భారత్‌లోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కాలేదు. ప్రపంచ మార్కెట్ వ్యవస్థలకు అనుసంధానించడంలో విద్యదే కీలక పాత్ర. ఆధునిక విద్యాసంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అనుసరించలేదు. ఈ నమూనాపై ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా జగన్ దీన్ని సాధ్యం చేశారు: 1. ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించడం. 2. పాఠశాల మౌలిక సదుపాయాలు, గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి వనరులను ఖర్చు చేయడం. దాని భవిష్యత్తు ప్రభావాన్ని దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు. ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా.
2024 సాధారణ ఎన్నికలకు ముందు భారతదేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక, పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే నాలుగు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణా చల్ ప్రదేశ్, సిక్కిం.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని మునుపెన్నడూ ఊహించని పథంలోకి మార్చింది. సాధారణంగా అభివృద్ధి అంటే... ఎత్తయిన భవనాలు, మంచి రోడ్లు వంటి పట్టణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టడానికి విధానాలను రూపొందించడమే అని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తాయి. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో బడ్జెట్ నిధులను పెద్ద కాంట్రాక్ట్ నిర్మాణాలకు వెచ్చిస్తాయి.
ప్రపంచీకరణ యుగంలో నయా ఉదార వాద ఆర్థికవేత్తలు అలాంటి ఖర్చును మంచి అభివృద్ధిగా పరిగణి స్తారు. ఆరెస్సెస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నమూనానే అనుసరిస్తోంది. సోషలిస్ట్ ఎకానమీ నుండి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపునకు మారిన చైనా కూడా ఇదే నమూనాను అవలంబించింది. వీటితో పోలిస్తే భారతీయ కుల అసమానతలకు కాస్త భిన్నమైన విధానం అవసరం.
భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ, దాని అసాధారణమైన కుల అడ్డంకులు ప్రజల కేంద్రిత అభివృద్ధికి అనేక అవరోధాలను సృష్టించాయి. రెండవది, భారతీయ గ్రామాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. వ్యవసాయాభివృద్ధి పూర్తిగా వ్యవసా యాన్ని పెట్టుబడిగా మార్చే దశకు చేరుకోలేదు. దేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం కాలేదు. ప్రజలను జాతీయ, ప్రపంచ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలకు అనుసంధానించడంలో వారి విద్యే కీలక పాత్ర పోషిస్తోంది.
గ్రామీణులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి...
గ్రామీణ పిల్లలకు, యువతకు విద్యను అందించడానికి ఆధునిక విద్యాసంస్థలతో కూడిన గ్రామాభివృద్ధి నమూనాను ఏ రాష్ట్ర ప్రభు త్వమూ అనుసరించలేదు. ఈ నమూనాపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. గత ఐదేళ్లలో తన బడ్జెట్‌లో ఎక్కువ భాగం గ్రామీణ విద్యా మౌలిక సదుపాయాలు, సాఫ్ట్ స్కిల్స్‌ను నిర్మించడం కోసం కేటాయించింది.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గత పదేళ్లలో టీడీపీ, వైఎస్సా ర్‌సీపీ ప్రభుత్వాలు పూర్తి వ్యతిరేకమైన అభివృద్ధి నమూనాలను ఎలా ఎంచుకున్నాయో చూడాలి. టీడీపీ ప్రభుత్వం కృష్ణా నది ఒడ్డున ఉన్న 30,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని లాక్కొని, రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువ భాగం అమరావతిని నిర్మించేందుకు కేటాయించడా నికి సిద్ధమైంది. పెద్ద నగరాలు మాత్రమే పెట్టుబడులు తెస్తాయనీ, వెలుపలి నుంచి వచ్చే పెట్టుబడితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది నయా ఉదారవాద ఆర్థిక ఆలోచన.
ఇది భారీ స్థాయి పెట్టుబడులతో కూడిన సిటీ మాల్ మార్కెట్‌లలోకి విస్తారమైన గ్రామీణ ప్రజలను తీసుకోలేదు. అందుకే, ధనవంతుల కోసం ఉద్దేశించిన ప్రైవేట్ పాఠశాల విద్యతో సరిపోయే పాఠశాల వ్యవస్థలో వారిని విద్యావంతులను చేయాలి. ఆ ప్రైవేట్ పాఠశాల విద్య ఇంగ్లీషు మీడియంలో కొనసాగాలి. గ్రామీణ వ్యవసాయాధారిత పిల్లలకు ప్రభుత్వ రంగంలో ఇలాంటి విద్యను అందించకపోతే వారు రాష్ట్ర, జాతీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో చేరలేరు.
విప్లవాత్మక అభివృద్ధి నమూనా
భారీ మల్టీ లేన్ రోడ్లు, పెద్ద విమానాశ్రయాలు, ఓడరేవులతో కూడిన ‘హైవే ఎకానమీ’, ప్రభుత్వ రంగ పరిశ్రమలను భారీగా ప్రైవేటీకరించడం ఆర్‌ఎస్‌ఎస్ దృక్పథానికి బాగా సరిపోతుందని మితవాద ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఆరెస్సెస్‌కి సంబంధించిన ఈ ఆధునిక ఆలోచన పురాతనమైన మధ్యయుగ వర్ణ ధర్మ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉంది. ఆ వ్యవస్థలో శూద్ర ఉత్పాదక ప్రజానీకానికి ఆస్తులపై యాజమాన్యం ఉండకూడదు.
ఈ నమూనాతో చంద్రబాబు శ్రుతిమించి పోయారు. వైఎస్ జగన్ మాత్రం అభివృద్ధి నమూనానే మార్చేశారు. దీన్ని నేను శూద్ర అభివృద్ధి నమూనా అని పిలుస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్ ప్రధానంగా అన్ని కులాలు, కార్మిక వర్గాలను కలిగి ఉన్న వ్యవసాయ, చేతివృత్తుల ఉత్పాదక ప్రజానీకానికి ఉద్దేశించినదని సూచించడానికి నేను శూద్ర అనే చారిత్రక పదాన్ని ఉపయోగిస్తున్నాను.
మొత్తం వ్యవసాయ, చేతివృత్తులకు చెందిన ఉత్పాదక ప్రజానీకంలో (ఆదివాసీ, దళిత వర్గాలు, రిజర్వుడ్ శూద్ర ఓబీసీలు, రెడ్డి, కమ్మ, కాపు వంటి అన్‌రిజర్వుడ్ శూద్రులు అందరూ ఇందులో ఉంటారు) నైపుణ్యాలు, వనరుల పునాదిని తప్పనిసరిగా మార్చాలని వైఎస్ జగన్ సరిగ్గా అర్థం చేసుకున్నారు. రాష్ట్ర పెట్టుబడిని పాఠశాల, కళాశాల విద్య, గ్రామ పరిపాలనలోకి మార్చడం ద్వారా ఈ పరివర్తన సాధ్యమవుతుంది.
వైఎస్ జగన్ రెండు వినూత్న ఆలోచనలను ముందుకు తేవడం ద్వారా ఇదంతా సాధ్యం చేశారు: 1) ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించడం. ఇది నైపుణ్యం, జ్ఞానం రెండింటిలోనూ గ్రామాన్ని ప్రపంచంతో కలుపుతుంది. విద్యా ఖర్చుల కోసం డబ్బును బదిలీ చేయడం ద్వారా పాఠశాల, కళాశాల పిల్లల తల్లులకు ఆర్థిక సహాయం అందించడాన్ని కూడా దీనికి జోడించారు. 2) పాఠశాల మౌలిక సదుపాయాలను, గ్రామ పరిపాలనను భారీగా మార్చడానికి రాష్ట్ర అభివృద్ధి వనరులను ఖర్చు చేయడం.
ప్రధాన వ్యాపారాలు లేని, శ్రమతో పని చేసే సాంప్రదాయ శూద్రులందరికీ ఈ నమూనాలో కొత్త నైపుణ్యాలు, ప్రపంచ భాషతో వ్యవహరించడానికి ప్రవేశం లభిస్తుంది. దాని భవిష్యత్తు ప్రభావాన్ని ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊహించలేకపోయారు. ఇది విప్లవాత్మకమైన అభివృద్ధి నమూనా.
పెట్టుబడుల కేంద్ర మార్పు
ఈ నమూనా... పెట్టుబడిని కేంద్రీకృత పట్టణ రంగాల నుండి వైవిధ్యమైన గ్రామీణ సమాజాలకు మారుస్తుంది. ఇది పట్టణ బ్యాంకుల్లోని డబ్బు నిల్వలను గ్రామీణ మార్కెట్లకు తరలిస్తుంది. ఇది విస్తారమైన గ్రామీణ ప్రజల ఆరోగ్యం, వ్యయం, ఉత్పత్తి, విజ్ఞాన పునాదిని మెరుగుపరుస్తుంది. మొత్తంగా సంపద కేంద్రీకరణను పట్టణ ధనవంతుల నుండి విస్తారమైన గ్రామీణ ప్రజానీకానికి బదలా యిస్తుంది. ఈ పెట్టుబడి ఉచితాల కిందికి రాదు. ఇది భవిష్యత్ విప్లవా నికి సంబంధించిన పెట్టుబడి. సాధారణంగా విప్లవం గురించి మాట్లాడే కమ్యూనిస్టులు కూడా భారతీయ కుల–సాంస్కృతిక సమాజంలో విప్లవం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు.
బెంగాల్‌లో వారి 34 ఏళ్ల పాలన గ్రామీణ ప్రజానీకాన్ని ప్రపంచీకరణ ప్రక్రియతోనూ, ఆంగ్ల విద్యతోనూ ముడిపెట్టకుండా ఎలా దూరంగా ఉంచిందో నిరూపించింది.
ఈ విప్లవం భారతదేశ అభివృద్ధిపై రెండు ముఖ్యమైన ప్రభావాలను కలిగి ఉంది. చారిత్రాత్మకంగా జ్ఞాన వ్యవస్థను నియంత్రిస్తున్నందున సంపద మొత్తంగా ద్విజ సంఘాల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది.
పురాతన కాలంలో ఇది సంపదను, సంస్కృత భాషను నియంత్రించింది. మధ్యయుగ కాలంలో ద్విజులు ముస్లిం పాలకులతో కలిసి సంపదను, పర్షియన్ భాషను నియంత్రించారు. గత 75 ఏళ్లుగా వారు సంపదను, ఆంగ్ల భాష ఆధారిత జ్ఞానాన్ని నియంత్రించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యపై దృష్టి సారించడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం సంపదను, విజ్ఞానాన్ని వ్యవసాయ, చేతివృత్తుల వారి చేతుల్లోకి తెచ్చింది.
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment