
కట్నం కోసం ఒత్తిడి
లేదనడంతో వరుని కుటుంబం పరార్
పీటల మీద నిలిచిన పెళ్లి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ అత్యాశతో వరకట్నం కోసం కక్కుర్తి పడ్డారు. అలిగిన వరుడు, అతని తల్లితండ్రులు, బంధువులు పెళ్లి మండపం నుంచి పరారయ్యారు. ఈ వింత సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. న్యాయం చేయాలంటూ వధువు తండ్రి ఉప్పారపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కాలేజీ నుంచి ప్రేమ
వధువరులు ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి స్నేహితులు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఏడాది జూలై నెలలో ఇండియాకు వచ్చిన యువతి ప్రేమ గురించి తల్లిదండ్రులకు తెలిపింది. ఇరువైపుల పెద్దలు మాట్లాడి గతేడాది జూలైలో నిశ్చితార్థం చేశారు. మార్చి 2న 2025లో వివాహం కూడా నిశ్చయించారు. గత ఫిబ్రవరి 17న షాపింగ్ కోసం ఫ్రాన్స్ నుండి ఢిల్లీకి వచ్చిన యువతి ఓ హోటల్‌లో బస చేసింది. ప్రియుడు ప్రేమ్ కూడా వచ్చి యూరోపియన్ సంస్కృతి ప్రకారం పెళ్లికి ముందే ఇద్దరూ శారీరకంగా కలవాలని కథలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు.
పొద్దున పెళ్లనగా గొడవ
వివాహ వేడుకల కోసం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకూ బెంగళూరు గాందీనగర్‌లోని రైల్వే ఆఫీసర్స్ ఎన్‌క్లేవ్‌లోని నంది క్లబ్‌ని బుక్ చేశారు. 28న సంగీత్, మెహందీ వేడుకలను జరిపారు. మార్చి 1న రాత్రి వరుడు, తల్లితండ్రులు గొడవకు దిగారు. రూ.50 లక్షల నగదు, అర్ధ కేజీ బంగారం, ఒక బెంజ్ కారును కట్నంగా ఇవ్వాలని పట్టుబట్టారు. వధువు తండ్రి తన చేత కాదని చెప్పాడు. కొంతసేపటికి వరుని కుటుంబం మొత్తం పరారైంది. తెల్లవారితే జరగాల్సిన పెళ్లి జరగలేదు. ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడు ప్రేమ్, అతని తల్లిదండ్రులు శివకుమార్, రాధలపై కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment