జాతీయ పతాకాన్ని అవమానిస్తే ఎవరికైనా శిక్ష తప్పదు
లీగల్ కౌన్సెలింగ్
అమ్మా, మేము రిటైర్డ్ ఉద్యోగస్తులం. మేము ఒక స్వచ్ఛంద సేవాసంస్థను ఏర్పాటు చేసుకున్నాము. సమాజసేవ దేశభక్తి మా సంస్థ ముఖ్యోద్దేశాలు. కొన్ని సందర్భాల్లో ‘జాతీయ పతాకాన్ని’ అవమానిస్తున్నారేమో అని బాధపడుతున్నాము. అలాంటప్పుడు ఏదైనా చట్టం ఉందా? దయచేసి తెలుపగలరు. - కాట్రగడ్డ వెంకటప్పయ్య, గుంటూరు
సార్, మీ దేశభక్తికి, జిజ్ఞాసకు అభినందనలు. మనం తరచుగా పేపర్లలో చదువుతున్నాము. జెండా తలక్రిందులుగా వేలాడదీశారని, జెండా నేలను తాకిందనీ చింపివేయబడిందనీ... ఇలా రకరకాల వార్తలు. ఇలాంటి చర్యలు జరిగినప్పుడు బాధ్యత గల పౌరులెవరైనా స్పందించవచ్చు. దీనిని సంబంధించి ‘జాతీయ పతాక గౌరవ పరిపరక్షణ చట్టం 1971’ ను అనుసరించి బహిరంగ ప్రదేశాల్లోగానీ, ప్రజలు వీక్షించటానికి అవకాశముండే ప్రదేశాల్లో కానీ, మరేదైనా ప్రదేశాల్లో కానీ జాతీయ పతాకాన్ని లేదా భారత రాజ్యాంగాన్ని తగులబెట్టిగా, చింపివేసినా, ధ్వంసం చేసినా, మాటల ద్వారా, చేతల ద్వారా, ఏవైనా ఇతర హావభావాల ద్వారా కించపరిచినా కానీ నేరం. అటువంటి చర్యలు పవిత్రమైన జాతీయ పతాకాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరచినట్లుగా పరిగణింపబడి శిక్షార్హమైన నేరాలవుతాయి.
ఈ చట్టాన్ని అనుసరించి... ప్రభుత్వం నిర్దేశించిన రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేయరాదు జాతీయ పతాకంపై ఏవిధమైన రాతలు రాయరాదు, చెక్కరాదు బుద్ధిపూర్వకంగా జాతీయ పతాకం నేలను తాకేలా చేయరాదు, నీట ముంచరాదు జాతీయ పతాకాన్ని బుద్ధిపూర్వకంగానే కాదు, పొరపాటుగా తలకిందులుగా ఎగుర వేయరాదు జాతీయ పతాకాన్ని అవమానించే లేదా అవహేళన చేసే వ్యాఖ్యలు చేసిన వారు కూడా శిక్షార్హులే జాతీయ పతాకాన్ని అవమాన పరిచినట్లైతే మూడు సంవత్సరాలు జైలు శిక్ష, జాతీయ గీతాన్ని పాడకుండా నిరోధించినా, గలాభా చేసినా కూడా మూడేళ్ల వరకు జైలు, జరిమానా లేక రెండూ విధింపబడతాయి.
ఒకవేళ జాతీయ పతాకం పాడయినట్లయితే దానిని చాటుగా తగులబెట్టాలి. అంతేకానీ, దానిని ఎగుర వేయడం కానీ, ఇతర విధాలుగా కానీ ఉపయోగించడం కూడా నేరమే. ఈ నియమాలకు, నిబంధనలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు కూడా అతీతులు కారు. వారికి కూడా శిక్షతప్పదు.
మా అమ్మగారు ఇటీవలే మరణించారు. ఆమె పేరు మీద పది ఎకరాల పొలం ఉంది. మా తండ్రిగారు జీవించి ఉన్నారు. నాకు అక్క, తమ్ముడు ఉన్నారు. నాకూ, అక్కకీ వివాహం అయింది. తమ్ముడు అవివాహితుడు. మా అమ్మగారు వీలునామా రాయలేదు. ఎవరికీ ఆస్తి పంపకాలు చేయలేదు. ఎవరికీ దాన పత్రాలు రాయలేదు. ఆ ఆస్తిని మేమెలా పంచుకోవాలి? అందరికీ సమాన వాటాలు వస్తాయా? తెలుపగలరు. -బి.ల క్ష్మి, చిలువూరు
మరణించిన మీ తల్లిగారు వీలునామా రాయలేదు. ఆమె ఆస్తి ఇద్దరు కుమార్తెలకూ, కొడుకుకూ, మీ తండ్రికి సంక్రమిస్తాయి. మీకు సమాన వాటాలు వస్తాయి. సెక్షన్ 15 హిందూ వారసత్వ చట్టం సబ్‌సెక్షన్ (1), క్లాజ్ (ఎ) కింద కొడుకులూ, కూతుళ్లు వారితోపాటు భర్తకూ సమాన వాటాలు ఉంటాయి. కూతుళ్లకు వివాహాలు అయినా కాకపోయినా వారికి సమాన వాటా ఉంటుంది.
మేడమ్, మాది ఉమ్మడి కుటుంబం. మా మామగారి తమ్ముళ్లూ, వారి కుటుంబాలు, మా కుటుంబం అంతా కలిసే ఉంటాం. అన్నదమ్ముల మధ్య కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయి.ఇక నేను ఆ ఇంటి కోడలిని. నాకు రాకరాక గర్భం వస్తే, మూడో నెలలోనే మావారి పిన్నిగారు ఏదో మందు తినిపించారు. బలానికని చెప్పారు. వెంటనే నాకు కడుపులో నొప్పి ప్రారంభమై అబార్షన్ అయింది. ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. నన్నేం చేయమంటారు? - వి.ఆర్., కాకినాడ
గర్భస్రావ నేరాలకు సంబంధించి విఫిసి చట్టాలు ఉన్నాయి. సెక్షన్ 312 నుండి 316 వరకూ ఇలాంటి నేరాలు, వాటి శిక్షల గురించిన వివరణ ఉంది. ప్రసవానికి ముందే గర్భంలోని శిశువును చిదిమి వేయడాన్ని గర్భస్రావం అంటారు. అంటే కడుపులోని బిడ్డను చంపివేయడమే. మీ విషయంలో సెక్షన్ 312 అన్వయిస్తుంది. మెడికల్ రిపోర్ట్ తీసుకొని కేస్ వేయవచ్చు. 3 సం॥జైలు శిక్ష, జరిమానా పడతాయి.
కేస్ స్టడీ
కట్నం రూపేణా ఇచ్చిన ఆస్తిని మూడు నెలల్లోగా భార్యపేరిట బదలాయించాలి!
సంథ్య సుభాష్‌ల వివాహమై ఆరు నెలలు అయింది. దాదాపు పది లక్షల కరకు రొక్కం కట్నం రూపేణా ఇచ్చారు సంధ్య తల్లిదండ్రులు. ఇది కాక వివాహం వియ్యాల వారి కోరిక మేరకు చాలా ఘనంగా జరిపించారు. ఘనమైన సారెతో అత్తింటికి పంపించారు. ఓ రెండు నెలలు హాయిగా ఉన్నారు దంపతులు. పల్లెటూర్లో ఉంటున్న అత్తామామల సంధ్య సుభాష్‌ల ఇంటికి వచ్చారు. అత్తమామల ఆరళ్లు ప్రారంభమైనాయి. సంధ్య ఒక్కతే కూతురు. పైగా బోలెడంత ఆస్తి ఉంది. ఇకనేం సుభాష్ మనసులో విషబీజాలు నాటారు అత్తమామలు. అత్తమామలు ఆరోగ్యంగా ఉండగానే ఆస్తి మొత్తం రాయించుకోమని సుభాష్‌పై ఒత్తిడి తెచ్చారు. డబ్బంటే చేదా? సుభాష్ కూడా సంధ్యను సతాయించడం ప్రారంభించాడు. చీటికి మాటికి పోట్లాటకు సిద్ధపడుతున్నాడు. పది లక్షలేం చేశారంటే బ్యాంక్‌లో వేసుకున్నానని సమాధానం. ఇంట్లో గొడవలు భరించలేక సుభాష్ కోరిక తీర్చడం కోసం పుట్టింటికి వెళ్లింది సంధ్య. ఆస్తి అంతా సుభాష్‌కు, సంధ్యకే ఇస్తామని, కానీ ఇప్పుడు కాదనీ, ఇప్పుడు ఇస్తే సంధ్యను అన్యాయం చేస్తారని ఆమె తల్లిదండ్రుల వాదన. అంతా కలసి వారి ఫ్యామిలీ లాయర్ దగ్గరకెళ్లారు. ఆమె కూడా సంధ్య పేరెంట్స్‌నే సపోర్ట్ చేసింది. ఏకైక వారసురాలైనంత మాత్రాన ఆస్తి మొత్తం ఇపుడే ఇవ్వడం కుదరదని తెలియజేసింది.
అసలు, వివాహమైన 3 నెలలలోగా కట్నం రూపేణా ఇచ్చిన సొమ్మును భార్య పేరు మీద తప్పకుండా ట్రాన్ఫర్ చేయాలని, వరకట్నంగా ఇచ్చిన డబ్బు గృహిణికి స్వంత ఆస్తి అవుతుందని ‘వరకట్న నిషేధ చట్టం 1961’ ప్రకారం భార్య పేరున తప్పకుండా కట్నం డబ్బునుకాని, కట్న రూపేణా వచ్చిన ఆస్తిని కానీ ట్రాన్ఫర్ చేయాలని అలా చేయకుంటే నేరమని, జైలు శిక్షా, జరిమానా పడతాయనీ లాయర్ తెలియజేశారు. ముందు 10 లక్షలు తన పేరు మీద ట్రాన్ఫర్ చేయించుకోమని, అపుడు భర్త, అత్తగార్ల అసలు స్వరూపం బయట పడుతుందని సలహా ఇచ్చారు. భర్తను నిలదీయడానికి సిద్ధపడింది సంధ్య. వీలుంటే న్యాయపోరాటానికి కూడా. తల్లిదండ్రులను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్పి లాయర్‌గారికి ధన్యవాదాలు చెప్పి అత్తింటికి మరలింది సంధ్య.