సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలో 49.57 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మే నెలలో జరిగిన రెగ్యులర్‌తో కలుపుకుంటే ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ ఉత్తీర్ణత 80.80 శాతంగా నమోదైంది. ఆగస్టు 1వ తేదీ నుంచి జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా జనరల్‌కు 1,02,236 మంది, ఒకేషనల్‌కు 12,053 మంది హాజరయ్యారని, వీరిలో జనరల్ 48,816(47.74 శాతం) మంది, ఒకేషనల్ 7,843 (65.07 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో మార్కుల జాబితాలను అందుబాటులో ఉంచామన్నారు. రెగ్యులర్, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ కలిపి జనరల్ ఇంటర్‌లో 3,92,258 మంది పరీక్ష రాస్తే, 3,18,247 మంది (81.13 శాతం), ఒకేషనల్‌లో 44,112 మంది రాస్తే 34,361 (77.89 శాతం) ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు సెప్టెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌లో 67 శాతం ఉత్తీర్ణత
ఫస్టియర్‌లో అడ్వాన్స్ సప్లిమెంటరీలో జనరల్ 1,49,285 మంది, ఒకేషనల్ 10,858 మంది ఉత్తీర్ణులైనట్టు బోర్డు కార్యదర్శి తెలిపారు. 1,00,513 మంది జనరల్‌లో, 2,146 మంది ఒకేషనల్‌లో ఇంప్రూవ్‌మెంట్ రాసినట్టు బోర్డ్ పేర్కొంది. పరీక్ష రాసినవారిలో 80028 మందికి ఏ గ్రేడ్ వచ్చినట్టు స్పష్టం చేసింది. అడ్వాన్స్‌డ్ రాసినవారిలో జనరల్ ఉత్తీర్ణత శాతం 67.72 శాతం, ఒకేషనల్‌లో 57.28 శాతం నమోదైనట్టు తెలిపింది. ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షలకు జనరల్‌లో 4,14,380 మంది విద్యార్థులు హాజరైతే, వీరిలో 2,68,763 (64.85 శాతం) పాసయినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment