పట్టా కావాలా నాయనా ! | Illegal House Certificates Distributed in Chittoor | Sakshi
Sakshi News home page

పట్టా కావాలా నాయనా !

Published Wed, Jul 31 2019 9:27 AM | Last Updated on Wed, Jul 31 2019 9:27 AM

Illegal House Certificates Distributed in Chittoor - Sakshi

నకిలీ పట్టాలకు నిలయంగా మారిన కాలనీ,వెలుగు చూసిన నకిలీ అనుభవ ధ్రువపత్రం 

సాక్షి, పలమనేరు(చిత్తురు) : ఇంటి పట్టా కావాలంటే అధికారుల చుట్టూ తిరిగేరోజులు పోయాయి. కాసులిస్తే ప్రభుత్వ స్థలాలకు నివేశిత ధ్రువపత్రాలు, అనుభవ ద్రువపత్రాలు కూడా ఇళ్ల వద్దకే నడుచుకుంటూ వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలమనేరు పట్టణ సమీపంలోని గంటావూరు, గడ్డూరు ఇందిరమ్మ కాలనీలో ఈ తంతు జరిగినట్లు తెలిసింది. ఈ అక్రమాలపై పత్రికల్లో పలు కథనాలు రావడంతో స్పందిందన అధికారులు ఎన్నికలకు ముందు విచారణ కూడా చేపట్టారు. నకిలీ పట్టాలు భారీగానే ఉన్నట్లు విచారణలో అధికారులు సైతం గుర్తించారు. అయితే కొందరు కీలక వ్యక్తులు ఈ నివేదికను తొక్కిపెట్టారనే ఆరోపణలున్నాయి.

అక్రమాలు ఇలా..
స్థానిక ఇందిరమ్మ కాలనీల్లోని ఖాళీస్థలాలు, అప్పటికే పట్టాలుపొంది ఇల్లు కట్టని స్థలాలు, పునాదుల దశలో ఆగినవాటిని లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమాలు సాగాయి. కాలనీల్లో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాన్ని ఎంచుకుని అక్కడ ఇతర వ్యక్తులద్వారా నిర్మాణాలను చేపట్టడం చేశారు. దీంతో అసలైన పట్టాదారు అక్కడికొచ్చి తనకు పట్టా ఉందని చెబితే దాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలనకు తీసుకోవడం జరిగింది. అయితే వారిచ్చిన పట్టాలేక అనుభవ ధ్రువపత్రాన్ని ఫోర్జరీ చేసి ఇతరుల పేరిట మార్చినట్లు తెలుస్తోంది. ఈవిధంగా ఇప్పటికే 200కు పైగా నకిలీ పట్టాలు చలామణిలో ఉన్నట్టు సమాచారం.

20 మంది కీలక సూత్రధారులు..
గత ఆరేళ్లలో సాగిన నకిలీ పట్టాల కుంభకోణంలో ఇరువురు రాజకీయ నాయకులు, ఇరువురు వీఆర్వోలు( ప్రస్తుతం బదిలీ అయ్యారు), ఓ సర్వేయర్‌ సహాయకుడు, ఓ రిటైర్డ్‌ వీఆర్‌వో సాయంతో మిగిలినవారు కలసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. నకిలీపట్టాల తయారీ కోసం ఖాళీ అనుభవ ధ్రువపత్రాలు, తహసీల్దార్‌ సీలు, కార్యాలయపు రౌండ్‌ సీలు తదితరాలను వీరే తయారు చేసుకున్నట్లు తెలు స్తోంది. రెవెన్యూ కార్యాలయంలో ఉండాల్సిన ఇందిరమ్మ కాలనీ ఎఫ్‌ఎంబీలు సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇప్పటికీ ఉన్నట్లు తెలుస్తోంది.

విచారణలో బయటపడినా ?
ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలపై దినప్రతికల్లో పలు కథనాలు గతంలో ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన కలెక్టర్‌ విచారణ జరిపించారు. ఇందులోనూ ఈ విషయం బయటపడిం ది. దీంతోవారు ఓ నివేదికను సైతం సిద్ధం చేశా రు. అయితే తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుం దోనని గ్రహించిన కొందరు కీలక వ్యక్తులు దీన్ని ఎన్నికలకు ముందే తొక్కిపెట్టినట్టు సమాచారం.

మళ్లీ వెలుగులోకి..
పట్టణానికి చెందిన రఘు అనే ప్రభుత్వ ఉద్యోగి దొంగపట్టాలపై ఆరాతీసి సుమారు 20 నకిలీ పట్టాలను ఇటీవలే సేకరించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులిచ్చినా న్యాయం జరగదని భావించారు. వీటిని సోషల్‌ మీడియాలో స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడతో పాటు జిల్లా అధికారులకు పోస్టింగులు పెట్టారు. దీంతో మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

అక్రమార్కుల కన్ను..
గంటావూరు కాలనీలో ఇప్పటికీ ప్రభుత్వ స్థలం 12 ఎకరాలదాకా ఖాళీగా ఉన్నట్లు సమాచారం.  సంబంధిత స్కెచ్‌లో ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో చూసి అక్కడ తమకు కావాల్సిన వారికి ఇళ్లు కట్టుకునేందుకు కొందరు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇంటి నివేశన పట్టాలను ఇవ్వడం లేదు. దీంతో 2008 నుంచి 2013 సంవత్సరాల్లో జారీ అయినట్లు అనుభవ పత్రాలను సృష్టించే పనుల్లో అక్రమార్కులు నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ కాలనీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలు చేపట్టాల్సి ఉందని పట్టణవాసులు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement