Childrens education
-
ఏపీ బాలల బడ్జెట్ బహుబాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేలా వారికి ఆంగ్ల మాధ్యమంలో మంచి చదువులు అందిస్తూ వారి సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. బాలల కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ రూపొందించి నిధులు కేటాయించడం అద్భుతమని మెచ్చుకుంటున్నాయి. జాతీయ విద్యాప్రణాళిక, పరిపాలన సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఐఈపీఏ–నీపా)) బుధవారం నిర్వహించిన వర్చువల్ వర్క్‌షాప్‌లో రాష్ట్రం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘స్టూడెంట్ బేస్డ్ ఫైనాన్సియల్ సపోర్టు సిస్టమ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్’ అంశంపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి రాష్ట్రం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు. అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి కార్యక్రమాల గురించి విని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసించారు. ముఖ్యంగా అమ్మ ఒడి పథకం అమలు సాహసోపేతమైన చర్యగా పలువురు అభినందించారు. నాడు–నేడు కింద రాష్ట్రంలోని ఫౌండేషన్ స్కూళ్లు మొదలు 60 వేల వరకు ఉన్న పలు విద్యాసంస్థలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం పట్ల నీపా అధికారులు మెచ్చుకున్నారు. ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని ప్రశంసించారు. పైగా అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో వాటి భద్రత నిర్వహణ కోసం స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిటెట్ల నిర్వహణ, పారిశుధ్య పనులకోసం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటుచేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దేలా కృషి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు విద్యారంగంలో ముఖ్యంగా పిల్లలను ప్రపంచపౌరులుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా వారిని మార్చేలా జగనన్న విద్యాకానుక కింద ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చుచేస్తూ 43 లక్షల మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో లెర్నింగ్ అవుట్‌కమ్స్ పెరుగుతున్నాయి. మనబడి నాడు–నేడు కింద రన్నింగ్ వాటర్‌తో కూడిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్‌చాక్‌బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్, పెయింటింగ్‌లు, కాంపౌండ్ వాల్, కిచెన్‌షెడ్ల నిర్మాణం వంటి ఏర్పాటు ద్వారా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే వీలు ఏర్పడుతోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించేలా రోజుకో మెనూతో అందిస్తున్న భోజనం గురించి ప్రతినిధులు తెలుసుకున్నారు. ఇందుకు ఈ ఏడాది ప్రభుత్వం 1,595.55 కోట్లు ఖర్చుచేస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి తల్లి తన పిల్లలను ఆర్థిక స్తోమత లేక చదువులకు దూరంగా ఉంచకుండా బడులకు పంపేలా ఏటా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తున్న సంగతి విని ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 2022–23 విద్యాసంవత్సరంలోనే తల్లులకు రూ.6,500 కోట్లు అందించారు. చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ వినూత్న ఆలోచన ► చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుపై నీపా అధికారులు, ఇతర ప్రతినిధులు ఆసక్తి చూపారు. ఈ బడ్జెట్ ఎలా రూపొందిస్తున్నారో తెలుసుకున్నారు. ► కుల, లింగ, వైకల్యాలు, తరగతి, మత, సాంస్కృతిక ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలిగే వాతావరణా న్ని సృష్టించడమే ఈ చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ లక్ష్యం. ► 2021–22లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా ఈ బాలల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2022–23లో రూ.16,903 కోట్లు కేటాయించారు. ► బాలల పథకాల కోసం వందశాతం నిధులు కేటాయించే కార్యక్రమాలు మొదటి విభాగం కాగా అవసరాల మేరకు నిధులు కేటాయించే సంక్షేమ పథకాలు రెండో విభాగంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ► వివిధ శాఖల ద్వారా పిల్లల కోసం పలు పథకాలను అమలు చేయిస్తున్నారు. మొదటి విభాగంలో 15 స్కీములు, రెండో విభాగంలో 18 స్కీములు అమలు చేస్తున్నారు. -
చిన్నారుల చదువుపై కోవిడ్ దెబ్బ.. నీతి ఆయోగ్ అధ్యయనం
సాక్షి, అమరావతి: దేశంలోని మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లల చదువులపై కోవిడ్ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ప్రధానంగా లాక్డౌన్ సమయంలో ఈ వయస్సులోని పిల్లల చదువులు, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాల్లో ఏర్పడిన అంతరాయాలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. ఆ సమయంలో దేశంలోని అన్ని పాఠశాలలు, ప్రీస్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాల్సి వచ్చింది. చిన్న పిల్లల వ్యక్తిగత విద్యను పూర్తిగా నిలిపేయడంతో మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లల ప్రారంభ అభ్యాసానికి తీవ్ర అంతరాయం కలిగిందని అందులో తేలింది. ఈ వివరాలను డిసెంబర్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య సేకరించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. అందుబాటులోలేని దూరవిద్య ఇక కోవిడ్ సంక్షోభ సమయంలో పిల్లలు చదువుకోవడానికి వీలుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏడాదిపాటు దూరవిద్య అందించేందుకు చర్యలను చేపట్టాయి. ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు, టీవీ, రేడియో ద్వారా ఈ ప్రయత్నాలు జరిగాయి. అయితే.. దేశంలోని చాలా కుటుంబాలకు ఈ దూరవిద్య అందలేలేని అధ్యయనం పేర్కొంది. 42 శాతం కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే కొంతమేర అభ్యసించే అవకాశం కలిగిందని, మిగతా కుటుంబాల పిల్లలకు లేదని తెలిపింది. ఉదా.. కోవిడ్‌కు ముందు ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అత్యధికంగా మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 84 శాతం మంది స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చేరారని.. అయితే సంక్షోభ సమయంలో ఏపీలో కేవలం 29 శాతం కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే దూరవిద్య అందిందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, రాజస్థాన్‌లో 23 శాతం మంది, తమిళనాడులో 17 శాతం మంది కుటుంబాల్లోని పిల్లలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. అయితే.. దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య దూరవిద్య సౌకర్యంలో అంతరాలున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో దూర విద్య ఎక్కువ శాతం పిల్లలకు అందుబాటులో ఉండగా కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. వీడియోల వైపు పిల్లల మొగ్గు 2020 మార్చి కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశంలోని ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు వీడియోలు చూడటానికి అలవాటుపడ్డారని.. టీవీ, ఫోన్ల వినియోగంతోపాటు కంప్యూటర్లో గేమ్‌లూ ఆడారని 41 శాతం పట్టణ తల్లిదండ్రులు తెలిపారు. కోవిడ్ కష్టకాలంలో ఒత్తిడి తీవ్రంగా ఎదుర్కొన్నట్లు 90 శాతం మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు చెప్పారు. తమిళనాడులో 66 శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 64 శాతం, ఒడిశాలో 60 శాతం మంది 2021 జనవరి, ఫిబ్రవరిలో అత్యధిక ఒత్తిడికి లోనైనట్లు వారు వెల్లడించారు. పిల్లల వైద్యంపై కూడా.. మరోవైపు.. లాక్డౌన్ కారణంగా 2020 మార్చి–మే నెలల మధ్య తల్లి, నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్య సేవలు కూడా గణనీయంగా తగ్గిపోయినట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఆసుపత్రుల్లో కాన్పులు 21 శాతం తగ్గిపోగా ఆ స్థానంలో ఇంటివద్దే జరిగాయని.. అంతేకాక, ఆ సమయంలో గర్భిణీల ఆరోగ్య పరీక్షలూ నిలిచిపోయాయని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. ఇక కోవిడ్ తొలినాళ్లలో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడంలో కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ 86 శాతం పిల్లలకు వేశారు. పట్టణ ప్రాంతాల్లో 90 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 85 కుటుంబాల్లోని పిల్లలకు ఇవి అందినట్లు నివేదిక వెల్లడించింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో 94 శాతం, పట్టణ ప్రాంతాల్లో 93 శాతం కుటుంబాలు కోవిడ్ సమయంలో తమ పిల్లలకు ఇతర వైద్య సదుపాయాలు అందాయని తెలిపారు. -
మూడో ఏడాదీ నష్టపోతే ఇక పిల్లల చదువులు ఏం కావాలి?: సీఎం జగన్
సమ్మె ఎవరికి కావాలంటే.. ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరు. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ, కడుపుమంట ఉన్నవారికి మాత్రమే సమ్మె కావాలి. పార్టీల పరంగా ఎర్రజెండాల వారికి కావాలి.. చంద్రబాబు దత్తపుత్రుడికి కావాలి.. మీడియా ముసుగులో వ్యక్తుల పరంగా నడుపుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కే సమ్మె కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతోందంటే వారికి పండగే. కానీ సంధి జరగడంతో ఏడుపు ముఖం పెట్టారు. సమ్మె విరమించారని తెలియగానే పచ్చజెండాల ముసుగులో ఉన్న ఎర్ర సోదరులను ముందుకు తోశారు. ఎదుట ఎర్రజెండా.. వెనుక పచ్చ అజెండా.. ఇదీ పరిస్థితి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ వల్ల రాష్ట్రంలో రెండేళ్లు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఉత్పన్నం కాగా ఇప్పుడు కొందరు టీచర్లను రెచ్చగొడుతూ రోడ్డెక్కిస్తే పిల్లల చదువులు ఏం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఆందోళనకు దిగుతున్న వారు తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మూడో ఏడాదీ చదువులను గాలికి వదిలేస్తారా? అని మండిపడ్డారు. రెచ్చగొట్టే నాయకులు, ఎల్లో మీడియా వీళ్లంతా నిజంగా మనుషులేనా? అని ధ్వజమెత్తారు. ఇంత మంచి చేస్తున్నా ప్రభుత్వంపై బురదజల్లడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ధర్మమేనా? అని ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. జగనన్న చేదోడు పథకం ద్వారా మంగళవారం లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. గత రెండేళ్లుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు గణనీయంగా వేతనాల పెంపుతో పాటు నిరుద్యోగ యువతకు కొత్తగా ఇచ్చిన ఉద్యోగాల వివరాలను ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఒక్క విషయం... ఇక్కడ ఒక విషయం ఆలోచించమని సవియనంగా కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె ప్రారంభించాలని ఎవరు కోరుకుంటారు? ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగులు కోరుకోరు. నేను ఇంతగా ప్రేమించే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కూడా కోరుకోరు. ఈ రెండున్నరేళ్లలో నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా లంచాలు, వివక్షకు తావులేకుండా రూ.1.27 లక్షల కోట్లు అందుకున్న ఏ కుటుంబమూ కోరుకోదు. ఏ ఒక్క సామాజిక వర్గమూ కోరుకోదు. సంతోషంగా సంతకాలు చేసి మళ్లీ.. ఉద్యోగుల సమస్యలు సామరస్యంగా పరిష్కారమయ్యాక ఆ ప్రక్రియలో భాగస్వాములైన వామపక్షాలకు సంబంధించిన సంఘాలు సంతకాలు చేసి సంతోషాన్ని వెలిబుచ్చాయి. కానీ మరుసటి రోజు వామపక్షాల యూనియన్లు, పచ్చ పార్టీల యూనియన్లు పోరుబాట పడతామని, రోడ్డెక్కుతామని అంటుంటే బాధనిపిస్తోంది. చదువులు ఏం కావాలి? కోవిడ్ వల్ల గత రెండేళ్లుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. కేవలం పాస్ చేస్తూ పోతున్నాం. ఇది మూడో సంవత్సరం. పరీక్షల సమయం సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకు కొంతమంది టీచర్లను రోడ్డెక్కిస్తే పిల్లల చదువులేం కావాలి? వాటి బాధ ఏమిటంటే... ఆశా కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారని ఈరోజు ఈనాడులో ఫోటో వేశారు. వాళ్లను ఈడుస్తున్నట్లు ఫోటో వేశారు. ఇది ఆ అక్కచెల్లెమ్మల మీద ప్రేమ ఉందని చూపించుకునే అభూత కల్పన. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారని ఈనాడు గుండెలు బాదుకోవడం వెనుక పచ్చ అజెండా దాగుంది. నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని ఎల్లో చానళ్ల బాధ అంతా ఇంతా కాదు. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆందోళన చేయండి.. మీకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయండి.. మా బాబు పాలనే బాగుందని చెప్పండి.. మీకు మెరుగైన జీతాలు ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగు జెండాలు పట్టుకోండి.. ఇదే వాటి బాధ. వీడియోకాన్ఫరెన్స్‌లో లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిని తిడితే మంచి కవరేజ్ ముఖ్యమంత్రిని తిడితే మంచి కవరేజ్ ఇస్తాం. బాగా హైలెట్ చేస్తాం. సోషల్ మీడియాలో ఎవరైనా రాస్తే దాన్ని ప్రధాన వార్తగా కూడా ప్రచురిస్తాం. టీవీల్లో కూడా చూపిస్తాం.. ఇదీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ధోరణి. నిజంగా ఇవి వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు చాలా బాధ కలిగినా.. ఇంత దిగజారిపోయిన పరిస్థితి చూస్తున్నప్పుడు ఆ బాధలోనుంచి నవ్వు కూడా వస్తుంది. ఈ స్ధాయికి వీళ్లు దిగజారిపోయేలా దేవుడు నన్ను హెచ్చించాడు అని సంతోషంగా ఉంటుంది. రెండున్నరేళ్లలో కొత్తగా 1,84,264 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ మీద్వారా కొన్ని విషయాలు అందరికీ చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు అంటే మన ప్రభుత్వం ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 3.97 లక్షల మంది ఉన్నారు. ఈ రెండున్నరేళ్లలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమిచ్చిన ఉద్యోగాలు మీరే చూడండి. మన కళ్లెదుటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 1.25 లక్షల మంది కనిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగులు కన్న కలలను నెరవేరుస్తూ దాదాపు 51 వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేశాం. ఇక మిగిలినవాటిని కలుపుకొంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,84,264 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు 3.97 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉండగా ఈ రెండేళ్లలోనే మనం 1,84,264 ఉద్యోగాలు ఇచ్చామంటే ఏకంగా 50 శాతంపై చిలుకు ఉద్యోగాల పెరుగుదల కనిపించడం లేదా? నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్న వారికి, మాట్లాడుతున్న వాళ్లకి ఇవి కనిపించడం లేదా? మెరుగైన, మంచి జీతాల కోసం ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మోసపోకూడదు, జీతాల కోసం లంచాలిచ్చే పరిస్థితి రాకూడదు, దళారీల బెడద ఉండకూడదు, కమీషన్లు లేకుండా వారికి మెరుగైన, మంచి జీతాలు ఇచ్చే పరిస్థితి రావాలని ఆప్కాస్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. దాదాపు లక్షమందికి పైగా ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ అందిస్తున్న ప్రభుత్వం మనది. ఇతర రాష్ట్రాల్లో పట్టించుకున్నారా? ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.3,600 కోట్ల అదనపు భారం పడుతున్నా చిరునవ్వుతో స్వీకరిస్తున్న ప్రభుత్వం మనది. పక్కనే తెలంగాణ, ఇతర రాష్ట్రాలున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కి ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా మమ్మల్ని విలీనం చేసుకోవాలని కోరితే ఒక్క ప్రభుత్వం అయినా పట్టించుకుందా? అని అడుగుతున్నా. గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగాలని కోరుతున్నా. టైం స్కేల్‌పై బాబు వంచన.. చంద్రబాబు ఐదేళ్ల పాలన చూశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇస్తామని ఆశ పెట్టారు కానీ ఒక్కరికైనా చేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేస్తున్న ప్రభుత్వం మనది. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు ఏ ఉద్యోగులకు ఎంత జీతం ఇచ్చారో, ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఎంత ఇస్తుందో అందరికీ తెలిసినా మరోసారి గుర్తు చేస్తున్నా. ఎక్కడ రూ.1,198 కోట్లు? ఎక్కడ రూ.3,187 కోట్లు? మన ప్రభుత్వం రాకముందు వరకు 3.07 లక్షల మంది ఉద్యోగులకు సంవత్సరానికి జీతాల ఖర్చు రూ.1,198 కోట్లు అయితే ఈరోజు మన ప్రభుత్వం భరిస్తున్న ఖర్చు రూ.3,187 కోట్లు. ఎక్కడ రూ.1,198 కోట్లు?... ఎక్కడ రూ.3,187 కోట్లు? ఇంత పెద్ద ఎత్తున ఇస్తుంటే ఆందోళన బాట పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు కలసి రాజకీయాలను కల్మషం చేసి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు ఇన్ని జరుగుతున్నా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇంకా మంచి చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ బలాన్ని దేవుడు ఇవ్వాలని, మీ అందరి చల్లని దీవెనలు తోడుగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయం నుంచి బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బాలల విద్యకు బలమైన పునాదులు వేసిన నెహ్రూ
సాక్షి, అమరావతి: భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బాలల విద్యకు బలమైన పునాదులు వేసారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. పండిట్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని చిన్నారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. బాలలు భారతీయ సమాజానికి వెన్నెముకగా పండిట్ నెహ్రూ భావించారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే ఆర్యోక్తిని అనుసరించి దేశ భావిపౌరులుగా మాతృభూమిని కాపాడుతూ, భారతావనికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత బాలలపై ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ను కలిసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శనివారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ను ఏపీ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొద్దిసేపు మాట్లాడారు. -
15 కోట్ల మంది పాఠశాలలకు దూరం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు, యువత విద్యా వ్యవస్థకి దూరంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మరో 25 కోట్ల మందికి అక్షరజ్ఞానం కూడా లేదని వెల్లడించారు. భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) గురువారం ‘‘ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు’’ అనే అంశంపై నిర్వహించిన వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు, చారిటబుల్ సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, ఉన్నత విద్యా సంస్థల్లో 3–22 ఏళ్ల మధ్య వయసున్న వారి గణాంకాలను పరిశీలిస్తే దాదాపుగా 35 కోట్ల మంది చదువుకుంటున్నారని తెలిపారు. ఆ వయసు కలిగిన వారు దేశ జనాభాలో 50 కోట్లు మంది ఉన్నారని, దీనిని బట్టి చూస్తే 15 కోట్ల మంది విద్యకు దూరంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు. వారందరినీ బడిబాట పట్టించడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తుందని, మన దేశ ఆర్థిక వ్యవస్థలో పని చేసే వారి సంఖ్య పెంచాలంటే అందరికీ విద్య అందుబాటులోకి రావాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో అక్షరాస్యత 80 శాతానికి చేరుకుందని ప్రధాన్ చెప్పారు. దాదాపుగా 25 కోట్ల మంది ఇప్పటికీ నిరక్షరాస్యులుగా ఉన్నారని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) మరో 25 సంవత్సరాలకి సాధించాల్సిన లక్ష్యాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ అన్నారు. దేశ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకల సమయానికి ఏం సాధించాలో మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు. కరోనా సంక్షోభం సమయంలో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం పెరిగిందని, తద్వారా విద్యారంగంలో సృజనాత్మకత, పెట్టుబడులకు అవకాశం పెరుగుతుందని అన్నారు. భవిష్యత్‌లో పల్లె పల్లెకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు వస్తాయని, దీనివల్ల విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి వినూత్న మార్పులు వస్తాయని చెప్పారు. -
శైశవగీతి!
ఇదొక మహా చౌర్యం. అతి పెద్ద లూటీ. మనకు తెలిసిన మన చరిత్రలో ఇంత పెద్ద దోపిడీ ఎప్పుడూ జరగలేదు. కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్లమంది బాలలు ఏడాదిపాటు బడి చదువుకు దూరమయ్యారట. మన దేశంలో అయితే పదహారు నెలలు గడిచింది. ఇంకా బడులు తెరుచు కోలేదు. బడి అంటే కేవలం చదువే కాదు. బడి అంటే బాల వికాసం. బడి అంటే చైతన్యం. బడి అంటే బాలమిత్ర. నాగరిక సంఘ జీవనానికి పునాది వేసేది బడి. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడైనా సరే, మనిషై పుట్టినప్పుడు బడికి వెళ్లకుండా ఉండలేదు. శ్రీరామావతారం దాల్చినప్పుడు కుల గురువు వశిష్టుని వద్దకు వెళ్లి, సకల విద్యలూ అభ్యసించాడు. శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు సాందీపుని గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. మనిషి నిండు నూరేళ్ల జీవితంలో బడికాలం పదేళ్లు మాత్రమే. విలువైన పదేళ్ల కాలంలోంచి ఒక యేడు జారి పోయింది. ఎనభై కోట్ల సంవత్సరాల అతివిలువైన బాల్యాన్ని ఎవరో మింగేశారు. కరోనా ఒక మహావిపత్తు, ఒక మహమ్మారి. మన చేతుల్లో ఏమీ లేదు. ఔను. మార్కెట్లూ, మాల్స్ మన చేతుల్లో ఉన్నాయి. అవి కిటకిటలాడవచ్చును. పండుగలూ, పబ్బాలూ మన చేతు ల్లోనే ఉన్నాయి. అప్పుడు కోవిడ్ రూల్స్‌ను ఉల్లంఘిం చవచ్చును. గుళ్లూ, గోపురాలు, ప్రార్థనాలయాలు మన చేతు ల్లోనే ఉన్నాయి. అవి తెరుచుకోవచ్చు. తొక్కిసలాట కూడా జరుపుకోవచ్చు. రాజకీయ సభలు ‘లక్ష’ణంగా జరుపుకోవ చ్చును. తాను బీఎస్పీలో చేరబోయే నల్లగొండ సభ లక్షకు తగ్గేదే లేదని ప్రవీణ్‌కుమార్ ప్రకటించవచ్చును. కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే ఇంద్రవెల్లి సభకు ‘లెక్క పెరిగినా ఫరవాలేదు కానీ లక్షకు తగ్గకుండా చూసుకో షేర్‌ఖాన్’ అంటూ రేవంత్‌రెడ్డి సవాలు చేయవచ్చును. ముఖ్యమంత్రి సభలు జనంతో పోటెత్తవచ్చును. ఎన్నికల ప్రచారాలతో నిత్యం వేలాదిమంది దూలాడావచ్చును. ధూమ్ ధామ్ చేయవచ్చును. అన్నీ జరిగిపోతున్నాయి. అంతా నార్మల్‌గానే వుంది. సూర్యుడు, చంద్రుడు, బీట్ కానిస్టేబుల్‌తో సహా ఎవరి డ్యూటీ వాళ్లు చేస్తూనే ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు మరి బడి ఎందుకు లేక పాయే కరోనా? ఎందుకంటే... భయం! దేశవ్యాప్తంగా పాలక శ్రేణుల్లో భయం. పాఠశాల విద్యపై మనం వేసిన శీతకన్ను బయట పడుతుందన్న భయం. మనం చూపిన నిర్లక్ష్యం కరోనా అద్దంలో బద్దలౌతుందన్న భయం. టాయిలెట్లు లేని, మంచినీరు దొరకని పరిశుభ్రత లేని బళ్లు తెరిస్తే కరోనా గుళ్లు తెరిచినట్లే అవు తుందన్న భయం. టీచర్లకూ, విద్యార్థులకూ వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని అమలుచేయలేమన్న భయం. నిత్యం విద్యార్థులకు పరీక్షలు చేస్తూ ప్రాంగణాలను శానిటైజ్ చేస్తూ బడులు నడప లేమన్న భయం. షట్టర్ మడిగెల్లో చింతపండు వ్యాపారం మాదిరిగా నడుపుకోవడానికి తాము అనుమతిచ్చిన ప్రైవేట్ స్కూళ్లలో కరోనా విస్ఫోటనం కావచ్చునన్న భయం. ఈ భయా లతో ఇంకెంతకాలం బాలల హక్కులను ఉల్లంఘిస్తారు? ఇంకెన్ని కోట్ల సంవత్సరాల బాల్యాన్ని హరిస్తారు? బడికెళ్లి చదువుకోవడం బాలలకు చట్టబద్ధమైన హక్కు. బాలలకు ఇంకెన్నో సహజమైన హక్కులున్నాయి. ఇప్పటికే అవి అంతరించిపోతున్నాయి. వారిని మనం సూర్యకాంతిలో తిరగ నివ్వడం లేదు. చంద్రుని వెన్నెల్లో ఆడుకోనివ్వడంలేదు. కోతి కొమ్మచ్చి లేదు, బావుల్లో చెరువుల్లో ఈత సాహసం లేదు. చేలల్లో చెలకల్లో చెప్పుల్లేకుండా తిరగడం తెలియదు. అరికాళ్లను పల్లేరుకాయలు గిచ్చడం తెలియదు. బొంతపురుగు గిలిగింత పెట్టడం తెలియదు. నీరెండ వెలుతురులో నీరెండిన ఏటి ఇసుకలో ఆడుకోవడం తెలియదు. కదిలిపోయే మబ్బుల నీడలు ఇసుక మీద బొమ్మలు బొమ్మలుగా మారుతుంటే విప్పార్చి చూసిన అనుభవం ఉండదు. అవి ఆకాశంలో సీతమ్మవారు వేస్తున్న ముగ్గుల ప్రతిబింబాలే సుమా అనుకునే సృజనాత్మక ఆలోచన తట్టదు. ఇవన్నీ లేత వయసు అనుభవించవలసిన సహజ హక్కులు. వీటిని మనం నిషిద్ధ జాబితాలో చేర్పించాము. చట్టబద్ధంగా కల్పించిన హక్కులను కూడా బాలలకు ఇంకెంత కాలం దూరం చేస్తారు? వర్చువల్ పేరుతో, దూరవిద్య పేరుతో, ఆన్లైన్ పేరుతో ప్రవేశపెట్టిన విద్యాపద్ధతులన్నీ విఫలమయ్యాయి. ఈ విధానా నికి ఉపాధ్యాయులే సన్నద్ధం కాలేదు. అనువైన సాంకేతిక వ్యవస్థ ఏర్పడలేదు. పేద విద్యార్థులు మరొకసారి వంచనకు గురయ్యారు. పేద, గ్రామీణ విద్యార్థులకు–పట్టణ, ధనిక విద్యా ర్థులకు మధ్యన అంతరం మరింత పెరిగింది. ఇంట్లో కంప్యూ టర్లు వై–ఫై సౌకర్యాలున్న విద్యార్థులకు కూడా పాఠాలు అంతంతమాత్రంగానే అర్థమయ్యాయి. పిల్లల చదువులకోసం తపించిపోయే మధ్యతరగతి తల్లిదండ్రులతో అప్పులు చేసి మొబైల్ ఫోన్లు కొనిపించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులైతే సిగ్నల్‌కోసం ఫోన్లు పట్టుకొని చెట్లెక్కడం, గుట్ట లెక్కడం వంటి చిత్రాలను పత్రికల్లో చూస్తున్నాము. ఫోన్ కూడా దొరకని విద్యార్థుల్లో చాలామంది చదువుకు చాప చుట్టేశారు. వీరిలో ఎందరు డ్రాపౌట్లుగా తేలుతారో చూడవలసి ఉన్నది. ఆన్లైన్ పాఠాల సంగతేమో గానీ మొబైల్ ఫోన్ ఒక వ్యసనంగా విద్యార్థుల్లో తయారైందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతు న్నారు. మొబైల్ ఫోన్లలో పాఠ్యేతర అంశాలపై పిల్లలు ఆసక్తిని పెంచుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ విద్యపై ‘సాక్షి’ నెట్వర్క్ చేసిన సర్వేలో కూడా ఈ సంగతి వెల్లడైంది. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలను ఎలా అర్థం చేసుకుంటు న్నారు? బడులను వెంటనే తెరవాలని కోరుకుంటున్నారా అనే అంశాలను తెలుసుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సాక్షి’ బృందం సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా 500 మంది విద్యార్థులతో, వారి తల్లిదండ్రుల్లో ఒక రితో, వారి క్లాస్ టీచర్‌తో కూడా ‘సాక్షి’ బృందం మాట్లాడింది. మొత్తంగా 1,500 మంది అభిప్రాయాలను క్రోడీ కరించారు. స్కూళ్ల మూసివేత వలన విద్యార్థులు ఒంటరితనాన్ని ఫీలవుతున్నారని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో 80 శాతం తల్లిదండ్రులు చెప్పారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల తల్లిదం డ్రుల్లో కూడా ఈ అభిప్రాయం 70 శాతం మందిలో ఉన్నది. విద్యార్థి మానసిక ధోరణి, ప్రవర్తనలో కూడా మార్పులు కన బడుతున్నాయని దాదాపు ఇదే నిష్పత్తిలో తల్లిదండ్రులు సమా ధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 40 శాతం మంది మాత్రమే ఆన్లైన్ పాఠాలను విన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 70 శాతం మంది హాజరయ్యామని చెప్పారు. రెండు తరగతుల విద్యార్థులు కూడా ఆ పాఠాలు తమకు అర్థం కాలేదనే చెప్పారు. 