జనతంత్రం
అంబేద్కర్‌ను తలుచుకునే ప్రతి సందర్భంలోనూ మనకు భారత రాజ్యాంగం తలపునకొస్తూనే ఉంటుంది. నాలుగు వేదాల్లోని సారమెల్లా మహాభారతంలో ఉన్నదని ప్రతీతి. మానవ హక్కులకు పట్టం కట్టిన ప్రతి చారిత్రక పత్రంలోని సారాంశమంతా మన రాజ్యాంగంలో ఉన్నది. ఎనిమిది శతాబ్దాల కిందటి ‘మాగ్నాకార్టా’ దగ్గరి నుంచి ఎనిమిది దశాబ్దాల నాటి ‘విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన’ (యుఎన్) వరకు ఆయా కాలాల్లోని డిక్లరేషన్లు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రాణ ప్రతిష్ఠ చేశాయి. ఈ డిక్లరేషన్‌లన్నిటిలోకి నిస్సందేహంగా అగ్రగణ్యమైనది, అత్యున్నతమైనది భారత రాజ్యాంగం. మానవ హక్కుల కథా గమనంలో పంచమవేదంలా పుట్టిన మహాకావ్యం భారత రాజ్యాంగం.
దేశంలో సాధారణ ఎన్నికల వడగాడ్పుల సందర్భం కూడా ఇది. రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశంపై చెలరేగుతున్న వాదోపవాదాలు కూడా ఈ సందర్భాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండేళ్ల కిందట కావచ్చు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆయనకా అవకాశం ఇవ్వలేదు. ఆయన్నే మార్చే శారు. కాలపరిస్థితులను బట్టి రాజ్యాంగంలో స్వల్ప సవరణలు సహజమే. కానీ దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదని ఇప్పటికే భారత సర్వోత్తమ న్యాయస్థానం ఘంటాపథంగా చాటిచెప్పింది. మౌలిక స్వరూపం అంటే ఏమిటో దాని పీఠికలో ఉన్న ఆరు వాక్యాలు చదివితే అర్థమవుతుంది.
బీజేపీ నాయత్వంలోని ఎన్డీఏ కూటమి మరోమారు గెలిస్తే రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చేస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరో పణల్ని బీజేపీ వాళ్లు మొక్కుబడిగా మాత్రమే ఖండి స్తున్నారు. అనంత హెగ్డే వంటి కొందరు నాయకులు బహిరంగంగానే రాజ్యాంగం మార్పుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ అనే రాజకీయ వేదికకు సొంతదారైన ఆరెస్సెస్‌కు మన రాజ్యాంగం పట్ల మొదటి నుంచీ సదభిప్రాయం లేదన్నది సత్యదూరం కాదు. పైగా ఈసారి బీజేపీ వాళ్లు 400 సీట్లలో తమ కూటమి గెలవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఈ ఆరాటం వెనుక ఉన్న మహ త్కార్యం రాజ్యాంగ మౌలిక మార్పులేనన్నది విమర్శకుల అభిప్రాయం.
భారత రాజ్యాంగంలో ధ్వనించే సమతా నినాదం సంఘ్ పరివార్‌కు ఏమాత్రం కర్ణపేయం కాదు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వపు పదేళ్ల పదవీకాలంలో 40 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల గుప్పెట్లోకి చేరిపోవడమే ఇందుకు ఉదాహరణ. వ్యవసాయరంగం నుంచి రైతు కూలీలను తరిమికొట్టి చీప్ లేబర్‌తో మార్కెట్లను నింపడం ఈ కూటమి విధానం. అందుకోసం తీసుకొచ్చిన వ్యవ సాయ చట్టాల ప్రహసనం తెలిసిందే.
బీజేపీకి భారీ మెజారిటీ వస్తే పీఠికలోని సెక్యులర్, సోషలిస్టు పదాలు గ్యారంటీగా ఎగిరిపోతాయని చాలామంది భావన. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ పదాలను జొప్పించారు. ఈ పదాలను తొలగించినప్పటికీ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని 39 అధికరణాల రూపంలో వాటి పునాదులు బలంగానే ఉంటాయి. అయితే ఆ పునాదులనే పెకిలించే అవకాశాలుండవచ్చని దేశంలోని బుద్ధిజీవులు భయపడుతున్నారు.
ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని సామెత. పెత్తందారీ వర్గాల తాబేదారు పాత్రలో జీవితాన్ని తరింప జేసుకుంటున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి సహజ మిత్రుడు. ప్రస్తుత ఎన్నికలతో కలిసి గడిచిన ఆరు సాధారణ ఎన్నికల్లో నాలుగుసార్లు ఆయన బీజేపీ కూటమిలోనే ఉన్నారు. రెండుసార్లు మాత్రమే దూరంగా ఉన్నారు. బీజేపీపై జనంలో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయంతో మాత్రమే ఆయన రెండుసార్లు దూరం జరిగారు.
కాకుల్ని కొట్టి గద్దలకు వేసే ఆర్థిక విధానాల్లో ఆయన బీజేపీ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. పేద ప్రజల పట్ల, బలహీన వర్గాల పట్ల తన ఏహ్యభావాన్నీ, అసహ్యాన్నీ దాచుకునే ప్రయత్నం కూడా చంద్రబాబు పార్టీ చేయదు. పేద ప్రజలకు రాజధాని ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కేసులు వేసి గుడ్డలూడదీసుకున్న వారి గురించి ఇంకేం మాట్లాడాలి?
కుల, మత, ప్రాంత, రాజకీయ, లింగ వివక్షలేవీ లేకుండా నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రజలందరికీ అందజేయాలనే ఒక బృహత్తరమైన యజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు కూటమి ఈ యజ్ఞాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకోవడం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం విద్యకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులకు వ్యతిరేకంగా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వ్యతిరేకంగా యెల్లో పెత్తందార్లు నడిపిన కుట్రల సంగతి కూడా తెలిసిందే.
అన్ని రంగాల్లోనూ ఇదే తంతు. పేద వర్గాలను, మహిళలను వారి కాళ్లపై నిలబెట్టడానికి జగన్ సర్కార్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ యెల్లో పెత్తందార్లు వ్యతిరేకిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ఎంత పెరిగితే అంతగా పారదర్శకత పెరుగుతుంది. అచ్చమైన ప్రజాస్వామ్యానికి ఇది సిసలైన లక్షణం. జగన్ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వ పాలనను ప్రజల ఇంటి గడప వద్దకు చేర్చింది.
వికేంద్రీకరణకు పెత్తందార్లు ఎప్పుడూ వ్యతిరేకమే. పాలనా వ్యవహారాలన్నీ వారి గుప్పెట్లోనే ఉండాలి. పారదర్శకత అనే పదం వారి డిక్షనరీలోనే ఉండదు. మాదాపూర్‌లో ఐటీ పార్క్ రాబోతున్నదనే రహస్యం వారికి మాత్రమే తెలియాలి. చుట్టూరా భూములన్నీ వారి వర్గంవారే కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే పార్క్ ప్రకటన రావాలి. రాజధాని ఎక్కడ వస్తుందో వారికి మాత్రమే తెలియాలి.
వారి వర్గం అక్కడి భూములన్నీ కొనుగోలు చేయాలి. ఆ తర్వాతనే రాజధాని ప్రకటన చేయాలి. ఈలోగా ఇతర వర్గం ఔత్సాహికులను తప్పుదారి పట్టించడానికి తప్పుడు లీకులు వదలాలి. చంద్రబాబు నాయకత్వంలోని పెత్తందార్ల కూటమి అనుసరిస్తున్న ఈ తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వారు అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టుకున్నారు.
భారత రాజ్యాంగం ప్రవచించిన ఆదేశిక సూత్రాలను శిరసావహించినందుకు జగన్ పాలన విధ్వంసకర పాలనని మన తోలుమందం పెత్తందార్లు ప్రచారం చేస్తున్నారు. యావత్తు ప్రపంచం వాంఛిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆదర్శంగా పెట్టుకున్నందుకు జగన్ పరిపాలన వారికి వినాశకరమైనదిగా కనిపిస్తున్నదట! దశాబ్దాలు గడిచిపోతున్నా అధికార పదవుల్లో ఆవగింజంత వాటా కూడా దొరకని వర్గాలను సమీకరించి సామాజిక న్యాయం బాట పట్టినందుకు జగన్ సర్కార్‌కు కొమ్ములు మొలిచా యట! కొవ్వు బలిసిన పెత్తందారీ వర్గాల ప్రచారం తీరు ఇది.
ఎన్డీఏ పదేళ్ల ఏలుబడిలో నిరుద్యోగ సమస్య జడలు విప్పి నర్తిస్తున్నది. మన తెలుగు పెత్తందార్లకు ఆ జడల దయ్యం ముద్దొస్తున్నది. ఐదేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉంటే జగన్ సర్కార్ హయాంలో వారి సంఖ్య ఆరున్నర లక్షలకు పెరిగింది. ఎకాయెకిన యాభై శాతం ఉద్యోగాలు అదనంగా కల్పించిన జగన్ ప్రభుత్వం వారికి విలన్‌గా కనిపిస్తున్నది.
ఈ సంఖ్యలో వలంటీర్లను చేర్చలేదు సుమా! పరిశ్రమల స్థాపనలోగానీ, మౌలిక వసతుల కల్పనలోగానీ, ఉపాధి కల్పనలోగానీ, సంక్షేమ కార్యక్రమాల అమలులోగానీ గణాంకాల ఆధారంగా జగన్ సర్కార్‌తో పోల్చడానికి ఈ పెత్తందార్లు ముందుకు రావడం లేదు. కేవలం విధ్వంసం, వినాశనం, సర్వనాశనం అనే పడికట్టు మాటలతో శాపనా ర్థాలు పెడుతూ పూట గడుపుకొస్తున్నారు.
యెల్లో మీడియా అనుసరిస్తున్న ఈ తరహా ఊకదంపుడు గోబెల్స్ ప్రచారం కాలం చెల్లిన చీప్ ట్రిక్. ప్రజల చైతన్యస్థాయి పెరిగింది. సమాచార మాధ్యమాలు పెరిగాయి. ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో గుర్తించగలిగే వివేచనా శక్తి జనంలో పెరిగింది. రాజ్యాంగబద్ధమైన తమ హక్కులను రక్షించుకోవడానికి ప్రజలు సంఘటితమవు తున్నారు. కేంద్రంలో ఒక విశ్వసనీయమైన ప్రతిపక్షం, విశ్వసనీయ ప్రతిపక్షనేత అందుబాటులో లేకపోవడం అనే ఒకే ఒక్క కారణం మరోసారి ఎన్డీఏను గద్దెనెక్కించవచ్చు.
అదీ బొటాబొటీ మెజారిటీతో మాత్రమే! కూటమి ఆశిస్తున్నన్ని సీట్లు గెలవడం అసంభవం. పెత్తందారీ వర్గాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ బలంగా ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో పేదవర్గాల జైత్రయాత్ర కొనసాగు తుందని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం 25 లోక్‌సభ స్థానాలతో పాటు నూటాయాభైకి పైగా అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment