
భర్త మొబైల్‌లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు ఉందని రోడెక్కిన భార్య
ఆ మహిళతో గొడవకు దిగిన వైనం
ఆపై పక్కంటి మహిళ ఆత్మహత్య
తన మృతికి సుజాతనే కారణమంటూ చీటి
చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రామంలో ఘటన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇరు కుంటుంబాలు పక్కపక్కనే ఉంటాయి.. తెల్లారితే ఒకరి ముఖాలు.. ఒకరు చూసుకోవాలి. తీరా బంధువులు కూడా.. అయితే ఏమైందో..ఏమో కానీ..ఆ ఇరు కుటుంబీకు ల మధ్య కొన్ని నెలల కిందట వివాదం తలెత్తింది. దూరం పెరిగింది. మాటల్లేవ్.. ఈ తరుణంలో భర్త ఫోన్‌లో ఆ పక్కంటి మహిళా ఫోన్ నంబరు ఉందని భార్య గొడవకు దిగింది. దీంతో మనస్తాపానికి గురైన పక్కంటి మహిళా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. పదెంకెల ఫోన్ నంబరు తెచ్చిన తంటాకు ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన మంగళవారం చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రా మంలో చోటుచేసుకుంది.
గ్రామస్తులు, పోలీసులు వివరాల మేరకు...చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రామానికి చెందిన రమేష్ భార్య ఉమ (30). ఈ దంపతులకు పెళ్లిలై ముగ్గురు పిల్లలున్నారు. వీళ్ల ఇంటి పక్కనే శివమణి, సుజాత అనే దంపతులు ఉన్నారు. ఈ ఇరుకుటుంబీకులు దగ్గర బంధువు లు. వీళ్ల మధ్య ఏర్పడిన చిన్న తగదాలు గొడవగా మారాయి. కొన్ని నెలలుగా ఈ ఇరు కుటుంబీకుల మధ్య మాటలు లేవు. అయితే సోమవారం శివమణి మొబైల్‌లో ఉమ ఫోన్ నంబరును సుజాత గమనించింది. ఆ నంబరు నీ ఫోన్‌లో ఎందుకు ఉందని సుజాత భర్తతో వాగ్వాదానికి దిగింది.
ఇలా అక్రోశానికి గురైన సుజాత రోడెక్కింది. ఉమతో గొడవకు దిగింది. ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. ఇలా మాట మాట పెరిగి జట్టు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనా ఉమ సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈక్రమంలో జాకెట్‌లోని అట్టముక్కలో తన చావుకు కారణం సుజాతనేని రాసి పెట్టింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళా ప్రాణాన్ని బలి తీసుకుంది. క్షణికావేశానికి గురై ఆ మహిళ పరువుకు తలొంచి ఆత్మహత్య చేసుకుంది.