
తల్లిదండ్రులకు సూసైడ్ లేఖలు రాసి ప్రేమజంట ఆత్మహత్య
నెల్లూరు లాడ్జిలో ఘటన
నెల్లూరు (క్రైమ్): వారిద్దరూ ప్రేమించుకున్నారు. కారణాలు ఏవైనా వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. వారిని ఎదిరించి ఒక్కటయ్యే ధైర్యంలేక ఊరుకాని ఊరు వచ్చారు. లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులకు సూసైడ్ లేఖ రాశారు. ‘‘అమ్మ, నాన్నలు క్షమించండి. మీరు మా ప్రేమను ఎలాగూ అంగీకరించడం లేదు. మళ్లీ పుట్టి అందరి అంగీకారంతో ఒక్కటవుతాం’’ అంటూ రాసి, పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన నెల్లూరులోని ఒక లాడ్జిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల సమాచారం ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బాచ్చు జోసఫ్ రత్నకుమార్ (23), కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాకకు చెందిన చిల్లుముంత శ్రావణి (21) మధ్య బీటెక్ చదివే సమయంలో చిగురించిన స్నేహం, అటుపై ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21వ తేదీన నెల్లూరు వచ్చారు. కళాశాలలో కౌన్సెలింగ్ ఉందని చెప్పి ఒక లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కౌన్సెలింగ్ పూర్తికాలేదని మరో రోజు గదికి నగదు చెల్లించారు. 23వ తేదీన గదిని శుభ్రం చేసేందుకు లాడ్జి స్వీపర్ వెళ్లి తలుపుకొట్టగా లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు.
బయటకు వెళ్లి ఉంటారని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు అలానే జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం వారు అద్దెకు తీసుకున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి సిబ్బంది సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ జి.దశరథరామయ్య, ఎస్‌ఐ బాలకృష్ణ తలుపులు పగులగొట్టి చూడగా, బెడ్‌పై జోసఫ్ రత్నకుమార్, నేలపై శ్రావణి మృతదేహాలు కుళ్లిపోతున్న స్థితిలో పడి ఉన్నాయి.
సమీపంలో గడ్డిమందు సీసా పడి ఉంది.దీంతో వారు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వారి బ్యాగ్‌లను పరిశీలించగా అందులో మృతుల ఆధార్ కార్డులు, కళాశాలలకు సంబంధించిన సరి్టఫికెట్లు ఉన్నాయి. ఇరువురు తమ తల్లిదండ్రులకు రాసిన సూసైడ్ లేఖలను పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి
సంతపేట ఇన్‌స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.