
గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల చదువులపై దృష్టి పెట్టిన తల్లులు
తరచూ స్కూల్లో బిడ్డల విద్యాబుద్ధులపై ఆరా తీస్తున్న 46.6 శాతం తల్లులు
ఏపీలోనూ 23 శాతం తల్లులు స్కూళ్లకు
చదువుకున్న తల్లుల సంఖ్యా పెరుగుతోంది
ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే గణనీయమైన పురోగతి
ఏపీలో టెన్త్ చదివిన తల్లులు 2016లో 10.4 శాతం.. 2024లో 22.8 శాతం
అసర్ సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో పిల్లల విద్య, భవిష్యత్తుపై తల్లిదండ్రుల శ్రద్ధ నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు చదువు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ బిడ్డలు బడికి వెళ్లారా.. ఎలా చదువతున్నారు.. ఇంటి వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను టీచర్లను అడిగి తెలుసుకొంటున్నారు. అంతే కాదు.. వారూ అక్షర జ్ఞానం పెంచుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం రోజువారీ పనుల మీదే దృష్టి పెట్టే తల్లిదండ్రులు పిల్లల చదువుపై అంతగా శ్రద్ధ పెట్టే వారు కాదు.
బడుల్లో తల్లిదండ్రుల సమావేశాలు పెట్టినా పెద్దగా హాజరయ్యేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. 46.6 శాతం తల్లులు స్కూళ్లకు వెళ్లి పిల్లల చదువుపై ఆరా తీస్తున్నారు. వారు కూడా పనులు చేసుకుంటూనే పిల్లలతో సమానంగా చదువుకుంటున్నారు. ‘వార్షిక స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (అసర్)– 2024’ సర్వే నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. గ్రామీణ భారత్‌లో పాఠశాలకు వెళ్లే వయసు గల పిల్లలు (5 నుంచి 16 ఏళ్లు) ఉన్న తల్లులు విద్యా రంగంపై మంచి అవగాహనతో ఉన్నారని ఆ నివేదిక తెలిపింది.
2016లో జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 29.4 శాతం మంది తల్లులు మాత్రమే ఇలా బడిబాట పడితే.. 2024 నాటికి ఆ సంఖ్య 46.6 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. తల్లుల్లో 10వ తరగతి మించి చదువుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు పేర్కొంది. ఎనిమిదేళ్ల క్రితం గ్రామాల్లో పదో తరగతి చదువుకున్న తల్లులు 9.2 శాతం ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 19.5 శాతం పెరిగిందని తెలిపింది. పదో తరగతి దాటి చదివిన తండ్రుల శాతం పెరుగుదల 2016లో 17.4 శాతం ఉండగా 2024లో 25 శాతానికి చేరువైంది.
పదో తరగతి దాటి చదివిన తల్లులు, తండ్రుల శాతం మధ్య అంతరమూ గత ఎనిమిదేళ్లలో తగ్గిందని, 2016లో తల్లులకంటే తండ్రులు 8 శాతం ఎక్కువుంటే, 2024 నాటికి సుమారు 5 శాతానికి తగ్గినట్టు నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం 23 శాతం మంది బడుల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతుండడంతో పాటు పిల్లలతో సమానంగా విద్యనభ్యసిస్తున్నట్టు ప్రకటించింది.
జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో ప్రగతి
పదో తరగతికి మించి విద్యావంతులైన తల్లులు గతంలో జాతీయ సగటుకంటే ఎక్కువగా కేరళలోనే అధికంగా ఉండేవారని, ఇప్పుడు ఈ జాబితాలో హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కూడా చేరినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 2016లో పదో తరగతికి మించి చదివిన తల్లులు 10.4 శాతం ఉండగా 2024లో 22.8 శాతానికి పెరిగినట్లు తెలిపింది.
తల్లులు విద్యావంతులు కావడంతో చదువు అవసరాన్ని గుర్తించారని నివేదిక వివరించింది. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచన పెరగడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోత్సాహక కార్యక్రమాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఈ ప్రగతి కేరళలో మాత్రమే కనిపించేదని, ఇప్పుడు దేశంలో పలు రాష్ట్రాల్లో చదువుకునే తల్లులు పెరుగుతున్నట్టు వెల్లడించింది.
సర్వే ఇలా..
అసర్ సర్వే కోసం ప్రథమ్ సంస్థ దేశంలోని 605 జిల్లాల్లో 17,997 గ్రామాల్లో 3,52,028 గృహాలను సందర్శించింది. 15,728 పాఠశాలల్లోని వివిధ
తరగతుల్లో 6,49,491 మంది పిల్లల చదువులు, వారి తల్లిదండ్రుల పర్యవేక్షణను పరిశీలించింది. చదువులో పిల్లల రాణింపు, విషయ పరిజ్ఞానంతో పాటు తల్లిదండ్రులు విద్యా ప్రగతని అంచనావేసి నివేదిక రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంస్థ 390 గ్రామాల్లో 7,721 నివాసాలను సర్వే చేసి, 3 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు గల 12,697
మంది పిల్లలను పరీక్షించింది.
Comments
Please login to add a commentAdd a comment