80 శాతం మంది ప్రభుత్వ విద్యార్థులు, 70 శాతం మంది ప్రైవేట్ విద్యార్థులు కూడా పాఠాలు అర్థం కాలేదని చెప్పారు. ఉపాధ్యాయులు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పారు. సగానికంటే ఎక్కువమంది విద్యార్థులకు పాఠాలు అర్థమైనట్టే తమకు తోచిందని చెప్పారు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల్లో 40 శాతం మంది మధ్యాహ్న భోజనాన్ని మిస్సవు తున్నామని చెప్పారు. మొబైల్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడపడం ఒక దుర్వ్యసనంగా తయారైందని 60 శాతం ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు, 50 శాతం మంది ప్రైవేట్ విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఇద్దరూ ఉద్యోగం చేసే తల్లి దండ్రులపై ఈ పరిణామం బాగానే ప్రభావం చూపింది. ఇంటివద్ద ఉండే పిల్లల్ని కనిపెట్టుకోవడానికి ప్రైవేట్ పిల్లల తల్లిదండ్రుల్లో 60 శాతం మంది ఎవరో ఒకరు పనికిపోవడం మానేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఇది ఇరవై శాతంగా ఉన్నది. ప్రైవేట్ పిల్లల తల్లిదండ్రుల్లో 60 శాతం మంది మొబైల్ లేదా కంప్యూటర్ కొనడానికి అప్పు చేశారు. ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి ఇది 30 శాతం. స్కూళ్లను వెంటనే తెరవాలా వద్దా అనే కీలకమైన అంశంపై మాత్రం దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇక్కడ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల వ్యత్యాసం కన్పించలేదు. 86 శాతం తల్లిదండ్రులు, 82 శాతం విద్యార్థులు, 80 శాతం టీచర్లు వెంటనే తెరవాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాల నాన్చివేత ధోరణికీ, ప్రజాభిప్రాయానికీ మధ్యన స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి థర్డ్‌వేవ్ బూచిని ముందుకు తెస్తున్నారు. ఆ తర్వాత ఫోర్త్ వేవ్ కూడా రాదన్న గ్యారంటీ ఏమున్నది? వేవ్‌లను ఎదుర్కొంటూనే స్కూళ్లను తెరవడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. దశాబ్దాలపాటు యుద్ధాల్లో మునిగితేలినప్పుడు కూడా వియత్నాం, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో జీవన వ్యాపారాలు ఆగలేదు. బడులు మూసివేయలేదు. ఇప్పుడు మన దేశంలో మాత్రం సమస్త వ్యాపారాలకూ, బార్లకు, షికార్లకు గేట్లెత్తి విద్యా రంగం గేట్లను మాత్రమే మూసివేయడం సమర్థనీయం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా విద్యాలయాలు తెరుచుకోవచ్చు నని సలహా ఇచ్చింది. విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విప్లవా త్మక సంస్కరణలు దేశానికిప్పుడు ఆదర్శం. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. మరో ఐదారు రాష్ట్రాలు కూడా ఈ నెలలో అదే బాటను అనుసరించబోతున్నాయి. విద్యారంగం రూపంలోనూ, సారంలోనూ (form and content) పూర్తి స్థాయి ప్రక్షాళనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. శిథిలా వస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సకల సౌకర్యాలను కల్పించడానికి దాదాపు 16 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. మూడో వంతు స్కూళ్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఏ బిడ్డ కూడా పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదని కొన్ని గొప్ప పథకాలను ఆయన అమలు చేస్తున్నారు. ‘అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక’ వంటి వరాల ఫలితంగా ఏ తల్లికీ బిడ్డ చదువు భారం కాని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ప్రకటించిన నూతన విద్యావిధానానికి (ఎన్ఈపీ) అనుగుణంగానే సృజనాత్మక మార్పులతో ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాన్ని రూపొందించారు. ప్రతి తరగతిలో మాతృభాష తెలుగును ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ప్రకటించారు. ప్రపంచస్థాయి పోటీల్లో నిలబడటం కోసం కింది స్థాయి నుంచే ఇంగ్లిష్‌ను బోధనా భాషగా అమలు చేయబో తున్నారు. 16 నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం కోసం ఒక అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. అందులో పొందుపరచిన ‘కరిక్యులమ్’ ప్లాన్‌ను పరిశీలిస్తే మన పాఠశాల విద్యావ్యవస్థ మీద మళ్లీ విశ్వాసం కలుగుతున్నది. ఆటపాటలకు, సృజనాత్మకతకు ఈ సిలబస్‌లో చోటు కల్పించారు. పర్యావరణం ఒక ప్రాధాన్యాంశంగా ఉంటుంది. ఆరోగ్యం, కెరీర్లపై పాఠాలుంటాయి. గుమస్తాల తయారీకి బ్రిటిష్ వాళ్లు ప్రవేశపెట్టిన మెకాలే విద్యా విధానాన్ని చాలా కాలం అనుసరించాము. తర్వాత కాలంలో కార్పొరేట్ సంస్థల అవసరాల కోసమే ఇంజనీరింగ్ విద్యను సవరించుకున్నాము. ఫలితంగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు పుట్టాల్సిన చోట బీపీఓల్లో పనిచేస్తే ఇంజనీర్లు పుట్టుకొచ్చారు. ఇప్పటికైనా దిద్దు బాటుకు ఉపక్రమిద్దాం. రూపాన్నీ, సారాన్నీ సంస్కరించుకొని ప్రారంభించుకోబోతున్న పాఠశాలలను స్వాగతిద్దాము. పిల్లల గురించి ‘శైశవ గీతి’లో శ్రీశ్రీ చెప్పిన పంక్తుల్ని గుర్తుకు తెచ్చు కుందాము. ‘‘మీదే మీదే సమస్త విశ్వం! మీరే లోకపు భాగ్య విధాతలు! మీ హాసంలో మెరుగులు తీరును... వచ్చేనాళ్ల విభా ప్రభాతములు!’’ ఈ ప్రపంచాన్ని పెద్దలు మనకిచ్చారు. మనం పిల్లలకిచ్చేయాలి. ఇచ్చేద్దాం! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వేలానికి రాహుల్ ప్రపంచకప్ బ్యాట్
న్యూఢిల్లీ: భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ‘నేను నా క్రికెట్ వస్తువులను టీమిండియా మద్దతు బృందం ‘భారత్ ఆర్మీ’కి విరాళంగా ఇస్తాను. ఇందులో ప్రపంచకప్‌లో వాడిన బ్యాట్‌తో పాటు టెస్టు, వన్డే, టి20 జెర్సీలు, గ్లౌజులు, ప్యాడ్లు, హెల్మెట్లు ఉన్నాయి. వారు వీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. వేలంలో సమకూరిన సొమ్మును వెనుకబడిన చిన్నారులను ఆదరిస్తోన్న ‘అవేర్’ ఫౌండేషన్‌కు అందజేస్తారు. సోమవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. అందరూ ఇందులో పాల్గొని చిన్నారులకు సహాయపడండి’ అని రాహుల్ పేర్కొన్నాడు. -
'విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ బీచ్ రోడ్ యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో నేచర్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బాలల సమాలోచన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అసెంబ్లీ లేజిస్లేటివ్ కమిటీ స్త్రీ, శిశు సంక్షమ వ్యవహారాలు చైర్మన్ విశ్వాసరాయి కళావతి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జి.హైమవతి తదితరులు పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం మార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. విద్య, బాలల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషికి బాలల హక్కుల పోరాట నేత కైలాష్ నాథ్ చటర్జీ జగన్‌ను కలిసి ప్రశంసించారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. సుస్థిర లక్ష్యాల సాధన కోసం బాలల సమాలోచన సదస్సు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని శిశు సంక్షమ వ్యవహారాలు చైర్మన్ విశ్వాసరాయి కళావతి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం బాలల చదువు కోసమేనని, సమాజంలో పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి పాఠశాలలో బాలలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని, ఆదీవాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం త్వరలోనే భాషా వలంటీర్లను నియమించనుందని కళావతి పేర్కొన్నారు. -
బడి ఎరుగని బాల్యం!
సాక్షి, రంగంపేట(తూర్పు గోదావరి) : బడిఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. చిన్నారుల తల్లిదండ్రుల పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తకాలు, దుస్తులు, బూట్లు, సాక్సులు వంటి వాటితో పాటు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం సమకూరుస్తోంది. అయినా కొందరు పిల్లలు ఇంకా బడికి దూరంగానే మిగిలిపోతున్నారు. వారు పొద్దున్న లేచింది మొదలు గ్రామాల్లో తిరుగుతూ రోడ్ల పక్కన పాడేసిన చెత్తలో చిత్తు కాగితాలు, అట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటున్నారు. అలా సేకరించిన చెత్తను మూటలుగా కట్టి రిక్షాలపై వేసి తొక్కుకుంటూ, తోసుకుంటూ తీసుకువెళ్లి తమ పెద్దవాళ్లకు అప్పగిస్తుంటే వారు దాని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం తాగి జల్సాలు చేసుకుంటున్నారు. పిల్లలు తెచ్చే సంపాదనకు అలవాటుపడ్డ తల్లిదండ్రులు వారిని ఈ చెత్త సేకరణకు ప్రోత్సహిస్తున్నారే తప్ప చదివించి ప్రయోజకుల్ని చేద్దామన్న ఆలోచన ఉండటం లేదు. వారి తల్లిదండ్రుల వ్యక్తిగత స్వార్థం, అధికారుల ఊదాసీనత వల్ల చాలా మంది బాలలు బడి బయటే గడుపుతున్నారు. ఆ బాలలకు చెప్పేవారు లేక తమ బాల్యాన్ని చెత్తకుప్పల మధ్య గడిపేస్తున్నారు. చిత్తుకాగితాలు, ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను ఏరుకుంటూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రులు తాము మద్యం తాగుతూ వీళ్లకు తాగడం అలవాటు చేసేస్తున్నారు. బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉన్నారంటూ ప్రభుత్వానికి లెక్కలు పంపే విద్యాశాఖ అధికారులకు రోడ్ల వెంబడి, చెత్తకుప్పల మధ్య తిరుగుతున్న బాల బాలికలు కనబడటంలేదు. అవగాహన కల్పించాలి అధికారులు ఇలాంటి బాలల తల్లిందండ్రులకు అవగాహన కల్పించి, వారిని నయానోభయానో ఒప్పించి స్కూళ్లల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను వారికి వివరించాల్సి ఉంది. పాఠశాలలో చేరే ప్రతి విద్యార్థి తల్లికి ఏటా రూ.15 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారని చెప్పి ఆ పిల్లలను పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
పిల్లల చదువుకు 12 లక్షలు
దేశంలో తల్లిదండ్రులు సగటున పెడుతున్న ఖర్చు ముంబై: భారత్‌లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం చేస్తున్న సగటు ఖర్చు రూ.12.22 లక్షలు. ప్రాథమిక పాఠశాల నుంచి పన్నెండో తరగతి వరకు అవుతున్న వ్యయమిది. ప్రపంచ సగటు రూ.28.58 లక్షల (44,221 డాలర్లు)తో పోలిస్తే ఇది చాలా తక్కువని హెచ్ఎస్బీసీ ‘ద వ్యాల్యూ ఎడ్యుకేషన్’సిరీస్ ‘హయ్యర్ అండ్ హయ్యర్’ అధ్యయనంలో తేలింది. ఇందులో ట్యూషన్ ఫీజులు, పుస్త కాలు, రవాణా, వసతి తదితర ఖర్చులన్నీ ఉన్నాయి. అం తేకాదు.. 59% మంది భారత తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం వేతనాల నుంచి ఖర్చు చేస్తుండగా, మరికొంతమం ది సేవింగ్స్, పెట్టుబడులు, ఇన్సూరెన్స్ ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. 32% మంది చేసే ఉద్యోగానికి తోడు అదనపు గంటలు పనిచేస్తున్నారు. హాంకాంగ్ టాప్: ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే... హాంకాంగ్ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం అత్యధికంగా సగటున రూ.85.42 లక్షలు ఖర్చు పెడుతున్నారు. తరువాతి స్థానాల్లో యూఏఈ (రూ.64.23 లక్షలు), సింగపూర్ (రూ.45.85 లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉండగా... ఫ్రాన్స్ రూ.10.8 లక్షలతో అట్టడుగున ఉంది. భారత్‌తో పాటు 15 దేశాలు... ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, హాంకాంగ్, ఇండోనేసియా, మలేసియా, మెక్సికో, సింగపూర్, తైవాన్, బ్రిటన్, అమెరికా, యూఏఈల్లోని 8,481 మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. ‘ప్రస్తుతం ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో విద్య కీలకంగా మారింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు తమ పిల్లలు అత్యుత్తమ ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆశిస్తున్నారు. ఇందుకు తమ వ్యక్తిగత, జీవనశైలి, ఆర్థిక త్యాగాలు చేసి పిల్లలను చదివిస్తున్నారు’ అని హెచ్ఎస్బీసీ భారత్ హెడ్ రామకృష్ణన్ చెప్పారు. పీజీకే అధిక ప్రాధాన్యం: భారత్‌లోని ప్రతి పది మందిలో 9 మంది (94 శాతం) తల్లిదండ్రులు తమ పిల్లలతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయించాలని భావిస్తు న్నారు. వీరిలో 79 శాతం మంది అందుకు తగిన నిధులు కూడా సమకూర్చుకుంటున్నారు. -
ఆపరేషన్ స్కూల్ చలో!
ఆదర్శం రెండు నెలలు... వెనక్కి వెళదాం. ఉద్రిక్తత, హింసాత్మక ఘటనలతో కాశ్మీరు అట్టుడికిపోతోంది. రోడ్లు బ్లాకై పోయాయి. బడులు బందైపోయాయి. నేషనల్ హైవేలో రాళ్లు, పెట్రోలుబాంబులు భయపెడుతున్నాయి. ‘యాపిల్ సీజన్’ తెల్లముఖం వేసింది. ఇల్లు విడిచి బయటికి రావడమే ఒక సాహసకృత్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ‘కామ్‌డౌన్’ ఆపరేషన్ చేపట్టింది. లోయలో ఒకవైపు సాధారణ పరిస్థితి నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే, మరోవైపు స్థానికులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, పిల్లల్లో భయాన్ని పోగొట్టడానికి ‘ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ’లో భాగంగా... వారితో సన్నిహితంగా కలిసిపోయేవారు సైనికులు. ఇక్కడితో మాత్రమే ఆగిపోలేదు. పిల్లల చదువులు దెబ్బతినకుండా ‘స్కూల్ చలో’ ఆపరేషన్ చేపట్టింది సైన్యం. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల గురించి బెంగపడడం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే... ఆందోళనకారులు ఎన్నో స్కూళ్లను ధ్వంసం చేశారు, కొన్ని నెలల నుంచి స్కూళ్లన్నీ మూతబడ్డాయి. పిల్లలు చదువు మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది.‘‘ఫలానా స్కూలు దగ్ధం చేశారు... లాంటి వార్తలు విన్నప్పుడల్లా నా గుండె కాలిపోయినట్లు అనిపించేది. ఇది మంచి పద్ధతి కాదు. సమాజానికి మంచిది కాదు. విద్య లేని సమాజానికి జీవం ఉండదు’’ అని ఆవేదన చెందాడు ముజఫర్ అనే ఉపాధ్యాయుడు. ఆయనలాగే ఎంతో మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కన్నీరు కార్చారు. దూరమైన చదువును పిల్లలకు చేరువ చేయడానికి ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించారు మేజర్ జనరల్ అశోక్ నరుల. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ‘స్కూల్ చలో’ ఆపరేషన్. ‘‘నేను కేవలం ఆర్మీ ఆఫీసర్‌గా ఆలోచించడం లేదు. ఇద్దరు పిల్లల తండ్రిగా ఆలోచిస్తున్నాను. పిల్లలు చదువుకు దూరమైతే ఒక తండ్రిగా నేను ఎంత బాధపడతానో అలాంటి బాధను చాలామంది తల్లిదండ్రులలో చూశాను. ఆ బాధను పోగొట్టి... పిల్లలను బడికి చేరువచేయడమే మా స్కూల్ చలో ఆపరేషన్ ఉద్దేశం’’ అంటున్నారు మేజర్ జనరల్ అశోక్. అనుకోవడం వేరు అనుకున్నదాన్ని ఆచరణలోకి తీసుకురావడం వేరు. అందుకు ఓపికి కావాలి. పట్టుదల కావాలి. అవి సైనికులలో ఉండడం వల్లే ‘స్కూల్ చలో’ బండి పట్టాల మీదికి వెళ్లింది. అయితే మొదట అది అంత సజావుగా ఏమీ సాగలేదు.‘‘మీ పిల్లలను స్కూలుకు పంపించండి’’ అంటూ సైనికులు గడప గడపకు వెళ్లారు.‘‘పెద్దవాళ్లే బయటికి వెళ్లడానికి జంకుతున్నారు. పిల్లల్ని ఎలా పంపిస్తాం? చదువు కంటే వాళ్ల క్షేమం మాకు ముఖ్యం’’ అనే తల్లిదండ్రులే ఎక్కువగా కనిపించారు. అలాంటి వాళ్లతో అనేకరకాలుగా మాట్లాడి, వాళ్లలో ధైర్యం నింపి, పిల్లలకు చదువు అనేది ఎంత ముఖ్యమో సూక్ష్మంగా అవగాహన పరిచి ‘స్కూలు చలో’ ఊపందుకోవడానికి ఓపిగ్గా కృషి చేశారు. మొదట్లో... స్కూళ్లలో పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు సైతం వెనకడుగు వేసేవారు. ‘ఎందుకొచ్చిన సమస్య!’ అన్నట్లుగానే ఉండేది వారి వైఖరి. అలాంటి వాళ్లలో కూడా తమ మాటలతో మార్పు తేవడమే కాదు... వారే స్వయంగా పిల్లలను సమీకరించి స్కూల్‌కు తీసుకువెళ్లేలా చేశారు. ‘మాకు డబ్బు వద్దు. కీర్తి వద్దు. పుస్తకాలు కావాలి. బడి కావాలి’ అని పిల్లల నోటి నుంచి వినిపించే నినాదాలు తమ పిల్లలను స్కూలుకు పంపడానికి ఇష్టపడని తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేసి స్కూలుకు పంపేలా చేస్తున్నాయి. పిల్లలకు చదువు చెప్పించడమే కాదు ఆటపాటలు, వ్యక్తిత్వవికాసం... తదితర విషయాలలో శిక్షణ ఇప్పిస్తుంది ఆర్మీ. ‘నవజవాన్’ అనే క్లబ్ ఏర్పాటు చేసింది. ఈ క్లబ్లో పిల్లలు, పెద్దలు ఆటల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. కొత్త మెలకువలు, ఆటలను నేర్చుకుంటారు. ‘జైజవాన్, జై కిసాన్’ అని పిల్లలు పాఠాల్లో చదువుకుంటారు. తాము జై కొట్టే జవాన్ తమ దగ్గరికి వచ్చాడు.‘నేనున్నాను’ అంటూ కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాడు. విజ్ఞాన లోక ద్వారాలు తెరిచాడు. జై జవాన్! -
మంచి మనసులు
ఆదర్శం ‘చిన్న పని చేయడానికైనా సరే...గొప్ప మనసుండాలి’ అంటారు. బెంగళూరులోని ‘టాటా షేర్వుడ్ రెసిడెన్షియల్ సొసైటీ’ వాసులు తమ ఇండ్లలో పనిచేసే వారి పిల్లల చదువు నుంచి మొదలు ఆరోగ్యం వరకు రకరకాలుగా శ్రద్ధ తీసుకుంటున్నారు. మామూలుగానైతే... పని వాళ్లు రావడం, తమ పనేదో చేసుకొని పోవడం వరకే ఉంటుంది. అయితే ఈ రెసిడెన్సీవాసులు మాత్రం తమ వంటవాళ్లు, డ్రైవర్లు, క్లీనర్లు... ఇతర పనివాళ్ల పిల్లలకు ట్యూషన్ పాఠాలు చెప్పడం నుంచి మొదలు స్కూలు ఫీజులు కట్టడం వరకు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం... దీపావళికి రెండు రోజుల ముందు ఈ రెసిడెన్సీలో వంట పని చేసే మహిళ ఒకరు జబ్బున పడ్డారు. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు అవసరమైన సొమ్ము... నాలుగు లక్షలు! రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబానికి ఆ మొత్తం కలలోని మాట. వారి బాధ మాటలకు అందనిది. ఏంచేయాలో తోచక ఇంటిల్లిపాది కన్నీరు మున్నీరయ్యారు. ఆ నోటా ఈ నోటా పడి విషయం సొసైటీవాసులకు తెలిసింది. తమ కుటుంబసభ్యులకో, బంధువులకో సమస్య వచ్చినప్పుడు ఎంత సీరియస్‌గా, సిన్సియర్‌గా స్పందిస్తారో అదే స్థాయిలో స్పందించారు. సానుభూతి చూపడానికి మాత్రమే పరిమితమై పోలేదు. కార్యాచరణ గురించి ఆలోచించారు. పరిస్థితిని వివరిస్తూ సొసైటీ గూగుల్ గ్రూప్‌లో ఇ-మెయిల్ పెట్టారు. మంచి స్పందన కనిపించింది. నాలుగు రోజుల్లోనే మూడు లక్షల రూపాయలు వసూలయ్యాయి. రెసిడెన్సీవాసులు మాత్రమే కాదు... వారి బంధువులు, పరిచయస్థులు కూడా తమ వంతుగా సహాయం చేశారు. అలా... సహాయ నిధి... నాలుగున్నర లక్షలకు చేరింది. సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. త్వరలోనే ఆ వంటమనిషి కోలుకుంది. ఈ సంఘటన రెసిడెన్సీ వాసుల మనసుల్లో సంతోషాన్ని నింపింది. ఒక మంచి పనిచేశామనే భావన వారిలో కనిపించింది. ‘మంచి పని’లోని గొప్పదనం ఏమిటంటే అది మరిన్ని మంచి పనులకు దారి చూపుతుంది. పేద వంటమనిషికి చేసిన సహాయం కూడా మరిన్ని మంచి పనులకు దారి చూపింది. వంట మనిషి కోసం సేకరించిన డబ్బులో మిగిలిన మొత్తాన్ని ఎలా ఉపయోగించాలనేదాని గురించి రెసిడెన్సీవాసులు ఒక సమావేశం నిర్వహించుకున్నారు. అనేక రకాలుగా ఆలోచించిన తరువాత... ఆ మొత్తాన్ని రెసిడెన్సీలో పని చేసే వారి పిల్లల సంక్షేమం కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వాలంటరీ గ్రూప్‌గా ఏర్పడి మరిన్ని మంచి పనులు చేయాలనుకున్నారు. ఒక ప్రణాళిక తయారు చేసిన తరువాత... తమ దగ్గర ఉన్న మొత్తానికి మరి కొంత మొత్తాన్ని సేకరించి పనివారి పిల్లల బడి ఫీజు కట్టాలనుకున్నారు. అలా మరో అడుగు పడింది. మొదటి సంవత్సరంలోనే నలభై మంది పిల్లల విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. ‘‘మనం చేస్తున్న పని మంచిదే అయినప్పటికీ... ఇది మాత్రమే సరిపోతుందా? డబ్బులు ఇచ్చి మాత్రమే తృప్తి పడుతున్నామా? స్కూలు ఫీజు గురించే మాత్రమే కాదు వారి చదువుల బాగోగులు గురించి కూడా పట్టించుకోవాలనుకుంటున్నాం’’ అని చెప్పారు ఒక వాలంటీర్. ‘ఇంకా ఏదైనా చేయాలి’ అని గ్రూప్ సభ్యులు ఎప్పుడైతే అనుకున్నారు మరో మంచి పనికి అడుగు ముందు పడింది. పేరెంట్స్‌ను కలిసి వారి అవసరాలేమిటో తెలుసుకున్నారు. పిల్లలు చదువులో ఎలా ఉన్నారో పరీక్షించారు. చదువులో వెనకబడిన విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించారు. ‘‘బోధనతో మాకెవరికీ పెద్దగా పరిచయం లేదు. అయితే మాలోని ఆసక్తే మమ్మల్ని ఆ దిశగా ప్రేరేపించింది. చదువు అంటే పిల్లలకు భయం స్థానంలో ఇష్టాన్ని పెంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. స్కూలు పుస్తకాలతో సంబంధం లేకుండా కమ్యునికేషన్ స్కిల్స్ పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు పిల్లల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే మా ఉత్సాహం రెట్టింపవుతుంది’’ అంటున్నారు ఒక ఆర్గనైజర్. ‘టాటా షేర్వుడ్ రెసిడెన్సియల్ సొసైటీ’లోని వాలంటరీ గ్రూప్‌ను అందరూ ఆదర్శంగా తీసుకుంటే... సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది! -
అమ్మో...జూన్ నెల !!
వెంకటనారాయణ. ఈయన నగరంలోని ఓ మున్సిపల్ పాఠశాలలో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఈయన వేతనంలో నెలకు అన్ని కోతలు పోను రూ.30 వేలు చేతికి వస్తుంది. ప్రతినెలా 1వ తేదీ వస్తే.. జీతం వస్తుందని సంతోషపడతారు.. కానీ జూన్ నెల ప్రారంభమైతే మాత్రం అమ్మో జూన్ నెల వచ్చిందా.. అని ఉలిక్కిపడతారు. కారణం.. పాఠశాలలు ప్రారంభం కావడంతో పాటు పెరిగిన ఖర్చులతో అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఒక ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వైఎస్సార్ జిల్లా: విద్యా సంవత్సరం మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఇంట కొనుగోళ్ల సందడి ప్రారంభమైంది. పాఠశాలలు జూన్ రెండో వారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలకు వెళ్లే చిన్నారుల కోసం రెండు జతల బూట్లు, సాక్సులు, టై, రెండు జతల యూనిఫాం, పుస్తకాలు, నోటుబుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్‌నర్, అరైజర్స్ ఇలా ఒక్కటేమిటి పాఠశాలకు సంబంధించిన మొత్తం సామగ్రి కొనుగోలు చేయాలంటే కనీసం పది నుంచి ఇరవై వేల రూపాయలు అవసరమవుతాయి. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో చదువుతున్నా కనీసం రూ.40 నుంచి 60వేలు ఫీజుల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఇక హైస్కూల్, కళాశాల స్థాయిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక వీటితో పాటు నెలవారి అద్దె, పాలు, ఇంటిసరుకులు, కరెంటు బిల్లు, డిష్బిల్లు, కూరగాయలకు సంబంధిం చిన ఖర్చులు ఉండనే ఉన్నాయి. నిప్పులు కురిపిస్తున్న నిత్యావసర ధరలు.. నిత్యావసర ధరలు రోజురోజుకీ కొండెక్కుతున్నాయి. కంది పప్పు కిలో దాదాపు రూ.200 పలుకుతోంది. కూరగాయల ధరలు సైతం వెక్కిరిస్తుండటంతో సామాన్యుడి పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా తయారైంది. అప్పులు చేయక తప్పడం లేదు... జూన్ నెల వచ్చిందంటే మాకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలకు పుస్తకాలు, నోటు బుక్కు లు కొనేందుకు, దుస్తులు కొనేందుకు చాలా ఇబ్బం దులు పడుతున్నాం. దీనికి తోడు మాకు ఇవ్వాల్సిన వేతనాలు కూడా రెండు నెలలుగా ఇవ్వకపోవడంతో మా పరిస్థితి దారుణంగా ఉంది. - ఆరోగ్యమ్మ, మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జూన్ నెల వచ్చిందంటే తిప్పలు తప్పడం లేదు... జూన్ నెల ప్రారంభమైందంటే.. పిల్లల అడ్మిషన్లు, యూనిఫాం, షూ ఇలా ఒకటేమిటి అన్నింటా హడావుడి మొదలవుతుంది. దీనికితోడు నెలవారి ఖర్చులతో పాటు కనీసం మరో రూ.50వేలు ఫీజులు, అదనపు ఖర్చులు వస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీనికి హద్దు ఎక్కడ ఉంటుందో అర్థం కావడం లేదు. - బి. నిరంజన్రాజు, కోఆపరేటివ్ కాలనీ ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు... పాఠశాల ఫీజు: : రూ.20వేలు యూనిఫాం (రెండు జతలు) : రూ. 2000 షూ, సాక్సులు (రెండు జతలు) : రూ. 1500 ఆటో చార్జీలు (నెలకు) : రూ. 1000 పుస్తకాలు : రూ. 6000 నోటు బుక్స్ : రూ. 3000 బ్యాగులు, బాటిళ్లు, క్యారీబాక్స్ : రూ. 1000 ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు రూ. 32,500 ఇద్దరు పిల్లలు ఉంటే రూ. 65,000. -
పిల్లల చదువుకు ఏం చేస్తున్నారు?
విద్యా రుణంపై ధీమా వద్దు... కొంతమంది తల్లిదండ్రులు పిల్లల చదువులకు ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది కదా! ఇప్పటి నుంచే దాచుకోవడం దేనికి అని ఆలోచిస్తున్నారు. కానీ ఈ రుణాలు అన్ని కోర్సులకు, అన్ని యూనివర్సిటీలకు అందుబాటులో ఉండవనేది మొట్టమొదట గుర్తించాల్సిన విషయం. ఎంపిక చేసిన కోర్సులు, విదేశాల్లో చేసే కోర్సులకు, కొన్ని యూనివర్సిటీలకు మాత్రమే ఇవి లభిస్తున్నాయి. అంతేకాక ఈ రుణాలు తీసుకున్నాక 12 నెలల నుంచి 18 నెలల తర్వాత నుంచి వీటి ఈఎంఐలు మొదలవుతాయి. అంటే మీ పిల్లలు ఉద్యోగంలో చేరిన వెంటనే రుణాలు తీర్చడం మొదలు పెట్టాలి. ఆర్థికంగా పిల్లలకు ఇది భారమే. ముందుచూపుతో వ్యవహరిస్తే ఇటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లల చదువు కోసం తగినంత నిధిని సమకూర్చుకోవచ్చు. పిల్లల చదువుకోసం పొదుపు చేయడానికి 10 నుంచి 15 ఏళ్ల సమయం ఉంటుంది కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లలకు ఏ చదువు చెప్పించాలనుకుంటున్నారు? ఏ యూనివర్సిటీ? దానికెంత మొత్తం కావాలి? అనే అంశాలపై అవగాహనతో ప్లాన్ చెయ్యాలి. పిల్లల ఇన్వెస్ట్మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా వంటి అనేక ఇన్వెస్ట్మెంట్ పథకాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకు డిపాజిట్లలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తుండాలి. ఒకవేళ తల్లిదండ్రులకు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మొత్తం సొమ్ము నామినీకి ఇస్తారు. దీంతో మీ ఆర్థిక లక్ష్యం మధ్యలోనే ఆగే ప్రమాదం ఉంటుంది. బీమా పథకాలైతే తల్లిదండ్రులకు బీమా రక్షణతో పాటు ఇన్వెస్ట్మెంట్స్నూ కొనసాగించొచ్చు. అనుకోని సంఘటన ఏమైనా జరిగినా మీ లక్ష్యం దెబ్బతినదు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి స్థిరమైన రాబడిని అందించేలా కొన్ని భీమా పథకాలున్నాయి. ఎంత తొందరగా ఈ బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే అంత ఎక్కువ మొత్తం పొందవచ్చు. ఫైనాన్షియల్ బేసిక్స్ పొదుపు ఎలా..? మనకు ప్రతి నెల జీతం వస్తుంది. వచ్చిన మొత్తం జీతాన్ని ఖర్చు చేయలేం కదా? భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. ఈ పొదుపు మొత్తం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఒకే మొత్తంలో జీతం రాదు. అలాగే వారి వయసు, అవసరాలు వంటి తదితర విషయాలు కూడా ఎంత మొత్తంలో పొదుపు చేయాలనే అంశాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే యుక్త వయసు ఉద్యోగి తనకు వచ్చే జీతంలో ఎంత మొత్తాన్ని పొదుపు చేయాలనే విషయాన్ని కింద వివరించాము. * 23 ఏళ్ల వయసులో కెరీర్‌ను ప్రారంభించిన వ్యక్తి తనకు వచ్చే జీతంలో 60-65 శాతాన్ని పొదుపు చేయాలి. ఈ విధానాన్ని ఏడేళ్లు కొనసాగించాలి. * తర్వాతి 20 ఏళ్లు కూడా 25-30 శాతంగా పొదుపు చేస్తూ రావాలి. ఈ కాలంలో జీతం పెరుగుదలతోపాటు ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి పొదుపు మొత్తం తగ్గుతుంది. * అటు తర్వాత ఖర్చులు తగ్గుతాయి కనుక 35-40 శాతం పొదుపు చేయాలి. -
నమ్ముకుంటే..నట్టేట ముంచింది
బతుక్కింత భరోసా దొరికిందని సంబరపడిపోయారు. 20 ఏళ్లపాటు కంపెనీ కోసం సర్వశక్తులు ఒడ్డారు. తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించవచ్చని, వారి భవిష్యత్తును బంగారుమయం చేయొచ్చని కలలు కన్నారు. కానీ అవన్నీ కల్లలుగా మిగిలిపోతాయని ఊహించలేకపోయారు. అయినా ఇది తాత్కాలికమే అనుకున్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందనుకున్నారు. ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని, నమ్మి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అండగా ఉంటారని అనుకున్న వారికి చివరికి ఆశాభంగమే అయింది. బిల్ట్ కర్మాగారం మూతపడడంతో ఉపాధి కరువై అల్లాడిపోతున్నారు. పిల్లల చదువులకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థంకాక తల్లడిల్లిపోతున్నారు. కొందరు పిల్లల చదువులు మానిపిస్తే మరికొందరు మిత్తికి డబ్బులు తెచ్చి చదివిస్తున్నారు. - కమలాపురం బంగారం తాకట్టుపెట్టి చదివిస్తున్నాం నాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కూతురు ఇంటర్ సెకండియర్, రెండో అమ్మాయి ఫస్ట్ ఇయర్, మూడో కూతురు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఫ్యాక్టరీలో 20ఏళ్లు పనిచేసిన తర్వాత ఇటీవల పీఎఫ్ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు జాబ్ పర్మనెంట్ అవుతుందని ఆశపడుతున్న తరుణంలో కంపెనీ మూసేశారు. దీంతో రోడ్డున పడ్డాం. పిల్లల చదువులకు డబ్బుల్లేక ఒంటిమీద ఉన్న బంగారం తాకట్టుపెట్టి మూడు రూపాయల మిత్తికి డబ్బులు తెచ్చి ఫీజులు కట్టాం. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక కష్టాలు పడుతున్నాం. ఫ్యాక్టరీని నమ్ముకుని సగం వయసు దానికే ధారపోశాం. ఇప్పుడేదారి కనిపించడం లేదు. అధికారులు, నాయకులు, ప్రభుత్వం ఎవరూ పట్టించుకోవడం లేదు. - మందా ఏలియా దత్తన్న దయ చూపాలి బిల్ట్ కర్మాగారం మూతపడి ఎనిమిది నెలలవుతున్నా పట్టించుకునే నాథుడే లేడంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కరువై అష్టకష్టాలు పడుతున్నా ఏ నాయకుడు తమవైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటూ వాపోతున్నారు. నిర్మలా సీతారామన్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రి బండారు దత్తాత్రేయ, స్థానిక బీజేపీ నాయకులు, కార్మికులు కలిసి ఆమెకు వినతిపత్రం సమర్పించారు. కార్మాగారాన్ని కాపాడాలని వేడుకున్నారు. ఇప్పుడు బండారు దత్తాత్రేయ కార్మికమంత్రి కావడంతో కార్మికులు కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాక్టరీ ఒడిదొడుకులపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చించి పరిశ్రమను తిరిగి తెరిపిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. పనిలేక సెంట్రింగ్ పనులకు.. నాకు ఇద్దరు కూతుర్లు. ఒకరు ఎనిమిది, ఒకరు తొమ్మిది చదువుతున్నారు. కంపెనీ బంద్ అవడంతో ఉపాధి కోల్పోయాం. పిల్లలను చదివించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల్లో సెంట్రింగ్ పనికి వెళుతున్నాం. రోజుకు రూ.200 ఇస్తున్నారు. ఇవి ఏమూలకూ సరిపోవడం లేదు. ఇప్పటి వరకు సంపాదించింది ఏమీలేదు. కంపెనీ యాజమాన్యం మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపింది. సమాచారం కూడా ఇవ్వకుండా వెళ్లగొట్టింది. ఇప్పటికే చాలామంది ఊరు వదిలి వెళ్లి పోయారు. పిల్లలను విడిచి ఉండలేక ఇక్కడే వ్యవసాయం, సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాం. ఇక్కడేమో పనిదొరికే పరిస్థితి లేదు. పిల్లాపాపలను తీసుకుని ఎక్కడి కెళ్లాలి. ఎలా బతికేది. నాయకులు అదిచేస్తాం.. ఇది చేస్తాం అంటారు కానీ ఆదుకునేందుకు ఎవరూ ముందుకురారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ఫ్యాక్టరీని తెరిపించాలి. - తవిసి కర్ణ ఇటుకల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నా.. పిల్లలను సాదుకునేందుకు ఇటుకల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నా. రోజుకు రూ.200 ఇస్తున్నారు. ఫ్యాక్టరీ ఉన్నప్పుడు రోజూ పని ఉంటుందని భోరోసా ఉండేది. ఇప్పుడు పని కూడా దొరకడంలేదు. కూలి పనిలోనూ తీవ్ర పోటీ ఉంది. అయినా కావాలని పోటీపడి పనికి వెళ్తున్నాం. అన్నీ వదులుకుని బిల్ట్పైనే ఆశలు పెట్టుకుంటే ఇలా జీవితాలు అల్లకల్లోలం అవుతాయని ఊహించలేకపోయాం. ఫ్యాక్టరీ బంద్ అయినప్పటి నుంచి చాలామంది దిగులుతో మంచంపట్టారు. కంపెనీ తిరిగి తెరుచుకోకుంటే ఆత్మహత్యలు తప్పవు. తెలంగాణ వచ్చినంక మంచి జరుగుతుందనుకుంటే ఇలాగైంది. కార్మిక ప్రభుత్వం ముందుకొచ్చి కంపెనీని తెరిపించాలి. - కలాల రాంబాబు -
అమ్మ ఆది గురువు
- పిల్లల విద్యాభ్యాసంలో కీలక పాత్ర - స్కూల్‌కు తీసుకెళ్లడం.. తీసుకురావడం.. - తల్లులకు రోజంతా హోం‘వర్క్’ మంచిర్యాల అర్బన్ : పిల్లల మొదటి బడి అమ్మ ఒడే. చిన్నారులను పాఠశాలల్లో చేర్చే వరకూ అమ్మనే గురువు. అందుకే ఆది గురువు తల్లి అంటారు పెద్దలు. పిల్లల ఉజ్వల భవిష్యత్ బంగారు బాట వేయడంలో మాతృమూర్తిదే కీలక పాత్ర. అక్షరాభ్యాసం దగ్గర నుంచి ఉన్నత విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు అమ్మ పడే శ్రమ అంతా ఇంతా కాదు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకూ ఇంటి పని.. వంట పని.. స్కూల్ పనులతో బిజీ బిజీ. పిల్లలను ఉదయం ఏడున్నరకు నిద్ర లేపడం, స్నానం చేయించి చక్కగా తయారు చేయడం, టిఫిన్ తినిపించడం దగ్గర నుంచి టిఫిన్ బాక్స్ సర్దడం వరకు అన్నీ చక్కబెడుతుంది. బ్యాగులో పుస్తకాలు, పెన్ను, పెన్సిల్ ఇలా సరి చూస్తుంది. స్కూల్‌కు తీసుకెళ్లడం, చిన్నపిల్లలైతే మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్లి తినిపించడం, సాయంత్రం స్కూల్ నుంచి తీసుకు రావడం దినచర్యగా మారింది. కొందరు పిల్లలు ఆటోలో, స్కూల్ బస్సులో వెళ్తుండగా.. మరికొందరు తండ్రులు పాఠశాలల్లో మోటార్‌సైకిల్‌పై దింపేస్తున్నారు. స్కూల్లో జరిగిన విషయాలను పిల్లలు చెబుతుంటే చిన్ని చిన్ని మాటలను విని సంబరపడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే తల్లి, భార్య పాత్రలో పోషిస్తూ యంత్రంలా పని చేస్తున్నారు. సెలవు రోజుల్లో కొంత ఉపశమనం కలుగుతోంది. మిగితా రోజుల్లో ఎంత కష్టమైన పనైనా సరే ఇష్టంగా చేస్తారు. పట్టణాలకు వలస బాట పిల్లల బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంతటి త్యాగాలకైనా వెనుకంజ వేయడం లేదు. చదువు విలువ తెలిసిన వారు పిల్లల ఉత్తమ భవిష్యత్ కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటుఆన్నరు. ఒకప్పుడు పొట్ట కూటి కోసం వలస వెళ్లిన గ్రామీణులు.. ప్రస్తుతం పిల్లల చదువు కోసం పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. ఉన్నత విద్యకు అవసరమైన డబ్బులు సమకూర్చుకునేలా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వారైతే మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ చదువుపై అవగాహన పెరిగింది. కార్పొరేట్ చదువులూ విస్తరించాయి. హైస్కూల్ చదువు స్థానికంగానే పూర్తి కాగానే కళాశాల చదువు కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల వంటి పట్టణాలకు వెళ్తున్నారు. ఉద్యోగులూ పిల్లల చదువు కోసం ఆయా నగరాలు, పట్టణాలకు బదిలీ చేయించుకుంటున్నారు. ఉత్తమ కళాశాలలను ఎంపిక చేసి ఎంత ఫీజైనా చెల్లించడానికి వెనుకంజ వేయడం లేదు. చదువులో పిల్లల్లో అంతగా పురోగతి లేకపోవడంతో కుటుంబాన్ని హైదరాబాద్, వరంగల్ నగరాలకు మారుస్తున్నారు. మంచిర్యాల చట్టుపక్కల గ్రామీణులు కళాశాల చదువు కోసం మంచిర్యాలకు వస్తున్నారు. మంచిర్యాలకు చెందిన అనేక మంది పిల్లల చదువు కోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు. వ్యాపారులు, ఉద్యోగుల పిల్లల్లో కొందరు హాస్టల్ చదువుకు ససేమిరా అంటే.. వారి కోసం తల్లులు హైదరాబాద్‌లో గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ విధానం ద్వారా ఖర్చు తగ్గడంతోపాటు పిల్లల చదువు తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశముంది. పిల్లలు క్రమ శిక్షణతో ఉంటారు. హోంవర్క్ బండెడు బరువు ఉన్న పుస్తకాలను మోసి పాఠశాలకు వెళ్లి వచ్చిన పిల్లలు అలసిపోయి పడుకుంటారు. కొద్ది సేపటి తర్వాత ఆటలాడేందుకు క్రీడా మైదానం వైపు పరుగులు తీస్తారు. మళ్లీ అలసిపోయి ఇంటికి వస్తారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఇచ్చిన హోంవర్క్‌ను మరిచిపోతారు. తల్లి హోంవర్క్ విషయమై గుర్తు చేస్తే చేయనంటూ మారాం చేస్తారు. పిల్లలను దగ్గరకు తీసుకుని హోం వర్క్ చేయిస్తుంది. అక్షరాలు దిద్దిస్తుంది. గురువు స్థానంలో నిలుస్తుంది. హోం వర్క్ చేయనని మారాం చేసినా బుజ్జగించి చేయిస్తుంది. చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా...అంటూ చదువుపై శ్రద్ధ పెరిగేలా చిట్టి కథలు చెబుతుంది. పిల్లలకు సంతుష్టి నిద్ర అవసరం కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోయేలా లాలిపాట పాడుతుంది. పాఠశాలకు తల్లులు.. ఇదేంటి అమ్మలు పాఠశాలకు వెళ్లడం ఏమిటీ అనుకుంటున్నారా..? అవును ఇప్పుడు పిల్లలతోపాటు తల్లులూ బడి బాట పడుతున్నారు. పిల్లలకు మధ్యాహ్నాం వేళ భోజనం తీసుకు వెళ్లడం దిన చర్యగా మారింది. స్కూల్ వెళ్లనని మారాం చేసే పిల్లలను బుజ్జగించి పంపించడం, వారికి ఇష్టమైన కూరలు, టిఫిన్లు తెస్తానని భరోసా ఇస్తేనే స్కూల్‌కు వెళ్తున్నారు. పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలు తీసుకెళ్లి మధ్యాహ్నా భోజన విరామ సమయంలో తల్లులే స్వయంగా గోరుముద్దలు తినిపిస్తున్నారు. దగ్గరుండి భోజనం పెట్టడం, నీళ్లు తాగించడం చేసిన తర్వాత పిల్లలను తరగతి గదిలో విడిచి ఇంటి బాట పడుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లడం వల్ల పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకునే వీలు కలుగుతుంది. ఎప్పుడు ఇంట్లో ఉండే తల్లులకు ఇతర పిల్లల తల్లులతో పరిచయాలు ఏర్పడుతాయి. కొన్ని పాఠశాలల్లో తల్లులు కూడా ఆంగ్లం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదివిన తల్లులు స్పోకెన్ ఇంగ్లిషు నేర్చుకుంటున్నారు. ఇంగ్లిషుపై పరిజ్ఞానం పెంచకుంటే పిల్లలతో చక్కగా హోంవర్క్ చేయించడంతోపాటు విద్యాబుద్ధులు నేర్పే అవకాశం ఉంది. ఆహారం పిల్లల ఆహారం విషయంలో తల్లి ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. రుచికరమైన భోజనం, టిఫిన్లు చేసి పెడుతుంది. ఆరోగ్యానికి అవసరమైన పండ్లు, జ్యూస్ అందిస్తుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, చురుకుగా మెదలాలని తపిస్తుంది. శక్తినిచ్చే పౌడర్లను పాలల్లో వేసి తాగిస్తుంది. పిల్లల చదువు.. వారి ఆరోగ్యంపై తల్లి చూపే శ్రద్ధ మరెవరూ చూపలేరు. తండ్రుల పాత్ర కీలకమే.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంలో తండ్రుల పాత్ర కీలకంగా పేర్కొనవచ్చు. పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించడం దగ్గర నుంచి రోజు ద్విచక్రవాహనంపై పాఠశాలకు తీసుకెళ్లడం, తీసుకు రావడం, యూనిఫాం, షూ, సాక్స్‌లు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, రబ్బరులు కొనుగోలు చేయడం వరకు అన్నీ తండ్రులు దగ్గరుండి చేస్తారు. పాఠశాల స్థాయి కాగానే ఏ కళాశాలలో చేర్పించాలి, ఉన్నత చదువులకు ఏ కోర్సులో చేర్పించాలనే అంశాలను సూచిస్తాడు. ఎక్కడా తమ పిల్లలకు నష్టం జరగకుండా, భవిష్యత్‌కు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.