నమ్ముకుంటే..నట్టేట ముంచింది
బతుక్కింత భరోసా దొరికిందని సంబరపడిపోయారు. 20 ఏళ్లపాటు కంపెనీ కోసం సర్వశక్తులు ఒడ్డారు. తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించవచ్చని, వారి భవిష్యత్తును బంగారుమయం చేయొచ్చని కలలు కన్నారు. కానీ అవన్నీ కల్లలుగా మిగిలిపోతాయని ఊహించలేకపోయారు. అయినా ఇది తాత్కాలికమే అనుకున్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందనుకున్నారు.
ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని, నమ్మి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అండగా ఉంటారని అనుకున్న వారికి చివరికి ఆశాభంగమే అయింది. బిల్ట్ కర్మాగారం మూతపడడంతో ఉపాధి కరువై అల్లాడిపోతున్నారు. పిల్లల చదువులకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థంకాక తల్లడిల్లిపోతున్నారు. కొందరు పిల్లల చదువులు మానిపిస్తే మరికొందరు మిత్తికి డబ్బులు తెచ్చి చదివిస్తున్నారు.
- కమలాపురం
బంగారం తాకట్టుపెట్టి చదివిస్తున్నాం
నాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కూతురు ఇంటర్ సెకండియర్, రెండో అమ్మాయి ఫస్ట్ ఇయర్, మూడో కూతురు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఫ్యాక్టరీలో 20ఏళ్లు పనిచేసిన తర్వాత ఇటీవల పీఎఫ్ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు జాబ్ పర్మనెంట్ అవుతుందని ఆశపడుతున్న తరుణంలో కంపెనీ మూసేశారు. దీంతో రోడ్డున పడ్డాం. పిల్లల చదువులకు డబ్బుల్లేక ఒంటిమీద ఉన్న బంగారం తాకట్టుపెట్టి మూడు రూపాయల మిత్తికి డబ్బులు తెచ్చి ఫీజులు కట్టాం. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక కష్టాలు పడుతున్నాం. ఫ్యాక్టరీని నమ్ముకుని సగం వయసు దానికే ధారపోశాం. ఇప్పుడేదారి కనిపించడం లేదు. అధికారులు, నాయకులు, ప్రభుత్వం ఎవరూ పట్టించుకోవడం లేదు.
- మందా ఏలియా
దత్తన్న దయ చూపాలి
బిల్ట్ కర్మాగారం మూతపడి ఎనిమిది నెలలవుతున్నా పట్టించుకునే నాథుడే లేడంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కరువై అష్టకష్టాలు పడుతున్నా ఏ నాయకుడు తమవైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటూ వాపోతున్నారు. నిర్మలా సీతారామన్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రి బండారు దత్తాత్రేయ, స్థానిక బీజేపీ నాయకులు, కార్మికులు కలిసి ఆమెకు వినతిపత్రం సమర్పించారు. కార్మాగారాన్ని కాపాడాలని వేడుకున్నారు. ఇప్పుడు బండారు దత్తాత్రేయ కార్మికమంత్రి కావడంతో కార్మికులు కొండంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాక్టరీ ఒడిదొడుకులపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చించి పరిశ్రమను తిరిగి తెరిపిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు.
పనిలేక సెంట్రింగ్ పనులకు..
నాకు ఇద్దరు కూతుర్లు. ఒకరు ఎనిమిది, ఒకరు తొమ్మిది చదువుతున్నారు. కంపెనీ బంద్ అవడంతో ఉపాధి కోల్పోయాం. పిల్లలను చదివించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల్లో సెంట్రింగ్ పనికి వెళుతున్నాం. రోజుకు రూ.200 ఇస్తున్నారు. ఇవి ఏమూలకూ సరిపోవడం లేదు. ఇప్పటి వరకు సంపాదించింది ఏమీలేదు. కంపెనీ యాజమాన్యం మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపింది. సమాచారం కూడా ఇవ్వకుండా వెళ్లగొట్టింది. ఇప్పటికే చాలామంది ఊరు వదిలి వెళ్లి పోయారు. పిల్లలను విడిచి ఉండలేక ఇక్కడే వ్యవసాయం, సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాం. ఇక్కడేమో పనిదొరికే పరిస్థితి లేదు. పిల్లాపాపలను తీసుకుని ఎక్కడి కెళ్లాలి. ఎలా బతికేది. నాయకులు అదిచేస్తాం.. ఇది చేస్తాం అంటారు కానీ ఆదుకునేందుకు ఎవరూ ముందుకురారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ఫ్యాక్టరీని తెరిపించాలి.
- తవిసి కర్ణ
ఇటుకల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నా..
పిల్లలను సాదుకునేందుకు ఇటుకల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నా. రోజుకు రూ.200 ఇస్తున్నారు. ఫ్యాక్టరీ ఉన్నప్పుడు రోజూ పని ఉంటుందని భోరోసా ఉండేది. ఇప్పుడు పని కూడా దొరకడంలేదు. కూలి పనిలోనూ తీవ్ర పోటీ ఉంది. అయినా కావాలని పోటీపడి పనికి వెళ్తున్నాం. అన్నీ వదులుకుని బిల్ట్‌పైనే ఆశలు పెట్టుకుంటే ఇలా జీవితాలు అల్లకల్లోలం అవుతాయని ఊహించలేకపోయాం. ఫ్యాక్టరీ బంద్ అయినప్పటి నుంచి చాలామంది దిగులుతో మంచంపట్టారు. కంపెనీ తిరిగి తెరుచుకోకుంటే ఆత్మహత్యలు తప్పవు. తెలంగాణ వచ్చినంక మంచి జరుగుతుందనుకుంటే ఇలాగైంది. కార్మిక ప్రభుత్వం ముందుకొచ్చి కంపెనీని తెరిపించాలి.
- కలాల రాంబాబు