సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేలా వారికి ఆంగ్ల మాధ్యమంలో మంచి చదువులు అందిస్తూ వారి సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. బాలల కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ రూపొందించి నిధులు కేటాయించడం అద్భుతమని మెచ్చుకుంటున్నాయి.
జాతీయ విద్యాప్రణాళిక, పరిపాలన సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఐఈపీఏ–నీపా)) బుధవారం నిర్వహించిన వర్చువల్ వర్క్‌షాప్‌లో రాష్ట్రం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘స్టూడెంట్ బేస్డ్ ఫైనాన్సియల్ సపోర్టు సిస్టమ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్’ అంశంపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి రాష్ట్రం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు.
అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక వంటి కార్యక్రమాల గురించి విని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసించారు. ముఖ్యంగా అమ్మ ఒడి పథకం అమలు సాహసోపేతమైన చర్యగా పలువురు అభినందించారు. నాడు–నేడు కింద రాష్ట్రంలోని ఫౌండేషన్ స్కూళ్లు మొదలు 60 వేల వరకు ఉన్న పలు విద్యాసంస్థలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం పట్ల నీపా అధికారులు మెచ్చుకున్నారు.
ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టిన రాష్ట్రం ఏపీ ఒక్కటేనని ప్రశంసించారు. పైగా అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో వాటి భద్రత నిర్వహణ కోసం స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిటెట్ల నిర్వహణ, పారిశుధ్య పనులకోసం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటుచేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దేలా కృషి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు విద్యారంగంలో ముఖ్యంగా పిల్లలను ప్రపంచపౌరులుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రభుత్వ ప్రతినిధులు వివరించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా వారిని మార్చేలా జగనన్న విద్యాకానుక కింద ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చుచేస్తూ 43 లక్షల మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో లెర్నింగ్ అవుట్‌కమ్స్ పెరుగుతున్నాయి.
మనబడి నాడు–నేడు కింద రన్నింగ్ వాటర్‌తో కూడిన మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్‌చాక్‌బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్, పెయింటింగ్‌లు, కాంపౌండ్ వాల్, కిచెన్‌షెడ్ల నిర్మాణం వంటి ఏర్పాటు ద్వారా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే వీలు ఏర్పడుతోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించేలా రోజుకో మెనూతో అందిస్తున్న భోజనం గురించి ప్రతినిధులు తెలుసుకున్నారు.
ఇందుకు ఈ ఏడాది ప్రభుత్వం 1,595.55 కోట్లు ఖర్చుచేస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి తల్లి తన పిల్లలను ఆర్థిక స్తోమత లేక చదువులకు దూరంగా ఉంచకుండా బడులకు పంపేలా ఏటా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తున్న సంగతి విని ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 2022–23 విద్యాసంవత్సరంలోనే తల్లులకు రూ.6,500 కోట్లు అందించారు.
చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ వినూత్న ఆలోచన
► చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుపై నీపా అధికారులు, ఇతర ప్రతినిధులు ఆసక్తి చూపారు. ఈ బడ్జెట్ ఎలా రూపొందిస్తున్నారో తెలుసుకున్నారు.
► కుల, లింగ, వైకల్యాలు, తరగతి, మత, సాంస్కృతిక ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా పిల్లలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలిగే వాతావరణా న్ని సృష్టించడమే ఈ చైల్డ్ సెంట్రిక్ బడ్జెట్ లక్ష్యం.
► 2021–22లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా ఈ బాలల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2022–23లో రూ.16,903 కోట్లు కేటాయించారు.
► బాలల పథకాల కోసం వందశాతం నిధులు కేటాయించే కార్యక్రమాలు మొదటి విభాగం కాగా అవసరాల మేరకు నిధులు కేటాయించే సంక్షేమ పథకాలు రెండో విభాగంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు.
► వివిధ శాఖల ద్వారా పిల్లల కోసం పలు పథకాలను అమలు చేయిస్తున్నారు. మొదటి విభాగంలో 15 స్కీములు, రెండో విభాగంలో 18 స్కీములు అమలు చేస్తున్నారు.
ఏపీ బాలల బడ్జెట్ బహుబాగు
Published Thu, Nov 17 2022 5:17 AM | Last Updated on Thu, Nov 17 2022 5:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment