కిరణ్.. నా జీవితంలోకి ఎందుకొచ్చావ్. నిన్ను చేసుకోకముందు సంతోషంగా ఉండేదాన్ని. పెళ్లయ్యాక మనస్ఫూర్తిగా నవ్విన రోజు కూడా గుర్తులేదు. నువ్వు ఎన్నిసార్లు వేధింపులకు గురి చేసినా మావాళ్లకు చెప్పలేదు. నీ ఫ్రెండ్స్‌కు చెప్పాలనుకున్నా.. కానీ, నీ పరువు పోతుందని చెప్పలేదు.
– సూసైడ్ నోట్‌లో వెన్నెల
చెన్నూర్: జీవితంపై ఎన్నో ఆశలు.. ఉన్నత చదువులు చదవాలన్న ఆశయం.. ఇంట్లో నలుగురు అమ్మాయిలు కావడంతో ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం. ఇలా ఆ యువతి జీవితం సాఫీగా సాగిపోయేది. అనుకోకుండా ఆమె జీవితంలో ప్రేమ ప్రవేశించింది. ప్రేమ.. పెళ్లి.. ఆత్మహత్య ఏడాదిన్నరలో జరిగిపోయాయి. తన కుటుంబానికి వెలుగు పంచాల్సిన ‘వెన్నెల’చీకటైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కట్నం వేధింపులు, తక్కువ కులమని అత్తింటివారు మాట్లాడే సూటిపోటు మాటలు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, చెన్నూరు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటపల్లి మండలం సిర్సా గ్రామానికి చెందిన ఆరె సత్తయ్య–శారదకు నలుగురు కూతుళ్లు. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీలే. కుటుంబాన్ని పోషిస్తూనే పెద్ద కుమార్తె పెళ్లి చేశారు. మూడో కుమార్తె వెన్నెల(26)కు చదువుపై ఆసక్తి ఉండటంతో ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నారు. మంచిర్యాలలో బీకాం సెకండియర్ చదువుతున్న సమయంలో గ్రామానికే చెందిన పెండ్యాల కిరణ్‌కుమార్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. కులాలు వేరని, పెద్దలు పెళ్లికి అంగీకరించరని వెన్నెల చెప్పినా.. మాయమాటలు చెప్పాడు. చచ్చిపోతానని బెదిరించాడు. గ్రామస్తుడే అని నమ్మి వెన్నెల పెళ్లికి అంగీకరించింది. ఇద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.
ఎన్నో ఆశలతో కొత్త కాపురం..: వివాహం అనంతరం కిరణ్‌కుమార్–వెన్నెల చెన్నూరులో కాపురం పెట్టారు. అద్దె ఇంట్లో ఉంటూ కిరణ్ క్లాత్‌స్టోర్ నిర్వహిస్తున్నాడు. కోవిడ్ కారణంగా నష్టాలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఎన్నో ఆశలతో కొత్త కాపురంలోకి అడుగు పెట్టిన వెన్నెలకు కొన్ని నెలలకే కష్టాలు ప్రారంభమయ్యాయి. రూ.10 లక్షల కట్నం తేవాలని వెన్నెలను కిరణ్ వేధించడం మొదలుపెట్టాడు. సున్నిత మనస్కురాలైన వెన్నెల భరించలేకపోయింది. పుట్టింటికి వెళ్లలేక, భర్తతో ఉండలేక కుమిలిపోయింది.
వెన్నెల మృతదేహం, సూసైడ్ నోట్
చావే పరిష్కారమని..
భర్తతోపాటు అత్తింటివారి వేధింపులు ఎక్కువ కావడంతో ఇక చావే సమస్యకు పరిష్కారమనుకుంది. ఆత్మహత్యకు ముందు మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. ‘ఇంకో జన్మంటూ ఉంటే మన కులంలోనే పుడుదాం’ అని ముగించి శుక్రవారం భర్త లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన ఇరుగుపొరుగు వారు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులు మృత్యువుతో పోరాడిన వెన్నెల శనివారం రాత్రి మృతిచెందింది.
ఆదివారం మృతదేహాన్ని చెన్నూరుకు తీసుకొచ్చారు. సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని సీర్స గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. వరకట్న వేధింపులు, కులం పేరుతో ధూషించినందుకు కిరణ్‌కుమార్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెన్నూరు సీఐ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment