక్కకుండా చేయడమే ఆ సెంటర్ స్థాపనలో ఉన్న ముఖ్యోద్దేశం. వారికి తెలిసిన న్యాయవాదిని కలిసి విషయం వివరించి జంటలు విడిపోవడానికి ప్రధాన కారణాలు తెలుసుకొని చర్చించుకొని ఒక అవగాహనకు వచ్చారు. అసలు జంటలు విడాకులదాకా రావడానికి గల ప్రధాన కారణాలు గురించి న్యాయవాది తెలిపిన వివరాలు. 1) ఇన్‌కంపాటబిలిటీ (అనుభవ రాహిత్యం) 2) అసహనం 3) అనుమానం 4) అధికారం (మేల్ డామినేషన్) 5) అహంకారం 6) వైవాహికేతర సంబంధాలు 7) దురలవాట్లు 8) వరకట్న డిమాండ్స్ 9) అంటువ్యాధులు 10) తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల అనవసరపు జోక్యం మొదలైనవి. ఇక ఒక్కొక్క కారణం గురించి అధ్యయనం చేయాలని, వాటి గురించి చర్చించాలని నిర్ణయించుకొని ఒక గుడ్కాజ్ గురించి సెంటర్ అత్యంత త్వరలో ఏర్పాటు చేయాలని వెను తిరిగారు మంగమ్మగారు. యాసిడ్ దాడులకు పాల్పడినా, అందుకు సహకరించినా... పదేళ్ల జైలు, జరిమానా లీగల్ కౌన్సెలింగ్ మేడమ్, మేము ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థినులం. మా కాలేజీలో ఒక అల్లరి మూక ఉంది. అమ్మాయిలను ప్రేమించామని వెంటపడటమే వారి పని. ఇటీవల వారి ఆగడాలు ఎక్కువైనాయి. ప్రేమించలేదని కొందరు అమ్మాయిలను దారి కాచి మరీ వేధిస్తున్నారు. మొన్నటికి మొన్న చేతిలో ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఏదో ద్రవం నింపుకొని వచ్చి కాలేజీ దారిలో కొందరిని భయభ్రాంతులకు గురి చేశారు. మా యాజమాన్యం పట్టించుకోలేదు. ఆ ఆకతాయి ముఠా వెనుక పెద్దల అండదండ లున్నాయ్. ఆ బాటిల్స్‌లోని ద్రవం యాసిడ్ అని మా అనుమానం. అదే నిజమైతే మా గతేం కాను? చాలా భయంగా ఉంది. యాసిడ్ దాడులకు సంబంధించి చట్టాలేమైనా ఉన్నాయా? దయచేసి తెలుపగలరు? - ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల బృందం, కాకినాడ భయపడకండి. ఇటువంటి సమయాల్లో ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా చాకచక్యంగా ఎదుక్కోవాలి. తగిన జాగ్రత్త అవసరం. స్వప్నిక, ప్రణీతల సంఘటన మీకు గుర్తుండి ఉంటుంది. అలాగే ఢిల్లీ గ్యాంగ్‌రేప్ కూడా. అదే ‘నిర్భయ’ ఉదంతం. ఢిల్లీ గ్యాంగ్ రేప్‌కి ముందు మనకు యాసిడ్ దాడులకు సంబంధించి ప్రత్యేక చట్టాలు/ఐపిసి సెక్షన్స్ లేవు. ఆ సంఘటన తర్వాత వెల్లువెత్తిన నిరసనల ఫలితంగా జస్టిస్ వర్మ కమిషన్ రిపోర్ట్‌ను/రికమెండేషన్స్‌ను అనుసరించి ‘నిర్భయ చట్టం’ లేక ‘క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013’ రావడం జరిగింది. దానిలో యాసిడ్ దాడులను చేర్చడం జరిగింది. సెక్షన్ 326 ఐ.పి.సి.కి ఎ, బి లను చేర్చడం జరిగింది. 326ఎ ప్రకారం ఎవరైనా యాసిడ్ దాడులకు పాల్పడి/యాసిడ్ పోసి తీవ్రమైన గాయాలు కలుగచేస్తే 10 సం॥జైలు శిక్ష లేక యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. దాంతో పాటు బాధితురాలికి, నిందితుడికి జరిమానా విధించి ఆ సొమ్మును అందచేస్తారు. సెక్షన్ 326బి ప్రకారం ఎవరైనా యాసిడ్ పోసినా/పోసే ప్రయత్నం చేసినా 5 నుండి 7 సం॥జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. మీరు వెంటనే పోలీస్‌లను ఆశ్రయించండి. వారు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వండి. వీలుంటే వారి దుశ్చర్యలను మీ సెల్ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేయండి. వారు వెళ్లే దారిలో మీరు ఒంటరిగా సంచరించకండి. మేడమ్, నేనొక పాఠశాల హెడ్ మాస్టర్‌ను. మాది బాలికల పాఠశాల. మా స్కూల్ ఉండే లైన్లో మా విద్యార్థినులు కొంతమంది ఒక చోట ఆగిపోయి తదేకంగా చూడడం గమనించాను. వారు వెళ్లిపోయిన తర్వాత నేను వెళ్లి, వారిని అంతగా ఆకర్షించిన విషయమేమిటా అని చూస్తే, ఒక పెద్ద వాల్‌పోస్టర్ ఉంది. ఒక సినిమాకు సంబంధించినది. ఇద్దరు యువతీ యువకులు అత్యంత అభ్యంతరకరమైన భంగిమలో ఉన్న దృశ్యం. నా మనస్సు చాలా బాధపడింది. విద్యార్థినులు ఇప్పుడిప్పుడే టీనేజ్‌లోకి వస్తున్నవాళ్లు. వారి మనస్సుపై ఇలాంటి అసభ్యకరమైన పోస్టర్స్ ఎంత దుష్ర్పభావం చూపిస్తాయో తలచుకుంటే భయమేస్తుంది. ఒక బాధ్యతగల హెడ్ మాస్టర్‌గా నేనేమీ చేయలేనా? - జి.వి.రంగారెడ్డి, హైదరాబాద్ మీలాంటి బాధ్యతగల గురువులుండబట్టే మన వ్యవస్థ ఈ మాత్రమైనా ఉంది. మీ మనసును కలచివేసిన పోస్టర్‌ను తొలగించాలంటే మీరు తప్పకుండా పూనుకోవాలి. మీకా అధికారం ఉంది. దీనికి సంబంధించిన చట్టం కూడా ఉంది. అదే ప్రొహిబిషన్ ఆఫ్ ఆబ్సీస్ అండ్ అబ్జక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1997. ఈ చట్టాన్ని అనుసరించి: - వీక్షకులను నైతికంగా పతనం చేసేవి - లైంగిక వాంఛలను ప్రేరేపించేవి - వీక్షకులను సంస్కారహీనులుగా చేసేవి - మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు, మానభంగాలను ప్రేరేపించేవి - శృంగార భావాన్ని అసభ్యరీతిలో ప్రదర్శించేవి తదితర చిత్రాలను ‘అసభ్యకరమైన పోస్టర్లు’ అంటారు. పై నేరాలకు పాల్పడిన వారికి 6 నెలలు జైలు, 6 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. మీరు హైదరాబాద్ సిటీలో ఉంటున్నారు కనుక ‘కమీషనర్ ఆఫ్ పోలీస్’ వారికి ఫిర్యాదు చేయండి. మేడమ్, నా చెల్లెలి వివాహమై 8 సం॥అయ్యింది. పెళ్లి అయిన ఏడాది తర్వాత అతను చెప్పా పెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు. ఇద్దరి మధ్య ఏ గొడవలూ లేవు. ఎన్నో రకాలుగా అతని ఆచూకీ కనుక్కొనే ప్రయత్నం చేశాం. అతని అమ్మానాన్నలు కూడా ఎంతో సహకరించారు. స్టేషన్లో మిస్సింగ్ కేస్ కూడా పెట్టాం. అయినా ఆచూకీ దొరకలేదు. దాదాపు 7 సం॥నిండిపోయాయి. చెల్లికి సంతానం లేదు. అమ్మానాన్నలు పెద్దవారైపోయారు. చెల్లెలి భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది. ఏంచేయమంటారు? - ఒక సోదరుడు, ఆదోని ఒక వ్యక్తి తన ఆచూకి, యోగక్షేమాలు తెలియవలసిన వారికి 7 సం॥నుండి తెలీకుండా పోయినప్పుడు అతను చట్టప్రకారం చనిపోయిన వ్యక్తిగానే పరిగణింపబడతాడు. మీరు వెంటనే పై కారణం వల్ల వివాహాన్ని రద్దు పరచమని కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టువారు ‘పేపర్ నోటిఫికేషన్’ ఆర్గర్ ఇచ్చి, తర్వాత వివాహాన్ని రద్దు చేస్తారు. మీ చెల్లికి పునర్వివాహం చేయవచ్చు. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
జాతీయ పతాకాన్ని అవమానిస్తే ఎవరికైనా శిక్ష తప్పదు
లీగల్ కౌన్సెలింగ్ అమ్మా, మేము రిటైర్డ్ ఉద్యోగస్తులం. మేము ఒక స్వచ్ఛంద సేవాసంస్థను ఏర్పాటు చేసుకున్నాము. సమాజసేవ దేశభక్తి మా సంస్థ ముఖ్యోద్దేశాలు. కొన్ని సందర్భాల్లో ‘జాతీయ పతాకాన్ని’ అవమానిస్తున్నారేమో అని బాధపడుతున్నాము. అలాంటప్పుడు ఏదైనా చట్టం ఉందా? దయచేసి తెలుపగలరు. - కాట్రగడ్డ వెంకటప్పయ్య, గుంటూరు సార్, మీ దేశభక్తికి, జిజ్ఞాసకు అభినందనలు. మనం తరచుగా పేపర్లలో చదువుతున్నాము. జెండా తలక్రిందులుగా వేలాడదీశారని, జెండా నేలను తాకిందనీ చింపివేయబడిందనీ... ఇలా రకరకాల వార్తలు. ఇలాంటి చర్యలు జరిగినప్పుడు బాధ్యత గల పౌరులెవరైనా స్పందించవచ్చు. దీనిని సంబంధించి ‘జాతీయ పతాక గౌరవ పరిపరక్షణ చట్టం 1971’ ను అనుసరించి బహిరంగ ప్రదేశాల్లోగానీ, ప్రజలు వీక్షించటానికి అవకాశముండే ప్రదేశాల్లో కానీ, మరేదైనా ప్రదేశాల్లో కానీ జాతీయ పతాకాన్ని లేదా భారత రాజ్యాంగాన్ని తగులబెట్టిగా, చింపివేసినా, ధ్వంసం చేసినా, మాటల ద్వారా, చేతల ద్వారా, ఏవైనా ఇతర హావభావాల ద్వారా కించపరిచినా కానీ నేరం. అటువంటి చర్యలు పవిత్రమైన జాతీయ పతాకాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరచినట్లుగా పరిగణింపబడి శిక్షార్హమైన నేరాలవుతాయి. ఈ చట్టాన్ని అనుసరించి... ప్రభుత్వం నిర్దేశించిన రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేయరాదు జాతీయ పతాకంపై ఏవిధమైన రాతలు రాయరాదు, చెక్కరాదు బుద్ధిపూర్వకంగా జాతీయ పతాకం నేలను తాకేలా చేయరాదు, నీట ముంచరాదు జాతీయ పతాకాన్ని బుద్ధిపూర్వకంగానే కాదు, పొరపాటుగా తలకిందులుగా ఎగుర వేయరాదు జాతీయ పతాకాన్ని అవమానించే లేదా అవహేళన చేసే వ్యాఖ్యలు చేసిన వారు కూడా శిక్షార్హులే జాతీయ పతాకాన్ని అవమాన పరిచినట్లైతే మూడు సంవత్సరాలు జైలు శిక్ష, జాతీయ గీతాన్ని పాడకుండా నిరోధించినా, గలాభా చేసినా కూడా మూడేళ్ల వరకు జైలు, జరిమానా లేక రెండూ విధింపబడతాయి. ఒకవేళ జాతీయ పతాకం పాడయినట్లయితే దానిని చాటుగా తగులబెట్టాలి. అంతేకానీ, దానిని ఎగుర వేయడం కానీ, ఇతర విధాలుగా కానీ ఉపయోగించడం కూడా నేరమే. ఈ నియమాలకు, నిబంధనలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు కూడా అతీతులు కారు. వారికి కూడా శిక్షతప్పదు. మా అమ్మగారు ఇటీవలే మరణించారు. ఆమె పేరు మీద పది ఎకరాల పొలం ఉంది. మా తండ్రిగారు జీవించి ఉన్నారు. నాకు అక్క, తమ్ముడు ఉన్నారు. నాకూ, అక్కకీ వివాహం అయింది. తమ్ముడు అవివాహితుడు. మా అమ్మగారు వీలునామా రాయలేదు. ఎవరికీ ఆస్తి పంపకాలు చేయలేదు. ఎవరికీ దాన పత్రాలు రాయలేదు. ఆ ఆస్తిని మేమెలా పంచుకోవాలి? అందరికీ సమాన వాటాలు వస్తాయా? తెలుపగలరు. -బి.ల క్ష్మి, చిలువూరు మరణించిన మీ తల్లిగారు వీలునామా రాయలేదు. ఆమె ఆస్తి ఇద్దరు కుమార్తెలకూ, కొడుకుకూ, మీ తండ్రికి సంక్రమిస్తాయి. మీకు సమాన వాటాలు వస్తాయి. సెక్షన్ 15 హిందూ వారసత్వ చట్టం సబ్‌సెక్షన్ (1), క్లాజ్ (ఎ) కింద కొడుకులూ, కూతుళ్లు వారితోపాటు భర్తకూ సమాన వాటాలు ఉంటాయి. కూతుళ్లకు వివాహాలు అయినా కాకపోయినా వారికి సమాన వాటా ఉంటుంది. మేడమ్, మాది ఉమ్మడి కుటుంబం. మా మామగారి తమ్ముళ్లూ, వారి కుటుంబాలు, మా కుటుంబం అంతా కలిసే ఉంటాం. అన్నదమ్ముల మధ్య కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయి.ఇక నేను ఆ ఇంటి కోడలిని. నాకు రాకరాక గర్భం వస్తే, మూడో నెలలోనే మావారి పిన్నిగారు ఏదో మందు తినిపించారు. బలానికని చెప్పారు. వెంటనే నాకు కడుపులో నొప్పి ప్రారంభమై అబార్షన్ అయింది. ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. నన్నేం చేయమంటారు? - వి.ఆర్., కాకినాడ గర్భస్రావ నేరాలకు సంబంధించి విఫిసి చట్టాలు ఉన్నాయి. సెక్షన్ 312 నుండి 316 వరకూ ఇలాంటి నేరాలు, వాటి శిక్షల గురించిన వివరణ ఉంది. ప్రసవానికి ముందే గర్భంలోని శిశువును చిదిమి వేయడాన్ని గర్భస్రావం అంటారు. అంటే కడుపులోని బిడ్డను చంపివేయడమే. మీ విషయంలో సెక్షన్ 312 అన్వయిస్తుంది. మెడికల్ రిపోర్ట్ తీసుకొని కేస్ వేయవచ్చు. 3 సం॥జైలు శిక్ష, జరిమానా పడతాయి. కేస్ స్టడీ కట్నం రూపేణా ఇచ్చిన ఆస్తిని మూడు నెలల్లోగా భార్యపేరిట బదలాయించాలి! సంథ్య సుభాష్‌ల వివాహమై ఆరు నెలలు అయింది. దాదాపు పది లక్షల కరకు రొక్కం కట్నం రూపేణా ఇచ్చారు సంధ్య తల్లిదండ్రులు. ఇది కాక వివాహం వియ్యాల వారి కోరిక మేరకు చాలా ఘనంగా జరిపించారు. ఘనమైన సారెతో అత్తింటికి పంపించారు. ఓ రెండు నెలలు హాయిగా ఉన్నారు దంపతులు. పల్లెటూర్లో ఉంటున్న అత్తామామల సంధ్య సుభాష్‌ల ఇంటికి వచ్చారు. అత్తమామల ఆరళ్లు ప్రారంభమైనాయి. సంధ్య ఒక్కతే కూతురు. పైగా బోలెడంత ఆస్తి ఉంది. ఇకనేం సుభాష్ మనసులో విషబీజాలు నాటారు అత్తమామలు. అత్తమామలు ఆరోగ్యంగా ఉండగానే ఆస్తి మొత్తం రాయించుకోమని సుభాష్‌పై ఒత్తిడి తెచ్చారు. డబ్బంటే చేదా? సుభాష్ కూడా సంధ్యను సతాయించడం ప్రారంభించాడు. చీటికి మాటికి పోట్లాటకు సిద్ధపడుతున్నాడు. పది లక్షలేం చేశారంటే బ్యాంక్‌లో వేసుకున్నానని సమాధానం. ఇంట్లో గొడవలు భరించలేక సుభాష్ కోరిక తీర్చడం కోసం పుట్టింటికి వెళ్లింది సంధ్య. ఆస్తి అంతా సుభాష్‌కు, సంధ్యకే ఇస్తామని, కానీ ఇప్పుడు కాదనీ, ఇప్పుడు ఇస్తే సంధ్యను అన్యాయం చేస్తారని ఆమె తల్లిదండ్రుల వాదన. అంతా కలసి వారి ఫ్యామిలీ లాయర్ దగ్గరకెళ్లారు. ఆమె కూడా సంధ్య పేరెంట్స్‌నే సపోర్ట్ చేసింది. ఏకైక వారసురాలైనంత మాత్రాన ఆస్తి మొత్తం ఇపుడే ఇవ్వడం కుదరదని తెలియజేసింది. అసలు, వివాహమైన 3 నెలలలోగా కట్నం రూపేణా ఇచ్చిన సొమ్మును భార్య పేరు మీద తప్పకుండా ట్రాన్ఫర్ చేయాలని, వరకట్నంగా ఇచ్చిన డబ్బు గృహిణికి స్వంత ఆస్తి అవుతుందని ‘వరకట్న నిషేధ చట్టం 1961’ ప్రకారం భార్య పేరున తప్పకుండా కట్నం డబ్బునుకాని, కట్న రూపేణా వచ్చిన ఆస్తిని కానీ ట్రాన్ఫర్ చేయాలని అలా చేయకుంటే నేరమని, జైలు శిక్షా, జరిమానా పడతాయనీ లాయర్ తెలియజేశారు. ముందు 10 లక్షలు తన పేరు మీద ట్రాన్ఫర్ చేయించుకోమని, అపుడు భర్త, అత్తగార్ల అసలు స్వరూపం బయట పడుతుందని సలహా ఇచ్చారు. భర్తను నిలదీయడానికి సిద్ధపడింది సంధ్య. వీలుంటే న్యాయపోరాటానికి కూడా. తల్లిదండ్రులను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్పి లాయర్‌గారికి ధన్యవాదాలు చెప్పి అత్తింటికి మరలింది సంధ్య. -
ఆయనకి కొద్దిగా క్లోజ్‌గా మూవయ్యాను...
లీగల్ కౌన్సెలింగ్ మా వివాహమై నాలుగు సంవత్సరాలైంది. ఇరువురమూ లెక్చరర్లం. ఒకే కళాశాలలో పనిచేస్తున్నాము. కాలేజీకి కలసి వచ్చేవాళ్లం. కలిసి ఇంటికి వెళ్లేవాళ్లం. నాకు ఆరు నెలల క్రితం వేరే కాలేజీలో ఎక్కువ జీతంపై మంచి పోస్టింగ్ వచ్చింది. నా భర్త అంగీకారంతోనే జాయిన్ అయ్యాను. అక్కడ ఎక్కువ మంది పురుష లెక్చరర్లే ఉన్నారు. నా యూనివర్శిటీ క్లాస్మేట్ కూడా అక్కడే పని చేస్తుండడంతో పూర్వ పరిచయంతో నేనతనితో కొద్దిగా క్లోజ్‌గా మూవయ్యాను. అంటే కూరలూ వగైరా షేర్ చేసుకోవడం, ఇంటికి లంచ్‌కి పిలవడం వంటివి. ఎందుకంటే అతను బ్యాచిలర్. పైగా తలిదండ్రులు వేరే రాష్ట్రంలో ఉంటారు. మొదట్లో నా భర్త కూడా అతనితో కలివిడిగానే ఉన్నారు. తర్వాత ఏమైందో ఏమో కానీ, నన్ను తీవ్రంగా అనుమానించడం మొదలెట్టారు. చీటికిమాటికీ చిరాకు పడటం, ఆఖరికి కొట్టడం కూడా ప్రారంభించారు. భరించలేక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరాను దూరంగా ఉంటే మారతాడని. కానీ మొన్న నాకు కోర్టునుండి విడాకుల నోటీసులు పంపారాయన. అదీ కూడా అడల్టరీ గ్రౌండ్స్మీద! నాకేపాపమూ తెలీదు. ఇది తెలిసి నా స్నేహితుడు రిజైన్ చేసి వెళ్లాడు. నాకు కోర్టు విచారణ భయంగా ఉంది. అంతమంది మధ్యలో ఈ ఆరోపణలు ఎలా ఎదుర్కోవాలి? నా నిజాయితీని నిరూపించుకోగలను కానీ, కోర్టునిండా న్యాయవాదులూ, కక్షిదారులూ ఉంటారు కదా! వాళ్లను చూస్తేనే భయం. పైగా తెలిసిన వాళ్లు కూడా కనపడుతుంటారు కదా! అవమానకరంగా ఉంటుంది. నేను ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? - పుష్పకుమారి, ఆదోని. అడల్టరీ గ్రౌండ్‌ను నిరూపించడం చాలా కష్టం. పైగా మీ వారిది కేవలం అనుమానం.. అందులో వాస్తవం లేదు కూడా! కాబట్టి మీరు తప్పకుండా కేసు గెలుస్తారు. కాకపోతే మీరు అంతలా భయపడ వలసిన అవసరం లేదు. ఇలాంటి సున్నితమైన విషయాలు విచారణకు వచ్చినప్పుడు సెక్షన్ 11, కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984 ప్రకారం అడల్టరీ ఆరోపణలు, పిల్లల లెజిటిమసీ గురించిన ఆరోపణలు, లైంగిక ప్రవర్తనల గురించి, నపుంసకత్వం గురించిన ఆరోపణలు మొదలైన విషయాలకు సంబంధించిన విచారణలను గోప్యంగా జరపమని కోరవచ్చు. అంతేకాకుండా హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 22 కూడా రహస్యంగా విచారణ జరపాలని తెలియజేస్తుంది. కనుక ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్ కావాలని అడగండి. కోర్టువారు తప్పకుండా అనుమతిస్తారు. అంటే విచారణ సమయంలో మీరు, మీ భర్త, మీ ఇరువురి న్యాయవాదులు, న్యాయమూర్తిగారు మాత్రమే కోర్టులో ఉంటారు. మిగతా వారినందరినీ బయటకు పంపించి, తలుపులు మూసివేసి, విచారణ ప్రారంభిస్తారు. మీరు స్వేచ్ఛగా, భయం లేకుండా మీ వాదనలను న్యాయమూర్తిగారికి విన్నవించుకోవచ్చును. మేడమ్, నేను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మాకు ఒక బాబు ఉన్నాడు. ఒక్కడే చాలని సరిపెట్టుకున్నాము. వాడికిప్పుడు 6 సంవత్సరాలు. స్కూలుకు వెళుతున్నాడు. నాకు ఇప్పుడు వీడితోపాటు ఒక పాప కూడా ఉంటే బాగుండుననిపిస్తోంది. కానీ నాకిక పిల్లలు పుట్టే అవకాశం లేదు. గైనకాలజిస్టుగా ఆ సంగతి నాకు తెలుసు. ఒక పాపను దత్తత తీసుకొని, తల్లిగా పెంచుకోవాలని కోరికగా ఉంది. బాధాకరమైన విషయమేమిటంటే, నేను ముస్లిమ్‌ని కనుక దత్తత తల్లిగా ఉండే అవకాశం లేదని, మమ్ములను చట్టం దత్తత తల్లిగా పరిగణించదని చెబుతున్నారు. దీనికి కారణమేమిటి? నా కొలీగ్. డా. సావిత్రి ఒకపాపను దత్తత తీసుకుని చట్టప్రకారం తల్లి అయారు. మరి నాకు ఆ అవకాశం ఎందుకు లేదు? - హసీనా, గుంటూరు పిల్లలను దత్తత తీసుకోవాలంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం తీసుకోవాలి. తీసుకున్న వారు చట్టప్రకారం తలిదండ్రులుగా పరిగణింపబడతారు. కానీ ఆ చట్టప్రకారం హిందువులు, సిక్కులు దత్తత తీసుకోవచ్చు. ముస్లిమ్‌లకు అది వర్తించదు. వీరికి సంబంధించి ప్రత్యేక చట్టం లేదు. అయినా మీకొక అవకాశ ం ఉంది. ‘గార్డియన్స్ అండ్ వార్డ్స్’ చట్టప్రకారం ఒక పాపను పెంచుకోవచ్చు. అంటే గార్డియన్‌గా మాత్రమే. అలాగని కోర్టు డిక్లేర్ చేస్తుంది. చట్టం మిమ్మల్ని గార్డియన్‌గా ఉండమంటుంది. కానీ అమ్మ అని పిలిపించుకోవద్దని శాసించలేదు కదా! తప్పకంండా పాపను పెంచుకోండి. గార్డియన్‌గా ఉంటూ అమ్మగా చలామణి అవుతూ అమ్మ అని పిలిపించుకోండి. మేము గత పది సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నాము. మేము వివాహం చేసుకోలేదు. అలాగే ఇరువురమూ అవివాహితులమే. ఇటీవల కాలంలో నా సహచరుడు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాడు. నా జీతం మొత్తం తనే తీసుకుని, దుర్వ్యసనాలకు ఖర్చు చేస్తున్నాడు. నేను డి.వి. కేస్ వేయవచ్చా? - రజిత, హైదరాబాద్ తప్పకుండా. వివాహం లేని బాంధవ్యాన్ని కూడా గృహహింస చట్టం వివాహ బాంధవ్యంగానే పరిగణిస్తుంది. అయితే మీరు భార్యాభర్తలుగా జీవించారని రుజువు చేయడానికి రే షన్ కార్డ్, ఓటర్ కార్డ్, సర్వీస్ రిజిస్టర్, బ్యాంక్ అకౌంట్స్ మొదలైన ఆధారాలను కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com -
వికలాంగులకు ఉపశమనంగా... డిజేబిలిటీస్ వెల్ఫేర్ బోర్డ్
లీగల్ కౌన్సెలింగ్ నేను డిగ్రీ చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి వినికిడి సమస్య ఉంది. పూర్తిగా చెవుడు లేకున్నా, సరిగ్గా వినిపించదు. అతి బిగ్గరగా మాట్లాడితేనే వినిపిస్తుంది. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అతికష్టం మీద చదివించారు. నా సమస్య తెలిసినా ఆర్థిక ఇబ్బందుల వల్ల డాక్టర్లను సంప్రదించలేదు. చిన్నా చితకా లోకల్ డాక్టర్ల దగ్గర (ఆర్ఎంపీ) మందులు తీసుకున్నా నా సమస్య తగ్గక పోగా, ఇపుడు ఇంకా ఎక్కువైంది. తెలిసినవారు వికలాంగులకు ఉద్యోగంలో రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. దానికి సంబంధించి చట్టం ఉందన్నారు. దయచేసి తెలియజేయగలరు. - గట్టయ్య, నిజామాబాద్ ఆర్థిక బాధలో ఉండీ మిమ్మల్ని చదివించినందుకు మీ తల్లిదండ్రులను అభినందించాలి. కానీ మీరు కనీసం సిటీలోని గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే బాగుండేది. మీకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్న మాట నిజమే. దానికి పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 1995 (పి.డబ్ల్యూ.డి) అంటారు. ఈ చట్టం ప్రకారం అంధులకు, దృష్టి లోపం ఉన్నవారికి, కుష్టువ్యాధి నుండి కోలుకుంటున్న వారికి, చెవిటి వారికి, శారీరక వైకల్యం ఉన్నవారికి, మెంటల్ రిటార్డేషన్ ఉన్నవారికి, మెంటల్ ఇల్నెస్ ఉన్నవారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. కాకుంటే మీకు ఎంత శాతం డిజేబిలిటీ ఉన్నదో దానికి సంబంధిత డాక్టర్లు నిర్ణయించాక 40 శాతం పైగా డిజేబిలిటీ ఉంటే మీకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ‘డిజేబిలిటీస్ వెల్ఫేర్ బోర్డ్’ వారిని సంప్రదించండి. మేడమ్, చట్టాలు కేవలం మహిళలకేనా? భార్యాబాధితుల మాటేంటి? మా వివాహమై మూడు సంవత్సరాలైంది. మా సంసారం మూణ్ణాళ్ల ముచ్చటలాగే ఉంది. అమ్మాయి సంప్రదాయబద్దంగా ఉందని, ఇంటి పనులు చక్కదిద్దుకుంటే చాలని పెళ్లి చేసుకున్నా. మీరు నమ్మండి; నమ్మకపోండి పైసా కట్నం తీసుకోలేదు. మా వివాహమయ్యే నాటికే మామగారు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. పెళ్లి ఖర్చులకు కూడా ఆశించకుండా వివాహం చేసుకున్నా. ఏం చెప్పమంటారు, చిన్న విషయాలకు కూడా నన్ను నానా తిట్లు తిట్టడం మొదలెట్టింది. పెళ్లికి మా వాళ్లు తెచ్చిన చీరలు నచ్చలేదని నోటికొచ్చినట్లు తిట్టింది. కొత్త కదా అని సర్దుకున్నాను. నా ఫ్రెండ్స్ కొత్తకాపురం చూడ్డానికి వస్తే నన్ను కల్చర్ లేదని, వట్టి ఏబ్రాసి గాడ్నని, భార్యను కనీసం హనీమూన్‌కైనా తీసుకెళ్లలేదని వాళ్లందరి ముందు నన్ను అవమానించింది. విమానాల్లో హనీమూన్లకు తీసుకెళ్లే స్థోమత నాకు లేదని చెబితే నన్నూ, నా వాళ్లనూ తీవ్రంగా దూషించింది. అప్పటి వరకూ సంపాదించిన సొమ్ము లెక్క చెప్పమని గొడవలు ప్రారంభించింది. వంట రాదంటే నేనే చేయడం ప్రారంభించా. చూసి నేర్చుకోమని బుజ్జగించా. నేను చేసిన వంట బాగాలేదని నా ముఖాన ప్లేట్ విసిరికొట్టింది. ఇవి చెప్పాలంటే పెద్ద వాల్యూమ్ అవుతుంది. అత్త మామగార్లను అడిగితే ఒకే అమ్మాయని గారంగా పెంచామని, చిన్నప్పటి నుంచి కాస్త దూకుడెక్కువని, సర్దుకు పొమ్మని చెప్పారు. చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేశాను. లాభం లేదు. మొన్న బస్టాండ్‌లో నా ఫిమేల్ కొలీగ్‌తో మాట్లాడుతుంటే పబ్లిగ్గా నాపై, ఆమెపై చేయి చేసుకుంది. నాకు మరణమే శరణ్యమా? - కృష్ణ, అమలాపురం మీ వేదన నాకు అర్థమైంది. ఒక విషయం... చట్టాలు కేవలం మహిళలకే కాదు, అవి అందరికీ వర్తిస్తాయి. కాకుంటే కొన్ని సాంఘిక దురాచారాల నుండి మహిళలను కాపాడాలని కొన్ని చట్టాలు వచ్చాయి. మీ విషయంలో అన్ని ప్రయత్నాలు ముగిశాయని అంటున్నారు. ఇక మీకు విడాకులే శరణ్యమని అనుకుంటున్నా, మీరు వర్ణించిన బాధలు ఒకవేళ నిజమైతే, అవన్నీ ‘క్రూర ప్రవర్తన’ కిందకు వస్తాయి. హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్ ప్రకారం అలాంటి క్రూర ప్రవర్తన ఎవరు ఎవరి పట్ల చూపినా, విడాకులకు సహేతుకమైన కారణమౌతుంది. న్యాయవాదిని సంప్రదించండి. నమస్తే ఆంటీ. నేనొక మైనర్ బాలుణ్ణి. నా వయస్సు 11 సం॥6వ తరగతి చదువుతున్నాను. మా తాతయ్య మీకు రాయమంటే రాస్తున్నాను. నేను మా నానమ్మ తాతయ్య దగ్గర చిన్నప్పటి నుంచి పెరుగుతున్నా. 3వ తరగతి నుండీ వీరి వద్దనే ఉంటున్నా. నన్ను మంచి స్కూల్లో చదివిస్తున్నారు. మా తాతగారు రిటైర్డ్ హెడ్మాస్టారు. మా అమ్మానాన్నలు నిత్యం పోట్లాడుకునేవారు. ఎప్పుడూ గొడవలే గొడవలు. అందువల్ల తాతగారు నన్ను తెచ్చుకున్నారు. మా అమ్మయితే నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఒకటే గొడవలు. మా ముందే అమ్మా నాన్నలు కొట్టుకునేవారు. ఇప్పుడేమో వాళ్లు విడాకులకు అప్లై చేశారని తెలిసింది. అమ్మ నా కస్టడీ కోసం కేసు వేసిందంట. నాన్న నన్ను కోర్టుకు రావాలని చెప్పారు. నాన్నేమో నేను తన దగ్గరే ఉండాలంటున్నాడు. నాకు ఇద్దరి దగ్గర ఉండటం ఇష్టం లేదు. నన్ను తాతయ్య, నాన్నమ్మ బాగా చూసుకుంటున్నారు. జడ్జిగారు నాతో మాట్లాడతారని తెలిసింది. భయంగా ఉంది. నా మనసులో మాట చెప్పవచ్చా? - రవిచంద్ర, హైదరాబాద్ భార్యాభర్తల మధ్య అగాథాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో నీ ఉత్తరం చదివాక ఇంకా బాగా అర్థమైది. పిల్లలకు అంటే మైనర్లకు తండ్రి సహజ సంరక్షకుడు, అతని తర్వాత తల్లి. లేదా పిల్లలు ఎవరి దగ్గర ఆనందంగా, పెరుగుతారో ఎవరి దగ్గర వారి భవిష్యత్ బాగుంటుందో వారికే కస్టడీ ఇస్తారు. కాకుంటే పిల్లల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇరువురి దగ్గర పిల్లలు ఉండలేరని భావిస్తే మూడోవారికి కస్టడీ ఇస్తారు. జడ్జిగారు మిమ్మల్ని తమ ఛాంబర్లోకి పిలిచి అడుగుతారు. అక్కడ వారికి నీ మనస్సులో ఏముందో నిర్భయంగా చెప్పవచ్చు. పిల్లల ఇష్టాలను, వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకొని, మీ తాతయ్య/నానమ్మల పరిస్థితులు విచారించి, వారి వద్ద నీకు అన్ని రకాల అభివృద్ధి ఉంటుందని కోర్టు వారు భావిస్తే తప్పకుండా నిన్ను వారి దగ్గరే ఉంచుతారు. మీ అమ్మా/ నాన్నలు అప్పుడప్పుడూ వచ్చిపోయే ఏర్పాటును ఆమోదిస్తారు. భయపడవద్దు బాబూ, తప్పకుండా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే నీవు హైస్కూల్ విద్యార్థివి. ఆలోచనా శక్తి ఉంటుంది. దానిని కోర్టు వారు గమనించి నిర్ణయం తీసుకుంటారు. - ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
పక్కింట్లో గృహహింస? బాధితుల తరఫున మీరు కేసు వేయవచ్చు!
