శిల్పానగర్‌లో ఇరువర్గాలు ఘర్షణ పడుతున్న దృశ్యం
నంద్యాల: అధికార పార్టీ నాయకులు తాము అనుకున్నది సాధించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఇళ్ల పట్టాలు రద్దు చేయించి.. తమకు అనుకూలమైన వారికి ఇప్పించారు. ఎన్నో ఏళ్ల క్రితం పట్టాలు పొంది..ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేసుకున్న లబ్ధిదారుల పట్టాలను రద్దు చేసి, కొత్త వారికి ఇవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం శిల్పానగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణ శివారులోని కడప, కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉన్న శిల్పావాసవీ నగర్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ సెంటు రూ.5 లక్షలు పలుకుతోంది. దీంతో టీడీపీ నాయకుల కన్ను పడింది.
ఇళ్లు నిర్మించుకోలేదన్న సాకుతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి 110 ఇళ్ల పట్టాలను రద్దు చేయించారు. వీరి స్థానంలో టీడీపీ నాయకులు వారి అనుచరులకు కొత్తగా పట్టాలు ఇప్పించారు. కొత్త పట్టాదారులు గురువారం స్థలాల దగ్గరికి వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. తమకు తహసీల్దార్ పట్టాలు ఇచ్చారని, బేస్‌మట్టం కూడా వేసుకున్నామని, ఈ స్థలంలోకి రానిచ్చే ప్రసక్తే లేదని పాత పట్టాదారులు తేల్చి చెప్పారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. ఇళ్లపట్టాల రద్దుపై పాత పట్టాదారులు కొంత మంది హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.
కలెక్టర్ విచారణ చేయకముందే తమ స్థలాలను ఇతరులకు ఎలా ఇస్తారని బాధితులు వాపోయారు. దీంతో తాలూకా ఎస్‌ఐ రమేష్‌బాబు జోక్యం చేసుకొని ‘మీ వద్ద ఉన్న ఇళ్లపట్టాలు తీసుకొని.. వాటిపై తహసీల్దార్‌తో సంతకం చేయించుకొని వస్తే వారికి అనుమతి ఇస్తామ’ని అన్నారు. కోర్టు పత్రాలు ఉన్నా తమకు చూపించాలన్నారు. దీంతో లబ్ధిదారులు తమ వద్ద ఉన్న కాగితాలు తీసుకొని వస్తామని ఎస్‌ఐకి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment