దంపతులు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
బేగంపేట ప్రకాష్‌నగర్‌లో ఘటన
సనత్‌నగర్ (హైదరాబాద్): ఫైనాన్స్ పేరుతో ఇంటి పత్రాలను తాకట్టు పెట్టుకున్నారు.. యజమానులకు తెలియకుండా ఆ గృహాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు.. అంతేకాకుండా దానిపై రూ.కోటి రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు జప్తు చేసేందుకు వచ్చారు. ఈ హఠాత్పరిణామంతో బాధిత కుటుంబ సభ్యులు ముగ్గురూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. బేగంపేట ప్రకాష్ నగర్‌కు చెందిన భరత్ భూషణ్, అనసూయ దంపతులు. వీరు 2019లో తమ కూతురు వివాహం కోసం భానుప్రకాష్ షఫీ అనే ఇద్దరు దళారులను ఆశ్రయించారు. తమ ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్లను తాకట్టు పెట్టి మూడు దఫాలుగా రూ.7 లక్షలు తీసుకున్నారు. ఈ క్రమంలో దళారులు భానుప్రకాష్ షఫీ 2019లోనే భరత్ భూషణ్, అనసూయలను కవాడిగూడ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రప్పించారు. అక్కడ దినకర్, రజని దంపతులను వీరికి పరిచయం చేసి.. వీరే మీకు అప్పు ఇచ్చారని, మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేయాలంటూ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. ఇంటిని దినకర్, రజని పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.
ఇవేమీ తెలియని బాధితులు వారు చెప్పిన చోటల్లా వేలిముద్రలు వేశారు. అనంతరం నిందితులు సదరు ఇంటిని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తనఖా పెట్టి రూ.కోటి రుణం తీసుకున్నారు. నిందితులు వాయిదాలు సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు రెండు మూడుసార్లు నోటీసులు పంపించారు. ఈ నోటీసుల గురించి నిందితులను భరత్‌భూషణ్ ప్రశ్నించగా.. దాంతో మీకు సంబంధం లేదని, అది తమ వ్యక్తిగతమని చెబుతూ వచ్చారు.
ఈ క్రమంలోనే మంగళవారం బ్యాంక్ అధికారులు ఇంటిని జప్తు చేయడానికి రావడంతో భరత్ భూషణ్, అనసూయ, వీరి కుమారుడు భరత్ తట్టుకోలేకపోయారు. తమకు చావే శరణ్యమంటూ ఇంట్లోకెళ్లి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని కాపాడారు. న్యాయమూర్తి మూడు రోజుల సమయం కోరడంతో బ్యాంక్ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment