మొదటి ప్రియుడిని అడ్డు తొలగించుకునేందుకు
రెండో ప్రియుడితో ప్రియురాలి పథకం?
రెండు రోజుల ముందుగానే రెక్కీ నిర్వహించిన యువతి
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో ప్రేమజంటపై జరిగిన దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యవకుడిపై దాడి వెనుక యువతి ఉన్నట్లు సమాచారం. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన అరవింద్ డిస్టెన్స్ డిగ్రీ చదువుతున్నాడు. అరవింద్ ఇంటర్ చదివే సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు మందలించడంతో విరమించుకున్నారు.
ప్రస్తుతం అమ్మాయి ఓ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే కళాశాలలో మరో అబ్బాయితో ప్రేమలో పడింది. ఒకరికి తెలియకుండా మరొకరితో మాట్లాడుతూ ఇద్దరితోనూ ప్రేమాయణం నడుపుతోంది. ఇటీవల మొదటి ప్రియుడి విషయం తెలుసుకున్న రెండవ ప్రియుడు.. యువతిని నిలదీయడంతో తప్పును కప్పి పుచ్చుకునేందుకు తాను ప్రేమించడం లేదని, అతడే వేధిస్తున్నాడని చెప్పింది. ఈక్రమంలో రెండో ప్రియుడితో కలసి మొదటి ప్రియుడు అరవింద్‌పై దాడికి కుట్ర పన్నారు. రెండు రోజులు ముందుగానే గాజులదిన్నె ప్రాజెక్టు వద్దకు వచ్చి రెక్కీ నిర్వహించుకుని వెళ్లింది. మంగళవారం అరవింద్‌ను గాజులదిన్నె ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లింది.
ఇదే విషయాన్ని ఫోన్‌లో మెసేజ్ ద్వారా ఎప్పటికప్పుడు రెండవ ప్రియుడికి సమాచారం ఇచ్చింది. అతడు తన స్నేహితులతో కలిసి వేటకొడవళ్లతో అక్కడికి చేరుకుని అరవింద్‌పై దాడి చేశారు. యువతి అక్కడి నుంచి పారిపోయింది. అరవింద్ కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విచారణలో యువతిదే పక్కా ప్లాన్ అని తెలిసి పోలీసులు అవాక్కయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఐ గంగాధర్ మాట్లాడుతూ ప్రేమజంటపై దాడి ఘటనను విచారిస్తున్నామని, గురువారం వివరాలు మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment