
వేసవిలో స్వచ్ఛంద సంస్థ మితాహారం పంపిణీ
రెండు నెలల పాటు బాటసారుల ఆకలి తీరుస్తూ..
పేదలకు శ్రీనివాస రామానుజ చారిటబుల్ ట్రస్ట్ సేవలు
రోజుకో పూట నిత్యాన్నదానం
నగరంలోని సనత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస రామానుజ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు, బాటసారులకు సేవలందిస్తోంది. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్రలా మారుతోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం మితాహారాన్ని అందిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తోంది. యేటా రెండు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం వేసవి కావడంతో మంగళవారం నుంచి మరోసారి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. – సనత్‌నగర్
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీరుస్తోంది శ్రీనివాస సమాజ సేవా సమితి. స్థానిక బీకేగూడ పార్కు వద్ద రోజుకు 250 నుంచి 300 మంది వరకూ మధ్యాహ్నం మిత భోజనాన్ని వడ్డించేందుకు సీనియర్ సిటిజన్స్ సిద్ధమయ్యారు.
దాతల సహకారంతో..
రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున దాతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు పోటీపడు తుంటారు. అయితే రోజుకో దాత అనే సంప్రదాయాన్ని ట్రస్ట్ కొనసాగిస్తూ వస్తోంది. దాతల కోరిక మేరకు పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి కొన్ని ప్రత్యేక తేదీల్లో వారి పేరున నలుగురికీ ఆహారాన్ని పంచుతోంది. ఈ యేడాదికి గానూ ఇప్పటికే జూన్ 2 వరకూ అన్ని రోజులకు సరిపడా దాతలు తమ తేదీలను బుక్ చేసుకున్నారు.
రోజుకు రూ.5వేల చొప్పున..
ఒక్కో దాత నుంచి రోజుకు రూ.5వేల చొప్పున మాత్రమే స్వీకరిస్తారు. వీటితో రుచికరమైన వంటకాలను అందిస్తారు. బగారా రైస్, టమాటా రైస్, జీరా రైస్, కర్రీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, స్వీట్స్‌తో పాటు ప్లేట్లు, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలను కలిపి రూ.5,000 గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ట్రస్ట్‌కు నగదు, చెక్కు రూపంలో స్వీకరిస్తారు.
దాతల సహకారం అపూర్వం..
మంగళవారం ఉదయం 11.30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ మితాహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇలాంటి అపూర్వమైన కార్యక్రమంలో దాతల సహకారం అపూర్వం. దీనికి సీనియర్ సిటిజన్స్ తోడవ్వడం మా అదృష్టం. వారి సహకారం మరువలేనిది. ఏటా మాదిరిగానే చలివేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్యాంసుందర్‌రాజ్‌కు కృతజ్ఞతలు.
– పార్థసారథి, శ్రీనివాస రామానుజ ట్రస్టీ