
మమత (ఫైల్)
సాక్షి, అనంతగిరి(రంగారెడ్డి): మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లికి చెందిన ఊరడి మమత(21) స్థానిక రామయ్యగూడకు చెందిన నవీన్ రెండేళ్ల క్రితం పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో 3 తులాల బంగారం పెడతామని మమత తండ్రి భాగయ్య హామీ ఇచ్చాడు.
కొన్నాళ్ల తర్వాత ఇస్తామని చెప్పాడు. భాగయ్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. కూతురికి బంగారం ఇవ్వడంలో ఆలస్యమైంది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన మమత బంగారం విషయమై తల్లిదండ్రులను అడిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కొన్నిరోజుల తర్వాత ఇస్తామని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈనెల 15న మధ్యాహ్నం గుళికల(తిమ్మెట) మందు మింగింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఉస్మానియాకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మమత సోమవారం రాత్రి 10గంటలకు చనిపోయింది. వికారాబాద్ తహసీల్దార్ రవీందర్ శవ పంచనామా చేశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలి భర్త నవీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు
సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment