పాలనలో వైఎస్ జగన్ వినూత్న ఒరవడిపై నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు సదస్సులో నిపుణుల ప్రశంసలు
2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థ ఓ అద్భుతం
పాలనా వికేంద్రీకరణలో భాగంగా విప్లవాత్మక వ్యవస్థ ఏర్పాటు
సంక్షేమ ప్రయోజనాలతోపాటు పౌరుల అవసరాలన్నీ తీర్చారు
గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం
ప్రతి గ్రామంలోనూ పౌరులందరికీ చేరువైన వ్యవస్థ
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసలు
గ్రామ, వార్డు సచివాలయాలతో ఎస్‌డీజీ లక్ష్యాల సాధన
పథకాలు, కార్యక్రమాల అమలుకు యాప్‌లు, అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ
బాలికల్లో రక్తహీనత నిర్మూలనకు డేటా సేకరణ, క్రోడీకరణ
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం పౌర సేవలు, ప్రభుత్వ పథకాల అమలు స్వరూపాన్నే మార్చేసింది. గ్రామ గ్రామాన సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. పల్లె రూపురేఖలే మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. ఎక్కడా లంచాలు, వివక్ష, పడిగాపులకు తావులేకుండా పారదర్శకంగా ప్రతి ఇంటికీ ప్రయోజనాలను అందచేసింది. గ్రామం నుంచి కదలాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్నే పల్లె చెంతకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో సాకారమైన విప్లవాత్మక మార్పులివి.
నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సంయుక్త సదస్సు ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. ఇంటింటికీ పౌర సేవలు, అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోందని, ప్రధానంగా నీతి ఆయోగ్ నిర్దేశించిన ఎస్‌డీజీ (సుస్థిరాభివృద్ధి) లక్ష్యాల సాధనకు సచివాలయాలతో క్షేత్రస్థాయి నుంచి కృషి చేశారని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు.
వివిధ రాష్ట్రాల ఆవిష్కరణ డేటా అధారిత పాలన, ప్రణాళికల కోసం డేటా సేకరణపై ఇటీవల లక్నోలో నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు సంయుక్త సదస్సు నిర్వహించాయి. డేటాను నాలెడ్జ్‌గా మార్చడం, 2047 భారత్ విజన్ లక్ష్యాలను సాధించడం, డేటాను పరిపాలనలో వినియోగించడం తదితర అంశాలపై వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలపై చర్చాగోష్టి నిర్వహించారు. సదస్సులో నీతి ఆయోగ్, ప్రపంచబ్యాంకుతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని ఆవిష్కరణలపై ప్రముఖంగా చర్చించారు.
ప్రతి పౌరుడికీ అందుబాటులో సేవలు..
సమగ్ర డేటా సేకరణ ద్వారా పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందని, పాలన వికేంద్రీకరణలో భాగంగా తెచ్చిన ఈ వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను వికేంద్రీకరించడంతోపాటు విధాన రూపకర్తలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు గ్రామాలు, వార్డులలో ఆధునిక పరిజ్ఞానంతో సౌకర్యాలు కల్పించారన్నారు. ఏపీలోని ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికీ ఈ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు, నెలవారీ కేటాయింపులు లాంటి సంక్షేమ ప్రయోజనాలను అందజేయడంతోపాటు పౌరుల అవసరాలను గుర్తించి తీర్చుతున్నట్లు తెలిపారు. పరిపాలనాపరమైన ఫిర్యాదులను సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వివిధ టెక్ పోర్టల్‌లను ఏర్పాటు చేయడం వల్ల పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేసే వెసులుబాటు కలిగిందన్నారు.
విప్లవాత్మక పాలనలో భాగంగా డేటా సేకరణ, క్రోడీకరణ, మార్పిడి ద్వారా సచివాలయాల వ్యవస్థతో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేశారన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన 116 సూచికల ఆధారంగా 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ దోహదం చేసిందని అభినందించారు. అన్ని పోర్టల్‌లలో డేటాను సేకరించడంతో పాటు విశ్లేషించి మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. పాఠశాలలకు వెళ్లే బాలికల్లో రక్తహీనత నిర్మూలన లాంటి సామాజిక లక్ష్యాలతో పాటు బడికి దూరమైన పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్చడం లాంటి వాటిని సచివాలయాల వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా అమలు చేసిందని ప్రస్తావించారు.
ఎస్‌డీజీ లక్ష్యాల సాధన..
నీతి ఆయోగ్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యవస్థను తెచ్చిందని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అవసరమైన డేటా సేకరణ, విశ్లేషణ గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచే జరుగుతోందన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుకు యాప్‌లు తీసుకొచ్చి అన్ని స్థాయిల్లో పకడ్బందీగా పర్యవేక్షించారన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి పౌరుల అవసరాలను తీర్చడం, గ్రామంలోనే సేవలు అందించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందన్నారు.
అవి సింగిల్ విండో విధానం ద్వారా పంచాయతీలు, స్థానిక సంస్థలకు సహాయ విభాగంగా పనిచేయడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. సచివాలయాల స్థాయిలోనే పౌరుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ టెక్ పోర్టల్‌తో బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉందన్నారు. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనలో భాగంగా ఆరోగ్యం, విద్య సంబంధిత కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాలతో అనుసంధానించినట్లు చెప్పారు.
జిల్లా స్థాయిలో కార్యక్రమాల పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్ ఏర్పాటైందని, వీటన్నింటినీ ప్రతిబింబించేలా రాష్ట్ర స్థాయి డేటా రూపొందించడం కార్యక్రమాలు విజయవంతంగా అమలుకు దోహదం చేసిందన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. బాలికలలో రక్తహీనత నిర్మూలనకు విద్యాసంస్ధల్లో డేటాను సేకరించి సంబంధిత విభాగాల ద్వారా క్రోడీకరించారని తెలిపారు.
వలంటీర్ల ద్వారా భారీ సర్వేతో బడికి దూరమైన పిల్లల డేటాను సేకరించడంతోపాటు తిరిగి స్కూళ్లకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ విద్యార్ధి సమాచార పోర్టల్‌ను నిర్వహిస్తున్నారన్నారు. నవశకం ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులను పారదర్శకంగా గుర్తించి క్రోడీకరించిన లబ్ధిదారుల డేటాతో పోర్టల్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment