శాసనసభలో ‘కాగ్’ నివేదిక సాక్షిగా వాస్తవాలు బహిర్గతం
2023–24 నాటికి బడ్జెట్, గ్యారెంటీ అప్పులు రూ.6.4 లక్షల కోట్లే
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై ఇన్ని రోజులు కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని, గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కుండబద్ధలు కొట్టింది. 2023–24 ఆర్థిక ఏడాది అకౌంట్స్‌ను కాగ్ బుధవారం అసెంబ్లీకి సమర్పించింది. 2023–24లో మార్కెట్ నుంచి రూ.68,414 కోట్లు అప్పు చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.68,400 కోట్లు మాత్రమే అప్పు చేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
ప్రభుత్వం గ్యారెంటీ రుణాలు కూడా నిబంధనలకు లోబడే ఉన్నాయని కాగ్ పేర్కొంది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పులతో పాటు గ్యారెంటీ అప్పులను కూడా కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అప్పులు దాచేస్తున్నారంటూ గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని కాగ్ నివేదిక సాక్షిగా తేటతెల్లమైంది.
బడ్జెట్, కాగ్ నివేదిక సాక్షిగా..
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా గత సర్కారు హయాంలో రూ.పది లక్షల కోట్లు అప్పులు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. నిన్న బడ్జెట్ సాక్షిగా.. నేడు కాగ్ నివేదిక ద్వారా వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పులకు సంబంధించి ఎల్లో మీడియా, చంద్రబాబు అండ్‌కో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలనేనని తేలిపోయింది. 2023–24 నాటికి ప్రజా రుణం రూ.4,86,151 కోట్లుగా ఉన్నట్లు కాగ్ స్పష్టం చేసింది.
2023–24 నాటికి ప్రభుత్వ గ్యారెంటీ ద్వారా చేసిన రుణాలు రూ.1,54,797 కోట్లు మాత్రమేనని కాగ్ వెల్లడించింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల మేరకు 2023–24లో జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 3 శాతం ఉండాల్సి ఉండగా అంతకన్నా తక్కువకే 2.68 శాతానికే పరిమితం అయినట్లు నివేదిక స్పష్టం చేసింది. ద్రవ్యలోటు జీఎస్‌డీపీలో 4 శాతం ఉండాల్సి ఉండగా స్వల్పంగా పెరిగి 4.35 శాతానికి చేరిందని కాగ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment