House Documents
-
దళారులు దగా చేశారని..
సనత్‌నగర్ (హైదరాబాద్): ఫైనాన్స్ పేరుతో ఇంటి పత్రాలను తాకట్టు పెట్టుకున్నారు.. యజమానులకు తెలియకుండా ఆ గృహాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు.. అంతేకాకుండా దానిపై రూ.కోటి రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు జప్తు చేసేందుకు వచ్చారు. ఈ హఠాత్పరిణామంతో బాధిత కుటుంబ సభ్యులు ముగ్గురూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. బేగంపేట ప్రకాష్ నగర్‌కు చెందిన భరత్ భూషణ్, అనసూయ దంపతులు. వీరు 2019లో తమ కూతురు వివాహం కోసం భానుప్రకాష్ షఫీ అనే ఇద్దరు దళారులను ఆశ్రయించారు. తమ ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్లను తాకట్టు పెట్టి మూడు దఫాలుగా రూ.7 లక్షలు తీసుకున్నారు. ఈ క్రమంలో దళారులు భానుప్రకాష్ షఫీ 2019లోనే భరత్ భూషణ్, అనసూయలను కవాడిగూడ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రప్పించారు. అక్కడ దినకర్, రజని దంపతులను వీరికి పరిచయం చేసి.. వీరే మీకు అప్పు ఇచ్చారని, మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేయాలంటూ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. ఇంటిని దినకర్, రజని పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఇవేమీ తెలియని బాధితులు వారు చెప్పిన చోటల్లా వేలిముద్రలు వేశారు. అనంతరం నిందితులు సదరు ఇంటిని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తనఖా పెట్టి రూ.కోటి రుణం తీసుకున్నారు. నిందితులు వాయిదాలు సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు రెండు మూడుసార్లు నోటీసులు పంపించారు. ఈ నోటీసుల గురించి నిందితులను భరత్‌భూషణ్ ప్రశ్నించగా.. దాంతో మీకు సంబంధం లేదని, అది తమ వ్యక్తిగతమని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం బ్యాంక్ అధికారులు ఇంటిని జప్తు చేయడానికి రావడంతో భరత్ భూషణ్, అనసూయ, వీరి కుమారుడు భరత్ తట్టుకోలేకపోయారు. తమకు చావే శరణ్యమంటూ ఇంట్లోకెళ్లి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని కాపాడారు. న్యాయమూర్తి మూడు రోజుల సమయం కోరడంతో బ్యాంక్ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నాకు కరోనా.. ఇంటి పత్రాలిస్తావా? ముఖంపై దగ్గమంటావా?
సాక్షి ,బంజారాహిల్స్(హైదరాబాద్): ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారి నుంచి ఎలా తప్పించుకోవాలి, వస్తే ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటే హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ మాత్రం తన పేరుమీదున్న ఇంటిపత్రాలను చేతికివ్వకపోతే కరోనాను అంటిస్తానంటూ భర్తపైనే బెదిరింపులకు దిగింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్‌కు చెందిన వి.సంజీవరెడ్డి(70) కొన్నేళ్ల క్రితం మొదటి భార్యతో విడిపోయి కోనేరు భారతి(40)ను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి 17 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. ఆ సమయంలోనే భారతి పేరుమీద ప్రశాసన్‌నగర్‌లో రూ.5 కోట్ల విలువ చేసే ఓ ఇంటిని సంజీవరెడ్డి కొని అక్కడ కాపురం పెట్టారు. అయితే భారతి కొంతకాలంగా సంజీవరెడ్డిని విడిచి మరో వ్యక్తితో కలసి సహజీవనం చేస్తోంది. దీంతో సంజీవరెడ్డి నందగిరిహిల్స్‌లో ఉన్న మరో ఇంటికి మారే క్రమంలో ఇంటి పత్రాలు కూడా తీసుకెళ్లిపోయాడు. ఇంటి పత్రాలిస్తావా? అంటించమంటావా? ఈ విషయమై కొద్దికాలంగా సంజీవరెడ్డి, భారతిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత నెల 31న సంజీవరెడ్డి ఇంటికొచ్చిన భారతి..‘‘తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తన పేరుతో ఉన్న ఇంటికి సంబంధించిన పత్రాలు ఇస్తావా లేదంటే కరోనా అంటించ మంటావా’’అని బెదిరింపులకు దిగింది. దీంతో బెదిరిపోయిన సంజీవరెడ్డి ఇంటిలోపలే ఉండిపోయాడు. అయితే అతను బయటకు రాకుండా తలుపులకు తాళం వేసి భారతి నిర్బంధించింది. మూడు రోజులపాటు నిర్బంధంలోనే ఉన్న అతడు బుధవారం ఫోన్ ద్వారా జూబ్లీహిల్స్ పీఎస్‌కు సమాచారం ఇవ్వగా.. పోలీసులు వచ్చి సంజీవరెడ్డిని విడిపించారు. నిందితురాలు భారతిపై ఐపీసీ సెక్షన్ 446, 341, 506తో పాటు సెక్షన్ 3(1)ఆఫ్ ఎపిడమిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని ఒకరు...ఫోన్ నాకే కావాలంటు మరొకరు -
మీ దస్తావేజుకు..మీరే లేఖరి
సాక్షి, అమరావతి: మీరు స్థిరాస్తి కొన్నారా. ఆ వెంటనే దస్తావేజు లేఖరిని సంప్రదించక్కర్లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లక్కర్లేదు. ఇక నుంచిఆస్తి కొనుగోలు దస్తావేజులను మీరే తయారు చేసుకోవచ్చు. భూములు, స్థలాలు, భవనాల వంటి స్థిరాస్తుల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ల కోసం, డాక్యుమెంట్ల తయారీ నిమిత్తం ఇక దస్తావేజు లేఖరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. తెలుగులో అత్యంత సులభంగా మీ దస్తావేజులను మీరే తయారు చేసుకోవడానికి వీలుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో నమూనా దస్తావేజులను అప్లోడ్ చేసింది. న్యాయ, రెవెన్యూ రంగాల నిపుణులతో చర్చించి సులభ శైలిలో ప్రజాప్రయోజనాల కోసం వీటిని రూపొందించింది. ఈ నమూనా దస్తావేజుల్లో ఖాళీలు నింపుకుంటే న్యాయబద్ధంగా చెల్లుబాటయ్యేలా స్థిరాస్తి విక్రయ రిజిస్ట్రేషన్ దస్తావేజు తయారవుతుంది. అన్ని వివరాలు నింపిన తర్వాత తప్పులేమైనా ఉన్నాయేమో సరిచూసుకుని సరిదిద్దుకునే వెసులుబాటు కూడా ఉంది. అన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే సదరు దస్తావేజు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు చేరుతుంది. ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ రోజుకు ముందుగానే స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న రోజు అదే సమయానికి సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అమ్మకందారులు, సాక్షులతో వెళ్లి అర గంటలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ సులభతర విధానం కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి రానుంది. నెలాఖరు వరకు ఇక్కడ ఎదురయ్యే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చేర్పులతో ఈ విధానాన్ని నవంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. చదువుకున్న వారెవరైనా దస్తావేజులనుసొంతంగా తయారు చేసుకునే వెసులుబాటు కొత్త విధానం ద్వారా లభిస్తోంది. దస్తావేజుల తయారీ ఇలా.. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి వెళితే ఎడమ వైపు కింది భాగంలో న్యూ ఇనిషియేటివ్స్ అనే బాక్సులో డాక్యుమెంట్ ప్రిపరేషన్ అని ఉంటుంది. దీనిని క్లిక్ చేసి పాస్వర్డ్, ఐడీ రిజిస్టర్ చేసుకుని డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో కొనుగోలుదారు పేరు, నివాస ప్రాంతం, ఆధార్ నంబరు, అమ్మకందారు పేరు, నివాస ప్రాంతం, అమ్మకందారు ఆధార్ నంబరు లాంటి వివరాలు నింపేందుకు ఖాళీలు వదిలి డాక్యుమెంటు ఉంటుంది. స్థిరాస్తి వివరాలు (సర్వే నంబరు/ఫ్లాట్ నంబరు/ప్లాట్ నంబరు, గ్రామం/ పట్టణం) లాంటి వివరాలను కూడా ఖాళీల్లో నింపితే డాక్యుమెంటు తయారవుతుంది. ఆస్తి వివరాలు నమోదు చేసిన తర్వాత దాని రిజిస్ట్రేషన్‌కు ఎంత మొత్తం చెల్లించాలో కూడా ఆన్లైన్లో ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్రకారం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ రుసుం చెల్లించాలి. ఏరోజు, ఏ సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ముందే నిర్ణయించుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోదలిచారో కూడా పేర్కొనాలి. దస్తావేజు అంతా సక్రమంగా పూరించినట్లు నిర్ధారించుకున్న తర్వాత ప్రింటవుట్ తీసుకుని సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆ దస్తావేజు సంబంధిత సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళుతుంది. స్లాట్ బుకింగ్ ప్రకారం సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళితే ఆన్లైన్లోని వివరాలను పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి దస్తావేజు కాపీ ఇస్తారు. -
పట్టా కావాలా నాయనా !