లీగల్ కౌన్సెలింగ్ మా పక్కింట్లో ఒక జంట నివసిస్తున్నారు. వారికి దాదాపు ముప్ఫయ్యేళ్లు ఉండవచ్చు. అతను ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె గృహిణి. వారు ఆ ఇంట్లో అద్దెకు దిగి ఆరునెలలైంది. విషయమేమిటంటే ఆమె ఎప్పుడూ బయటకు రాదు. ఎవరితోనూ కలవదు. దాదాపు నెలరోజుల నుండి రాత్రివేళల్లో ఆమె ఏడ్పులు, కేకలు వినిపిస్తున్నాయి. అది భార్యాభర్తల విషయం ఏమో అని మేము మొదట్లో పట్టించుకోలేదు. ఆ తర్వాత ఉండబట్టలేక ఆమెను అడిగితే అతి కష్టం మీద చెప్పింది. తనను భర్త ప్రతిరోజూ హింసిస్తున్నాడనీ, బయటకు రానివ్వడం లేదనీ. ఎవరికైనా తెలియజేద్దామంటే కనీసం తన దగ్గర ఫోన్ కూడా లేదని, ఎలాగైనా తనను కాపాడమని అడిగింది. అయితే విషయం పోలీసుల వరకు వెళ్లనివ్వవద్దని అభ్యర్థించింది. మేము ఏం చేయమంటారు? సలహా ఇవ్వగలరు. - కనకలత, హైదరాబాద్ మీరు వెంటనే మీ పక్కింట్లో గృహ హింస జరుగుతోందని ఫోన్ ద్వారాగానీ, ఈ మెయిల్ ద్వారా గానీ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన రక్షణాధికారికి (ప్రొటెక్షన్ ఆఫీసర్)కు తెలియబరచండి. బాధితురాలు నిస్సహాయ స్థితిలో, బయటకు రాలేని సందర్భాల్లో, అత్యవసర పరిస్థితుల్లో బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వారు ఆమె తరఫున ఫిర్యాదు చేయవచ్చు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు తప్పకుండా స్పందిస్తారు. వారు వెంటనే ఆ ఇంటికి వచ్చి తమకు అందిన సమాచారం నిజమని రుజువైతే గృహహింస సంఘటన నివేదిక తయారు చేసి గృహహింస చట్టప్రకారం తగు ఆదేశాలు పొందడానికి ఎలాంటి జాప్యమూ లేకుండా తగిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకుంటారు. నేనొక సీనియర్ సిటిజన్‌ను. పైగా హార్ట్ పేషెంట్‌ను. వైద్యం నిమిత్తం శ్రీకాకుళం నుండి హైదరాబాద్‌కు రైలులో ప్రయాణించాను. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీ టికెట్ తీసుకున్నాను. మార్గంమధ్యలో రైల్వే అధికారులు చెకింగ్‌కు వచ్చి, వయస్సు ధృవీకరణ పత్రం చూపించమన్నారు. నేను నా హాస్పిటల్ రిపోర్టులు, హాస్పిటల్ ఐడీ చూపించాను. వారు అవి సరిపోవని ఛీత్కరిస్తూ నాకు పెనాల్టీ విధించారు. అంతేగాక డెబ్భయ్యేళ్ల వాడినని కూడా చూడకుండా నాపట్ల అగౌరవంగా ప్రవర్తించారు. నేనెంతో మానసిక వ్యధకు లోనయ్యాను. నేను నా పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్య తీసుకోవలసిందిగా రైల్వే ఉన్నతాధికారులను కోరవచ్చునా? అందుకు నేను ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వండి. - ఎం. పైడితల్లి, పాలకొండ అనాగరిక చర్యలు సేవల్లోని లోపాలే అని వినియోగదారుల రక్షణ చట్టం స్పష్టంగా చెప్పింది. మీరు టికెట్ కొని రైలులో ప్రయాణించారు కాబట్టి మీరు వినియోగదారుడే అవుతారు. సీనియర్ సిటిజన్స్ పట్ల గౌరవంగా మెలగడమనేది కనీస బాధ్యత. చాలామంది అలా చేయడం లేదు. ఇలాంటి విషయాలు జాతీయ కమిషన్ దృష్టి వరకు వెళ్లాయి. ఈ ప్రవర్తన మంచిది కాదని, దురుసు మరియు అగౌరవకరమైన ప్రవర్తనకు సంస్థలు బాధ్యత వహించవలసి ఉంటుందని అనేక సందర్భాలలో జాతీయ కమిసన్ సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించింది. వారి ప్రవర్తనలో మార్పు రావాలని సూచించింది. సీనియర్ సిటిజన్లకు సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంస్థలను బాధితులకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా చాలా సందర్భాల్లో, చాలా కేసుల్లో తీర్పులు ఇవ్వడం జరిగింది. వినియోగదారులందరి పట్లా సంస్థల ప్రవర్తనా సరళి సుహృద్భావంతో ఉండాలి మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల పట్ల. మీ వేదన తీరాలంటే వినియోగదారుల ఫోరంలో కేసు వేయండి. మీరు ఫైన్కట్టిన రశీదు, మీ రైల్ టికెట్ జతపరచి కేసు వేయండి. ఇందుకు నామమాత్రపు కోర్టు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మీకు తప్పక న్యాయం జరుగుతుంది. వయోవృద్ధులు కనుక మీ కేసు సత్వరం పరిష్కారమవుతుంది. మీకు నస్టపరిహారం అందుతుంది. నా పేరు రుక్సానా. మాకు వివాహమై 8 సంవత్సరాలయింది. ఆరేళ్లబాబు, ఏడేళ్ల పాప ఉన్నారు. నేను నా భర్తనుండి విడాకులు తీసుకున్నాను. నా పిల్లలకు సంరక్షకులెవ్వరు? పిల్లలు నా దగ్గర ఉండవచ్చునా? హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంరక్షణ విషయంలో తలిదండ్రులిద్దరూ సహజ సంరక్షకులే. అంటే నేచురల్ గార్డియన్స్. కానీ మహమ్మదీయ ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి మాత్రమే సహజ సంరక్షకుడు. పసిపిల్లల సంరక్షణ విషయంలో ప్రధాన బాధ్యత తండ్రిదే అయినప్పటికీ మగపిల్లలకు ఏడు సంవత్సరాల వయసు వరకు, ఆడపిల్లలకు యుక్తవయసు వరకు తల్లి అధీనంలో ఉండవచ్చు. ఈ కష్టడీని హిజానత్ అంటారు. విడాకులు పొందిన స్త్రీలకూ ఇది వర్తిస్తుంది. అయితే అబ్బాయికి ఏడు సంవత్సరాలు, అమ్మాయికి యుక్తవయసు రాకముందే మీరు మరలా వివాహం చేసుకుంటే పై అర్హతను మీరు కోల్పోతారు. అంటే పిల్లలు తండ్రి అధీనంలోకి వెళతారు. నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. ఇంతవరకూ మా మధ్య ఎటువంటి శారీరక బంధమూ ఏర్పడలేదు. ఆయన సంసారానికి పనికిరారనే విషయాన్ని కప్పిపుచ్చి నన్ను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మా ఆయన, తమ తప్పును ఒప్పుగా చేసుకునేందుకు మా అత్తమామలు నాపైన లేనిపోని నిందలు మోపుతున్నారు. ఈ వైవాహిక బంధాన్ని కొనసాగించటం నాకు ఇష్టం లేదు. దీని నుంచి బయట పడాలంటే ఏం చేయాలి? -పి. కృష్ణావతి, పెదవడ్లపూడి మీ వారు సంసారానికి పనికి రారంటున్నారు, పైగా మీపైన లేనిపోని నిందలు మోపుతూ మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా బాధిస్తున్నాడంటున్నారు. దీనికి తోడు మీ అత్తమామలు కూడా మిమ్మల్ని సూటిపోటి మాటలంటూ మిమ్మల్ని బాధపెడుతున్నారంటున్నారు కాబట్టి మీరు ఈ విషయాలను వివరిస్తూ, మీ వివాహాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతూ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయండి. మీరు చెప్పిన విషయాలను కోర్టులో నిరూపించగలిగితే కోర్టు మీ పెళ్లిని రద్దు చేస్తూ, మీకు విడాకులు మంజూరు చేస్తుంది. తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. కుక్క కాటుకి చెప్పుదెబ్బలా... కేస్ స్టడీ సుప్రియ, విజయ్‌లు భార్యాభర్తలు. వారి వివాహమై ఏడేళ్లయింది. ఒక పాప కూడా. అయితే ఇటీవల విజయ్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. చీటికి మాటికీ సుప్రియను మాటలతో, చేతలతో హింసిస్తున్నాడు. ఇంటికి ఆలస్యంగా రావడం, అర్ధరాత్రిళ్లు తగాదా పడటం, ఇంట్లోనుండి తక్షణమే వెళ్లిపొమ్మని ఆర్డరేయడం ఎక్కువైంది. సుప్రియ మౌనంగా భరించింది. అసలు కారణం కనుక్కునే ప్రయత్నం చేసింది కానీ వృథాప్రయాసే అయింది. ఒకరోజు అర్ధరాత్రప్పుడు బాగా తాగి వచ్చి ఆమెనూ, పాపనూ ఇంటినుండి గెంటివేశాడు విజయ్. ఎక్కడికెళ్లాలో పాలుపోలేదు సుప్రియకు. అమ్మానాన్నా వృద్ధులు. వారి మీద తమ బరువు బాధ్యతలు వేయడం ఇష్టంలేదు. దాంతో ఒక స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుని భర్త మీద గృహహింస కేసు పెట్టింది. కొంతకాలంపాటు తాను తలదాచుకోవడానికి అత్యవసరంగా ఒక గూడు కావాలి కాబట్టి భర్తతో కలిసి ఉన్న ఇంటిలో నివసించేలాగా ఆర్డర్ కావాలని కోర్టువారిని అభ్యర్థించింది. ఆ ఇల్లు ఎలాగూ భర్తదే. అతని పేరు మీదే ఉంది. కేసు దాఖలై విజయ్‌కు నోటీసు వెళ్లింది. మొదటి వాయిదా నాటికే ఆ ఇంటిని తల్లి పేరుమీద బదిలీ చేసి తనకసలు ఇల్లే లేదని, అది తల్లి ఇల్లనీ వాదించాడు విజయ్. భార్యాభర్తల మధ్య వివాదం మొదలైన తర్వాత అదీ కేస్ వేసిన తర్వాత దురుద్దేశ్యపూర్వకంగా ఆ ఇంటిని విజయ్ తల్లి పేరున బదలీ చేశాడనీ కనుక సుప్రియకు, పాపకూ నివాస హక్కులుంటాయనీ కోర్టువారు హెచ్చరించారు. - ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
మా వివాహమై పది సంవత్సరాలు ...
లీగల్ కౌన్సెలింగ్ మా వివాహమై పది సంవత్సరాలు అయింది. సంతానం లేదు. అన్ని ప్రయత్నాలు చేశాం. ‘సరోగసి’ మాకు ఇష్టం లేదు. మాకు బాగా తెలిసిన కుటుంబం వారు వాళ్ల పాపను మాకు దత్తత ఇస్తామంటున్నారు. దయచేసి వివరాలు తెలియ చేస్తారా? అంటే ఎలా తీసుకోవాలి, ఏమైనా కండిషన్స్ ఉంటాయా తెలియజేయగలరు. - ఒక సోదరి హిందూ అడాప్షన్ అండ్ మెయిన్టెనెన్స్ యాక్ట్ 1956ను అనుసరించి దత్తత తీసుకోవాలి. దత్తత స్వీకారం గురించి దానికి సంబంధించిన షరతులు, అర్హతల గురించి ఆ చట్టంలో చెప్పబడింది. ఏ వ్యక్తి అయినా అంటే స్త్రీ అయినా, పురుషుడైనా, వివాహితులైనా, అవివాహితులైనా, వితంతువులయినా, విడాకులు పొందిన వారైనా దత్తత తీసుకోవచ్చును కానీ వారు 1) మేజర్ అయి ఉండాలి 2) మానసిక స్వస్థత కలిగి ఉండాలి 3) అబ్బాయిని దత్తత చేసుకోవాలంటే వారికి అంతకుముందే జన్మించిన అబ్బాయి ఉండకూడదు 4) అమ్మాయిని దత్తత చేసుకోవాలంటే అంతకుముందే జన్మించిన అమ్మాయి ఉండకూడదు. ఇక ఎవరైతే వారి పిల్లలను ఇతరులకు దత్తత ఇవ్వబోతున్నారో వారికి కొన్ని షరతులు ఉన్నాయి. 1) తల్లి అంగీకారంతోనే తండ్రి దత్తత ఇవ్వాలి 2) తండ్రి చనిపోయినా, హిందూ మతాన్ని వదలివేసినా తల్లి దత్తత ఇవ్వవచ్చును. దత్తత చేసుకోబోయే బాలుడు/బాలిక 1) హిందువై ఉండాలి 2) 15 సం॥లోపు వయస్సు ఉండాలి 3) అవివాహితులై ఉండాలి. ఏవైనా కులాచారాలు, సంప్రదాయాలు అనుమతించితే 15 సం॥వయస్సు దాటిన వారిని, వివాహితులను కూడా దత్తత చేసుకోవచ్చును. కొందరు దత్తత సమయంలో ‘హోమం’లాంటి వైదిక కార్యక్రమాలు చేసుకుంటారు. చట్టంలో దాని గురించి కంపల్సరీ లేదు. అలాగే ‘దత్తత స్వీకార పత్రం’ రాయించుకొని రిజిస్టర్ చేయించుకుంటే మంచిది. ముందు జాగ్రత్త చర్యగా ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం. అమ్మాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తండ్రి ఆమె కంటే 21 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి. అబ్బాయిని దత్తత చేసుకుంటే దత్తత తీసుకునే తల్లి అతనికంటే 21 సంవత్సరాలు పెద్దదై ఉండాలి. ఒక స్నేహితురాలు ఎంతో అవసరమని ప్రాధేయపడితే లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాను. తను దాని నిమిత్తమై ఒక పోస్ట్ డేటెడ్ చెక్ రాసి ఇచ్చింది, అప్పు తీసుకుంటున్నట్లు పేపర్ రాసి ఇచ్చింది. నెల రోజుల తర్వాత బ్యాంక్‌లో వేసి, నగదు తీసుకోమని చెప్పింది. నేను నెల తర్వాత చెక్ బ్యాంక్‌లో వేశాను. చెక్ బౌన్స్ అయిందని, వాపస్ వచ్చింది. బ్యాంక్ వారిని అడిగితే నా ఫ్రెండ్ అకౌంట్లో డబ్బు లేదని, అందువల్ల చెక్ బౌన్స్ అయిందని చెబుతూ ఒక ‘స్లిప్’ లాంటిది ఇచ్చారు. దానిపై ‘ఇన్ సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్’ అని రాసి ఉంది. నాకు కంగారుగా ఉంది. ఫ్రెండ్‌ని నమ్మి నా భర్తకు తెలియకుండా పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చాను. ఆమెను అడిగితే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోంది. నా డబ్బు నాకు తిరిగి వచ్చేలా లేవు. దయచేసి ఏం చేయాలో చెప్పండి. - జానకి, హైదరాబాద్ ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మేట్లు లేదు. చెక్‌ల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. చెక్‌లకు సంబంధించి చాలామంది మోసపోతున్నారు. మీ విషయంలో కోర్టును ఆశ్రయించక తప్పదు. చెక్స్ బౌన్స్ అయినపుడు అంటే డిజానర్ అయినపుడు నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881ను అనుసరించి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు వేయాలి. నేరం నిరూపణ అయితే జైలు శిక్ష, చెక్‌లో రాసిన మొత్తానికి రెట్టింపు మొత్తం ఇవ్వమని ఆర్డర్. దీనితోపాటు జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. కాకుంటే చెక్ డిజానర్ అయిన 30 రోజుల్లోగా చెక్ ఇచ్చిన వారికి నోటీస్ పంపాలి. నోటీసుకి స్పందించి డబ్బు వాపస్ ఇస్తే సరేసరి. లేకుంటే నోటీస్ చేరిన 15 రోజుల తర్వాత మీరు కోర్టులో కేస్ ఫైల్ చేసుకోవచ్చు. మీకు మీ ఫ్రెండ్ ఇచ్చిన చెక్ ఏ బ్యాంక్‌లో డిజానర్ అయిందో అంటే మీరు దాన్ని ఏ బ్యాంక్‌లో వేసుకున్నారో, ఆ బ్యాంక్ పరిధిలోని కోర్టులో కేసు వేసుకోవాలి. మీరు మీ ఫ్రెండ్ నుండి పేపర్ రాయించుకొని మంచి పని చేశారు. అయితే అప్పు ఎందుకిచ్చారో నిరూపించుకోవాలి. ఆ బాధ్యత ఫిర్యాదుదారులదే. మా అబ్బాయి చిన్న దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికాడు. అతని వయస్సు 14 సం॥పోలీసులు అతడిని జువినైల్ హోంకు తరలించారు. ఇటీవల కాలంలో మైనర్లకు కూడా కఠినమైన శిక్షలు ఉండాలని, జైలుకు పంపాలని చట్టం వచ్చిందని విన్నాను. నాకు భయంగా ఉంది. మా అబ్బాయిని జైల్లో వేస్తారా? - ఒక సోదరి భయపడకండి. మీ అబ్బాయి మైనరు. అంటే 18 సం॥లోపు వయస్సు వాడు. దొంగతనం నేరం. అయితే ఈ నేరంలో మైనర్లకు శిక్ష వేయరు. మొదట కేసు విచారణలో ఉన్నపుడు మైనర్లను అబ్జర్వేషన్ హోంలో పెడతారు. నేరం చిన్న నేరమైతే మందలించి వదిలేస్తారు. ఒకవేళ కొంచెం పెద్దదైతే తల్లిదండ్రుల పూచీకత్తుతో వదిలి వేస్తారు. ఇంకా కొంచెం పెద్ద నేరమై అది నిరూపించబడితే వారి మైనారిటీ తీరే వరకు ‘జువినైల్ హోం’లో పెడతారు. అది జైలు కాదు. మైనర్ పిల్లలకు సంబంధించి ‘జువినైల్ జస్టిస్’ (కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్) 2000లను అనుసరిస్తారు. ఇక 2015 సం॥జువినైల్ జస్టిస్ చట్టానికి సవరణ తెచ్చారు. హత్య, అత్యాచారం మొదలైన పెద్ద నేరాలు చేసిన 16 నుండి 18 సం॥వయస్సుగల పిల్లలను నేరం రుజువైతే పెద్దల కారాగారానికి పంపాలని సవరణ చేశారు. మీ అబ్బాయి చేసిన నేరం చిన్నది. అతని వయస్సు కూడా 14 సం॥కనుక భయపడకండి. కానీ అతనిని మంచి మార్గంలో పెట్టే బాధ్యత మీదే! ఆ పిటిషన్ ద్వారా కాపురాన్ని నిలబెట్టుకుంది! కేస్ స్టడీ నళిది, సుధాకర్లది ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకున్నారు. ఇరువైపులవారూ ఆగ్రహించి, వీరి పెళ్లికి హాజరు కాలేదు. ఇద్దరూ ఆర్థికంగా స్థిరపడిన వారైనందున మంచి ఇల్లు తీసుకొని కాపురం పెట్టారు. ఒక సంవత్సరం బాగా గడిచింది. తర్వాత సుధాకర్ పేరెంట్స్ అతడితో మాటలు సాగించారు. తమ ఇంటికి వస్తూ పోతుండేలాగా రిలేషన్ మొదలుపెట్టారు. ఈ విషయాలు నళినికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సుధాకర్‌ను కూడా నళినికి చెప్పనీయకుండా కట్టడి చేసి బ్రెయిన్ వాష్ చేశారు. ఫలితంగా సుధాకర్ నళినిని సం॥నుండి వదిలివేసి వేరే ఉంటున్నాడు. నళిని ఎంతగానో ప్రయత్నించింది సుధాకర్లోని మార్పు తెలుసుకోవడానికి. కానీ కుంటిసాకులు తప్ప, అసలు విషయం చెప్పలేదు. చేసేది లేక నళిని ‘రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్’ పిటిషన్ వేసుకుంది (కాపురాన్ని నిలుపుకోవాలని). సుధాకర్ కోర్టుకు హాజరై తనకు అప్పటికే ‘ఎక్స్‌పార్టీ’ డైవర్స్ వచ్చిందని చెప్పాడు. షాక్ తిన్న నళిని తనకు నోటీసు రాలేదని చెప్పుకొని, అతను పంపిన కోర్టు నోటీస్‌లు సెక్షన్లో విచారిస్తే ఆమె సంతకం చేసినట్లుగా ఉన్నది. కానీ ఆ సంతకం ఆమెది కాదు. సుధాకర్ ఫోర్జరీ చేసి, మేనేజ్ చేశాడు. అతనిపై ఫోర్జరీ, ఛీటింగ్ కేసు పెట్టి విడాకుల ఆర్డర్‌ను ‘సెట్ఎసైడ్’ చేయమని పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత తెలిసింది కోట్ల కట్నంతో సుధాకర్ రెండో పెళ్లికి సిద్ధపడ్డాడని. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
నా భర్తకు ఇష్టం లేకుండా.....
లీగల్ కౌన్సెలింగ్ జైపూర్ చుట్టూ తిప్పుతున్నాడు... ఏం చేయాలి... నాకు, నా భార్యకు చెప్పుకోదగ్గ పెద్ద గొడవలేమీ లేవు గానీ... తరచూ పుట్టింటికి వెళ్లిపోతుంటుంది. నేను ఎన్నిసార్లు వారించినా, హెచ్చరించినా వినిపించుకోలేదు. పెపైచ్చూ ఆమె ఎన్నాళ్లు అక్కడ ఉండాలనుకుంటే అన్నాళ్లు అక్కడ ఉండి సావకాశంగా తిరిగి వస్తుంటుంది. దీనివల్ల పిల్లల చదువులు పాడవుతున్నాయి. నాకు చెప్పలేనంత చిరాగ్గా, కోపంగా ఉంటోంది. నాకు ఈ కారణం వల్ల విడాకులు మంజూరవుతాయా? - సూర్యకుమార్, విజయవాడ మీ ప్రశ్నలో డిసర్షన్ గురించి ప్రస్తావించారు. హిందూ వివాహచట్టం 13 (1)లో దీని గురించి కూలంకషంగా వివరించడం జరిగింది. మీ ఇద్దరి మధ్య ఉన్నవి సరిదిద్దుకోలేనంత పెద్ద సమస్యలు, పొరబాట్లు కాదని, విడాకులకు అప్లై చేయాల్సినంత పెద్ద గొడవలు లేవని మీరు చెబుతున్న దాన్నిబట్టి తెలుస్తోంది. 13(1) ప్రకారం విడాకులకు అప్లై చేసేనాటికి కంటిన్యువస్‌గా రెండు సంవత్సరాలు భర్తను భార్యగానీ, భార్యను భర్తగాని విడిచి విడిగా జీవిస్తుంటే దాన్ని డిసర్షన్గా పరిగణిస్తూ డైవోర్సు అడగవచ్చు. కానీ మీ కేసులో ఆమె వస్తూపోతూ ఉంది. మీతో సంసారం చేస్తూ మీ మీ కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉంటోంది. కాబట్టి మీరు విడాకులు అడగటానికి సరైన కారణం లేదు. మీరు మీ అత్తమామలను పిలిపించి, ఆమెను కూర్చోబెట్టి మీకు నచ్చని విషయాలు ప్రస్తావించి ఆమె ప్రవర్తనను మార్చుకొమ్మని చెప్పండి. చిన్న చిన్న విషయాలకు విడాకుల కోసం కోర్టులకెక్కి సంసారాన్ని పాడుచేసుకోవద్దు. మంచిగా మాట్లాడుకుని సయోధ్యతో సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా జీవించండి. నాకు పెళ్లయి పదేళ్లు అయ్యింది. నా భర్తకు ఇష్టం లేకుండా ఆయన తల్లిదండ్రులు నన్ను ఆయనకిచ్చి వివాహం చేశారు. నాకు పెళ్లిలో పెట్టిన డబ్బు, నగలు, వెండి మొదలైన విలువైన వస్తువులు నాకు తెలియకుండా తీసుకుని నా భర్త ఎనిమిదేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇప్పటివరకు తిరిగిరాలేదు. నిజానికి మా అత్తమామలు ఎంతో మంచివాళ్లు. ఒక్కటే సంతానం కావడం వల్ల అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కానరాకపోవడంతో వారూ తల్లడిల్లిపోయారు. ఇప్పుడు విసిగిపోయి ఎదురుచూడటం వృథా అని అర్థం చేసుకున్నాం. విలువలేని ఈ బంధానికి ముగింపు ఇచ్చి నా తల్లిదండ్రులు, అత్తమామ నిశ్చయించారు. నేనెలా ప్రొసీడ్ అవ్వాలి? - రాణీరెడ్డి, నిజామాబాద్ మీ జీవితంలో మీరు చిన్నవయసులోనే దురదృష్టవశాత్తు చే దు అనుభవాలను చవిచూశారు. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నారు. ‘‘నాట్ హర్డ్ ఫర్ సెవన్ ఇయర్స్’’ అనేది విడాకులకు గ్రౌండ్‌గా చూపిస్తూ, మీకు... ఆయనకు మధ్య సంసారం జరగలేదని, పెళ్లైన ఎన్ని రోజులకు మిమ్మల్ని విడిచి వెళ్లిపోయారో కూలంకషంగా వివరిస్తూ మీరు మీ లాయర్ ద్వారా విడాకులకు పిటీషన్ ఫైల్ చేయండి. కొద్దికాలంలోనే విడాకులు గ్రాంట్ అయ్యక, మీరు పునర్వివాహం చేసుకుని ఆనందంగా జీవించండి. ఇదొక విచిత్రమైన సమస్య. నా కూతుర్ని మా బంధువులకు దత్తతకు ఇచ్చాను. మాది ఆర్థికంగా ఉన్నత కుటుంబం కాదనీ... మా బంధువులు కోటీశ్వరులని, పిల్లలు లేక బాధపడుతున్నారని మా బంధుమిత్రుల ప్రోద్బలంతో వారి మాటలు విని నా కూతుర్ని పెంపకానికి ఇచ్చాను. నా కూతురు ఇంకా మైనరు. వారు లీగల్‌గా అడాప్షన్ తీసుకుని రెండేళ్లు పెంచుకున్నాక వారికి సంతానం కలగడం వల్ల నా కూతుర్ని తెచ్చి మళ్లీ నా దగ్గరే వదిలివెళ్లారు. అప్పుడే అనుకోని పరిస్థితుల్లో నా భర్త చనిపోయారు. నా ముగ్గురి పిల్లలతో పాటు నేను పెంపకానికి ఇచ్చిన ఈ పాప బాధ్యత కూడా నామీదే పడింది. నేనెక్కువ చదువుకోలేదు. ఉద్యోగం, ఆస్తీపాస్తీ లేవు. నా ముగ్గురు పిల్లల్ని చూసుకోవడమే కష్టమంటే ఈ పాప బాధ్యత కూడా ఇప్పుడు నాపైనే ఉంది. లీగల్‌గా నేనేమీ చేయలేనా? నేను దత్తత ఇచ్చిన కూతురికి, ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల మీద ఏమీ హక్కులు లేవా? - శాంతకుమారి, విజయవాడ మీ బాధ అర్థమైంది. లీగల్‌గా అడాప్షన్ తీసుకుని ముచ్చట తీరేదాకా ఉంచుకుని, తీరా వారికి సంతానం కలిగేసరికి పాపను తిరిగి మీ ఇంట్లో దింపి వెళ్లడం ఏమీ బాగోలేదు. అడాప్టెడ్ పేరెంట్స్ పాపను అలా వదిలివేయలేరు. వారికి ఆ హక్కు లేదు. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 20 కింద మీరు మీ పాపకోసం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయవచ్చు. ఆ పాపకు తప్పక మెయింటెనెన్స్ వచ్చి తీరుతుంది. లీగల్‌గా అడాప్షన్ తీసుకున్నారు కాబట్టి ఆ పాపకు మెయింటెనెన్స్ మాత్రమే గాక, పెరిగి పెద్దయ్యే వరకు చదువుల ఖర్చులు పెంపకానికి తీసుకున్న తల్లిదండ్రులే చూసుకోవాల్సి ఉంటుంది. ఆ పాప పెళ్లి ఖర్చులు కూడా వాళ్లే భరించాల్సి ఉంటుంది. పెంపకానికి పోయిన పాపకు అందరు న్యాచురల్ డాటర్స్‌కు ఉండే హక్కులే ఉంటాయి. మీరు మెయింటెనెన్స్ కేసు వేసి ఆ కేసు డిస్పోజ్ అయ్యేవరకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వమని ఒక ఐ.ఏ. వేసుకుంటే... కేసు తేలేవరకు జడ్జీగారు ఇంటరిమ్ మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు. పాప చదువుసంధ్యలు, మెయింటెనెన్స్‌కు ఇబ్బంది ఉండదు. తల్లిదండ్రుల ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఈ మెయింటెనెన్స్ డిసైడ్ చేస్తారు. వారు ఎలాగూ కలిగిన వారంటున్నారు. కాబట్టి పాపకు మంచి మెయింటెనెన్స్ వస్తుంది. దిగులు పడకండి. నా భర్త కారణం లేకుండా నాకు వ్యతిరేకంగా ఉన్నవీ లేనివీ కల్పించి నన్ను పుట్టింటికి తరిమేసి ఇప్పుడు జైపూర్ కోర్టులో (ఆయన ఉద్యోగం చేస్తున్న ప్రదేశం) డైవోర్సు కేసు ఫైల్ చేశాడు. నేను ప్రతిసారీ జైపూర్ కోర్టుకు అటెండ్ అవ్వలేను. పైగా భాషా సమస్య. నా కాపురాన్ని నిలబెట్టుకోడానికి నేనేం చేయాలి? నాకు విడాకులు వద్దు. నా పిల్లల కోసమైనా నేను నా భర్తతో కలిసి ఉండాల్సిన పరిస్థితిన నాది. నేనేం చేయాలి? - పి. లత, ఆదిలాబాద్ మీరు వెంటనే మీరుంటున్న ప్రదేశంలోని కోర్టుకు మీ కేసును ట్రాన్స్ఫర్ చేయమని కోరుతూ సుప్రీం కోర్టులో ట్రాన్స్ఫర్ పిటీషన్ దాఖలు చేయండి. మీ అడ్వకేటు ద్వారా మీరిప్పుడు నాకు చెప్పిన కారణాలన్నీ వివరిస్తూ ట్రాన్స్ఫర్ పిటీషన్ అప్లై చేయండి. మీ పిటీషన్ తప్పక ఆమోదం పొంది, మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశానికి కేసు ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఆ కోర్టులో మీ అడ్వకేటు ద్వారా కౌంటర్ దాఖలు చేస్తూ విడాకుల పిటిషన్ డిస్మిస్ చేయమని కోర్టువారిని కోరండి. -
వీరికీ కొన్ని హక్కులున్నాయి
ఆ వాదనలో నిజం లేదు... లీగల్ కౌన్సెలింగ్ మా వివాహమై ఆరు సంవత్సరాలైంది. మా దాంపత్య జీవితంలో ఏ లోటూ లేదు. పిల్లలు కలిగినప్పుడే కలుగుతారులే మనకింకా వయసైపోలేదని మా వారి వాదన. ఇదిలా వుండగా నాకో షాకింగ్ విషయం తెలిసింది. మా వారు నాకు చెప్పకుండా ఏనాడో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారని. నాకాయన ముఖం చూడాలన్నా అసహ్యం వేస్తోంది. అతనితో కలసి వుండలేను. ఏం చేయాలి? - ఉమ, వైజాగ్ హిందూ వివాహచట్టం సెక్షన్ 13ను అనుసరించి ‘క్రూరప్రవర్తన’ విడాకులు తీసుకోడానికి ఒక ఆధారం. అది శారీరకం కావచ్చు. మానసికం కావచ్చు. వైద్యకారణాలు లేకుండా భర్త లేదా భార్య రహస్యంగా పిల్లలు కలుగకుండా ఆపరేషన్ చేయించుకుంటే అది క్రూరత్వమే అవుతుంది. భార్యాభర్తలలో ఒకరికి తెలియకుండా, మరొకరి అంగీకారం లేకుండా ఇలా చేయడం క్రూరత్వమేనని, ఆ కారణం మీద విడాకులు ఇవ్వవచ్చునని సుప్రీంకోర్టు అనేక కేసులలో రూలింగ్ ఇచ్చింది. మీరు అన్ని వివరాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. నా భర్తపై 498-ఎ కేస్ వేశాను. అది కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ లోగా మా ఇరుకుటుంబాల వారు మాట్లాడుకొని, కేస్ కాంప్రమైజ్ అవ్వాలని, దానికి గాను అతను 15 లక్షలు శాశ్వతమనోవర్తి ఇచ్చేలా, ఇరువురూ క న్సెంట్ విడాకులు తీసుకునేలా నిర్ణయించారు. నా సమస్యేమిటంటే విడాకుల పిటిషన్ దాఖలు చేసే నాడు 10 లక్షలు, విడాకులు మంజూరు చేసే నాడు మిగతా 5 లక్షలు ఇస్తామని అంటున్నారు. నాకేమో మోసపోతానని భయంగా ఉంది. ఏం చేయమంటారు? - సౌమ్య, విజయవాడ మీరుచెప్పిన విషయాలు పిటిషన్లో రాసుకుంటే భయపడే అవసరం లేదు. మొదటి విడత డబ్బులు ఎలాగూ ఇచ్చేస్తారు. రెండో మొత్తం మీకు ముట్టిందని జడ్జిగారు నిర్ధారించుకున్న తర్వాతనే మీకు విడాకులు వస్తాయి. మీకు మొత్తం సొమ్ము ముట్టకుండా విడాకులు రావు. ఒక వేళ మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎటూ క్రిమినల్ కేసు ఉండనే ఉంది. ముందు విడాకుల కేసు, తర్వాత క్రిమినల్ కేసు ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు క్రిమినల్ కేస్ కాంప్రమైజ్ అవ్వవచ్చు. మేము ఒక ట్రైబల్ తండాకు చెందిన వాళ్లము. మాకు ఒక పాప. కొన్ని కారణాల వలన మేము ఇద్దరం మా పెద్దల కులపంచాయతీ ద్వారా విడాకులు తీసుకున్నాము. తర్వాత నేను రెండో పెళ్లి చేసుకున్నాను. నేను మా తండాలోనే అంగన్వాడీ వర్కర్‌గా పనిచేస్తున్నాను. పాపకూడా నాదగ్గరే ఉంది. నాభర్త బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒక రోజు నా మాజీ భర్త పాపను చూసివెళ్తానని అడిగితే అంగన్వాడీ స్కూల్ దగ్గరకురమ్మని చెప్పి పాపను చూపించి పంపించాను. అది తెలిసిన నా భర్త నన్ను అనుమానించి, చిత్రహింసలు పెట్టి అసలు మా వివాహం చెల్లదని, రద్దు చేయమని కోర్టును ఆశ్రయించాడు. నేను అసలు మొదటి భర్త నుండి విడాకుల తీసుకోలేదని అతని వాదన. నేను అతనికి అన్నీ చెప్పే వివాహం చేసుకున్నాను. నాకు సలహా ఇవ్వండి. - మంగ్లీ, ఆదిలాబాద్ అతని వాదనలో నిజం లేదు. ఎందుకంటే మీరు మీ మొదటి భర్త నుండి తీసుకున్నవి ‘కస్టమరీ డైవర్స్’ అంటే కొన్ని ‘గుర్తించబడిన కులాలకు, తెగలకు’ చెందిన వారి ఆచారాలను సంప్రదాయాలను, తరతరాలుగా వస్తున్న పద్ధతులను అనుసరించి ‘కులపెద్దల’ సమక్షంలో విడాకులు తీసుకునే కట్టుబాటు ఉంటుంది. వీరి వివాహ పద్ధతులు, సంప్రదాయాలు, ఆచారాలు భిన్నంగా ఉంటాయి. సెక్షన్ 29(2) హిందూ వివాహచట్టం కుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం వివాహాన్ని రద్దు చేసుకోడానికి వున్న హక్కును మార్పు చేయదు. ఆచారాల ప్రకారం విడాకులు తీసుకునే పద్ధతి అమలులో వుంటే ఈ చట్టం దానిని రక్షిస్తుంది అని అర్ధం. కనుక మీ వారి పిటిషన్‌ను అడ్డుకోవచ్చు. మీవర్షన్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోయ పద్మజ వర్సెస్ లోయ వీర వెంకట గోవిందరాజులు కేస్‌లో తీర్పునిచ్చింది. వీరికీ కొన్ని హక్కులున్నాయి వారు ఒక రకంగా విధివంచితులు. వారంతా హెచ్ఐవీ బాధితులు. కేవలం ప్రభుత్వాస్పత్రి వారిచ్చే మందులపైనే ఆధారపడుతున్నవారు. నెలనెలా ఆస్పత్రికి పోవాలి. వారి ఐడెంటిటీలు చూపాలి. ఎవరైనా గమనిస్తారేమోనని ముఖాలకు స్కార్ఫ్ కట్టుకోని ఆస్పత్రికి వెళ్ళి మందులు తెచ్చుకోవాలి. పరీక్షలు చేయించుకోవాలి. ఇక హాస్పిటల్ సిబ్బంది నుంచి వైద్య సిబ్బంది వరకూ అందరూ వారి పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. చులకనగా చూస్తున్నారు. ఎంత రోగగ్రస్తులైనా వారికీ ఆత్మగౌరవం వుంటుంది. అసలు తమకు గల హక్కులూ, రక్షణల గురించి తెలుసుకోవాలని ఒక స్వచ్ఛంద సేవాసంస్థను సంప్రదించారు. హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కోర్టు తీర్పు ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం... చట్టంముందు అందరూ సమానులేనన్న హక్కు. స్వేచ్ఛగా రక్షణ వుండే హక్కు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించే హక్కు ఎయిడ్స్ వున్న వ్వక్తులను వివాహం చేసుకునే హక్కు గుప్తత హక్కు అమానవీయ హింసల నుండి రక్షణ పొందే హక్కు ఉద్యోగ హక్కు నష్టపరిహారం పొందే హక్కు వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకారం ప్రతి పేషంట్‌కి నెలకు 1000/- ఆర్థికసాయం పొందవచ్చు. వారి హక్కులకు భంగం వాటిల్లితే హైకోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. కనుక హాస్పిటల్ వారి అమానవీయ ప్రవర్తన గురించి కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలని నిర్ణయించుకున్నారు. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్