దుర్గం రమ్య (ఫైల్)
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన ఎనిమిది నెలలకే మరో వివాహిత తనువు చాలించింది. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుండగా.. అత్తింటివారు హత్య చేశారని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కారణాలేవైనా ఇద్దరు గర్భిణులు ఆత్మ హత్య చేసుకోవడం స్థానికులను కలిచివేసింది.
సాక్షి, భీమారం(ఆదిలాబాద్): అత్తింటి వేధింపు తాళలేక మండలంలోని నర్సింగాపూర్(బి) గ్రామానికి చెందిన ఎనిమిది నెలల గర్భిణి దుర్గం రమ్య (20) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్ మండలం ఓత్కులపల్లి గ్రామానికి చెందిన జుమ్మడి లక్ష్మి, రాజలింగు దంపతుల కుమార్తె రమ్యకు 2020 జూన్ 26న భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం రాజ శేఖర్‌తో వివాహం జరిగింది.
ఆ సమయంలో ఒప్పుకున్న ప్రకారం కట్నంతోపాటు 10 గుంటల భూమి ఇచ్చారు. ఆ భూమి అమ్మి డబ్బులు తీసుకురావాలని భర్తతోపాటు అత్తమామలు రమ్యపై ఒత్తిడి తెస్తున్నారు. మరో రూ.50వేలు అదనపు కట్నం తీసుకురావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో అదనపు కట్నం తెచ్చేందుకు ఆమె నిరాకరించడంతో గర్భిణి అని కనికరం చూపకుండా శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో వేధింపులు తాళలేక రమ్య శుక్రవారం పురుగుల మందు తాగింది.
కుటుంబ సభ్యులు చికిత్స కోసం భీమారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రమ్య మృతిచెందినట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. మృతురాలి భర్త రాజశేఖర్, అత్తమామలు శశక్క, భూమన్న, మరిది రాకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులందరూ పరారీలో ఉన్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment