
కల్లాపి రంగు పొడిని నీటిలో కలిపి తాగి ఆత్మహత్య
నెల్లూరు జిల్లా ఊటుకూరు పెద్దపాళెంలో ఘటన
భర్త, మామ క్రికెట్ బెట్టింగ్‌లే కారణమని గ్రామంలో ప్రచారం
విడవలూరు: వరకట్నం కోసం వేధించడంతో కల్లాపిరంగు పొడిని నీటిలో కలిపి తాగి వివాహిత మృతిచెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. బోగోలు మండలం తాటిచెట్లపాళెం గ్రామానికి చెందిన బచ్చింగారి సుగుణ (23)కు విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన హరికృష్ణతో 2021లో వివాహమైంది.
వారికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన ఏడాది తర్వాత అదనపు కట్నంగా రూ.7 లక్షలు తీసుకురావాలని భర్తతోపాటు, అత్త నర్సమ్మ, మామ నాగూరు, ఆడపడుచు నాగలక్ష్మి కలిసి సుగుణను వేధించడం మొదలుపెట్టారు. ఇవి బుధవారం తారస్థాయికి చేరాయి. మనస్తాపంతో సుగుణ ఇంటి ముందు చల్లే కల్లాపిరంగు పొడిని నీళ్లలో కలిపి తాగింది. సాయంత్రం వరకు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇరుగుపొరుగున్న బంధువులు ఇది గుర్తించి ఈ సమాచారాన్ని సుగుణ తల్లి అన్నమ్మకు తెలిపారు.
వారు వెంటనే పెద్దపాళెం గ్రామానికి చేరుకుని సుగుణను రాజుపాళెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన కుమార్తె మరణంపై అనుమానం ఉందంటూ హరికృష్ణతోపాటు, అత్త నర్సమ్మ, మామ నాగూరు, ఆడపడుచు నాగలక్షి్మలపై అన్నమ్మ గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో గ్రామంలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో హరికృష్ణ, అతని తండ్రి నాగూరు కూడా ఉన్నారు. వీరు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నారని, కట్నం కోసం సుగుణను వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని గ్రామంలో ప్రచారం జరుగుతోంది.