సాక్షి, పలమనేరు(చిత్తురు) : ఇంటి పట్టా కావాలంటే అధికారుల చుట్టూ తిరిగేరోజులు పోయాయి. కాసులిస్తే ప్రభుత్వ స్థలాలకు నివేశిత ధ్రువపత్రాలు, అనుభవ ద్రువపత్రాలు కూడా ఇళ్ల వద్దకే నడుచుకుంటూ వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలమనేరు పట్టణ సమీపంలోని గంటావూరు, గడ్డూరు ఇందిరమ్మ కాలనీలో ఈ తంతు జరిగినట్లు తెలిసింది. ఈ అక్రమాలపై పత్రికల్లో పలు కథనాలు రావడంతో స్పందిందన అధికారులు ఎన్నికలకు ముందు విచారణ కూడా చేపట్టారు. నకిలీ పట్టాలు భారీగానే ఉన్నట్లు విచారణలో అధికారులు సైతం గుర్తించారు. అయితే కొందరు కీలక వ్యక్తులు ఈ నివేదికను తొక్కిపెట్టారనే ఆరోపణలున్నాయి. అక్రమాలు ఇలా.. స్థానిక ఇందిరమ్మ కాలనీల్లోని ఖాళీస్థలాలు, అప్పటికే పట్టాలుపొంది ఇల్లు కట్టని స్థలాలు, పునాదుల దశలో ఆగినవాటిని లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమాలు సాగాయి. కాలనీల్లో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాన్ని ఎంచుకుని అక్కడ ఇతర వ్యక్తులద్వారా నిర్మాణాలను చేపట్టడం చేశారు. దీంతో అసలైన పట్టాదారు అక్కడికొచ్చి తనకు పట్టా ఉందని చెబితే దాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలనకు తీసుకోవడం జరిగింది. అయితే వారిచ్చిన పట్టాలేక అనుభవ ధ్రువపత్రాన్ని ఫోర్జరీ చేసి ఇతరుల పేరిట మార్చినట్లు తెలుస్తోంది. ఈవిధంగా ఇప్పటికే 200కు పైగా నకిలీ పట్టాలు చలామణిలో ఉన్నట్టు సమాచారం. 20 మంది కీలక సూత్రధారులు.. గత ఆరేళ్లలో సాగిన నకిలీ పట్టాల కుంభకోణంలో ఇరువురు రాజకీయ నాయకులు, ఇరువురు వీఆర్వోలు( ప్రస్తుతం బదిలీ అయ్యారు), ఓ సర్వేయర్ సహాయకుడు, ఓ రిటైర్డ్ వీఆర్వో సాయంతో మిగిలినవారు కలసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. నకిలీపట్టాల తయారీ కోసం ఖాళీ అనుభవ ధ్రువపత్రాలు, తహసీల్దార్ సీలు, కార్యాలయపు రౌండ్ సీలు తదితరాలను వీరే తయారు చేసుకున్నట్లు తెలు స్తోంది. రెవెన్యూ కార్యాలయంలో ఉండాల్సిన ఇందిరమ్మ కాలనీ ఎఫ్‌ఎంబీలు సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇప్పటికీ ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో బయటపడినా ? ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలపై దినప్రతికల్లో పలు కథనాలు గతంలో ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణ జరిపించారు. ఇందులోనూ ఈ విషయం బయటపడిం ది. దీంతోవారు ఓ నివేదికను సైతం సిద్ధం చేశా రు. అయితే తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుం దోనని గ్రహించిన కొందరు కీలక వ్యక్తులు దీన్ని ఎన్నికలకు ముందే తొక్కిపెట్టినట్టు సమాచారం. మళ్లీ వెలుగులోకి.. పట్టణానికి చెందిన రఘు అనే ప్రభుత్వ ఉద్యోగి దొంగపట్టాలపై ఆరాతీసి సుమారు 20 నకిలీ పట్టాలను ఇటీవలే సేకరించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులిచ్చినా న్యాయం జరగదని భావించారు. వీటిని సోషల్ మీడియాలో స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడతో పాటు జిల్లా అధికారులకు పోస్టింగులు పెట్టారు. దీంతో మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్రమార్కుల కన్ను.. గంటావూరు కాలనీలో ఇప్పటికీ ప్రభుత్వ స్థలం 12 ఎకరాలదాకా ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సంబంధిత స్కెచ్‌లో ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో చూసి అక్కడ తమకు కావాల్సిన వారికి ఇళ్లు కట్టుకునేందుకు కొందరు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇంటి నివేశన పట్టాలను ఇవ్వడం లేదు. దీంతో 2008 నుంచి 2013 సంవత్సరాల్లో జారీ అయినట్లు అనుభవ పత్రాలను సృష్టించే పనుల్లో అక్రమార్కులు నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ కాలనీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలు చేపట్టాల్సి ఉందని పట్టణవాసులు కోరుతున్నారు. -
పేదల ఇళ్ల పట్టాలు రద్దు
నంద్యాల: అధికార పార్టీ నాయకులు తాము అనుకున్నది సాధించారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఇళ్ల పట్టాలు రద్దు చేయించి.. తమకు అనుకూలమైన వారికి ఇప్పించారు. ఎన్నో ఏళ్ల క్రితం పట్టాలు పొంది..ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేసుకున్న లబ్ధిదారుల పట్టాలను రద్దు చేసి, కొత్త వారికి ఇవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం శిల్పానగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణ శివారులోని కడప, కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉన్న శిల్పావాసవీ నగర్లో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ సెంటు రూ.5 లక్షలు పలుకుతోంది. దీంతో టీడీపీ నాయకుల కన్ను పడింది. ఇళ్లు నిర్మించుకోలేదన్న సాకుతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి 110 ఇళ్ల పట్టాలను రద్దు చేయించారు. వీరి స్థానంలో టీడీపీ నాయకులు వారి అనుచరులకు కొత్తగా పట్టాలు ఇప్పించారు. కొత్త పట్టాదారులు గురువారం స్థలాల దగ్గరికి వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. తమకు తహసీల్దార్ పట్టాలు ఇచ్చారని, బేస్మట్టం కూడా వేసుకున్నామని, ఈ స్థలంలోకి రానిచ్చే ప్రసక్తే లేదని పాత పట్టాదారులు తేల్చి చెప్పారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. ఇళ్లపట్టాల రద్దుపై పాత పట్టాదారులు కొంత మంది హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. కలెక్టర్ విచారణ చేయకముందే తమ స్థలాలను ఇతరులకు ఎలా ఇస్తారని బాధితులు వాపోయారు. దీంతో తాలూకా ఎస్ఐ రమేష్‌బాబు జోక్యం చేసుకొని ‘మీ వద్ద ఉన్న ఇళ్లపట్టాలు తీసుకొని.. వాటిపై తహసీల్దార్‌తో సంతకం చేయించుకొని వస్తే వారికి అనుమతి ఇస్తామ’ని అన్నారు. కోర్టు పత్రాలు ఉన్నా తమకు చూపించాలన్నారు. దీంతో లబ్ధిదారులు తమ వద్ద ఉన్న కాగితాలు తీసుకొని వస్తామని ఎస్ఐకి తెలియజేశారు. -
ఏపీలో అధికారపార్టీ గిమ్మిక్కులు
-
పట్టాల పంపిణీలో హోం మంత్రి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న బలిజ సంఘంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి ప్రసంగించారు. అనంతరం అర్హులైన పేదలకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. -
పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి
సరూర్‌నగర్ (రంగారెడ్డి) : అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అందించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు ఇండ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటూ టీడీపీ మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యలు పాల్గొన్నారు. వీరితోపాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.