
హనుమకొండ: సొంత ఇంటి కల నెరవేరాలంటే.. అందుకు తగిన స్థలం ఉండాలి. కనీసం 100 గజాల జాగా లేకపోతే సౌకర్యవంతమైన ఇల్లు కట్టలేం. కానీ ఓ వ్యక్తి 23 గజాల స్థలంలోనే రెండతస్తుల ఇల్లు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరకాల (Parakala) పట్టణంలోని 22వ వార్డుకు చెందిన ఫార్మసీ ఉద్యోగి కాపర్తి రాజు తల్లి భారతమ్మ పెంకుటింట్లో నివాసం ఉండేది.
కాగా రాజు కుమారుడు దత్తు అదే స్థలంలో తన నానమ్మ కోసం సొంత ప్లాన్‌తో రూ.7 లక్షలు ఖర్చు పెట్టి, 23 గజాల స్థలంలోనే రెండు అంతస్తుల ఇల్లు నిర్మించాడు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్కింగ్, స్టోర్ రూం, మొదటి అంతస్తులో వంటగది, డైనింగ్ హాల్, రెండో అంతస్తులో అటాచ్డ్ బాత్‌రూంతో బెడ్‌రూమ్ నిర్మాణం చేసి స్థానికులనే కాక ఇంజనీర్లను సైతం ఆశ్చర్యపడేలా చేశాడు.
సెంచరీ బనానా సెలబ్రేషన్
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని గొర్లోనిబాయి గ్రామంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంబుల లచ్చమ్మకు సోమవారంతో 100 సంవత్సరాలు నిండాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా ఐదుగురు కుమారులు బాలకృష్ణయ్య, రాములు, వెంకటయ్య, భీమన్న, సుఖ్‌దేవ్‌తోపాటు పుట్టింటికి వచ్చిన ఆమె ముగ్గురు కుమార్తెలు, మనవళ్లు, మునిమనవళ్లు అరటిపండ్లతో తులాభారం నిర్వహించారు. తల్లిదండ్రులను భారంగా చూసే ఈ రోజుల్లో అమ్మకు వందేళ్ల పండుగ నిర్వహించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈమె వంశాంకురంగా 65 మంది ఉండటం విశేషం.